భారత మహిళల క్రికెట్‌లో గుర్తుంచుకోదగ్గ అయిదుగురు ప్లేయర్లు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వద్ది ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"దయచేసి రండి, సపోర్ట్ చేయండి. చూడండి, ప్రోత్సహించండి, తిట్టండి, విమర్శించండి. ఇండియన్ ఫుట్‌బాల్‌కు మీరు అవసరం" అని భారతీయులకు భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రీ 2018లో చేసిన విజ్ఞప్తి మీకు గుర్తుండే ఉంటుంది.
ఎందుకంటే, దేశంలో పురుషుల క్రికెట్ మ్యాచ్ చూడటానికి స్డేడియాలకు వచ్చిన అభిమానుల్లో పది శాతం కూడా మిగతా ఆటలు చూడటానికి రాని పరిస్థితి ఉందనేది అనేకమంది చెప్పే మాట.
అంతకుముందు భారత మహిళా క్రికెట్ జట్టు పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాంటిదే. చాలా సంవత్సరాలుగా, భారత మహిళా క్రికెట్ జట్టుపై అంచనాలు ఉండకపోయేవి. మీడియా దృష్టి తక్కువగా ఉండేది, తక్కువ వనరులు ఉండేవి, జట్టులో రోల్-మోడల్స్ కూడా తక్కువే.
కానీ, కొందరు ప్లేయర్లు అంతా మార్చేశారు.
వారి ఆట, నాయకత్వం, దృఢ సంకల్పం మహిళల క్రికెట్ భవిష్యత్తును మార్చడమే కాకుండా అంచనాలను పెంచాయి.
టీవీల్లో లైవ్ వచ్చినా పట్టించుకోని అభిమానులను స్టేడియాలకు రప్పించారు.
గల్లీకో మహిళా క్రికెటర్ తయారయ్యేలా భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు.
అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేర్లు అయిదు..
- హర్మన్ ప్రీత్ కౌర్
- స్మృతీ మంధాన
- మిథాలీ రాజ్
- ఝులన్ గోస్వామి
- అంజుమ్ చోప్రా
'కఠినమైన పరిస్థితుల్లో' మహిళల క్రికెట్ ఉనికిని కాపాడేందుకు, పురుషుల క్రికెట్ మాత్రమే చూసే అభిమానులకు తమ ఆటనూ చూసేలా చేయడంలో ఈ అయిదుగురిది కీలకపాత్ర.
కఠినమైన సవాళ్లు అంటే అదేదో మహిళా క్రికెటర్లు సరిగ్గా ఆడలేక కాదు.
స్వతంత్రంగా అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం, తక్కువ వనరులు ఉండటం, క్రికెట్ బోర్డు నిర్వహణ పురుషుల చేతుల్లో ఉండటం వల్ల మహిళల క్రికెట్ గతంలో పెద్దగా వెలుగులోకి రాలేదు.


ఫొటో సోర్స్, facebook/Harmanpreet Kaur
హర్మన్‌ప్రీత్ కౌర్ - బ్యాటింగ్‌లో దూకుడు
2017 మహిళల ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 115 బంతుల్లోనే 171 పరుగులు చేసి, ఒక్కసారిగా భారత క్రీడాలోకాన్ని తన వైపు తిప్పుకున్నారు హర్మన్‌ప్రీత్ కౌర్.
ఆ మ్యాచ్‌లో ఆమె ఆటతీరు భారత క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. మహిళల క్రికెట్‌లో అత్యంత చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లలో ఇదొకటి.
ఒక్కసారిగా ఆ టోర్నీపై ఫ్యాన్స్, మీడియా అటెన్షన్ పడింది.
భారత బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బీఏఆర్సీ) ప్రకారం, ఆ ఫైనల్ మ్యాచ్ భారతదేశంలో 1.95 కోట్ల మంది చూశారు. అది అప్పటివరకు దేశంలో అత్యధికంగా వీక్షించిన మహిళా క్రీడా ఈవెంట్‌గా నిలిచింది.
ఆ టోర్నీ భారత మహిళా క్రికెట్ వేగంగా పుంజుకోవడానికి ఉపయోగపడింది.
హర్మన్‌ప్రీత్ 1989 మార్చి 8న పంజాబ్‌లోని మోగాలో జన్మించారు. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. మహిళల క్రీడలో అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారిణులలో ఒకరిగా చాలావేగంగా ప్రాముఖ్యం సంపాదించుకున్నారామె.
