‘యోని లోపలి నుంచి అవయవాలు బయటకు వచ్చినట్లయింది’- ప్రతి 12 మంది తల్లుల్లో ఒకరు ఎదుర్కొనే ఈ పరిస్థితి ఏంటి?

ఫొటో సోర్స్, Helen Ledwick
- రచయిత, యాస్మిన్ రుఫో
- హోదా, బీబీసీ న్యూస్
'పొట్ట లోపలి అవయవాలు జారిపోయి బయటకు వస్తున్నట్లుగా నాకెందుకు అనిపిస్తోంది' అని గూగుల్‌లో సెర్చ్ చేశారు హెలెన్ లెడ్విక్.
ఈ పరిస్థితి గురించి కొన్నేళ్ల క్రితం గూగుల్‌లో వెదికినప్పుడు, ఈ పరిశోధన జీవితాన్ని మార్చేసే ప్రయాణానికి నాంది పలుకుతుందని ఆమెకు తెలియదు.
బీబీసీ 5 లైవ్ జర్నలిస్ట్, పాడ్‌కాస్టర్‌గా గతంలో హెలెన్ లెడ్విక్ పనిచేశారు.
ఆమె 'పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్' అనే అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ప్రసవం తర్వాత ప్రతి 12 మంది మహిళల్లో ఒకరికి ఇలాంటి సమస్య ఎదురవుతుంది. అయినప్పటికీ, చాలామంది మహిళలు ఇప్పటికీ దీని గురించి కనీసం విని కూడా ఉండరు.
ప్రొలాప్స్ ఏర్పడటానికి కారణం కటి భాగంలోని మూత్రాశయం, పేగులు, గర్భాశయం వంటి అవయవాల్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అవయవాలు తమ స్థానం నుంచి యోనిలోకి జారిపోయి ఉబ్బినట్లుగా మారడం. ఇది ప్రాణాంతకం కాదు. కానీ, రోజువారీ జీవితాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, రిలేషన్‌షిప్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

ప్రసవం తర్వాత..
రెండో బిడ్డకు జన్మనిచ్చిన రెండు వారాల తర్వాత హెలెన్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది.
''నేను సోఫాలో నుంచి లేవగానే అకస్మాత్తుగా అవయవాలన్నీ కదిలినట్లుగా అనిపించాయి. చాలా భయమేసింది. అద్దం, ఫోన్ సహాయంతో అసలేం జరిగిందో చూద్దామని ప్రయత్నించాను. అంతకుముందు నేనెప్పుడు ప్రొలాప్స్ అనే పదాన్ని కూడా వినలేదు' అని ఆమె చెప్పారు.
దీని గురించి బహిరంగంగా మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆమెకొక విషయం అర్థమైంది. ఇది చాలా సాధారణమే అయినప్పటికీ దీన్నొక మాట్లాడకూడని విషయంగా చాలామంది భావిస్తున్నట్లు ఆమె గ్రహించారు.
సిగ్గు కారణంగా దీని గురించి బయటకు మాట్లాడకపోవడంతో మహిళల్లో, ఆరోగ్య కార్యకర్తల్లో ఈ అంశంపై అవగాహన లోపించినట్లు హెలెన్ భావించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆమె పోరాడుతున్నారు.

ఫొటో సోర్స్, Helen Ledwick
‘పెల్విక్ ఆరోగ్యం చుట్టూ అపోహలు’
ఈ పరిస్థితికి సంబంధించిన చికిత్స, పరిష్కారాన్ని ఆశిస్తున్న తనకు డాక్టర్ చెప్పిన అంశాలతో మరింత ఆందోళన, భయం పెరిగిందని హెలెన్ గుర్తు చేసుకున్నారు.
పరిగెత్తినా, దూకినా, బరువులెత్తినా పరిస్థితి మరింత దిగజారుతుందని.. అలాంటి పనులు చేయొద్దని తనకు డాక్టర్ సూచించినట్లు ఆమె చెప్పారు.
''ఆ సలహా నాకు బతకడమే మానేయన్నట్లుగా అనిపించింది. శారీరక బాధ కన్నా సిగ్గుతో చచ్చిపోయాను. దీని గురించి ఎవరికీ చెప్పలేం. ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరికీ జరిగి ఉండదని అనుకుంటాం. సిగ్గుతో జీవిస్తాం' అని హెలెన్ అన్నారు.
హెలెన్ సపోర్ట్ కోసం తొలుత ఇన్‌స్టాగ్రామ్‌ను ఆశ్రయించారు. తనలాంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఆందోళన, అయోమయంలో జీవిస్తున్న మరికొందరు ఇన్‌స్టాలో తనకు తారసపడ్డారు. దీంతో ఆమె ఒక పాడ్‌కాస్ట్ ప్రారంభించారు. అలాగే 'వై మామ్స్ డోంట్ జంప్' అనే పుస్తకాన్ని రాశారు.
పెల్విక్ ఆరోగ్యం చుట్టూ ఉన్న అపోహలు, నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మహిళలంతా తమ అనుభవాలను పంచుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఈ కార్యక్రమాలు చేపట్టారు.
''ఒక్కరు కూడా ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు. అందుకే నాకు కోపం వచ్చింది. ఈ అంశం గురించి మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నా. ఈ విషయంలో నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న జ్ఞానాన్ని ఇతర మహిళలకు తెలియజేయాలని అనుకున్నా'' అని హెలెన్ అన్నారు.
బరువులు ఎత్తితే...
ప్రసవం, బరువులు ఎత్తడం, అధిక బరువు, హిస్టరెక్టమీ వంటి రకరకాల కారణాల వల్ల ప్రోలాప్స్ సంభవించవచ్చు. అరుదైన సందర్భాల్లో ఇది పురుషులను కూడా ప్రభావితం చేస్తుంది.
పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు, జీవనశైలిలో మార్పులు చేయడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది. కానీ, కొన్నిసార్లు శస్త్రచికిత్స అవసరం అవుతుంది.
'ప్రోలాప్స్ ఉన్న స్త్రీలకు యోనిలో వాపు, లేదా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. పెల్విక్ ఫ్లోర్ లిగ్మెంట్స్ బలహీనపడటం వల్ల మూత్రాశయం వంటివి కదులుతాయి'' అని గైనకాలజిస్ట్ డాక్టర్ క్రిస్టిన్ ఎకెచి చెప్పారు.

ఫొటో సోర్స్, Helen Ledwick
‘ఒక యుద్ధంలో గెలిచినట్లయింది’
15 ఏళ్ల క్రితం ఒంటరిగా తాను చేసిన గూగుల్ శోధన ఇప్పుడు మహిళలకు ఎంతో అవసరమైన, శక్తిమంతమైన అంశంగా మారిందని హెలెన్ భావిస్తున్నారు.
తన విషయంలో రికవరీ నెమ్మదిగా జరిగిందని హెలెన్ చెప్పారు.
''కోలుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. పోస్ట్‌పార్టమ్ ఎక్సర్‌సైజ్ చేశాను. నేను ఒక ఫిజియోను కలిశాను. నేను మళ్లీ పరుగు ప్రారంభించడానికి ఆమె సహకరించారు. నేను ఇక ఎప్పటికీ పరిగెత్తలేనని అనుకున్నాను. ప్రోలాప్స్ లక్షణాలను ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకున్నా. నాకు ప్రోలాప్స్ ఇంకా ఉంది. కానీ, ముందులా నా జీవితాన్ని ఇప్పుడు ప్రోలాప్స్ నియంత్రించలేదు. నేను ఒక యుద్ధంలో గెలిచినట్లుగా అనిపిస్తోంది'' అని హెలెన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














