బ్యాంక్ కొలువు సులువేనా? ఏమేం పరీక్షలు ఉంటాయి,ఎలా సిద్ధమవ్వాలి?

బ్యాంకులు, జాబ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, ప్రియాంక ఝా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బ్యాంకులంటే రుణాలు తీసుకోవడానికి, డబ్బు డిపాజిట్ చేయడానికి, ఎఫ్‌డీలు చేయడానికి మాత్రమే ఉపయోగపడవు. అవి ఉద్యోగాలను కూడా అందిస్తాయి, అది కూడా పెద్దసంఖ్యలో.

ఉద్యోగ కల్పనలో దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మొదటి ఐదుస్థానాలలో ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకులు కూడా వివిధ స్థాయులలో అనేక ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి.

కానీ ఈ ఉద్యోగాలను పొందే మార్గం ఏమిటి? ఈ మార్గం పేరు ఐబీపీఎస్. దీని ద్వారా ప్రభుత్వ బ్యాంకులలో కొలువు లభిస్తుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఐబీపీఎస్ అంటే ?

సివిల్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ కోసం యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లే, ఐబీపీఎస్ అనేది ప్రభుత్వ రంగ బ్యాంకుల నియామకాలను చూసుకునే సంస్థ. దీని పూర్తి పేరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్.

ఇది ప్రభుత్వ బ్యాంకులలో నియామకాల కోసం ప్రతి సంవత్సరం పరీక్షలు నిర్వహించే స్వయంప్రతిపత్తి సంస్థ.

ఐబీపీఎస్ ఏడు పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తుంది:

  • క్లర్క్
  • ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ)
  • స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్ఓ)
  • ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్ఆర్‌బీ) ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3
  • ఆఫీస్ అసిస్టెంట్

ఐబీపీఎస్ నిర్వహించే నియామక పరీక్షలో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు భాగంగా ఉన్నాయి.

వీటిలో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఉన్నాయి.

కానీ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ ఇందులో భాగం కాదు. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొంతంగా నియామక పరీక్షలను నిర్వహిస్తుంది. సొంత నోటిఫికేషన్లను జారీ చేస్తుంది.

ఇంతకీ, ఐబీపీఎస్ పరీక్షలో ఎన్ని దశలు ఉన్నాయి?

ఈ పరీక్షలు ప్రధానంగా మూడు దశల్లో ఉంటాయి.

  • ప్రిలిమ్స్
  • మెయిన్స్
  • ఇంటర్వ్యూ

క్లర్క్ పోస్టుకు ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే ఉంటాయి.

క్లర్క్, పీఓ పరీక్షా విధానాలు కూడా భిన్నంగా ఉంటాయి.

బ్యాంక్ పరీక్షలు, విధానాలు, ఉద్యోగాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఎవరు అర్హులు?

వివిధ పోస్టులకు విద్యార్హతలు వేరు వేరుగా ఉన్నప్పటికీ ఈ పరీక్షకు హాజరు కావడానికి కొన్ని అర్హతలు అవసరం, అవి:

  • పీఓ పరీక్షకు హాజరు కావాలంటే, భారతీయుడై ఉండాలి.
  • వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి
  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ
  • కంప్యూటర్ ప్రాథమిక జ్ఞానం ఉండాలి.

మీరు ఏదైనా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని బ్యాంకులో నియామకం పొందాలనుకుంటే, ఆ ప్రాంత అధికారిక భాషలో ప్రావీణ్యం అవసరం. పీఓకి ప్రాంతీయ భాష తప్పనిసరి కాదు. దీని వెనకున్న కారణాన్ని ఐబీపీఎస్ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే టీచర్ తన్వి వివరించారు.

క్లర్క్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వారికి నచ్చిన రాష్ట్రాల్లో పోస్టింగ్ ఇస్తారు. పీఓలను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నియమించవచ్చు. అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు లలో పీఓ, క్లర్క్ పోస్టులు రెండింటికీ కూడా భాషా ప్రావీణ్య పరీక్ష తప్పనిసరి.