హర్మన్‌ప్రీత్ విధ్వంసకర బ్యాటింగ్‌కు ప్రసిద్ధి. ఆమె ఆటలో దూకుడు, నాయకత్వ పాత్రలు భారత మహిళా క్రికెట్‌పై అభిమానుల అంచనాలను మరింతగా పెంచాయి.
ఎండార్స్‌మెంట్‌లు, మీడియాలో హర్మన్ ప్రీత్ చురుగ్గా ఉంటారు. ఇది యువ క్రీడాకారులు, స్పాన్సర్‌లు, అభిమానులను ఆకర్షించడంలో కీలకంగా పనిచేస్తుంది.
"చిన్న పట్టణాల్లో అమ్మాయిలు క్రికెట్ ఆడితే, బంధువుల నుంచి వివిధ రకాల మాటలు వినాల్సి వస్తుంది. కానీ, హర్మన్‌ప్రీత్ సాధించిన విజయాలు అందరి నోరూ మూయించాయి" అని బీబీసీకి 2019లో ఇంటర్వ్యూ ఇచ్చిన హర్మన్ తండ్రి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
స్మృతి మంధాన - ‘పరుగుల యంత్రం’
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన గురించి తెలియని క్రికెట్ ఫ్యాన్స్ బహుశా ఉండరేమో.
ఆమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారత మహిళా క్రికెట్‌లో స్మృతి మంధాన ఒక 'స్టార్'. ఆమె ఆట చూడటం కోసమే స్డేడియానికి వచ్చే అభిమానులూ ఉన్నారు.
2013లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు స్మృతి మంధాన. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్‌గా జట్టుకు మంచి ఆరంభాన్ని అందించడం లేదా ప్రత్యర్థి బౌలింగ్‌ను చిత్తు చేయడంలో ఆమె నేర్పరి.
1996 జులై 18న ముంబయిలో జన్మించిన స్మృతి మంధాన, 11 ఏళ్ల వయసులోనే మహారాష్ట్ర అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు.
17 సంవత్సరాల వయస్సులో ఫస్ట్ క్లాస్ వన్డే గేమ్‌లో డబుల్ సెంచరీ చేశారు.
అప్పటివరకు ఏ భారత మహిళా క్రికెటర్ కూడా వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేయలేదు.
2017 ప్రపంచకప్ టోర్నీలో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే స్మృతి 90 పరుగులు చేశారు. వెస్టిండీస్‌పై సెంచరీ (106 పరుగులు) సాధించారు. ఈ టోర్నీ ద్వారా స్మృతి అంతర్జాతీయ క్రికెట్‌లో తన మార్క్ చూపించారు.
ఇలా క్రమంగా స్మృతి మంధాన భారత మహిళల జట్టులో 'పరుగుల యంత్రం'గా పేరు తెచ్చుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''స్మృతి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆమె వేగంగా స్కోర్ చేయాలనుకుంటుంది. ఆమె భారత బ్యాటర్లలో మార్పు తీసుకువచ్చింది" అని ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ లిసా స్తలేకర్ ఫోర్బ్స్ ఇండియాతో అన్నారు.
స్టైలిష్, దూకుడు ఆటతీరు — స్మృతి మంధానను భారత మహిళా క్రికెట్‌కు 'గ్లోబల్ ఫేస్'గా మార్చింది. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ చాలా జట్లపై సెంచరీలు సాధించారు, యువతులు క్రికెట్‌ను పూర్తికాల కెరీర్‌గా ఎంచుకోవడానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
మహిళల క్రికెట్ కొత్త తరానికి చేరువ కావడానికి స్మృతి ఆట సహాయపడింది. దేశంలో చిన్న పట్టణాల యువతులూ ఆమె ఆటను ఇష్టపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మిథాలీ రాజ్ - రెండుసార్లు టీమిండియాను ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్
మహిళల క్రికెట్‌ను మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన వారిలో మిథాలీ రాజ్ ఒకరు. ఆమె భారత మహిళల క్రీడలకు, నేటి తరానికి ఒక వారధి.
అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ మిథాలీ రాజ్ పేరిటే ఉంది.
