'3 నెలల కిందట ఇక్కడ భారీ భవనాలు, దగ్గర్లోనే పంటపొలాలు ఉండేవి. కానీ, ఇప్పుడది చెబితే ఎవరూ నమ్మరు', ఎందుకిలా?

హిమాలయాలు, ప్రమాదాలు, కొండచరియలు, వర్షాకాలం

ఫొటో సోర్స్, Mayuresh Konnur

    • రచయిత, మయూరేష్ కొన్నూర్
    • హోదా, బీబీసీ ప్రతనిధి, హిమాచల్ ప్రదేశ్ నుంచి

హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో, అక్టోబర్ 7వ తేదీ రాత్రి సమయంలో ఒక ప్రైవేట్ బస్సు పర్వత ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు.. అనూహ్యంగా కొండచరియలు విరిగిపడటంతో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. 18 మంది గాయపడ్డారు.

హిమాచల్ ప్రదేశ్‌లో ఈ వర్షాకాలంలో జరిగిన వరుస ఘోర ప్రమాదాల్లో ప్రైవేట్ బస్సు ఘటన తాజా ఘటన. ఇవి ఇంకా కొనసాగేలా కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో హిమాచల్ ప్రదేశ్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా జరిగిన పలు సంఘటనల్లో 141 మంది మరణించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. వాస్తవానికి, ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చన్న వాదనలు కూడా ఉన్నాయి.

ఈ ఏడాది వర్షాకాలం, కేవలం హిమాచల్ ప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగానూ విషాదకరంగా మారింది.

ఐఎండీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, ఈ సీజన్‌లోనే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 1528 మంది చనిపోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇక హిమాలయ ప్రాంతంలో ఈ పరిస్థితులు మరింత దారుణం.

ప్రతికూల వాతావరణం కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఉత్తరాఖండ్‌లో 41, జమ్మూకశ్మీర్‌లో 139 మంది చనిపోయినట్లు ఐఎండీ డేటా చెబుతోంది.

దీంతో, హిమాలయాల్లో వర్షాలు ఎందుకింత ప్రమాదకరంగా మారుతున్నాయనే ప్రశ్న మరింత తీవ్రమవుతోంది.

హిమాలయాలు, ప్రమాదాలు, కొండచరియలు, వర్షాకాలం

ఫొటో సోర్స్, Mayuresh Konnur

3 నెలల కిందట ఇక్కడ భవనాలు ఉండేవి..

మేం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా జంజేహ్లీలో, ఒక పొలంలో నిల్చుని ఉన్నాం. ఇక్కడంతా పెద్దపెద్ద రాళ్లతో నిండిపోయింది, కొత్తగా చూసేవారికి ఈ ప్రాంతం ఒక విశాలమైన నదీ పరివాహక ప్రాంతంలా అనిపించొచ్చు. కానీ, అది నిజం కాదు.

మూడు నెలల కిందట, ఇక్కడ భారీ భవనాలు భవనాలు ఉండేవి. దగ్గర్లోనే పంటపొలాలు కూడా ఉండేవి. పండించేవాళ్లు. కానీ, ఇప్పుడది చెబితే ఎవరూ నమ్మరు.

ఈ ప్రాంతం ఇలా మారడాన్ని చంద్రాదేవి, ఆమె కుటుంబీకులు ఇంకా నమ్మలేకపోతున్నారు.

హిమాలయాలు, ప్రమాదాలు, కొండచరియలు, వర్షాకాలం

ఫొటో సోర్స్, Mayuresh Konnur

''మేం ఇక్కడే, పొలంలోనే ఇల్లు కట్టుకున్నాం. పక్కనే కిరాణ దుకాణం కూడా పెట్టుకున్నాం. వందేళ్లలో ఇటువైపు ఎప్పుడూ నీళ్లు రాలేదు'' అని ఆమె బాధగా వివరించారు.