వయస్సు పరంగా, షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ, ఇతర వెనుకబడిన తరగతి, మాజీ సైనికులు, వికలాంగులు వంటి వివిధ వర్గాలకు చెందిన అభ్యర్థులకు మూడు నుంచి 10 సంవత్సరాల వరకు సడలింపు లభిస్తుంది.

క్లర్క్ కోసం పరీక్ష రాయాలంటే:

  • దరఖాస్తుదారుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • అభ్యర్థి భారతీయ పౌరుడై ఉండాలి.
  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీకి సమానమైన ఏదైనా ఇతర డిగ్రీని కలిగి ఉండాలి.

మీరు బ్యాంకింగ్ పరీక్ష రాయాలంటే కామర్స్ గ్రాడ్యుయేట్ కానవసరం లేదు. ఆర్ట్స్ లేదా సైన్స్ స్ట్రీమ్‌లో ఉన్నవారు కూడా ఈ పరీక్షలకు హాజరు కావచ్చు.

అయితే, స్పెషలిస్ట్ ఆఫీసర్లకు (ఎస్‌ఓలు) సంబంధిత విద్య అవసరం. ఉదాహరణకు, లా ఆఫీసర్‌కు ఎల్ఎల్‌బీ , మార్కెటింగ్ మేనేజర్‌కు మార్కెటింగ్‌లో ఎంబీఏ అవసరం.

ఉద్యోగం, బ్యాంక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

పరీక్షా విధానం ఏమిటి?

ఈ పరీక్షల సరళి కూడా మారుతూ ఉంటుంది. పీఓ పరీక్ష ప్రిలిమ్స్‌లో మూడు విభాగాలుగా ఉంటుంది.

  • ఇంగ్లీష్ లాంగ్వేజ్
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
  • రీజనింగ్ ఎబిలిటీ

మెయిన్స్‌లో ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ ప్రశ్నలు రెండూ అడుగుతారు.

  • ఆబ్జెక్టివ్ విభాగంలో రీజనింగ్, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ ఇంటర్‌ప్రెటేషన్ ఉంటాయి.
  • డిస్క్రిప్టివ్ విభాగంలో ఇంగ్లిషుభాషలో లెటర్, ఎస్సే రైటింగ్ ఉంటాయి.

ఇప్పుడు ఐబీపీఎస్ నుంచి కంప్యూటర్ ఆప్టిట్యూడ్ తొలగించారు. కానీ, ఎస్‌బీఐ పరీక్షలో ఉంటుంది.

మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది

అయితే, ఎస్‌బీఐ పరీక్షలో ఇంటర్వ్యూతో పాటు గ్రూప్ ఎక్సర్‌సైజ్ కూడా ఉంటుంది. దీనిని గతంలో గ్రూప్ డిస్కషన్ అని పిలిచేవారు.

అలాగే, ఇప్పుడు ఐబీపీఎస్, ఎస్‌బీఐ రెండూ సైకోమెట్రిక్ పరీక్ష లేదా పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తున్నాయి.

క్లర్క్ పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే ఉంటాయి.

ప్రిలిమ్స్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ వంటి విభాగాలు ఉంటాయి.

మెయిన్స్‌లో రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ విభాగాలు ఉంటాయి.

జనరల్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ అనేది వివిధ అంశాలను కవర్ చేస్తుంది: బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఆర్బీఐ ఎలా పనిచేస్తుంది. ద్రవ్యోల్బణం, బ్యాంకులు ఎలా నియంత్రింతమవుతాయి, బ్యాంకులకు వర్తించే అంతర్జాతీయ లేదా జాతీయ చట్టాలు ఏమిటి?

పరీక్షలలో తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అభ్యర్థులు తదుపరి దశకు చేరుకోవడానికి కటాఫ్ మార్కులు పొందాలి.

మరి, మెరిట్ జాబితా ఎలా తయారుచేస్తారు?.

