చాట్‌జీపీటీ అట్లాస్: ఈ ఓపెన్ ఏఐ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌కు పోటీ ఇస్తుందా?

చాట్‌జీపీటీ అట్లాస్, ఓపెన్‌ఏఐ, పర్‌ప్లెక్సిటీఏఐ, కామెట్, గూగుల్ క్రోమ్, టెక్నాలజీ

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, లిలీ జమాలి
    • హోదా, నార్త్ అమెరికన్ టెక్నాలజీ కరస్పాండెంట్, శాన్‌ఫ్రాన్సిస్కో

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌కు పోటీగా కృత్రిమ మేథ ఆధారిత (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ బేస్డ్) వెబ్‌బ్రౌజర్‌ చాట్‌జీపీటీ అట్లాస్‌ను ఓపెన్ ఏఐ ఆవిష్కరించింది.

సెర్చ్‌లో కీలకంగా పనిచేసే అడ్రస్ బార్ చాట్‌జీపీటీ అట్లాస్‌‌లో కనిపించకపోవడమే ఇందులోని కీలక ఫీచర్. దీనిని చాట్‌‌జీపీటీ కేంద్రంగా అభివృద్ది చేసినట్లు సీఈవో సామ్ ఆల్ట్‌మన్ చెప్పారు. ఆ సంస్థ మంగళవారం ఈ కొత్త బ్రౌజర్‌ను మాక్ ఓఎస్ ఫ్లాట్‌ఫాంపై విడుదల చేసింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చేసిన భారీ పెట్టుబడులపైన ఆదాయార్జన, పెరుగుతున్న వినియోగదారులను ఆకర్షించడంలో భాగంగా చాట్‌జీపీటీ అట్లాస్‌‌ను మార్కెట్లోకి తెచ్చారు.

తన చాట్‌బోట్ వినియోగదారుల కోసం పెయిడ్ ఏజెంట్ మోడ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది.

ఈ ఏజెండ్ మోడ్ పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. "అది మీరు ఏం బ్రౌజ్ చేస్తున్నారనే విషయానికి అనుగుణంగా వేగవంతమైన, ఉపయోగకరమైన" సెర్చ్ ఫలితాలను అందిస్తుంది.

వినియోగదారులను తన ఆన్‌లైన్ సేవల వైపు ఆకర్షించేందుకు కంపెనీ కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎట్సీ, షాపిఫై వంటి ఈ-కామర్స్ సైట్‌లతో పాటు ఎక్స్‌పిడియా, బుకింగ్.కామ్ వంటి బుకింగ్ సేవలలో భాగస్వామి కానుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

డేటా అండ్ రీసర్చ్ సంస్థ డిమాండ్‌సేజ్ ప్రకారం, చాట్‌జీపీటీ వారానికి 400 మిలియన్ల (ఫిబ్రవరిలో) నుంచి 800 మిలియన్ల యాక్టివ్ యూజర్స్‌ను చేరుకున్నట్లు ఈనెల మొదట్లో ఓపెన్‌ఏఐ నిర్వహించిన దేవ్‌డే ఈవెంట్‌లో సీఈవో ఆల్ట్‌మన్ ప్రకటించారు.

"కొత్త ఓపెన్‌ఏఐ మొదటి వినియోగదారులు దీనిని పరీక్షించి చూస్తారని భావిస్తున్నా" అని మూర్ ఇన్‌సైట్స్ అండ్ స్ట్రాటజీ సంస్థ సీఈవో, చీఫ్ అనలిస్ట్ పాట్ మూర్‌హెడ్ అన్నారు.

అయితే గూగుల్ క్రోమ్ లేదా మైక్రోసాఫ్ట్‌కు అట్లాస్ గట్టి పోటీనిస్తుందా? అనే విషయంలో ఆయనకు సందేహాలున్నాయి.

"ఎందుకంటే, సాధారణ వినియోగదారులు, ప్రారంభ వినియోగదారులు, కార్పొరేట్ వినియోగదారులు తమకు నచ్చిన బ్రౌజర్ సామర్థ్యాన్ని ఇది అందించేవరకూ వేచిచూస్తారు" అని ఆయన అన్నారు.

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో ఇప్పటికే ఇలాంటి సామర్థ్యాలు చాలా ఉన్నాయని మూర్‌హెడ్ అన్నారు.

ఆన్‌లైన్ సెర్చ్‌లో గూగుల్ చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యం చెలాయిస్తున్నట్లు ప్రకటించిన ఏడాది తర్వాత ఓపెన్‌ఏఐ సవాల్ చేస్తోంది.

న్యాయవాదులు కోరినప్పటికీ.. సెర్చ్‌లో గూగుల్ ఆధిపత్యాన్ని తగ్గించే ఉద్దేశంతో ఇటీవల అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పులోనూ,క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ నుంచి వేరుచేసేందుకు న్యాయస్థానం ఆదేశించలేదు.

చాట్‌జీపీటీ అట్లాస్, ఓపెన్‌ఏఐ, పర్‌ప్లెక్సిటీఏఐ, కామెట్, గూగుల్ క్రోమ్, టెక్నాలజీ

ఫొటో సోర్స్, Getty Images

పర్‌ప్లెక్సిటీ ఏఐ 'కామెట్'

మరో సంస్థ పర్‌ప్లెక్సిటీఏఐ కూడా ఏఐ ఆధారిత బ్రౌజర్ కామెట్‌(comet)ను ఆవిష్కరించింది.

ఇది సాధారణ బ్రౌజర్‌కి మించి వ్యక్తిగత సహాయకుడిగా, ఆలోచనల భాగస్వామిగా పనిచేస్తుందని ఆ సంస్థ పేర్కొంది.

కామెట్ ప్రస్తుతం మాక్‌ఓఎస్ 14, దాని తర్వాతి వెర్షన్లకు, విండోస్ 10, ఆ తర్వాతి వెర్షన్లకు అందుబాటులో ఉంది.

భవిష్యత్తులో కామెట్‌ను మరిన్ని ప్లాట్‌ఫామ్స్‌కు తీసుకొచ్చే దిశగా పనిచేస్తున్నట్లు పర్‌ప్లెక్సిటీఏఐ పేర్కొంది.

కామెట్ కేవలం ఆదేశాలకు స్పందించడమే కాకుండా కంటెంట్‌ను అర్థం చేసుకుని సొంతంగా పనిచేస్తుందని, ఈమెయిల్స్, క్యాలెండర్ ఈవెంట్స్, షాపింగ్, షెడ్యూలింగ్ వంటి వాటిని కూడా నిర్వహించుకోవచ్చని కంపెనీ తెలిపింది.

సాధారణ బ్రౌజర్లు కేవలం బ్రౌజింగ్ సాధనాలు మాత్రమే. అయితే కామెట్ మీకు అవసరమైన సమాధానాలు ఇవ్వడంతో పాటు, మీ వెబ్‌పేజీలను అర్థం చేసుకుని, మీ ఉద్దేశాలను గ్రహించి సొంతంగా సమాధానాలను సిఫార్సు చేస్తుందని పర్‌ప్లెక్సిటీ ఏఐ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)