Kurnool Bus accident: ‘కాలిపోతున్న బస్ నుంచి ప్రాణాలతో ఎలా బయటకు దూకానంటే’

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
( హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలవరపరచొచ్చు )
‘ఒక్కసారిగా పొగ కమ్మేసి ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. నా బెర్త్ దగ్గర ఉన్న అద్దాలను నేను, ఇంకొకరు కలిసి కాలితో తన్ని పగలగొట్టి కిందకు దూకేశాం'' అని చెప్పారు ప్రయాణికుడు సూర్య.
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో బస్సు నుంచి సురక్షితంగా బయటపడిన సూర్య, ఆ ఘటన వివరాలను బీబీసీతో పంచుకున్నారు.
సూర్య, హైదరాబాద్‌లోని మియాపూర్ వాసి.
చదువు పూర్తి కావడంతో బెంగళూరుకు వెళ్తున్నానని 24 ఏళ్ల సూర్య చెప్పారు. ప్రమాదానికి గురైన బస్‌లో ఎల్16 బెర్తులో ఆయన ప్రయాణిస్తున్నట్లుగా ఉంది.

మూసాపేట నుంచి ‘వేమూరి కావేరీ’ ట్రావెల్స్ బస్సులో గురువారం రాత్రి సుమారు 9.45 గంటల ప్రాంతంలో బయల్దేరానని వివరించారు.
''అగ్ని ప్రమాద ఘటన తెల్లవారుజామున 2.45 గంటల నుంచి 3 గంటల మధ్య సమయంలో జరిగింది. ఒక్కసారిగా ఏసీలోంచి పొగ, వాసన రావడం మొదలయ్యాయి. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే బస్సును పొగ కమ్మేసింది'' అని బీబీసీకి వివరించారు సూర్య.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై మంటలు అంటుకుని ఈ ఘోర ప్రమాదం జరిగింది.

''మాకు ఎలాంటి శబ్దం వినిపించలేదు'
ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు.
బైకును ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అక్కడి పరిస్థితిని బట్టి ప్రాథమికంగా తెలుస్తోందని కలెక్టర్ సిరి బీబీసీతో చెప్పారు.
బస్సులో మొత్తం 46 మంది ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించామని బీబీసీతో కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ. సిరి చెప్పారు.
వీరిలో ఇద్దరు డ్రైవర్లు కాగా, మిగిలిన వారు ప్రయాణికులని తెలిపారు.
ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మందితో పాటు, బైకుపై వెళుతున్న వ్యక్తి చనిపోయారని తెలిపారు. మృతుల సంఖ్య మొత్తం 20గా ఉందని స్పష్టం చేశారు.
27 మంది ప్రాణాలతో బయటపడ్డారని, వారందరికీ అవసరమైన చికిత్స అందించామని, కొందరు స్వస్థలాలకు వెళ్లిపోయారని వివరించారు.
''బస్సు కిందకు బైక్ వెళ్లిపోయింది. బస్సు ఇంజిన్ కింద ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఫ్యూయల్ ట్యాంకుకు మంటలు అంటుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించాం'' అని కలెక్టర్ అన్నారు.
ప్రమాద సమయంలో పెద్ద శబ్దంలాంటిదేమీ తమకు వినిపించలేదని సూర్య బీబీసీతో చెప్పారు.
''అది ఏసీ బస్సు కావడంతో అద్దాలన్నీ మూసి ఉన్నాయి. బయట నుంచి ప్రమాదం జరిగిన శబ్ధం ఏమీ వినిపించలేదు. పొగ, వాసన రావడంతో నాకు మెలకువ వచ్చింది'' అని బీబీసీతో చెప్పారు.
తన బెర్త్ వెనుకవైపు ఉందని, అక్కడికి మంటలు వ్యాపించడానికి కాస్త సమయం పట్టిందని, ముందువైపు నుంచి మంటలు విస్తరిస్తూ వచ్చాయని సూర్య వివరించారు.
ప్రమాదానికి గురైన బస్సును పరిశీలిస్తే, ముందు వైపు నుంచి ఎక్కువగా కాలిపోగా.. వెనుక వైపు తక్కువగా కాలినట్లు కనిపిస్తోంది.

