ఆదోని: 'సర్పంచ్ ఎస్సీ' అంటున్న వీడియో వైరల్.. బీజేపీ, టీడీపీ నేతలు అవమానించారంటున్న దళిత సంఘాలు, అసలు వివాదమేంటి?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
'సర్పంచ్ ఎస్సీ' అంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపురం గ్రామానికి చెందిన దళిత సర్పంచ్‌ను కూటమి నేతలు అవమానించారంటూ విమర్శలు కూడా వచ్చాయి.
ఏపీలో కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఈనెల 16న ధనాపురంలో 'ప్రజల కోసం మీ పార్థసారథి' అనే కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దళితుడైన సర్పంచ్ చంద్రశేఖర్‌ను గుడి వద్ద ఏర్పాటుచేసిన స్టేజీపై నిల్చోనివ్వకపోవడం వివాదంగా మారింది.

సర్పంచ్ ఎస్సీ కావడం వల్లే బీజేపీ, టీడీపీ నేతలు ఆయనను వేదిక కింద నిలబెట్టారని, దళిత సర్పంచ్‌ను అవమానించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఘటనపై ఎమ్మెల్యే పార్థసారథి స్పందిస్తూ, ''ఇందులో నా తప్పు ఉన్నా, లేకున్నా దళిత జాతికి క్షమాపణ చెబుతున్నా' అంటూ ఒక వీడియో విడుదల చేశారు.

ఫొటో సోర్స్, Facebook/Dr Parthasarathi mla Bjp
ఇంతకీ వీడియోలో ఏముంది?
ధనాపురంలో జరిగిన 'ప్రజల కోసం' కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పార్థసారథితో పాటు ఫుడ్ కమిషన్ మాజీ సభ్యురాలు, టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ కూడా హాజరయ్యారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ 'సర్పంచ్ ఎక్కడ? రావాలి' అని వేదికపైకి పిలిచారు.
సర్పంచ్ రాకపోవడంతో, 'ఏంటి ఆయన ఏమైనా క్రిస్టియనా?' అని ఎమ్మెల్యే అనగానే, పక్కనే ఉన్న కృష్ణమ్మ ఎమ్మెల్యే చెవిలో 'సర్పంచ్ ఎస్సీ' అని చెప్పారు.
దీంతో 'అవునా?' అన్న ఎమ్మెల్యే స్టేజి దగ్గరకైనా రావాలని సర్పంచ్‌ను పిలిచారు. వచ్చిన సర్పంచ్‌ను స్టేజీ కింద నిల్చోవాలని ఎమ్మెల్యే పార్థసారథి, కృష్ణమ్మలు సూచిస్తున్నట్లుగా మైక్‌లో స్పష్టంగా వినిపిస్తోంది. దీంతో ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయమైంది.

