అబూజ్‌మడ్: మావోయిస్టుల ‘ఆఖరి కోట’ కూలిందా?

అబూజ్‌మడ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బస్తర్‌లోని జగదల్‌పూర్‌లో అక్టోబర్ 17న 210 మంది మావోయిస్టులు లొంగిపోయారు
    • రచయిత, అలోక్ పుతుల్
    • హోదా, బీబీసీ కోసం

భారత్‌లో మావోయిస్టుల ప్రధాన స్థావరం, వారికి అత్యంత సురక్షిత ప్రాంతంగా పరిగణించే బస్తర్‌లోని అబూజ్‌మడ్ ప్రాంతంలో ఇక మావోయిస్టుల జాడ లేదనేది ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనల సారాంశం.

''ఒకప్పుడు ఉగ్రవాదానికి నిలయంగా ఉన్న అబూజ్‌మడ్, ఉత్తర బస్తర్‌ ప్రాంతాలు ఇప్పుడు నక్సలైట్ల హింస నుంచి పూర్తిగా విముక్తి పొందాయి. ఇక దక్షిణ బస్తర్‌లో కొంతమంది నక్సలైట్లు మిగిలారు. అక్కడి నక్సలిజాన్ని కూడా మన భద్రతా బలగాలు త్వరలోనే నిర్మూలిస్తాయి'' అని అక్టోబర్ 16న ఎక్స్‌లో అమిత్ షా ఒక పోస్ట్ పెట్టారు.

ఉత్తర బస్తర్ ప్రాంతంలో కాంకేర్, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాలు ఉన్నాయి. అబూజ్‌మడ్ ఈ ప్రాంతంలోనిదే.

''ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, 2024 జనవరి నుంచి 2100 మంది నక్సలైట్లు లొంగిపోయారు. 1785 మందిని అరెస్ట్ చేశారు. 477 మందిని అంతమొందించాం '' అని ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో అమిత్ షా పేర్కొన్నారు.

''నక్సలిజాన్ని 2026 మార్చి 31లోపు సమూలంగా నిర్మూలించాలనే మా దృఢ సంకల్పానికి ఇది ప్రతిబింబం'' అని ఎక్స్‌లో అమిత్ షా రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ప్రాంతంలో ప్రభుత్వం చాలా సున్నితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని బస్తర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సురేష్ మహాపాత్ర అన్నారు.

''నక్సల్ రహిత ప్రదేశంగా అబూజ్‌మడ్ మారడం కేవలం భద్రతా బలగాల విజయమే కాదు. ఆ గిరిజన ప్రాంతానికి కొత్త ఉదయం కూడా. ఈ ప్రాంతం ఇప్పటివరకు ప్రభుత్వ పటాల్లో కూడా చేరలేదు.

ఇప్పుడిక ఈ ప్రాంతంలో పాలకుల జోక్యం పెరగడం, అభివృద్ధి పథకాలు చేరుతాయనే అంచనాలతో పాటు, అక్కడి గిరిజనులపై దోపిడీ కొత్తగా ప్రారంభమవుతుందనే భయాలను తోసిపుచ్చలేం. అందువల్ల ఇక్కడ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా, సున్నితత్వంతో పనిచేయాల్సిన అవసరం ఉంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

బస్తర్‌లోని అబూజ్‌మడ్ అడవులను ఇప్పటి వరకు కొలవలేదు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బస్తర్‌లోని అబూజ్‌మడ్ అడవులను ఇప్పటి వరకు కొలవలేకపోయారు

అబూజ్‌మడ్: మ్యాప్‌లకు అతీతమైన భౌగోళిక ప్రాంతం

జీపీఎస్, గూగుల్ మ్యాప్స్ ఆధిపత్యం చెలాయిస్తోన్న ఈ రోజుల్లో కూడా, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో దాదాపు 4 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అబూజ్‌మడ్ ఏరియా ఈ భూమ్మీదే ఉన్నప్పటికీ ఏ దస్తావేజుల్లోనూ మీకు కనిపించదు.

అబూజ్‌మడ్‌లోని చాలా ప్రాంతాల్లో భూమికి స్థిరమైన కొలత లేదు, సరైన బాటలు, రోడ్లు లేవు.

అక్బర్ కాలంలో ఈ ప్రాంతానికి చెందిన రెవెన్యూ పత్రాలను సేకరించే ప్రయత్నం జరిగిందని పాత దస్తావేజులు వెల్లడిస్తున్నాయి. కానీ, దట్టమైన అడవులతో అబూజ్‌మడ్ ప్రాంతం ఎవరికీ అర్థం కాని ప్రదేశంగానే మిగిలిపోయింది.