చంద్ర, ఆమె భర్త కలిసి జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో 8 ఏళ్ల కిందట ఇక్కడ ఒక 8 గదుల ఇల్లు కట్టుకున్నారు. కానీ, జూన్ 30వ తేదీ రాత్రి వచ్చిన వరద.. వారి ఇంటితో పాటు అన్నింటినీ తుడిచిపెట్టుకుపోయింది.

ఆరోజు రాత్రి కుంభవృష్టి కురిసింది. ఎలాగోలా చంద్రాదేవి కుటుంబం ప్రాణాలతో బయటపడింది. ఆమె19 ఏళ్ల కూతురు రితిక. శారీరక, మానసిక వికలాంగురాలు. తన కూతురిని వీపుకు కట్టుకుని చంద్రా దేవి పక్కనే ఉన్న పర్వతాన్ని ఎక్కగలిగారు.

ఒకప్పుడు నది సమీపంలో నివసించిన చాలామంది మాదిరిగానే చంద్రా దేవి కూడా ఇప్పుడు భయంతో పర్వతంపైన నివసిస్తున్నారు.

జూన్ 30 రాత్రి కురిసిన వర్షానికి, పోటెత్తిన వరదకు సెరాజ్‌వ్యాలీలోని వారి ఇల్లు నీళ్లలో కొట్టుకుపోయింది.

హిమాలయాలు, ప్రమాదాలు, కొండచరియలు, వర్షాకాలం

ఫొటో సోర్స్, Mayuresh Konnur

ఫొటో క్యాప్షన్, కూతురితో చంద్రాదేవి

మేం అక్కడ పర్యటించినప్పుడు, అంతటి విధ్వంసం జరిగి నెలలు గడిచినా కొండచరియలు, దెబ్బతిన్నరోడ్లు, కూలిపోయిన భవనాల అవశేషాల రూపంలో ఆ విధ్వంసం తాలూకూ గాయాలు ప్రతిచోటా కనిపిస్తున్నాయి.

తునాగ్ పట్టణం ఈ విధ్వంసం నుంచి ఇంకా కోలుకోలేదు. అక్కడి ఇరుకైన సందుల్లో మేం నడుస్తున్నప్పుడు దెబ్బతిన్న అనేక భవనాలు, శిథిలాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

''రాత్రి గం.10:30 వరకు మేం ఇళ్లలోనే ఉన్నాం. తెల్లవారుజామున గం. 2.30 వరకు శిథిలాలు కొట్టుకొస్తూనే ఉన్నాయి. ఇళ్లు, దుకాణాలు అన్నీ కొట్టుకుపోయాయి. చాలామంది కట్టుబట్టలతో మిగిలిపోయారు'' అని తునాగ్‌లో నివసించే ఖీమీ చౌహాన్ చెప్పారు.

కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ పర్వతాల్లోని చిన్నచిన్న నివాసప్రాంతాలు నాశనమయ్యాయి. భారీ వరద, కొండచరియల మధ్య తునాది గ్రామం చిక్కుకుంది.

తునాది గ్రామానికి చెందిన 90 ఏళ్ల జై రామ్‌ను మేం కలిశాం. తన జీవితంలో ఇలాంటి విధ్వంసాన్ని ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.

''రెండు నెలలు మేం కొండపైనే ఉన్నాం. ఆ తర్వాత, కిందికి వెళ్లాలని అధికారులు చెప్పారు. ఇంకా మా ఇళ్లలో శిథిలాల పోగుపడి ఉన్నాయి. శుభ్రం చేసుకుంటున్నాం'' అని ఆయన చెప్పారు.

హిమాలయాలు, ప్రమాదాలు, కొండచరియలు, వర్షాకాలం

ఫొటో సోర్స్, Mayuresh Konnur

ఎందుకిలా...

గత కొన్నేళ్లుగా హిమాలయ ప్రాంతం ఇలాంటి విషాదాలను ఎదుర్కొంటోంది.

