ఆంధ్రప్రదేశ్: ఎమ్మెల్యే కొలికపూడి VS ఎంపీ కేశినేని చిన్ని... ఏమిటీ వివాదం, చంద్రబాబు ఏం చేయనున్నారు?

కొలికపూడి, ఎంపీ కేశినాని చిన్ని

ఫొటో సోర్స్, facebook.com/srinivasarao.kolikapudi/UGC

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) మధ్య వివాదం ముదిరింది.

కేశినేని చిన్ని తనకు టికెట్‌ ఇప్పిస్తానని రూ.5 కోట్లు తీసుకున్నారని కొలికపూడి బహిరంగంగా ఆరోపించారు. ఈ వివాదంపై అక్టోబరు 24న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాశ్రీనివాసరావు చేయాల్సిన ‘పంచాయితీ’ ఇప్పుడు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది.

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న చంద్రబాబు, తాను తిరిగి వచ్చిన తరువాత స్వయంగా దీనిపై మాట్లాడతానని చెప్పినట్టు పల్లా శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.

కొలికపూడి శ్రీనివాసరావు 2024కి ముందు అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంతో గుర్తింపు తెచ్చుకున్నారు . తిరువూరు నుంచి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 20 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు.

కొలికపూడి ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్ల నుంచే తిరువూరు టీడీపీ నేతలకు, కొలికపూడికి మధ్య వివాదాలు నెలకొన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వివాదాలపై పలుమార్లు ఆయన టీడీపీ అధిష్టానానికి వివరణ కూడా ఇచ్చుకున్నారు.

ఆయా వివాదాలపై ఆయన గతంలో బీబీసీతో మాట్లాడుతూ ''ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల పెత్తనం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులను డమ్మీలుగా చేసి వారు అధికారం చలాయించాలని చూస్తుంటారు. ఈ సంస్కృతిని వ్యతిరేకించాననే తిరువూరులో నాపై లేనిపోని ఆరోపణలు, వివాదం సృష్టిస్తున్నారు'' అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు, కొలికపూడి

ఫొటో సోర్స్, Kolikapudi Srinivsa Rao/FB

వివాదం ఎక్కడ మొదలైంది?

గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, తదుపరి టీడీపీలోకి వచ్చిన పల్లెపాటి శ్రీను అనే నేతకు తిరువూరు పట్టణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తూ పార్టీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయంపై ‘‘మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లకు అన్యాయం జరుగుతోందని’’ వారం కిందట జి.కొత్తూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమావేశంలో కార్యకర్తలు ఎమ్మెల్యే కొలికపూడి వద్ద చెప్పారు.

దీంతో "ఎంపీ కేశినేని చిన్ని పీఏ కిశోర్, ఎంపీ అనుచరుడు సూరపనేనిరాజా పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారు. నేను సూచించిన వారికి పదవులు రాకుండా అడ్డుకుంటున్నారు. తిరువూరులో ఇసుక, గ్రావెల్‌ అక్రమాలకు పాల్పడుతున్నారు'' అని కొలికపూడి ఆ సమావేశంలో టీడీపీ తిరువూరు పరిశీలకుడు సుఖవాసి రాజా సమక్షంలోనే ఆరోపించారు.

ఎమ్మెల్యే వ్యాఖ్యలతో తాజా వివాదం మొదలైంది.

తెలుగుదేశంపార్టీ, కొలికపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్ని, చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, UGC

‘‘ఆయన వైసీపీ కోవర్టు’’

ఎంపీ కేశినేని చిన్ని వర్గంపై ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యల తర్వాత తిరువూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు, అలవాల రమేష్‌ రెడ్డి, కంచిబాబి, దుబ్బాక వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేపై నేరుగా విమర్శలకు దిగారు.

కొలికపూడి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన వైసీపీ కోవర్టని ఆరోపించారు.

తిరువూరు నియోజకవర్గంలో సమస్యలకు మూల కారణం కొలికపూడేనని, ప్రతి స్కామ్‌ వెనక ఉన్నది ఆయనేనని ఆరోపించారు. ఎంపీ చిన్నిపై వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.

