మలేషియాలో చర్చలకు థాయిలాండ్, కంబోడియా అంగీకారం.. 'ట్రంప్‌కు కృతజ్ఞతలు'

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జోనాథన్ హెడ్, డియర్‌బైల్ జోర్డాన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఘర్షణకు తెరదించేందుకు, మలేషియాలో సోమవారం చర్చలు జరిపేందుకు థాయిలాండ్, కంబోడియా అంగీకరించాయి.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శనివారం రెండు దేశాల నాయకులకు ఫోన్ చేసి తక్షణ కాల్పుల విరమణ కోసం ఒత్తిడి తెచ్చారు. దీంతో తాత్కాలిక ప్రధాన మంత్రి ఫుమ్తామ్ వెచాయాచాయ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం చర్చలకు హాజరవుతుందని థాయిలాండ్ ఆదివారం ప్రకటించింది.
చర్చలకు కంబోడియా ప్రధాన మంత్రి హున్ మానెట్ కూడా హాజరవుతారని మలేషియా చెప్పిందని థాయ్ ప్రభుత్వం తెలిపింది.
జూలై 24న ఇరుదేశాల మధ్య ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి కనీసం 33 మంది సైనికులు, పౌరులు మరణించారు. వేలాది మంది థాయ్, కంబోడియా జాతీయులు నిరాశ్రయులయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా అకౌంట్‌లో "కాల్పుల విరమణ, తద్వారా శాంతిస్థాపన కోసం తక్షణమే చర్చలు జరిపేందుకు రెండు దేశాలు అంగీకరించాయి!" అని పోస్ట్ చేశారు.
ట్రంప్ చొరవకు, చేసిన ప్రయత్నాలకు ఇరుదేశాలు కృతజ్ఞతలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడి కాల్పుల విరమణ అభ్యర్థనను కంబోడియా అంగీకరించింది. అయితే, థాయిలాండ్ మాత్రం రెండు దేశాల మధ్య చర్చల అవసరాన్ని నొక్కిచెప్పింది.

ఇరుదేశాలు ఏమంటున్నాయి?
కంబోడియా ఇప్పటికే కాల్పుల విరమణను ప్రతిపాదించింది, ఆ దేశ సైన్యం థాయిలాండ్ కంటే బలహీనంగా ఉంది. థాయ్ ఫిరంగి బాంబు దాడులు, వైమానిక దాడులకు కంబోడియా తమ భూభాగంతో పాటు, సామగ్రిని కోల్పోతోంది.
ట్రంప్‌తో ఫోన్ కాల్ తర్వాత కంబోడియా ప్రధాన మంత్రి హున్ మానెట్ మాట్లాడుతూ "రెండు సాయుధ దళాల మధ్య తక్షణ, బేషరతు కాల్పుల విరమణకు కంబోడియా అంగీకరిస్తోందని నేను ఆయన(ట్రంప్)కు చెప్పాను" అని అన్నారు.
ట్రంప్ మధ్యవర్తిత్వం "నిజంగా చాలామంది సైనికులు, పౌరుల ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది" అని అన్నారు.
మరోవైపు, థాయిలాండ్ కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని చెబుతూ, ముందు కంబోడియాతో చర్చలు జరగాలని పట్టుబడుతోంది.
థాయ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో "తాత్కాలిక ప్రధాన మంత్రి ఫుమ్తామ్ వెచాయాచాయ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. కాల్పుల విరమణకు థాయిలాండ్ సూత్రప్రాయంగా అంగీకరిస్తోందని చెప్పారు. అయితే, కంబోడియా చిత్తశుద్ధిని గమనించాలని థాయిలాండ్ కోరుతోంది" అని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
శాంతి లేకపోతే, వాణిజ్య చర్చలూ లేవు
కంబోడియా, థాయిలాండ్‌లతో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నట్లు, అయితే ఇరుదేశాలు ఘర్షణను ఆపేవరకు చర్చలు సముచితం కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
కంబోడియా, థాయిలాండ్ దేశాలపై అమెరికా సుంకాలు అమల్లోకి రావడానికి వారం ముందు ఆయన జోక్యం చేసుకున్నారు.
థాయిలాండ్ లేదా కంబోడియా నుంచి వస్తువులను అమెరికాకు దిగుమతి చేసుకోవడానికి ఆగస్టు 1లోపు ఒప్పందం కుదుర్చుకోవాలి, లేకపోతే ఆ రోజు నుంచి వాటిపై 36 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఎలా జరిగింది?
ఇరుదేశాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ట్రంప్ ఎలా ముందుకెళుతున్నారనే దానిపై స్పష్టత లేదు. ఎందుకంటే దీనికి ముందు రోజు, థాయిలాండ్ విదేశాంగ మంత్రి మారిస్ సంగియంపోంగ్సా "మాకు మూడో దేశం నుంచి మధ్యవర్తిత్వం అవసరం లేదని అనుకుంటున్నాం" అని అన్నారు.
అంతకుముందు, మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం కూడా థాయిలాండ్, కంబోడియా మధ్య చర్చలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
మరోవైపు, కంబోడియా శనివారమే తక్షణ కాల్పుల విరమణ, థాయిలాండ్‌తో వివాదాన్ని పరిష్కరించడానికి శాంతియుత మార్గాన్ని కోరింది.
అయితే, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ దక్షిణ ఐర్‌షైర్‌లోని తన లగ్జరీ రిసార్ట్ ట్రంప్ టర్న్‌బెర్రీలో గోల్ఫ్ ఆడిన తర్వాత, కంబోడియా ప్రధానమంత్రి హున్ మానెట్, థాయిలాండ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్‌తామ్‌తో మాట్లాడినట్లు తెలిపారు.
"అంతా పూర్తయింది. శాంతి దగ్గర్లోనే ఉంది, రెండు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఎదురుచూస్తున్నా!" అని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు.
కాగా, ఘర్షణ మొదలవ్వడానికి కారణం మీరంటే మీరని థాయిలాండ్, కంబోడియాలు ఒకరినొకరు నిందించుకుంటున్నాయి.
సరిహద్దు వద్ద థాయ్ దళాలను గమనించేందుకు కంబోడియా డ్రోన్లను వాడటంతో ఘర్షణ ప్రారంభమైందని థాయిలాండ్ చెబుతోంది. ఖైమర్-హిందూ దేవాలయానికి దగ్గరగా థాయ్ సైనికులు వెళ్లి మునుపటి ఒప్పందాన్ని ఉల్లంఘించారని కంబోడియా ఆరోపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
వందల ఏళ్ల నాటి ఘర్షణ
ఈ వివాదానికి మూలాలు వందల సంవత్సరాల నాటివి. కంబోడియాను ఫ్రెంచ్ ఆక్రమించిన అనంతరం సరిహద్దులు నిర్ణయించినపుడు ఇది ప్రారంభమైంది.
ఆ తర్వాత, కంబోడియా వివాదాస్పద ప్రాంతంలో ఉన్న 11వ శతాబ్దపు దేవాలయాన్ని 2008లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దీనిపై థాయ్‌లాండ్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగి సైనికులు, పౌరులు మరణించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