వాతావరణ మార్పుల కారణంగా దేశవ్యాప్తంగా డ్రై పీరియడ్స్ ఏర్పడుతున్నాయని, అకస్మాత్తుగా భారీ వర్షపాతం సంభవిస్తోందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోఫికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం)కి చెందిన వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ రాక్సీ మేథ్యూ కోల్ ప్రకారం, 1950 నుంచి 2025 జూన్ మధ్య భారత్‌లో మొత్తంగా 325 సార్లు తీవ్రమైన వరదలు సంభవించాయి. వీటివల్ల 923 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 19 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. 81,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఒక గంట వ్యవధిలో 100 మి.మీ వర్షపాతం కురిసే క్లౌడ్ బరస్ట్ వంటి ఘటనలు ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతున్నాయి.

గత 5 ఏళ్లలో అతి భారీ వర్షాలకు (204.5 మి.మీ. కంటే ఎక్కువ) సంబంధించి భారత వాతావరణ విభాగం విడుదల చేసిన డేటా ఈ పరిస్థితికి అద్దం పడుతుంది.

హిమాలయాలు, ప్రమాదాలు, కొండచరియలు, వర్షాకాలం

ఫొటో సోర్స్, Mayuresh Konnur

ఫొటో క్యాప్షన్, కులు పట్టణం

‘ఎక్కువ తేమతో కుంభవృష్టి’

గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరిగే సముద్రాల ఉష్ణోగ్రతకు, ఈ అతి భారీ వర్షాలకు సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు.

''అరేబియా సముద్రం, బంగాళాఖాతం విపరీతంగా వేడెక్కుతున్నాయి. ఉష్ణోగ్రత పెరిగితే, వాతావరణంలో తేమ పెరుగుతుంది. ఎక్కువ తేమ అనేది ఎక్కువ వర్షపాత రేటుకు దారితీస్తుంది'' అని ఐఐటీ బాంబేలోని క్లైమేట్ సైన్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అక్షయ నికుంబ్ వివరించారు.

"హిమాలయ ప్రాంతంలో ఒరోగ్రఫీ ఉంటుంది. తేమ బాగా ఎత్తుకు వెళ్తుంది. వర్షాలు కురుస్తాయి. ఏళ్లుగా ఇలాగే జరుగుతోంది. కానీ, ఇప్పుడు వాతావరణంలో తేమ భారీగా ఉండటం వల్ల క్లౌడ్ బరస్ట్‌లకు దారితీస్తోంది'' అని ఆమె చెప్పారు.

అయితే, ఈ ఏడాది యూరప్‌లో హీట్ వేవ్ కారణంగా ఏర్పడిన 'వెస్టర్న్ డిస్టర్బన్సెస్' ఈ దుస్థితిని మరింత తీవ్రంగా మార్చింది.

హిమాలయాలు, ప్రమాదాలు, కొండచరియలు, వర్షాకాలం

ఫొటో సోర్స్, Mayuresh Konnur

అస్థిరంగా మారిన పర్వతాలు

క్లౌడ్ బరస్ట్‌లతో కొండ చరియలు విరిగిపడటం పెరుగుతుంది.

ఐఐటీ మండీకి చెందిన పరిశోధకులు గత 30 ఏళ్ల వర్షపాత డేటాను అధ్యయనం చేశారు. పొడి, తడి సీజన్ల మధ్య అంతరం గణనీయంగా తగ్గిపోయిందని, ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉందని వారు గుర్తించారు.

ఈ అంతరం పెరగడం వల్ల పర్వతాలు తడిగా ఉండే కాలం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుంది.

హిమాలయాలు, ప్రమాదాలు, కొండచరియలు, వర్షాకాలం

ఫొటో సోర్స్, Mayuresh Konnur

మానవ తప్పిదాలు కూడా కారణం

ఈ విధ్వంసానికి వాతావరణ మార్పులతో సమానంగా మానవుల బాధ్యత కూడా ఉందని నిపుణులు అంటున్నారు.