ఆ తర్వాత గురువారం ఎంపీ కేశినేని చిన్ని తిరువూరులో పర్యటించి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే కొలికపూడి నియోజకవర్గంలోని విస్సన్నపేటలోనే ఉన్నప్పటికీ దూరంగా ఉన్నారు.

ఎంపీ చిన్ని తన పర్యటన తర్వాత తిరువూరులోనే మీడియాతో మాట్లాడుతూ నేరుగా కొలికపూడిపై విమర్శలు చేశారు.

"ఎన్నికల సమయంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయిన తన సోదరుడు కేశినేని నాని ఫొటో పెట్టుకుని తిరిగే వాళ్లకు పదవులు ఇమ్మంటే ఎందుకు ఇస్తా" అని కొలికపూడిని ఉద్దేశించి చిన్ని వ్యాఖ్యానించారు.

సీఎం చంద్రబాబు, ఎంపీ కేశినేని చిన్ని సహకారం వల్లే ఎమ్మెల్యేగా గెలిచానని, వారు దైవంతో సమానమని చెప్పే కొలికపూడికి తాను ఇప్పుడు దెయ్యంగా ఎందుకు కనిపిస్తున్నానో సమాధానం చెప్పాలని ఎంపీ ప్రశ్నించారు.

పార్టీ పదవులు ఎవరూ అమ్ముకోవడం లేదనీ, విమర్శలు చేసే వాళ్లు సాక్ష్యాలు చూపించాలన్నారు.

గత ప్రభుత్వ పాలనలో వైసీపీ నాయకులు చేసిన స్కామ్స్‌ అన్నీ బయటికి వస్తున్నాయని, ఈ స్కాముల వెనుక ఉన్న నాయకులు కూడా బయటకు వస్తారని ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు.

కాగా, ఎంపీ చిన్నితో మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా దీని గురించి తర్వాత మాట్లాడతారని ఎంపీ వ్యక్తిగత సిబ్బంది చెప్పారు.

తెలుగుదేశంపార్టీ, కొలికపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్ని, చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, UGC

కొలికపూడి ఏమన్నారు?

ఎంపీ కేశినేని చిన్ని మీడియా సమావేశం తర్వాత ఎమ్మెల్యే కొలికపూడి నేరుగా ఎంపీపై ఆవినీతి ఆరోపణలు గుప్పించారు.

సోషల్‌ మీడియా వేదికగా గురువారం విమర్శలు చేశారు.

2024లో ఎమ్మెల్యే టికెట్‌ కోసం కేశినేని చిన్నికి డబ్బులు ఇచ్చానంటూ కొలికపూడి బ్యాంకు స్టేట్‌మెంట్‌లు విడుదల చేశారు.

చిన్నికి ఇచ్చిన డబ్బుల వివరాలు అంటూ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లతో వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టారు.

తాను ఇచ్చిన డబ్బుల వివరాల గురించి రేపు మాట్లాడుకుందాం అంటూ మరో స్టేటస్‌ పెట్టారు.

ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఎంపీ చిన్ని 5 కోట్లు అడిగారని మూడు దఫాల్లో రూ. 60లక్షలు డబ్బు ట్రాన్స్‌ ఫర్‌ చేశానని, మరో రూ. 50 లక్షలు చిన్ని పీఏ తీసుకెళ్లాడని కొలికపూడి ఆరోపించారు.

మిగతా డబ్బుల గురించి రేపు(శుక్రవారం) మాట్లాడుకుందాం అంటూ స్టేటస్‌ పెట్టారు.

ఆ తర్వాత తాను జగన్‌ మీద పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చానని.. కసిరెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన లిక్కర్‌ డబ్బులతో రాజకీయాల్లోకి రాలేదని వాట్సాప్‌ స్టేటస్‌లో రాశారు.

అలాగే ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి తిరువూరు పబ్లిక్‌ పార్క్‌ కాదు అని వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టినట్టు ప్రచారం జరిగింది. కానీ వీటిని బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించడంలేదు.

