భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా : మిచెల్ స్టార్క్ 176.5 కి.మీ.ల వేగంతో బంతిని వేశాడా?

మిచెల్ స్టార్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిచెల్ స్టార్క్
    • రచయిత, వద్ది ప్రభాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

ఆసీస్ బౌలర్ గంటకు 176.5 కి.మీ.ల వేగంతో బంతి వేసినట్లు మ్యాచ్ బ్రాడ్‌కాస్టర్ చూపించింది.

ఆ బంతి వేసింది ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్. ఇది నిజమైతే అంతర్జాతీయ క్రికెట్‌లోనే అత్యంత వేగవంతమైన బంతిని వేసిన బౌలర్‌గా స్టార్క్ నిలుస్తాడు.

ఎందుకంటే, ఇప్పటివరకు వన్డే చరిత్రలో ఏ బౌలర్ కూడా 170 కి.మీ. పైగా వేగంతో బంతిని వేసినట్లు ఐసీసీలో రికార్డు లేదు. ఇంతకీ స్టార్క్ నిజంగా అంత వేగంతో బంతి వేశాడా?.

భారత్, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొదటి వన్డేలో రోహిత్ శర్మ 8 పరుగులకే ఔటయ్యాడు.

ఏ ఓవర్లో పడింది?

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, గిల్ ఓపెనర్లుగా వచ్చారు.

రోహిత్ స్ట్రైకింగ్‌లో ఉండగా మొదటి ఓవర్‌ మిచెల్ స్టార్క్ వేశాడు. అతను వేసిన మొదటి బంతి వేగం ఇపుడు చర్చనీయమైంది.

ఎందుకంటే, ఆ బంతి వేగం గంటకు 176.5 కి.మీ.గా స్క్రీన్‌పై చూపించింది.

దీంతో చాలా ఏళ్లుగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరు మీద ఉన్న 'అత్యంత ఫాస్టెస్ట్ బాల్ రికార్డు (గంటకు 161.3 కిలోమీటర్లు)' బద్దలైందా అని చాలామంది అనుకున్నారు.

దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చ నడిచింది. నిజానికి ఆ బంతి అంత వేగంతో పడలేదని, 2003లో షోయబ్ అక్తర్ సృష్టించిన రికార్డు బ్రేక్ అవ్వలేదని తర్వాత తేలింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, X

ఫొటో క్యాప్షన్, ఎక్స్ స్క్రీన్‌షాట్

స్పీడ్ గన్ సాంకేతిక లోపం వల్ల అలా చూపించిందని టైమ్స్‌నౌన్యూస్, న్యూస్18తో సహా పలు వార్తాసంస్థలు తమ కథనాలలో తెలిపాయి.

ఇంతకీ ఆ బంతి ఎంత వేగంతో పడింది?.

క్రిక్‌బజ్ వెబ్‌సైట్ ప్రకారం, ఆ బంతి గంటకు 140.8 కి.మీ. వేగంతో పడింది.

కాగా, స్పీడ్ గన్ గంటకు 176.5 కి.మీ.లు చూపించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు, మీమ్స్ వేస్తున్నారు.

అయితే, దీనిపై ఐసీసీ నుంచి స్పష్టత రాలేదు.

భారత్ వర్సెస్ ఆసీస్, పెర్త్ వన్డే

ఫొటో సోర్స్, Getty Images

బోల్తా పడిన భారత్

పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ వ‌న్డే మ్యాచ్‌లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై విజ‌యాన్ని సాధించింది.

డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తి ప్ర‌కారం, 131 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆసీస్ 21.1 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఆసీస్ బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్ (52 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లతో 46 పరుగులు), జోష్ ఫిలిప్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లతో 37 పరుగులు) రాణించారు.

భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌లు ఒక్కో వికెట్ తీశారు.

రోహిత్ శర్మ, కోహ్లీ, భారత్, ఆసీస్ వన్డే

ఫొటో సోర్స్, Getty Images

నిరాశపరిచిన రోహిత్, కోహ్లీ

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది.

కేఎల్ రాహుల్ (31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), అక్షర్ పటేల్ (38 బంతుల్లో 3 ఫోర్లతో 31), చివర్లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి(11 బంతుల్లో 2 సిక్సర్లతో 19 నాటౌట్) మినహా ఇతర బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. దీంతో, భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.

చాలారోజుల తర్వాత, భారీ అంచనాలతో బరిలోకి దిగిన సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ 8 పరుగులు, విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగారు.

ఆసీస్ బౌలర్లలో జోస్ హజెల్ వుడ్, మిచెల్ ఓవెన్, మాథ్యూ కుహ్నేమన్‌లు తలో రెండు వికెట్లు తీశారు.

ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Getty Images

కాగా, 131 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన ఆసీస్‌ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.

ఎనిమిది ప‌రుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ను అర్ష్‌దీప్ ఔట్ చేయ‌గా, మాథ్యూ షాట్ (8)ను అక్ష‌ర్ ప‌టేల్ పెవిలియన్‌కు పంపించ‌డంతో ఆసీస్ 44 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

అయితే, మిచెల్ మార్ష్, జోష్ ఫిలిప్‌లు క్రీజులో పాతుకుపోవడంతో ఆసీస్ సునాయాస విజయం సాధించింది.

రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్‌లో జరుగుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)