బ్రిటిష్ వారు 1909లో ఈ ప్రాంతంలో భూ ఆదాయాన్ని లెక్కించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

స్వాతంత్ర్యం వచ్చాక చాలా కష్టమ్మీద అక్కడి గ్రామాల వివరాలు, గణాంకాలను సేకరించారు. కానీ, అబూజ్‌మడ్‌లోని 237 గ్రామాలు ఇప్పటికీ అధికారిక మ్యాప్‌లు, ఫైళ్లు, ప్రభుత్వ పథకాలకు దూరంగా పురాతన కాలంలోనే మగ్గుతున్నాయి.

తమ భూమికి ఇక్కడి గిరిజనులే యజమానులు. కానీ, వారి వద్ద ఒక అధికారిక పత్రం కూడా లేదు.

బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ ప్రాంతంలో మావోయిస్టులు సులభంగా ప్రవేశించారు

ఫొటో సోర్స్, CG KHABAR

ఫొటో క్యాప్షన్, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ ప్రాంతంలో మావోయిస్టులు సులభంగా ప్రవేశించారు

ఆంధ్రప్రదేశ్ నుంచి నక్సల్స్ రాక

నక్సలైట్లు ఈ ప్రాంతంలోకి మొదటిసారిగా 1970లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవేశించారు. కానీ, తర్వాత వారు ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు.

తర్వాత, 1980లలో నక్సలైట్లు రెండోసారి ఇక్కడికి రావడానికి ప్రయత్నించినట్లు పోలీసుల వద్ద ఉన్న పత్రాల ద్వారా తెలుస్తోంది. పీపుల్స్ వార్ గ్రూప్‌కు చెందిన ఒక బృందం ఈ ప్రాంతానికి వచ్చి, బీడీ ఆకు కార్మికుల సమస్యలపై ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నించింది.

బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ ప్రాంతంలోని గిరిజనుల పరిస్థితులపై చాలా కథలు, వాదనలు ఉన్నాయి.

నక్సలైట్ పత్రాల ప్రకారం, ఒక కిలో ఉప్పుకు బదులుగా ఇక్కడి గిరిజనుల నుంచి ఒక కిలో జీడిపప్పు లేదా ఎండుద్రాక్ష తీసుకోవడం వంటి అనేక నమ్మశక్యం కాని కథనాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో తమ స్థావరాన్ని ఏర్పరచుకోవడంలో నక్సలైట్లు పెద్దగా ఇబ్బంది పడలేదని ఆ పత్రాల ద్వారా తెలుస్తోంది.

అమిత్ షా

ఫొటో సోర్స్, ANI

ఇక్కడి గిరిజనుల సామాజిక-సాంస్కృతిక భిన్నత్వానికి ప్రాధాన్యం ఇస్తూ 1980ల ప్రారంభంలోనే అబూజ్‌మడ్‌లోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించారు.

నక్సలైట్లు ఈ సమయంలోనే అబూజ్‌మడ్, బస్తర్‌తో పాటు అవిభక్త మధ్యప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లో విస్తరించారు. అబూజ్‌మడ్‌లోని భౌగోళిక పరిస్థితులు నక్సలైట్ల సైనిక శిక్షణకు పూర్తిగా అనుకూలంగా ఉండేవి.

అందుకే ఈ ప్రాంతం క్రమంగా దండకారణ్యంలో నక్సలైట్లకు అత్యంత దుర్భేద్యమైన కోటగా మారింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో నక్సలైట్లపై ఒత్తిడి పెరగడంతో సెంట్రల్ కమిటీ నుంచి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వరకు ఇలా పలు నక్సల్స్ వర్గాలకు అబూజ్‌మడ్ స్వర్గధామంగా మారింది.

నక్సలిజం

ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తొమ్మిదేళ్ల తర్వాత, 2009లో ఈ ప్రాంతంలోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేశారు. కానీ, అప్పటికే నక్సలిజం ఇక్కడ అడవిలోని చెట్ల మాదిరిగానే బాగా వేళ్లూనుకుంది.

దంతెవాడ, దక్షిణ బస్తర్ ప్రాంతాలు నక్సలైట్ హింసకు కేంద్రంగా ఉంటే ఉత్తర బస్తర్, ముఖ్యంగా అబూజ్‌మడ్ అనేది నక్సలైట్లకు స్థావరంగా మారిందని సీనియర్ జర్నలిస్ట్ ప్రఫుల్ ఠాకూర్ అన్నారు.

