ఆవలింత ఎంత పని చేసిందంటే

ఫొటో సోర్స్, UGC
- రచయిత, జేవియర్ సెల్వకుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆవలించిన తర్వాత నోరు దానంతట అదే మూసుకోకపోతే, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం.
కేరళలోని కొచ్చిలో పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక యువకుడికి సరిగ్గా ఇదే జరిగింది.
కన్యాకుమారి-దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న 24 ఏళ్ల వ్యక్తికి తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ సమస్య ఎదురైంది.
రైలు అప్పుడు పాలక్కాడ్ జంక్షన్‌ను సమీపిస్తోంది.
ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి తోటి ప్రయాణికులు, టికెట్ ఇన్‌స్పెక్టర్‌కు తెలుపగా, ఆయన అక్కడి రైల్వే ఆసుపత్రి అధికారికి సమాచారం అందించారు.

సమాచారం అందగానే పాలక్కాడ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న రైల్వే మెడికల్ ఆఫీసర్ జితిన్ ఆ యువకుడికి చికిత్స చేశారు. వెంటనే ఆయన నోరు మామూలుగా మూతపడింది. తర్వాత, ఆయన అదే రైలులో తన ప్రయాణాన్ని కొనసాగించారు.
కేవలం ఐదు నిమిషాల్లో ఈ చికిత్స పూర్తయింది. తర్వాత అంతా సర్దుకున్నప్పటికీ రైల్లో యువకుడు ఎదుర్కొన్న పరిస్థితి, చికిత్సకు సంబంధించి మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి.
ఆవలింత అనేది ఒక సహజ ప్రక్రియ. ఆవలించేటప్పుడు ఇలా జరగడానికి కారణం ఏమిటి?

నోరు బాగా తెరిస్తే...
ఆ యువకుడికి ఎదురైన పరిస్థితిని 'టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ డిస్‌లొకేషన్' (టీఎంజే) గా పిలుస్తారని డాక్టర్ జితిన్ చెప్పారు.
''నేనొక చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణుడిని. ఆ రోజు ఉదయం పాలక్కాడ్ రైల్వే ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్నాను. తెల్లవారుజామున 2:15 గంటలకు నాకు ఆ యువకుడి సమస్య గురించి సమాచారం తెలియగానే అక్కడికి పరిగెత్తాను. అంతకు 45 నిమిషాల ముందు ఆ యువకుడు ఆవలించాడు. తర్వాత నోరు మూసుకోలేకపోయాడు. టీఎంజే వల్ల ఇలా జరిగి ఉంటుందని ఊహించి, తగిన ఏర్పాట్లతో రైల్వే ప్లాట్‌ఫామ్‌కి వెళ్లాను. ఆ యువకుడిని ప్లాట్‌ఫామ్ బెంచి మీద కూర్చోబెట్టి చికిత్స చేశాను. అతని కింది దవడలోని బాల్ జాయింట్స్ వద్ద ఏర్పడిన లాక్‌ను నా చేతి వేలితో తొలగించాను. అయిదు నిమిషాల్లోనే అంతా సర్దుకుంది. ఇలా జగడం ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు'' అని బీబీసీకి డాక్టర్ జితిన్ వివరించారు.
ఇలాంటి పరిస్థితిని సాధారణంగా కొన్ని నిమిషాల్లోనే సరిచేయవచ్చని, చాలా కొద్ది మందికి మాత్రమే శస్త్రచికిత్స అవసరం పడొచ్చని ఆయన తెలిపారు.