'రెండు చోట్ల అద్దాలు పగలగొట్టాం'
ఘటన జరిగిన సమయంలో వర్షం కురుస్తోంది.
మంటలు అంటుకున్న తర్వాత వేగంగా వ్యాపించాయని, వర్షం పడుతున్నప్పటికీ మంటల తీవ్రత ఎక్కువగా కనిపించిందని సూర్య చెప్పారు.
''బస్సులోంచి బయటపడేందుకు మూడు ఎగ్జిట్స్ (మార్గాలు) క్రియేట్ చేశాం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వెనుక ఉంది. అది కాకుండా ప్రయాణికులంతా కలసి మరో రెండుచోట్ల అద్దాలు పగులగొట్టి బయటపడ్డాం'' అని సూర్య అన్నారు.
బస్సు లోపల ఉన్న వారి అరుపులు, కేకలు వినిపించాయని చెప్పారు.
ఒక్కొక్కరుగా బయటకు దూకేశారని, ఆ సమయంలో లోపల ఎంత మంది ఉన్నారో అర్థం కాలేదని ఆయన అన్నారు.

'ఏం జరిగిందో అర్థమయ్యేసరికే మంటలు'
మరో ప్రయాణికుడు శ్రీహర్ష కూడా బీబీసీతో మాట్లాడారు.
ఆయన సూర్యతో కలిసి ఎల్ 17 బెర్తు బుక్ చేసుకుని బస్సులో ప్రయాణిస్తున్నారు.
నిజాంపేట క్రాస్ రోడ్స్ వద్ద నుంచి పికప్ వ్యానులో వచ్చి మూసాపేట వద్ద ఈ బస్సు ఎక్కినట్లు చెప్పారు శ్రీహర్ష.
''ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. షాక్‌కు గురయ్యాం. బయటకు దూకేసిన తర్వాత అర్థమైంది, బస్సు ప్రమాదానికి గురైందని. అప్పటికే వెనుక ఆగిన వాహనదారులు అరుస్తున్నారు. కానీ, బస్సుకు బాగా మంటలు అంటుకున్నాయి'' అని చెప్పారు.
బెంగళూరులో ఉద్యోగానికి వెళుతున్నానని శ్రీహర్ష చెప్పారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు డ్రైవర్లలో ఒకరి ఆచూకీ దొరకలేదని పోలీసులు మీడియాకు చెప్పారు. తాము కిందకు దూకి చూసేసరికి డ్రైవర్ కూడా అక్కడ కనిపించలేదని సూర్య బీబీసీతో చెప్పారు.
''ముందు వైపు ఉన్న ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతోపాటు పొగ కారణంగా స్పృహ కోల్పోయినట్లుగా అనిపించింది. అందుకే వాళ్లు బయటకు రాలేకపోయారు'' అని చెప్పారు.
బస్సుపై రూ. 23 వేల ట్రాఫిక్ చలాన్లు
ప్రమాదానికి గురైన బస్సు వివరాలను వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం ప్రకటించింది. బస్సు నం.DD01N9490 తో నడుస్తోంది.
దాద్రా, నగర్ హవేలి అండ్ డామన్ డయ్యూలో రిజిస్ర్టేషన్ అయ్యింది.
ఈ బస్సుపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 16 చలాన్లు ఉన్నాయి. వీటిల్లో 'నో ఎంట్రీ' మార్గంలోకి బస్సు రావడం సహా పరిమితికి మించిన వేగంతో కూడా బస్సు నడిపినట్లుగా చలాన్లు ఉన్నాయి.
చలాన్ల మొత్తం రూ.23,120 ఉన్నట్లుగా తెలంగాణ పోలీసు వెబ్‌సైట్ ఆధారంగా తెలుస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














