దొంగల వేట: 48 గంటల్లోగా లూవ్ర దోపిడీ దొంగలను పట్టుకోకపోతే ఇక ఆ నగలు కనిపించవా?

ఫొటో సోర్స్, Louvre Museum
- రచయిత, గేబ్రియేలా పోమేరాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పారిస్‌లోని లూవ్ర మ్యూజియంలో అత్యంత విలువైన ఆభరణాలను దోచుకున్న దొంగలను పట్టుకోవడానికి ఫ్రెంచ్ పోలీసులు, అధికారులు కాలంతో పోటీపడుతున్నారు. వారిని వెంటనే పట్టుకోకపోతే, ఆ ఆభరణాలను కరిగించి దేశం దాటించేస్తారనే ఆందోళన పెరుగుతోంది.
పట్టపగలు పవర్ టూల్స్‌తో అద్దాలు పగలగొట్టి మ్యూజియంలోకి ప్రవేశించిన దొంగలు విలువైన 8 ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వీటిల్లో నెపోలియన్ తన భార్య కోసం చేయించిన వజ్రాలు, పచ్చలు పొదిగిన నెక్లెస్ కూడా ఉంది.
ఆదివారం ఉదయం మ్యూజియం తెరిచిన తర్వాత 9.30 నుంచి 9.40 గంటల మధ్య దొంగతనం జరిగింది.
నలుగురు దొంగలు ఒక వాహనానికి అమర్చిన నిచ్చెన మీదుగా సీన్ నదివైపు ఉన్న బాల్కనీలోకి ప్రవేశించి అక్కడ నుంచి మ్యూజియంలోని అపోలో గ్యాలరీలోకి వచ్చారు.
బ్యాటరీతో పని చేసే డిస్క్ కట్టర్‌తో కిటికీ అద్దాలను కట్ చేసి మ్యూజియంలోకి ప్రవేశించిన దొంగలు గార్డులను బెదిరించి ఆభరణాలను తీసుకెళ్లారు.


ఫొటో సోర్స్, Reuters
దొంగతనం జరిగిన తర్వాత సందర్శకుల్ని బయటకు పంపించిన అధికారులు దర్యాప్తు జరిపేందుకు సోమవారం కూడా మ్యూజియాన్ని మూసివేశారు.
దొంగతనం జరిగిన అపోలో గ్యాలరీకి తాళం వేశారు. ఈ గ్యాలరీలోకి ఎవరినీ అనుమతిండం లేదు.
"వాస్తవం ఏంటంటే మనం విఫలమయ్యాం. కొంతమంది వ్యక్తులు పారిస్ నడిబొడ్డున ఒక ఫర్నీచర్ క్రేన్ తీసుకొచ్చి మ్యూజియం బయట పార్క్ చేసి దాని మీదుగా మ్యూజియంలో ప్రవేశించి విలువ కట్టలేని నగలు తీసుకెళ్లారు. ఇదంతా నిముషాల్లో జరిగింది" అని ఫ్రాన్స్ న్యాయశాఖమంత్రి గెరాల్డ్ డర్మేనిన్ ఫ్రాన్స్ ఇంటర్ రేడియోతో చెప్పారు.
వీలైనంత త్వరగా పోలీసులు దొంగల్ని పట్టుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Louvre Museum
ఇక ఎప్పటికీ దొరకవా?
దొంగలను 48 గంటల్లోగా పట్టుకోకపోతే "నగలు ఎప్పటికీ కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని" దొంగిలించిన కళాఖండాలను గుర్తించడంలో అనుభవం ఉన్న సంస్థ డైరక్టర్ ఒకరు చెప్పారు.
"ఇప్పుడు అసలైన వేట మొదలైంది" అని ఆర్ట్ రికవరీ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ మరినెల్లో బీబీసీతో అన్నారు.
దొంగలు దోచుకెళ్లిన కిరీటాలు, నెక్లెస్‌లు, ఇతర ఆభరణాలను చాలా తేలిగ్గా పగలగొట్టి చిన్నముక్కలుగా మార్చి అమ్మవచ్చు.
‘‘దొంగలు వాటిని తమతో ఉంచుకోరు. వాటిని పగలగొడతారు. విలువైన లోహాన్ని కరిగిస్తారు. విలువైన రాళ్లను బయటకు తీస్తారు. నేరం బయట పడకుండా చూసుకుంటారు" అని మరినెల్లో చెప్పారు.
ఆభరణాలను అలాగే అమ్మడం దొంగలకు సాధ్యం కాదని ఆయన వివరించారు.
"48 గంటల్లో దొంగలు దొరక్కపోతే, వాళ్లు దోచుకెళ్లిన నగలు పోయినట్లేనన్న విషయం పోలీసులకు కూడా తెలుసు" అని ఆయన చెప్పారు.
"వాళ్లు దొంగల్ని పట్టుకోవచ్చు. అయితే ఆభరణాల్ని వెనక్కి తీసుకురాలేరు" అని మరినెల్లో అన్నారు.
మ్యూజియంలో దొంగతనం జరిగిన భాగంలో ఉన్న గదుల్లో మూడొంతుల గదుల్లో సీసీ కెమెరాలు లేవని కోర్టు ఆడిటర్ల ప్రాథమిక నివేదికలో వెల్లడైనట్లు ఫ్రెంచ్ మీడియా కథనాలు ప్రచురించింది.
లూవ్ర మ్యూజియంలో దొంగతనం తర్వాత దేశంలోని సాంస్కృతిక సంస్థలు, మ్యూజియాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అంతర్గత మంత్రి లారెంట్ న్యూనెజ్ సలహాదారులు చెప్పారు.
భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేవని, అవన్నీ కరెక్ట్‌గా ఉంటే దొంగతనాన్ని ఆపగలిగి ఉండేవాళ్లమని ఫ్రాన్స్ న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యానించిన తర్వాత పోలీసులు, మంత్రులు సమావేశం అయ్యారు.
ఈ సమావేశం తర్వాత సాంస్కృతిక సంస్థల వద్ద భద్రతను పెంచారు.
దొంగతనం కారణంగా ఫ్రాన్స్ ప్రతిష్ఠ దారుణంగా దెబ్బ తిందని మంత్రి చెప్పారు