ప్రిలిమ్స్ అనేది క్లర్క్, పీఓ రెండింటికీ అర్హత సాధించడానికి నిర్వహించే పరీక్ష మాత్రమే. అంటే దాని మార్కులు మెరిట్ జాబితాలో లెక్కించబోరు. క్లర్క్ మెరిట్ జాబితా మెయిన్స్ స్కోరు ఆధారంగా మాత్రమే తయారు చేస్తారు.

ఇక పీఓకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాబట్టి, మొత్తం మెరిట్ స్కోరు మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఈ రెండింటి వెయిటేజ్ కొన్ని పేపర్లలో 80:20, మరికొన్నింటిలో 75:25 ఉంటుంది. మెయిన్స్‌కు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది.

బ్యాంక్ పరీక్షలు, విధానాలు, ఉద్యోగాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

జీతం ఎలా ఉంటుంది?

ఆర్ఆర్‌బీ (గ్రామీణ బ్యాంకు)లలో క్లర్క్ ఉద్యోగులకు, ప్రారంభ జీతం రూ. 25 నుంచి 35 వేల వరకు ఉంటుంది. వివిధ ప్రాంతాల ఆధారంగా ఈ అలవెన్సులు ఉంటాయి. అంటే ప్రాంతం మారితే జీతం కూడా మారుతుంది.

అదే సమయంలో, ఐబీపీఎస్ క్లర్క్ జీతం రూ. 30,000 నుంచి 40,000 రూపాయల మధ్య ఉంటుంది. ఎస్బీఐ క్లర్క్ జీతం 35,000 నుంచి 45,000 రూపాయల మధ్య ఉంటుంది.

ఎవరైనా ఆర్ఆర్‌బీ అంటే గ్రామీణ బ్యాంకులలో పీఓ అయితే, ప్రారంభ జీతం రూ. 55 వేల నుంచి 65 వేల మధ్య ఉంటుంది. ఐబీపీఎస్ పీఓకి జీతం రూ. 60,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. ఎస్బీఐ పీఓకి జీతం రూ. 80,000 నుంచి 1.5 లక్షల వరకు ఉంటుంది.

ఐబీపీఎస్ నియామక పరీక్షల క్యాలెండర్ ఏటా జనవరి 15-16 తేదీలలో ఐబీపీఎస్ వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. పరీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.

"పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎప్పుడు జరుగుతాయో సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులు తెలుసుకుంటారు. దీంతో, ప్రణాళిక వేసుకోవడానికి, ఇతర విషయాలపై స్పష్టతకు సమయం ఉంటుంది" అని తన్వి చెప్పారు.

చివరిది, అతి ముఖ్యమైన విషయం ఎలా సిద్ధం కావాలి?

"విద్యార్థులు వేగంపై దృష్టి పెట్టాలి. సిలబస్‌ను పూర్తి చేయడం పరీక్ష ప్రిపరేషన్‌లో 30-40 శాతం మాత్రమే. అభ్యర్థి మొదటి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 50 మాక్ టెస్ట్‌లైనా రాయాలి" అని తన్వి అన్నారు.

బ్యాంక్ పరీక్షలు, విధానాలు, ఉద్యోగాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ప్రైవేట్ బ్యాంకులలో..

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, దాదాపు 20 పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ రంగ బ్యాంకులకు భిన్నంగా ఉంటాయి. ప్రైవేట్ పెట్టుబడిదారులు ఎక్కువ వాటాను కలిగి ఉంటారు. వాటిలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటివి ఉన్నాయి.

ఇక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకుల మాదిరిగా చాలా బ్యాంకులలో సాధారణ ప్రవేశ పరీక్ష లేదు. ప్రైవేట్ బ్యాంకులు అర్హతలు, నైపుణ్యాలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఏడాది పొడవునా నియామకాలు చేపడతాయి. సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్ కెరీర్ పేజీలో నోటిఫికేషన్లు ఇస్తుంటాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)