"ఈ సమాజం మహిళా క్రికెటర్లను ఎలా చూస్తోంది అనేది ప్రధానం. నా కెరియర్ తొలినాళ్లలో అసలు మహిళలకు ప్రత్యేకంగా క్రికెట్ టీమ్ ఉందా? వంటి ప్రశ్నలు ఎదుర్కొన్నాను" అని మిథాలీ గతంలో చెప్పారు.
ఆమె సుదీర్ఘ కెరీర్, స్థిరత్వం యువతులకు ఒక మోడల్‌గా నిలిచింది, మహిళల క్రికెట్ కేవలం కాలక్షేపం కాదు, సీరియస్ కెరీర్ మార్గమనేలా నిరూపించింది. ఆమె కెప్టెన్సీలో భారత జట్టు రెండు వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ (2005, 2017) ఆడింది, భారత మహిళలు అత్యున్నత స్థాయిలో పోటీ పడగలరని చూపించారు.
1982 డిసెంబర్ 3న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించిన మిథాలీ, 16 సంవత్సరాల వయసులోనే భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు.
"అది చాలా కఠినమైన ప్రయాణం" అని మిథాలీ రాజ్ ఒక సందర్భంలో చెప్పారు.
23 ఏళ్ల క్రికెట్ ప్రస్థానంలో వన్డేల్లో 50కి పైగా సగటుతో 7,805 పరుగులు చేశారామె. అందులో 7 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు కూడా మిథాలీదే.
నిరంతరంగా పరుగులు చేయడం వల్ల మిథాలీని "లేడీ సచిన్", "మహిళా తెందూల్కర్" అని పిలిచేవారు.
భారత క్రికెట్‌కు మిథాలీ రాజ్ చేసిన సేవలు అసమానమైనవి. ఆమె అద్భుతమైన టెక్నిక్, ఇన్నింగ్స్‌ను నిర్మించగల సామర్థ్యం, ఒత్తిడిలో ప్రశాంతత ఆమెను ఆశావహ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిపాయి.
"విమెన్స్ క్రికెట్‌లో.. మరీ ముఖ్యంగా భారత్‌లో వస్తున్న మార్పుల్లో నేను భాగమవ్వడం సంతోషంగా ఉంది. పురుషుల, మహిళల క్రికెట్‌ను ప్రజలు సమానంగా చూసే రోజున నేను జీవించే ఉంటాననుకుంటున్నా" అని మిథాలీ రాజ్ 2016లో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఝులన్ గోస్వామి - ఫాస్ట్ బౌలింగ్‌కు మారుపేరు
భారత మహిళా క్రికెట్ పాపులర్ ప్లేయర్లలో ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి ఒకరు. ఫాస్ట్ బౌలింగ్ పురుషులకే అనే అపోహను బద్దలు కొట్టారామె. అమ్మాయిలు కూడా వేగంగా పేస్ బౌలింగ్ చేయగలరని, అంతర్జాతీయంగా విజయం సాధించగలరని చూపించారు.
భారతీయ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు ఝులన్. మహిళల క్రికెట్‌లో ఎంతో మందికి మార్గదర్శకంగా మారి చాలామంది క్రికెట్‌ను ఒక కెరీర్‌గా ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలిచారామె.
1982 నవంబర్ 25న పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన ఝులన్, 2002లో అరంగేట్రం చేసి తొందరగానే టీమిండియా కీలక పేస్ బౌలర్‌గా మారారు.
ప్రపంచవ్యాప్తంగా వన్డేలలో అత్యధిక వికెట్లు (255) తీసిన బౌలర్ ఆమె. టెస్టులలో ఒక మ్యాచ్‌లో (ఇంగ్లండ్‌పై-2006) పది వికెట్లు తీసిన అతి పిన్న వయస్కురాలు ఝలన్.
2007లో, మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టులో ఝులన్ కీలక పాత్ర పోషించారు. ఆ టోర్నీలో టీమిండియా తృటిలో టైటిల్‌ను కోల్పోయింది.
భారత క్రికెట్‌కు ఆమె చేసిన కృషి దేశంలోని భవిష్యత్తు తరాల ఫాస్ట్ బౌలర్లకు స్ఫూర్తి.
క్రిక్‌ఇన్ఫో ప్రకారం, ప్రపంచంలో సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ టెస్టు, వన్డే క్రికెట్ ఆడిన రెండో మహిళా క్రికెటర్.
