వివాహిత ఫోటోలు వాడి ఎరోటిక్ ఏఐ కంటెంట్ సృష్టించిన మాజీ ప్రియుడు.. తర్వాత ఏం జరిగిందంటే

ఫొటో సోర్స్, Babydoll Archi
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్
బేబీడాల్ ఆర్చి అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోయర్లు రోజుల వ్యవధిలోనే రెండింతలై 14 లక్షలకు చేరుకున్నారు. రెండు పోస్టులు వైరల్ కావడంతో ఫాలోయర్ల సంఖ్య ఇలా అమాంతం పెరిగింది.
ఒక పోస్టులో ఒక మహిళ ఎరుపు రంగు చీరలో రొమేనియా పాటకు డ్యాన్స్ చేస్తుండగా, మరో ఫోటోలో ఆమె అమెరికా అడల్ట్ ఫిల్మ్ స్టార్ కెండ్రా లస్ట్‌తో ఫోజు ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది.
దీంతో, అందరూ ఆమె గురించి తెలుసుకోవాలని అనుకున్నారు.
గూగుల్ సెర్చ్‌లోనూ 'బేబీడాల్ ఆర్చి' పేరు ట్రెండ్ అయింది. అలాగే లెక్కలేనన్ని మీమ్స్, ఫ్యాన్ ఫేజీలు పుట్టుకొచ్చాయి.
అయితే, అందరూ భావించినట్లుగా ఈ ఖాతా ఒక మహిళకు చెందినది కాదు.
అదొక ఫేక్ ఇన్‌స్టా అకౌంట్. అయితే, అందులో ఉపయోగించిన ఒక ముఖం, అచ్చంగా అసోంలోని దిబ్రూగఢ్‌కు చెందిన ఒక గృహిణి ముఖాన్ని పోలి ఉంటుంది.
ఆ మహిళ సోదరుడు ఈ అకౌంట్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత అసలు నిజం బయటకొచ్చింది.
ఈ కేసుకు సంబంధించి ఆ మహిళ మాజీ ప్రియుడు ప్రతీమ్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు.

బోరాకు ఆమెకు మధ్య గొడవ జరిగిందని, ఆ మహిళపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఏఐతో ఆమె లాంటి ఒక రూపాన్ని సృష్టించారని కేసు దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీస్ ఆఫీసర్ సిజల్ అగర్వాల్ బీబీసీతో చెప్పారు.
ప్రతీమ్ బోరా ఒక మెకానికల్ ఇంజినీర్. సొంత ఆసక్తితో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో మెలకువలు నేర్చుకున్న ప్రతీమ్ ఒక నకిలీ ప్రొఫైల్‌ను సృష్టించేందుకు తన మాజీ ప్రేయసి అయిన ఆ గృహిణి వ్యక్తిగత ఫోటోలను వాడుకున్నారని సిజల్ తెలిపారు.
బోరా ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఆయన కుటుంబంతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. వారి స్పందన రాగానే ఈ కథనాన్ని అప్‌డేట్ చేస్తాం.
బేబీడాల్ ఆర్చి అకౌంట్‌ను 2020లో ప్రారంభించారు. 2021 నుంచి అందులో పోస్టులు చేశారు. తొలుత మహిళకు సంబంధించిన అసలైన ఫోటోలను మార్ఫింగ్ చేసి అందులో పోస్ట్ చేశారని సిజల్ చెప్పారు.
''ఆ తర్వాత చాట్ జీపీటీ, డిజైన్ వంటి టూల్స్ ఉపయోగించి ఏఐ వర్షన్‌ను రూపొందించారు. డీప్‌ఫేక్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఆ అకౌంట్‌ను ఆయన పాపులర్ చేశారు'' అని సిజల్ తెలిపారు.
గత ఏడాది నుంచి ఆ ఇన్‌స్టా ఖాతాలకు లైక్స్ రావడం మొదలైందని తెలిపిన ఆమె, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అది బాగా పాపులర్ అయిందని వెల్లడించారు.
