ఇకపై అలాంటి పోర్న్ వీడియోలు చట్టవిరుద్ధం, బ్రిటన్ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షియోనా మెక్కల్లమ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహిళలు, బాలికలపై హింసను అరికట్టే ప్రభుత్వ ప్రణాళికలలో భాగంగా ‘ఊపిరాడకుండా చేయడం’ ‘గొంతు నొక్కడం’లాంటి అంశాలను చూపే అశ్లీల చిత్రాలను చట్టవిరుద్దమైనవిగా ప్రకటించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రధాన పోర్న్ వెబ్‌సైట్‌లలో చిత్రీకరిస్తున్న గొంతు అదిమే దృశ్యాల కారణంగా, అలాంటి చర్యలు సాధారణమని యువత భావించేలా చేస్తున్నాయని ఒక సమీక్షలో తేలింది.
పార్లమెంటులో 'క్రైమ్ అండ్ పోలీసింగ్' బిల్లుకు చేసిన తాజా మార్పుల ప్రకారం, ఈ రకమైన వాటిని ప్రచురించడం లేదా కలిగి ఉండటం నేరం. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు అలాంటి వాటిని కనిపెట్టి తొలగించాలి, లేదంటే మీడియా నియంత్రణ సంస్థ 'ఆఫ్‌కామ్' చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ భద్రతా చట్టం ప్రకారం, అశ్లీల చిత్రాలలో గొంతునొక్కడం ఇకపై 'ప్రాధాన్యత నేరం'గా చూస్తారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ ఇన్నోవేషన్ టెక్నాలజీ (డీఎస్ఐటీ) తెలిపింది. అంటే, ఇక నుంచి దీన్ని పిల్లల లైంగిక వేధింపులు లేదా ఉగ్రవాద కంటెంట్ లాగానే పరిగణిస్తారు.
"అటువంటి విషయాలను చూడటం లేదా పంచుకోవడం నీచం, ప్రమాదకరం. దానిని పోస్ట్ చేసే వ్యక్తులు హింస, దుర్భాషను ప్రోత్సహిస్తున్నారు'' అని సాంకేతిక శాఖ మంత్రి లిజ్ కెండాల్ అన్నారు.
టెక్ కంపెనీలను కూడా జవాబుదారీగా ఉంచుతాం, ఈ కంటెంట్ వ్యాప్తి చెందకముందే వారు దానిని ఆపేలా చూస్తామని ఆమె తెలిపారు.

పోర్న్ ఇండస్ట్రీపై ప్రభుత్వం సరిగ్గా దృష్టి పెట్టడం లేదని ఈ సంవత్సరం ప్రారంభంలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యురాలు, బారోనెస్ బెర్టిన్ హెచ్చరించారు.
'సెక్స్ సమయంలో అమ్మాయిలను ఎలా ఊపిరాడకుండా చేయాలి' అని ఒక టీచర్‌ని అడిగిన 14 ఏళ్ల బాలుడి గురించి ఫిబ్రవరిలో ప్రచురితమైన తన సమీక్షలో బెర్టిన్ ప్రస్తావించారు.
అలాంటి చర్యలను అనుకరించడం వల్ల తీవ్ర ప్రమాదం సంభవించవచ్చని ఆమె హెచ్చరించారు.
గొంతు అదమడాన్ని చూపించే అశ్లీల చిత్రాలను నిషేధించేలా చట్టాన్ని మారుస్తామని బ్రిటన్ ప్రభుత్వం జూన్‌లో హామీ ఇచ్చింది.