15వ శతాబ్దం తర్వాత మొదటిసారిగా, 2017లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రెవెన్యూ సర్వే ప్రారంభించింది. కానీ, నక్సలైట్ల భయం కారణంగా అది సాధ్యం కాలేదు.

ఛత్తీస్‌గఢ్

ఫొటో సోర్స్, CG KHABAR

ప్రభుత్వ వ్యూహం, మారుతున్న పరిస్థితులు

బస్తర్‌లో 2018లో భద్రతా దళాల శిబిరాలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టినప్పుడు, ఈ శిబిరాలను ఇనుప ఖనిజం, ఇతర ఖనిజాల వెలికితీత కోసం ఏర్పాటు చేస్తున్నారని మావన హక్కుల సంఘాలు ఆరోపించాయి.

మైనింగ్‌ను సులభతరం చేయడానికి ఈ శిబిరాల ఏర్పాటు ఖర్చును మొత్తం తామే భరించామని బిలాయ్ స్టీల్ ప్లాంట్ వంటి ప్రభుత్వ సంస్థలు అంగీకరించాయి.

కానీ, నక్సలైట్ల కోట అయిన అబూజ్‌మడ్‌లోకి ప్రవేశించడం ప్రభుత్వానికి ఎదురైన అతిపెద్ద సవాలు.

2023లో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం మారింది. విష్ణుదేవ్ సాయ్ ప్రభుత్వం ఒకవైపు మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించింది. మరోవైపు భద్రతా దళాల కార్యకలాపాల వేగాన్ని కూడా పెంచింది.

స్థానిక గిరిజనులను, ముఖ్యంగా లొంగిపోయిన నక్సలైట్లను భద్రతా దళాల్లో, జిల్లా రిజర్వ్ గార్డ్‌లో నియమించడం వల్ల నక్సలైట్లకు వ్యతిరేకంగా జరిపే ఆపరేషన్లలో మొదటిసారిగా భౌగోళిక, వ్యూహాత్మక అవగాహన లభించింది.

వీటితో పాటు అభివృద్ధి పనుల్ని వేగవంతం చేశారు. రోడ్ల నిర్మాణం, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, విద్యుత్ కనెక్షన్లు, ఆరోగ్య సేవల్ని విస్తరించారు.

అబూజ్‌మడ్‌లోని అనేక గ్రామాల్లో తొలిసారిగా రెవెన్యూ సర్వేను ప్రారంభించారు.

బస్తర్‌లోని అనేక ప్రాంతాల్లో కొత్తగా 64 భద్రతా దళాల శిబిరాలను ఏర్పాటు చేశారు. దాదాపు అక్కడ ప్రతిరోజూ నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్లు జరిగాయి.

నక్సలైట్లకు వ్యతిరేకంగా నిర్వహించిన గత 25 ఏళ్లలోని అన్ని రికార్డులు బద్దలయ్యాయంటే ఈ ఆపరేషన్ల తీవ్రతను అంచనా వేయొచ్చు. ఈ ఆపరేషన్లలో సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి బసవరాజుతో సహా పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీకి చెందిన అనేక మంది నాయకులు మరణించారు.

''మా ప్రభుత్వ పాలనలోని గత 22 నెలల్లో 477 మంది నక్సలైట్లు హతమయ్యారు. 2110 మంది లొంగిపోయారు. 1785 మంది అరెస్టు అయ్యారు. ఛత్తీస్‌గఢ్‌ను నక్సల్స్ రహితంగా మార్చాలనేది మా సంకల్పం. మేం ఆ దిశగానే పయనిస్తున్నాం'' అని రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ అన్నారు.

నారాయణపూర్ జిల్లాలోని బడ్‌సెటీ పంచాయతీని రాష్ట్రంలోని తొలి నక్సల్ రహిత పంచాయతీగా ప్రకటించడాన్ని బట్టి చూస్తే ఉత్తర బస్తర్‌లో మావోయిస్టులపై ప్రభుత్వం సాధించిన విజయం, వ్యూహాలను అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఇప్పుడు నక్సల్స్ హింసతో విసుగు చెందారనడానికి కూడా ఇదొక సంకేతం.

అయితే, దక్షిణ బస్తర్‌లోని దంతెవాడ, సుక్మాతో పాటు ఉత్తర బస్తర్‌లోని బీజాపూర్‌లో నక్సలైట్లు ఇంకా సవాలుగానే ఉన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)