"నేను అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టేసరికి, ఆమె కెప్టెన్‌గా ఉన్నారు. ఆమె ఆడుతున్న ఇంటర్నేషనల్ వన్డేకు నేతృత్వం వహించడం నాకు లభించిన గొప్ప అవకాశం" అని భారత క్రికెట్ మహిళల జట్టుకు ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు.
రిటైర్ అయిన తర్వాత, మెంటార్‌షిప్, కోచింగ్ పాత్రలను (డబ్ల్యూపీఎల్) చేపట్టారు ఝులన్. ఇది యువ ఆటగాళ్లకు సంస్థాగత మద్దతును అందించడంలో సహాయపడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
అంజుమ్ చోప్రా - 6 వరల్డ్ కప్‌ల అనుభవం
అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేసిన తొలి భారత మహిళా క్రికెటర్లలో అంజుమ్ చోప్రా ఒకరు.
1977 మే 20, దిల్లీలో జన్మించిన అంజుమ్, 1995లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేశారు. అంజుమ్ ఎడమచేతి వాటం బ్యాటర్.
24 ఏళ్లకే భారత జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2005 మహిళల ప్రపంచ కప్ ఫైనల్ జట్టులో ఆమె సభ్యురాలు. చాలామంది యువతులు క్రికెట్ ఆటలోకి రావడానికి అంజుమ్ చోప్రా స్ఫూర్తిగా నిలిచారు.
హిందూస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం, అంజుమ్ చోప్రా వన్డే సెంచరీ సాధించిన, 100 వన్డేలు ఆడిన, ఆరు ప్రపంచ కప్‌లలో పాల్గొన్న తొలి భారతీయ మహిళా క్రికెటర్.
అంజుమ్ భారత్ తరపున 12 టెస్టులు, 127 వన్డేలు, 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. ఆమె టెస్ట్‌లలో 4 హాఫ్ సెంచరీలతో 548 పరుగులు చేయగా, 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలతో 2,856 పరుగులు చేశారు.
రిటైరయ్యాక కూడా అంజుమ్ చోప్రా వ్యాఖ్యాత, విశ్లేషకురాలిగా సేవలందిస్తున్నారు. ఆట గురించి విలువైన సూచనలు అందిస్తూ మహిళల క్రికెట్ వృద్ధికి దోహదపడుతున్నారు. భారత ప్రభుత్వం నుంచి 2006లో అర్జున అవార్డు, 2014లో పద్మశ్రీ అవార్డు గౌరవం పొందారు అంజుమ్ చోప్రా. మహిళల క్రికెట్ గురించి, వారికి దక్కాల్సిన గౌరవం గురించి పలు సందర్భాల్లో ఆమె తన గొంతు వినిపించారు.
భారత మహిళల క్రికెట్ పురోగతికి ఈ ఐదుగురితో పాటు చాలామంది మద్దతుగా నిలిచారు.
అయితే, ఈ ఐదుగురు ప్లేయర్లు కేవలం మ్యాచ్‌లు గెలవడమే కాదు - భారత మహిళా క్రికెట్‌ను చూసే విధానాన్ని మార్చడానికి సహాయపడ్డారు. ఇప్పుడు స్టేడియాలు నిండిపోతున్నాయి, మీడియా విస్తృతంగా కవరేజ్ ఇస్తోంది, పట్టణాల నుంచి పల్లెల వరకు చిన్నపిల్లలు బ్యాట్ పట్టుకుంటున్నారు.
వారి వారసత్వం కేవలం రికార్డులు, ట్రోఫీల్లో కాదు — ప్రతి ప్రతిభావంతమైన భారత అమ్మాయికి ఇప్పుడు క్రికెట్‌లో భవిష్యత్తు ఉందనే నమ్మకంలోనూ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
వాళ్లంతా లెజెండ్స్: నోయల్ డేవిడ్
"వాళ్లంతా లెజెండ్స్. వాళ్లు మహిళల క్రికెట్ నుంచి పొందిన దాని కంటే, వాళ్ల నుంచి మహిళా క్రికెట్ పొందింది ఎక్కువ. మిథాలీ రాజ్‌ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. తను మహిళల క్రికెట్‌లో ఒక శిఖరం అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇంతమంది మహిళల క్రికెట్ ను ఆదరిస్తున్నారు, తమ పిల్లల్ని ఇటువైపు ప్రోత్సహిస్తున్నారంటే ఇలాంటి వారే కారణం" అని భారత మాజీ క్రికెటర్ నోయల్ డేవిడ్ అన్నారు.