'హింసకు తీవ్రమైన రూపం'
2019లో బీబీసీ నిర్వహించిన ఒక సర్వేలో 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో 38 శాతం మందికి సెక్స్ సమయంలో గొంతు నొక్కారని (ఊపిరాడకుండా చేయడం) చేశారని తేలింది.
ప్రభుత్వ చర్యలను ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్రస్సింగ్ స్ట్రాంగ్యులేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నీ ర్యాన్ స్వాగతించారు.
'గొంతు నొక్కడం' అనేది సన్నిహిత సంబంధాలలో మహిళలకు "గందరగోళ, హానికరమైన సందేశాలు" పంపవచ్చని చెబుతున్నారు.
ఊపిరాడకుండా చేయడం తీవ్రమైన హింస అని, దీనిని తరచుగా గృహ హింసలో బాధితులను నియంత్రించడానికి, నోరు విప్పకుండా చేయడానికి, లేదా భయపెట్టడానికి ఉపయోగిస్తారని బెర్నీ వివరించారు.
పోర్న్‌లో హింస సాధారణమని ప్రజలు భావించకుండా 'ఈ కొత్త చట్టం ఒక ముఖ్యమైన అడుగు' అని ఎండ్ వయోలెన్స్ ఎగైనెస్ట్ విమెన్ కోయలేషన్‌కు చెందిన ఆండ్రియా సైమన్ అభిప్రాయపడ్డారు.
హానికలగకుండా 'గొంతునొక్కడం' లాంటిదేమీ ఉండదు. ఇలాంటి హానికరమైన వాటిని మహిళలు ఎక్కువసేపు సమ్మతించలేరు.ఇది మెదడు, జ్ఞాపకశక్తి సమస్యలను కలిగిస్తుందని చెప్పారామె.
"పోర్న్‌లో ఇటువంటి చర్యలను చూపించడం ముఖ్యంగా యువతలో ప్రమాదకరమైన ప్రవర్తనలను ప్రోత్సహిస్తుంది" అని ఆండ్రియా అన్నారు.

'సోషల్ మీడియా సాధారణం చేసింది'
కొత్త చట్టం పనిచేస్తుందని పెద్దగా నమ్మకం లేదని 'వీ కాంట్ కన్సెంట్ టు దిస్' అనే గ్రూపు ఫౌండర్, క్యాంపెయినర్ ఫియోనా మెకెంజీ అన్నారు.
'గొంతు నొక్కడం' ఉండే పోర్న్‌లను చూపకుండా ఆపడానికి ఇప్పటికే చట్టాలు ఉన్నాయని, కానీ, సరిగ్గా అమలు కావడం లేదన్నారామె.
అలాంటి చట్టమే 'క్రిమినల్ జస్టిస్ అండ్ ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 2008', ఇది ప్రాణాంతక చర్యలను చూపించే కంటెంట్‌తో సహా తీవ్రమైన అశ్లీలతను చేయడం నేరంగా పరిగణిస్తుంది
"మహిళల గొంతు అదమడం సోషల్ మీడియాలో సాధారణమైన విషయంగా, అభిరుచి వ్యక్తీకరణగా చూపిస్తున్నారని యువతులు మాకు ఐదేళ్ల కిందటే చెప్పారు" అని ఫియోనా మెకెంజీ చెప్పారు.
ఇలాంటివి పురుషులకు సాధారణమన్నట్లు పోర్న్ సైట్‌లు చూపుతున్నాయని, ప్రస్తుత చట్టాల ప్రకారం కూడా వాటిలో ఏవీ శిక్షను ఎదుర్కోలేదని ఆమె అన్నారు.
"కాబట్టి చట్టంలో లేదా ఆచరణలో మార్పు అవసరం. ఈసారి ప్రభుత్వం నిజంగా ఏదైనా చేసే అవకాశం ఉంది" అని అభిప్రాయపడ్డారు ఫియోనా మెకెంజీ.
కొత్త సవరణ తీసుకొస్తామని జూన్‌లో చెప్పిన బ్రిటన్ ప్రభుత్వం, అది అబ్‌సీన్ పబ్లికేషన్ యాక్ట్ -1959, క్రిమినల్ జస్టిస్ అండ్ ఇమ్మిగ్రేషన్ యాక్ట్-2008 వంటి ప్రస్తుత చట్టాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