ఇక గురువారం సాయంత్రం ఓ చానల్‌తో మాట్లాడిన కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీ చిన్నిపై ఆరోపణలు గుప్పించారు

ఈ విషయమై కొలికపూడితో మాట్లాడేందుకు బీబీసీ ఆయనను సంప్రదించే ప్రయత్నం చేసింది. అయితే ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ అంశం గురించి తిరువూరు టీడీపీ పరిశీలకుడు సుఖవాసి రాజాను బీబీసీ ప్రశ్నించింది.

''అక్కడి పరిస్థితి మా చేయి దాటింది. మేమేమీ మాట్లాడలేని పరిస్థితి. ఇక అధినాయకత్వం చూడాల్సిందే'' అని ఆయన అన్నారు.

తెలుగుదేశంపార్టీ, కొలికపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్ని, చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, facebook.com/srinivasarao.kolikapudi

ఫొటో క్యాప్షన్, కొలికపూడి శ్రీనివాసరావు తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఈ చిత్రాన్ని పోస్ట్ చేశారు.

‘‘చంద్రబాబే పరిష్కరిస్తారు’’

ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేశినేని చిన్ని వివాదం రచ్చకెక్కిన నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈనెల 24వ తేదీన వారిద్దరితో పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు.

అయితే చంద్రబాబు ఆదేశాలతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నానని పల్లా బీబీసీతో చెప్పారు.

"ఈ మీటింగ్‌ గురించి సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని ఫోన్‌ చేశాను. విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత తానే వారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. అందుకే మీటింగ్‌ క్యాన్సిల్‌ చేశాను' అని పల్లా శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.

పార్టీ లైన్‌ దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆయన చెప్పారు.

"ఇవి అవాంఛనీయ పరిణామాలు. తప్పెవరిదని అప్పుడే చెప్పలేం. కానీ అలా బయటపడి వ్యాఖ్యలు చేసుకోకుండా ఉండాల్సింది. ఎవరైనా సరే, పార్టీ క్రమశిక్షణకు లోబడి పని చేయాల్సిందే. పార్టీ లైన్‌ దాటితే ఏ స్థాయి నేతనైనా ఉపేక్షించేది లేదు'' అని పల్లా బీబీసీతో అన్నారు.

"వాస్తవంగా చెప్పాలంటే కొలికపూడి ఆవేశపరుడు. ఇది అందరికీ తెలుసు. అందుకని జాగ్రత్తగా డీల్‌ చేయాలి. ఎంపీ కూడా తిరువూరు నియోజకవర్గంలో ఎక్కువ జోక్యం చేసుకోకుండా ఉండాల్సింది. ఓ రకంగా ఇద్దరిదీ తప్పనే చెప్పాలి'' అని టీడీపీ సీనియర్‌ నాయకుడొకరు బీబీసీతో అన్నారు.

ఎన్నికల్లో టికెట్ కోసం ఎంపీ చిన్నికి డబ్బులు ఇచ్చానంటూ కొలికపూడి స్క్రీన్‌ షాట్స్‌ పెట్టడం పార్టీకి కాస్త ఇబ్బందే.

దీన్ని చంద్ర బాబు ఎలా డీల్‌ చేస్తారనే దాని గురించి పార్టీలో చర్చ జరుగుతోంది.

"ఇద్దరికీ సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వొచ్చు. కానీ గట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో సామాజిక వర్గాల దృష్ట్యా ఇది సున్నిత సమస్య. మరి బాబు ఎలా డీల్‌ చేస్తారో చూడాలి'' అని ఆ టీడీపీ నేత బీబీసీ వద్ద అభిప్రాయపడ్డారు.

అక్టోబరు 24వ తేదీ 4గంటలకు తన కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ ఉందని ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం నుంచి మీడియా సంస్థలకు సమాచారం వచ్చింది.కానీ కొద్దిసేపటికే ఆ ప్రెస్‌మీట్‌ క్యాన్సిల్‌ అని చెప్పారు.

చంద్రబాబు రాష్ట్రానికి వచ్చే వరకు ఈ విషయమై ఎవ్వరూ ఏమీ మాట్లాడకూడదని ఆదేశాలు రావడం వల్లే ఎంపీ మీడియా సమావేశం క్యాన్సిల్‌ చేసుకున్నారని టీడీపీ నేత ఒకరు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)