అడ్డగోలు నిర్మాణాలు, రహదారులు, సొరంగాలు, జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం జరుగుతున్న పనులు హిమాలయ పర్వతాలను బలహీనపరుస్తున్నాయి.

మండి నుంచి కులు-మనాలి వరకు నిర్మాణంలో ఉన్న మల్టీ లైన్ హైవే వెంట మేం ప్రయాణిస్తున్నప్పుడు, పర్వతాల వెంబడి కొండచరియలు ప్రమాదకరంగా ఉన్నాయి. హైవే కూడా అనేక చోట్ల దెబ్బతింది.

'' మైదాన ప్రాంతాల తరహా రోడ్లు హిమాలయాల్లో ఎందుకు? భారీగా చేపడుతున్న ఈ నిర్మాణ పనులతో శిథిలాలు భారీగా పుట్టుకొస్తున్నాయి. వానలు పడినప్పుడు ఈ శిథిలాలే తీవ్ర సమస్యలు సృష్టిస్తున్నాయి'' అని పీపుల్స్ అసోసియేషన్ ఫర్ హిమాలయన్ ఏరియా రీసెర్చ్ వ్యవస్థాపకులు శేఖర్ పాఠక్ అన్నారు.

సౌత్ ఏసియా నెట్‌వర్క్ ఆన్ డ్యామ్స్, రివర్స్ అండ్ పీపుల్ (ఎస్‌ఏఎన్‌డీఆర్‌పీ)కి చెందిన హిమాన్షు ఠక్కర్ కూడా ఇదే మాట అంటున్నారు.

''ఉత్తరాఖండ్‌లోని ధారాలీని ఉదాహరణగా చూద్దాం. అక్కడొక విపత్తు వచ్చి చాలామంది చనిపోయారు. 2013లో కూడా ఇలాంటి విపత్తే వచ్చింది. అయినా దాన్నుంచి మనం ఏమీ నేర్చుకోలేదు. ప్రజలు మళ్లీ అక్కడ స్థిరపడ్డారు. గుణపాఠం నేర్చుకొని ఉంటే అక్కడ మళ్లీ ప్రజలు స్థిరపడేందుకు అనుమతించకపోయేవారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, సినిమా ముందుంది అని అప్పుడే చెప్పాం. ఇప్పుడు సాక్ష్యాలు చూస్తున్నాం'' అని హిమాన్షు అన్నారు.

హిమాలయాలు, ప్రమాదాలు, కొండచరియలు, వర్షాకాలం

ఫొటో సోర్స్, Mayuresh Konnur

హిమాచల్ ముఖ్యమంత్రి ఏమన్నారు?

హిమాలయ పర్వత ప్రాంతాల్లో అభివృద్ధి నమూనా గురించి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుతో మేం మాట్లాడాం.

''విధానపరమైన మార్పు అవసరం. ఎక్కడో లోపం ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే, నాలుగు లేన్ల రహదారిని నిర్మించినప్పడు పెద్ద యంత్రాలను వాడారు. అవి పర్వతాల్లోని పొరల్ని కదిలించాయి. అందుకే అవి పడిపోతున్నాయి. కొత్త రహదారులు నిర్మించినప్పుడల్లా అక్కడంతా స్థిరపడటానికి నాలుగైదేళ్లు పడుతుంది'' అని ఆయన అన్నారు.

హిమాలయ రాష్ట్రాలకు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా పర్వత ప్రాంతాలున్న రాష్ట్రాలకు ప్రత్యేక విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ అభిప్రాయపడ్డారు.

ఇదంతా చూస్తుంటే హిమాలయాలు ముందులా లేవని మనం చెప్పొచ్చు. వాతావరణ మార్పులు ఈ ప్రాంతంలో వర్షపాతం సరళిని మార్చేశాయి. మానవ జోక్యంతో పర్వతాల వెన్ను విరిచినట్లయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)