పృథ్వీ షా: 141 బంతుల్లో డబుల్ సెంచరీ - టీమ్‌ఇండియాలో మళ్లీ చోటు దొరుకుతుందా?

పృథ్వీ షా, భారత క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పృథ్వీ షా భారత క్రికెట్ జట్టు తరపున ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి మొత్తం 339 పరుగులు చేశాడు.
    • రచయిత, జస్వీందర్ సిద్ధూ
    • హోదా, బీబీసీ కోసం

భారత క్రికెటర్, ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్న పృథ్వీ షా కథ పూర్తిగా సినిమా తరహాలో ఉంటుంది. ఇందులోని పాత్ర వీరోచితమైనది, కానీ అతని చుట్టూ సంఘర్షణలు, సంక్షోభాలు, సమస్యలు కూడా ఉంటాయి.

పృథ్వీ షా ముంబయి మైదానం నుంచి తన కెరీర్‌ను ప్రారంభించినప్పుడు, ఈ బ్యాటర్ చాలా ఎత్తుకు ఎదగగలడని అందరూ అన్నారు. కానీ, తర్వాత పరిస్థితులు మారిపోయి. భారత్ తరఫున అతను అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఏళ్లు దాటాయి.

ఈ బ్యాటర్ ఇటీవల రంజీ ట్రోఫీలో సెక్టార్-16 మైదానంలో చండీగఢ్‌పై మహారాష్ట్ర తరపున 222 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించలేదు. దాన్ని మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఇచ్చారు. అయితే, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ పృథ్వీ షాతో అవార్డును పంచుకున్నాడు గైక్వాడ్.

రుతురాజ్ గైక్వాడ్‌ ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 116 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేశాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పృథ్వీ షా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ తరఫున ఆడిన (అంతర్జాతీయ) టెస్టుల్లో పృథ్వీ షా అత్యధిక స్కోరు 134.

మూడో వేగవంతమైన సెంచరీ

ముంబయిని వదిలి మహారాష్ట్ర తరఫున ఆడిన తర్వాత పృథ్వీ షా చేసిన తొలి సెంచరీ ఇది.

ఈ సెంచరీని కేవలం 72 బంతుల్లోనే సాధించాడు, అందులో 14 ఫోర్లు ఉన్నాయి.

అక్టోబర్ 25, 28 మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో, పృథ్వీ షా 8 పరుగులు చేయగా, రెండవ ఇన్నింగ్స్‌లో 156 బంతుల్లో 222 పరుగులు సాధించాడు. 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు. అంతేకాదు, రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన డబుల్ సెంచరీ.

హైదరాబాద్‌కు చెందిన తన్మయ్ అగర్వాల్ (119 బంతుల్లో), ముంబయికి చెందిన రవిశాస్త్రి (123 బంతుల్లో) అతని కంటే ముందున్నారు.

పృథ్వీ షా, భారత్, రంజీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పృథ్వీ షా 2020లో వన్డే అరంగేట్రం చేశాడు.

'అందరూ తప్పులు చేస్తారు'

చిన్నప్పటి నుంచి పృథ్వీ షా కోచ్‌గా ఉన్న ప్రశాంత్ శెట్టి బీబీసీతో మాట్లాడుతూ "ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. కొన్నినెలల కిందట అతను ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. అందులో తన తప్పులను అంగీకరించాడు. అతను చాలా కష్టపడుతున్నాడు" అని అన్నారు.

స్నేహితులను ఎంచుకోవడంలో తప్పులు చేసినట్లు షా అంగీకరించాడని, ఆ విషయంలో ఇప్పటికీ తనను తాను బాధ్యునిగా భావిస్తున్నాడని అయితే, దాన్నుంచి అతను చాలా నేర్చుకున్నాడని ప్రశాంత్ శెట్టి చెప్పారు.

పృథ్వీ షా తన ఆట, ప్రవర్తనలో చాలా మార్పులు చేసుకున్నాడని అన్నారాయన.

ఏడేళ్ల వయసులో షా తన వద్దకు కోచింగ్ కోసం వచ్చాడని, అప్పటి నుంచి అతనితో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు.

"షాను ఏ విధంగానూ పక్కనపెట్టలేం" అని ప్రశాంత్ శెట్టి అన్నారు.

పృథ్వీ షా , క్రికెట్, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పృథ్వీ షా ఆడిన ఆరు వన్డేల్లో 189 పరుగులు చేశాడు, అత్యధిక స్కోరు 49.

'ఓపెనర్ బాధ్యత తీసుకోవచ్చు'

షా అధిక బరువుతో ఉన్నాడనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే, షా బరువును తగ్గించుకోవడంపై దృష్టిపెట్టాడని అతన్ని నిశితంగా పరిశీలించిన నిపుణులు అంటున్నారు.

ఈ సీజన్‌కు రెండు మూడు నెలల నుంచి తన ట్రైనర్‌తో కలిసి పనిచేస్తున్నట్లు మహారాష్ట్ర తరఫున రికార్డు ఇన్నింగ్స్ ఆడిన అనంతరం పృథ్వీ షా చెప్పాడు. అంతేకాదు, ఒక డైటీషియన్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. గత మూడు, నాలుగు నెలల్లో పృథ్వీ షాలో అనేక శారీరక మార్పులు కనిపించాయి, అతని ఆటను మెరుగుపరిచాయి.

"భారత జట్టు ఓపెనర్‌ బాధ్యతలు షా నిర్వహించగలడని ఇప్పటికీ నమ్ముతున్నా" అని ముంబయికి చెందిన ప్రముఖ క్రికెట్ కోచ్‌లలో ఒకరైన దినేష్ లాడ్ అన్నారు.

"షా ప్రవర్తన గురించి చాలా కథనాలు విని ఉండవచ్చు. కానీ, అంతకుమించి అతని ఆటను చూడండి. బ్యాటింగ్ అద్భుతంగా ఉంది" అన్నారాయన.

దినేష్ భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా శిక్షణ ఇచ్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)