‘‘అబూ సలేం ఒక వ్యాన్ నిండా ఆయుధాలు తెచ్చాడు, అందులోంచి సంజయ్ దత్ ఒక ఏకే తుపాకీని తీసుకున్నాడు’’: బాంబే బ్లాస్ట్స్, కసబ్‌ల గురించి ఆనాటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంకా ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, Getty Images
ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ ఒక యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కేసు గురించి అనేక విషయాలు చెప్పారు.
1993లో జరిగిన ముంబయి పేలుళ్ల గురించి సంజయ్ దత్‌కు తెలియదని ఆయన అన్నారు.
నికమ్ చెప్పిన దాని ప్రకారం, సంజయ్ దత్‌కు ఆయుధాలంటే ఇష్టం. ఆ ఆయుధాల గురించి సంజయ్ దత్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ముంబయి పేలుళ్లను నివారించి ఉండేవారు.
ఈ ఏడాది ఉజ్వల్ నికమ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో ముంబయి నార్త్ సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
1993 ముంబయి బాంబు పేలుళ్ల నుంచి అండర్ వరల్డ్‌పై టాడా కేసుల వరకూ అనేక కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహించిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్, యూట్యూబర్‌తో సంభాషణలో అనేక విషయాలు చెప్పారు.

1993 మార్చి 12న ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి.
ఈ పేలుళ్ల తర్వాత, అబూ సలేం, రియాజ్ సిద్ధిఖీ నుంచి అక్రమంగా తుపాకులు పొందడం, వాటిని తన వద్ద ఉంచుకోవడం, అనంతరం వాటిని ధ్వంసం చేయడం వంటి అభియోగాల్లో సంజయ్ దత్ దోషిగా నిర్ధరణ అయింది.
2013లో సుప్రీం కోర్టు, సంజయ్ దత్ కేసులో టాడా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
2016లో యరవాడ జైలు నుంచి విడుదలైన తర్వాత, 1993 ముంబయి పేలుళ్ల విషయంలో ఇకపై తన పేరు ప్రస్తావించవద్దంటూ సంజయ్ దత్ మీడియాను అభ్యర్థించారు.
"నేను టెర్రరిస్టుని కాదు, 1993 పేలుళ్లతో నన్ను లింక్ చేయొద్దని మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నా" అని సంజయ్ దత్ అన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్ నికమ్ మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నో హై ప్రొఫైల్ కేసుల్లో వాదనలు వినిపించారు.
ముంబయి పేలుళ్ల తర్వాత క్రిమినల్ కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నికమ్ ఎదిగారు.
సంజయ్ దత్‌పై ఉన్న కేసుల గురించి ఆయన వివరంగా చర్చించారు.
"నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, సంజయ్ దత్ ఆయుధాలంటే వ్యామోహం ఉండేదని అనుకుంటున్నా. అందుకే ఆయన ఏకే 56 రైఫిల్ తన దగ్గర పెట్టుకున్నారు. అయితే, మార్చి 12వ తేదీకి 15 నుంచి 20 రోజుల ముందు అబూ సలేం ఒక ట్రక్కులో ఆయుధాలు తెచ్చారు. వాటిని సంజయ్ దత్ చూశారు. వాటిలో నుంచి ఒక ఏకే గన్‌ను తీసుకుని మిగిలిన వాటిని పంపించేశారు. అయితే, ఆయుధ చట్టం కింద ఆయనకు శిక్ష కూడా పడింది" అని నికమ్ అన్నారు.
"సంజయ్ దత్ ముందుగా ఆయుధాలు తీసుకున్నప్పుడు, టెంపోలలో ఆయుధాలు వచ్చాయని, వాటిలో ఆర్డీఎక్స్, హ్యాండ్ గ్రనేడ్లు ఉన్నాయని పోలీసులకు చెప్పి ఉండాల్సింది. ఆయన కొంత హింట్ ఇచ్చినా, పోలీసులు విచారణ జరిపి పేలుళ్లు జరగకుండా నిరోధించి ఉండేవారు" అని నికమ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
హైప్రొఫైల్ కేసుల్లో మీపై ఏదైనా ఒత్తిడి వచ్చిందా?
సంజయ్ దత్ కేసులో మీపై ఏదైనా ఒత్తిడి వచ్చిందా? అని అడిగినప్పుడు, "నాపై ఎలాంటి ఒత్తిడి రాలేదు. కోర్టు ఆయన్ను ఆయుధ చట్టం కింద దోషిగా నిర్ధరించిందని మీకు తెలుసు. ఇది సంజయ్ దత్ చేసిన మొదటి తప్పు అని, ఆయనకు కొంత ఉపశమనం కల్పించాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు" అన్నారు నికమ్.
"నేను వారి వాదనలను వ్యతిరేకించాను. కోర్టు కూడా ఆ వాదనలను తిరస్కరించింది" అని ఆయన అన్నారు.