ఇలా దవడ స్థానచలన పరిస్థితి గురించి ఆర్థోడాంటిక్ నిపుణులు డాక్టర్ బాలచందర్ మరింత వివరంగా చెప్పారు.
''చెవుల కింద ఉండే కీళ్లను 'టెంపొరోమాండిబ్యులర్ జాయింట్' అని పిలుస్తారు. ఈ జాయింట్ మీద టెంపోరల్ బోన్, కింద కండైల్ అనే ఎముకలు ఉంటాయి. ఈ రెండు ఎముకల మధ్య ఒక డిస్క్ ఉంటుంది. ఈ మూడింటిని కలిపి' టెంపోరోమాండిబ్యులర్ జాయింట్స్, లిగ్మంట్స్' అని పిలుస్తారు.
మనం నోరు నెమ్మదిగా తెరిచినప్పుడు, కింది దవడ మాత్రమే కొద్దిగా కదులుతుంది. నోరును కాస్త వెడల్పుగా తెరిచినప్పుడు ఈ దిగువ ఎముక, డిస్క్ కొద్దిగా ముందుకు కదులుతాయి. అప్పుడు ఎమినెన్స్ అనే స్టాపర్ వల్ల ఈ కదలిక నియంత్రణలో ఉంటుంది. కొంతమందిలో కొన్నిసార్లు దిగువ ఎముక, డిస్క్ అనేవి స్టాపర్‌ను దాటి వెళ్తాయి. అప్పుడవి తిరిగి లోపలికి అంటే యథాస్థానానికి రాలేవు. ఈ పరిస్థితినే టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ డిస్‌లోకేషన్ అంటారు. ఇది నోటికి రెండు వైపులా జరుగుతుంది. నోరు చాలా వెడల్పుగా తెరవడమే దీనికి కారణం'' అని బాలచందర్ వివరించారు.

చికిత్స ఏమిటి?
డాక్టర్ బాలచందర్ ఈ చికిత్స విధానాన్ని వివరించారు.
''తెరిచి ఉన్న నోరు లోపల ఒక సన్నని గుడ్డను దంతాల మధ్య బిగించి లాగడం వల్ల నయం అవుతుంది. కొంతమందికి, వైద్యులు వారి వేళ్ల చుట్టూ గుడ్డను చుట్టుకొని, దిగువ దవడ ఎముక, డిస్క్‌పై ఒత్తిడిని ప్రయోగించి దాని అసలు స్థానానికి తీసుకువస్తారు'' అని ఆయన తెలిపారు.
శరీరంలో సంభవించే అనేక రకాల డిస్‌లొకేషన్‌లలో టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ డిస్లోకేషన్ (టీఎంజే) చాలా తక్కువగా జరుగుతుందని ఫ్రాక్చర్ థెరపిస్ట్ కార్తీక్ చెప్పారు.
''భుజం ఎక్కువగా డిస్‌లొకేట్ అవుతుంది. తర్వాత మోచేతి కీలు, వేళ్ల కీళ్లు అనేవి ఈ డిస్‌లొకేషన్ వల్ల ప్రభావితమవుతాయి.
ఇలాంటిదే మరో ఘటన గురించి చెబుతాను. ఒకేసారి మొత్తం బోండా తినడానికి ప్రయత్నించి, నోరు అలాగే తెరుచుకొని ఉండి మూసుకోలేకపోవడంతో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చారు. అప్పుడు నా చేతితో ఆయన నోటిలోని కింది దవడ ఎముకను సవరించాను. వెంటనే అతని నోరు సాధారణ స్థితికి వచ్చింది. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే వారికి చాలా భయమేస్తుంది'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
డాక్టర్ అందుబాటులో లేకుంటే ఎలా?
ఈ సమస్యతో బాధపడేవారు ఆవలిస్తున్నప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు వారి కింది దవడను పట్టుకోవాలని, నోరు ఎక్కువగా తెరవకూడదని ఆర్థోడాంటిస్ట్ బాలచందర్ సూచించారు. ఫ్లూట్, సాక్సోఫోన్ వంటి వాయిద్యాలను వాయించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
''ఒకవేళ ఈ పరిస్థితి ఎదురైనప్పుడు డాక్టర్ అందుబాటులో లేకుంటే రెండు బొటనవేళ్లను కింది దవడపై ఉంచి, ఇతర వేళ్లను దవడ కింద నాడుల వద్ద ఉంచి, బొటనవేళ్లను పై నుంచి కిందికి లాగడం వల్ల ఉపశమనం దక్కొచ్చు. దీనివల్ల ఎలాంటి హాని కలుగదు. కాబట్టి ఆందోళన చెందకూడదు. ఇది తరచుగా సంభవిస్తే చికిత్స అవసరం కావొచ్చు'' అని బాలచందర్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