ఫొటో సోర్స్, Swarna Venkaiah
దళిత సంఘాల ఆగ్రహం
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దళిత సంఘాలు విమర్శించాయి.
దళిత సర్పంచ్‌ను అవమానించిన ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు కృష్ణమ్మపై కేసు నమోదు చేయాలని మాల మహానాడు ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణా వెంకయ్య డిమాండ్ చేశారు.
''సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు. అలాంటి సర్పంచ్‌ను దళితుడనే కారణంతో స్టేజీ ఎక్కనీయకుండా వాళ్ల కాళ్ల దగ్గర నిల్చోబెట్టడం ఎమ్మెల్యే దురహంకారానికి ప్రతీక. పక్కనున్న మహిళా కార్యకర్త 'ఆయన దళితుడు' అని చెప్పడంతో స్టేజీపైకి ఆహ్వానించలేదు, కాళ్ల దగ్గర నిల్చోబెట్టారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితులను ఎంత చిన్న చూపు చూస్తోందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ'' అని వెంకయ్య అన్నారు.
కేసు పెడతా: సర్పంచ్
ధనాపురం గ్రామం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి సర్పంచ్‌గా గెలిచిన చంద్రశేఖర్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీలో చేరారు.
మొదట ఈ ఘటనపై సర్పంచ్ ఎలాంటి ఫిర్యాదూ చేయలేదు. అయితే, వీడియో వైరల్ కావడం, ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జూన్ 19న చంద్రశేఖర్ స్పందించారు.
ఇది తనకు జరిగిన అవమానంగా కాకుండా, దళిత జాతికి జరిగిన అవమానంగా భావిస్తున్నట్లు చంద్రశేఖర్ బీబీసీతో చెప్పారు.
''కూటమి సీనియర్ నాయకులు ముందు స్టేజీ ఎక్కారు. నువ్వు ముందు, నేను ముందు అని వాళ్లే దూరుతున్నారు, ఇక ఎందుకులే అని నేను దూరంగా ఉన్నా. అయితే, ఎమ్మెల్యే 'మీరు ప్రథమ పౌరుడు కదా రండి' అని పిలిచారు.
నేను దగ్గరికి వెళ్లాను. ఇక్కడి లోకల్ లీడర్లు 'ఆయన ఎస్సీ వద్దు' అని టీడీపీ లీడర్ కృష్ణమ్మతో చెప్పించారంట, ఎమ్మెల్యేకి ఆమె అదే చెప్పారు. మీడియాలో అదే వచ్చింది. ఆమె ఎస్సీ అన్న పదాలు స్పష్టంగా వినిపించాయి'' అని చంద్రశేఖర్ అన్నారు.
ఊళ్లో జరిగిన కార్యక్రమం కాబట్టి సంయమనం పాటించానని ఆయన చెప్పారు. కానీ, దళిత సంఘాలు ఘటనపై తనను ప్రశ్నించారని, ఇప్పుడది దళిత జాతికి అవమానంగా భావిస్తున్నట్లు చంద్రశేఖర్ అన్నారు.
''అక్కడి గుడికి వెళ్లడానికి మాకు ఎలాంటి ఆంక్షలు లేవు, మేం గుడికి వెళుతుంటాం. దేవుడు అందరివాడు. ఎమ్మెల్యే వస్తున్నారని అక్కడి ఏర్పాట్లన్నీ మేమే చేశాం. ఎమ్మెల్యేతో తిరిగినప్పుడు మాపై ఎలాంటి వివక్ష చూపలేదు. కాకపోతే ఆమె అలా అన్నారు. దీనిపై నేనే స్వయంగా వెళ్లి కేసు వేస్తాను'' అని సర్పంచ్ చంద్రశేఖర్ చెప్పారు.
ఇందులో ఎమ్మెల్యే తప్పు లేదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, UGC
దళిత జాతికి క్షమాపణలు: ఎమ్మెల్యే
ఈ ఘటనపై ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు.
'జరిగిన దాంట్లో నా తప్పు ఉన్నా, లేకున్నా దళిత జాతికి క్షమాపణ చెబుతున్నాను' అంటూ దళిత సంఘాలతో కలిసి ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
''ఆ రోజు జరిగిన సందర్భం వేరు. మేం గ్రామంలోకి వెళ్లినపుడు ఆయన దూరంగా నిలబడ్డారు. మేం ఆలయ కట్ట పైన నిలబడ్డాం. సర్పంచ్ ఎక్కడో జనాల మధ్య ఉంటే రమ్మని పిలిచాను. ఆయన వేరే మతాన్ని ఆచరిస్తున్నాడేమో అందుకే రావడం లేదనుకున్నా. అందుకే పక్కన అడిగాను'' అని ఎమ్మెల్యే అన్నారు.
ఈ వీడియో ద్వారా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
''ఎవరో కావాలని వీడియో వైరల్ చేసి, దాన్ని ఎడిట్ చేసి, ఏదో అవమానం జరిగిందంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నా సమక్షంలో జరిగింది కాబట్టి నేను బాధ్యత వహించాలి. జరిగిన దాన్ని పూర్తిగా ఖండిస్తున్నా. జరిగిన దాంట్లో నా తప్పు ఉన్నా లేకున్నా నేను క్షమాపణ చెబుతున్నా'' అని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.
'కావాలని చేసిన రాజకీయ కుట్ర': కృష్ణమ్మ
ఈ వివాదంపై ఫుడ్ కమిషన్ మాజీ సభ్యురాలు, టీడీపీ నాయకురాలు కృష్ణమ్మను బీబీసీ సంప్రదించింది.
ఆమె స్పందిస్తూ, ''కావాలని రాజకీయంగా కుట్ర చేశారు. అతను వైసీపీ నుంచి నుంచి వచ్చిన సర్పంచ్. మళ్లీ బీజేపీ నుంచి వైసీపీకి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ వీడియో కటింగ్ చేసి పెట్టారు. అయినప్పటికీ మేం క్షమాపణలు చెప్పాం'' అన్నారు.
''మేం దళితులతో కలిసే ఉంటాం. మా ప్రాంతంలో కొన్ని ఏరియాల్లో దళితులు ఆలయాల దగ్గరికి రారు. ఆ మాట నేను ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. అంతేతప్ప ఎస్సీలపై ఎటువంటి వివక్ష నాకు లేదు.''
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