జులై 11న ఆ మహిళ కుటుంబీకులు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యాలుగా అందులోని ఫోటోలు, వీడియోలను అందించారు. దీని వెనుక ఎవరున్నారో అప్పుడు వారికి తెలియదని సిజల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
బేబీడాల్ ఆర్చిలో కనిపించే మహిళ ఒక ఏఐ సృష్టి అంటూ వచ్చిన మీడియా కథనాలు, కామెంట్ల గురించి తాము విన్నామని, అయితే ఒక నిజమైన వ్యక్తి ఆధారంగా ఆ ఏఐని సృష్టించినట్లు ఎటువంటి సూచన లేదని పోలీసులు తెలిపారు.
''ఇన్‌స్టాగ్రామ్ సంస్థ నుంచి మేం సమాచారాన్ని సేకరించిన తర్వాత, ప్రతీమ్ బోరా అనే వ్యక్తి ఎవరైనా మీకు తెలుసా అని ఆ మహిళను అడిగాం. ఆమె చెప్పిన వివరాలతో ప్రతీమ్ దగ్గరికి వెళ్లి జులై 12న ఆయనను అరెస్ట్ చేశాం'' అని సిజల్ చెప్పారు.
''అతని నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్స్, బ్యాంక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. లింక్‌ట్రీ సైట్‌లో ఈ అకౌంట్‌కు 3000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దీన్నుంచి ఆయన 10 లక్షల రూపాయలు ఆర్జించినట్లుగా మేం అనుకుంటున్నాం. అరెస్ట్ కావడానికి 5 రోజుల ముందు కూడా ఆయన రూ. 3 లక్షలు సంపాదించినట్లుగా భావిస్తున్నాం. ఆ మహిళ సోషల్ మీడియా వాడరు. అలాగే ఆమె కుటుంబీకులను కూడా ఈ అకౌంట్ బ్లాక్ చేసింది. వీడియోలు వైరల్ అయిన తర్వాతే వీటి గురించి వారికి తెలిసింది'' అని సిజల్ వివరించారు.
ఈ కేసుకు సంబంధించి బీబీసీ అడిగిన ప్రశ్నలకు మెటా ఇంకా స్పందించలేదు.
నిజమైన వ్యక్తుల ఫోటోలను ఉపయోగించి అసభ్యకరమైన డీఫ్ ఫేక్‌లను సృష్టించే ఏఐ టూల్స్‌ను ప్రమోట్ చేసే ఎన్నో ప్రకటనలను తొలగించినట్లు సీబీఎస్ న్యూస్ గత నెలలో ఒక రిపోర్టులో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
బేబీడాల్ ఆర్చి ఇన్‌స్టా అకౌంట్ నుంచి 282 పోస్టులు చేశారు. ఇప్పుడు ఈ అకౌంట్, అందుబాటులో లేదు. కానీ, ఈ ఖాతాలోని చాలా వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మరోవైపు, వేరే ఇన్‌స్టా అకౌంట్‌లో దాదాపు ఈ పోస్టులన్నీ ఉన్నాయి. ఈ పోస్టులను ఏం చేయబోతున్నారని మెటా సంస్థను బీబీసీ అడిగింది.
మహిళకు జరిగినదాన్ని నివారించడం దాదాపు అసాధ్యమని ఏఐ నిపుణురాలు, లాయర్ మేఘనా బల్ అన్నారు.
ఆమె కోర్టుకు వెళ్లి వీటన్నింటినీ తొలగించాల్సిందిగా కోరచ్చు. కానీ, ఇంటర్నెట్ నుంచి ఈ ఆధారాలను పూర్తిగా తొలగించడం చాలా కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రతీమ్ బోరాపై పోలీసులు లైంగిక వేధింపులు, అసభ్యకర మెటీరియల్ షేర్ చేయడం, పరువు నష్టం, ప్రతిష్టను దెబ్బతీసేలా ఫోర్జరీ చేయడం, మోసం, సైబర్ నేరాలు వంటి అభియోగాలు మోపారు. ఇందులో దోషిగా తేలితే బోరాకు దాదాపు 10 ఏళ్ల జైలు శిక్ష పడొచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