మహిళల క్రికెట్ ఎదుగుదలలో బీసీసీఐ పాత్ర కూడా ముఖ్యమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.
"బీసీసీఐకి థ్యాంక్స్ చెప్పాలి, డబ్ల్యూపీఎల్ తీసుకొచ్చారు. దీంతో, ఎంతోమంది ప్రతిభావంతులైన ప్లేయర్స్ వెలుగులోకి వచ్చారు. ఈ రోజు ఆస్ట్రేలియా లాంటి టీమ్‌ను ఓడిస్తున్నాం అంటే, బీసీసీఐ కూడా ఆ స్థాయిలో మహిళల క్రికెట్‌ను అభివృద్ధి చేయడం వల్లే. అలాగే, మహిళా క్రికెట్‌లో టెస్టులను ప్రవేశపెట్టడం కూడా గొప్ప విషయం, టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు" అని అన్నారు నోయల్.
మహిళల క్రికెట్‌లో జట్టులోని అందరూ సూపర్ స్టార్సేనన్న నోయల్.. "నిన్న జెమీమాది, ఈ రోజు ఇంకొకరిది. అలా.. ప్రతి ఒక్క భారత మహిళా క్రికెటర్ సత్తా ఉన్నవాళ్లే. వాళ్లదైన రోజున అద్భుతాలు సృష్టిస్తారు. దానిపై నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను" అని అన్నారు.
"ఒక వేళ వరల్డ్ కప్ గెలిస్తే, ఇండియాలో మహిళల క్రికెట్ దశ, దిశ మారుతుంది. 1983లో పురుషుల టీమ్ వరల్డ్ కప్ కొట్టిన తరువాత ఇండియాలో క్రికెట్ ఎలా మారిందో, అలాంటి మార్పు మహిళల క్రికెట్‌లో చూస్తాం" అని నోయల్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
చాలా మార్పు వచ్చింది: డయానా ఎడుల్జీ
1970, 80లలో తాను క్రికెట్ ఆడిన రోజుల నుంచి ఇప్పటికి చూస్తే చాలా పురోగతి ఉందని భారత మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ ఒక సందర్భంలో అన్నారు.
ఆ రోజుల్లో టీవీలో చాలా తక్కువగా మహిళల మ్యాచ్‌లు ప్రసారం అయ్యాయని, వాటి కోసం నిధులు సేకరించడం కూడా కష్టమైందని ఆమె పేర్కొన్నారు.
మహిళల క్రికెట్‌కు విమెన్ ప్రీమియర్ లీగ్, డిజిటల్ మీడియా కూడా చాలావరకు దోహదపడింది.
2017లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ పాల్గొనడాన్ని మిథాలీ రాజ్ ఒక ముఖ్యమైన ఘటనగా పరిగణించారు.
ఐసీసీ డిజిటల్, సోషల్ మీడియా ఛానెల్స్‌కు రికార్డు స్థాయిలో 100 మిలియన్ల వీడియో వ్యూస్ వచ్చాయి.
"అప్పటి వరకు, మాకు నిజంగా అలాంటి కవరేజ్ లేదు" అని మిథాలీ చెప్పారు.
"2017లో డిజిటల్ మీడియా కొత్తగా వచ్చింది. ఇది మహిళల క్రికెట్‌కు అవసరమైన కవరేజీని రెట్టింపు చేసింది" అని అన్నారామె.
ఆ తర్వాత, మహిళల క్రికెట్‌ను కూడా ఇతర భారతీయ భాషల్లో ప్రసారం చేయడం మొదలుపెట్టారు.
ఇపుడు, డబ్ల్యూపీఎల్‌లో ఆడటానికి మారుమూల ప్రాంతాల నుంచి కూడా అమ్మాయిలు ఆసక్తి చూపుతున్నారు.
టీవీలో మ్యాచ్‌ల ప్రసారం విషయంలో డబ్ల్యూపీఎల్ మార్పును తీసుకొచ్చిందని, కొంతమంది ప్రేక్షకులు ఐపీఎల్ కంటే డబ్ల్యూపీఎల్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక సందర్భంలో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