ఫొటో సోర్స్, Louvre Museum
పార్టీలు ఏమన్నాయి?
ఈ దొంగతనం "సంస్కృతి మీద దాడి. మనం గర్విస్తున్న మన చరిత్ర మీద జరిగిన దాడి" అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అన్నారు.
ఈ వ్యవహారమంతా ఫ్రాన్స్‌ను 'బాధిస్తోందని' ఫ్రెంచ్ సెనేట్‌కు చెందిన ఫైనాన్స్ కమిటీ సభ్యురాలు నథాలీ గౌలెట్ అన్నారు.
"ఇదంతా చాలా నిరాశ, ఆగ్రహం కలిగిస్తోంది. ఇది అంత తేలిగ్గా జరిగిందంటే జీర్ణించుకోవడం కష్టంగా ఉంది" అని గౌలెట్ బీబీసీతో చెప్పారు.
అపోలో గ్యాలరీ అలారం సరిగ్గా పని చేయడం లేదని తనకు తెలిసిందని గౌలెట్ చెప్పారు. "అలారాన్ని ఎవరు ఆపివేశారో దర్యాప్తులో తెలుస్తుంది" అని ఆమె చెప్పారు.
దొంగలు నగల్ని ముక్కలు చేసి అమ్ముకుంటే వాళ్లు వాటిని విదేశాల్లో అమ్ముకునే అవకాశం ఉంది అని ఆమె అన్నారు.
"వాళ్లేమీ చిన్నా చితకా దొంగల్లా అనిపించడం లేదు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన నేరం. వాళ్లకు ఎలాంటి నైతిక విలువల్లేవు. వాళ్లకు చారిత్రక సంపద మీద ఎలాంటి గౌరవం లేదు. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారేలా ఉన్నారు" అని నథాలీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Louvre Museum
అంతా ఏడు నిముషాల్లోనే
దొంగల్ని పట్టుకునేందుకు 100 మంది ఇన్వెస్టిగేటర్లను నియమించారు.
లూవ్ర మ్యూజియంలో దొంగలు దోచుకున్న ఆభరణాల విలువ 102 మిలియన్ డాలర్లు ఉంటుందని పారిస్ ప్రాసిక్యూటర్ లౌర్ బెక్కావ్ ఫ్రెంచ్ రేడియో స్టేషన్ ఆర్టీఎల్‌తో చెప్పారు.
"ఆ నగల్ని డబ్బుతో విలువ కట్టలేం. సాంస్కృతికంగా చాలా విలువైనవి" అని ఆమె చెప్పారు.
వాళ్లు పారిపోయిన మార్గంలోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
"దొంగతనం చాలాచాలా వేగంగా జరిగింది. అంతా ఏడు నిముషాల లోపే అయిపోయింది" అని ఫ్రాన్స్ ఇంటర్ రేడియోతో భద్రత వ్యవహారాలు చూసే మంత్రి లారెండ్ న్యూయెజ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