"నాకు తెలిసినంత వరకు, ముంబయి బాంబు పేలుళ్లతో సంజయ్ దత్‌కు సంబంధం లేదు. బాంబు పేలుళ్లు జరుగుతాయని సంజయ్ దత్‌కు తెలిసి ఉండొచ్చని కూడా నేను అనుకోవడం లేదు"
సంజయ్ దత్ కేసుకు సంబంధించి తాను బాలాసాహెబ్ థాకరేను కలిసినట్లు ఉజ్వల్ నికమ్ చెప్పారు.
" అతను నిర్దోషి అని, అతన్ని వదిలేయమని చెప్పారు. ఎవరి వల్ల ఆయన అలా అన్నారో నాకు తెలీదు. కానీ, బాబాసాహెబ్ దయ చూపించేవారు. ఎవరైనా ఏడుస్తూ వెళ్లి తనకు అన్యాయం జరిగిందని చెబితే, వాళ్ల మాట వినేవారు" అన్నారు నికమ్.

ఫొటో సోర్స్, Getty Images
కసబ్ కేసు గురించి ఏమన్నారంటే..
2008 నవంబర్‌లో, ముంబయిలో భారీ ఉగ్రదాడి జరిగింది. భద్రతా దళాలు, టెర్రరిస్టుల మధ్య మూడు రోజుల పాటు సాగిన పోరాటంలో అజ్మల్ కసబ్ అనే ఒక టెర్రరిస్టును మాత్రమే సజీవంగా పట్టుకున్నారు.
ఈ కేసులో కసబ్‌కు మరణశిక్ష పడింది.
ఆ దాడి జరిగిన సమయంలో తాను గోవాలో ఉన్నానని, రాత్రి సమాచారం అందడంతో ఉదయాన్నే ముంబయికి వచ్చినట్లు నికమ్ చెప్పారు.
కసబ్ గురించి మాట్లాడుతూ, "తనకి వ్యతిరేకంగా కోర్టులో వాదనలు వినిపించేది నేనేనని అతనికి తెలిసింది. అతను, అతని గ్యాంగ్ ప్రజలను చంపేశారనే కోణంలోనే నేను చూసేవాడిని. అలా ఎందుకు చేశారు? దానిని ఎలా నిరూపించాలనేదే నాకు పెద్ద సమస్య" అని అన్నారు.
"అతను సాయంత్రం 6.30 గంటలకు ముంబయి రావాలి. కానీ, అదృష్టవశాత్తూ ఆలస్యంగా వచ్చారు. సాయంత్రం 6.30 గంటలకే వచ్చి ఉంటే.. ఆ దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరిగి ఉండేది. ఎందుకంటే, సీఎస్‌టీ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు విపరీతమైన రద్దీ ఉంటుంది" అని ఉజ్వల్ నికమ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ కేసు
2013 ఆగస్టులో, 22 ఏళ్ల మహిళా ఫోటో జర్నలిస్టుపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ కేసుగా పిలుస్తారు.
ఈ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసును కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వాదించారు.
ఈ కేసులో అత్యాచారానికి గురైన బాధితురాలిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతున్నారనే వాదనలు వచ్చాయి.
దీనిపై నికమ్ మాట్లాడుతూ, "చట్టం అలాగే ఉంది. అత్యాచారం జరిగింది అంటే, ఏం జరిగిందో కోర్టుకి పూర్తిగా వివరించాలి. ఇది అమానవీయమని నేను కూడా భావిస్తున్నా. ఈ ప్రక్రియలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది" అన్నారు.
"క్వశ్చన్ ఆన్సర్ సెషన్‌లో, బాధితురాలు స్పృహ కోల్పోయారు. దీంతో విచారణ వాయిదా వేయాలని నేను కోర్టును కోరాను" అన్నారు నికమ్.
చట్టపరంగా, న్యాయపరంగా చూస్తే.. అలాంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలు అవసరమని నికమ్ అన్నారు.
"అదొక భావోద్వేగ సమస్య. చాలా క్రూరమైన నేరం. కానీ, చట్టపరంగా చేయాల్సినవి చేయాల్సిందే కదా" అని ఆయన అన్నారు.
ఈ కేసులతో పాటు 1997 ఆగస్టు 12న ముంబయిలో జరిగిన బాలీవుడ్ సినీ నిర్మాత గుల్షన్ కుమార్ హత్య కేసుకు కూడా ఉజ్వల్ నికమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు.
అలాగే, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రమోద్ మహాజన్ హత్య కేసులోనూ నికమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్.
2006 ఏప్రిల్ 22న ప్రమోద్ మహాజన్‌ను ఆయన తమ్ముడు ప్రవీణ్ మహాజన్ హత్య చేశారు. ఈ కేసులో ప్రవీణ్‌కు జీవిత ఖైదు పడింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














