‘టికెట్ బుక్ చేసుకుని కూడా ఎక్కలేదు’.. కర్నూలు బస్ ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రయాణికుడి అనుభవం

కర్నూలులో కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''ఆ బస్సు నా కళ్ల ముందు నుంచే వెళ్లింది. బస్సు వచ్చిందని, ఎక్కడానికి రావాలని డ్రైవర్ నాకు ఫోన్ చేశారు. అయినా, నాకు అర్జెంటు పని ఉండటం.. అది పూర్తి కాకపోవడంతో బస్సు ఎక్కలేదు'' అని చెప్పారు తరుణ్.

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైన బస్సులో తరుణ్ ప్రయాణించాల్సి ఉంది.

కానీ, ఆయన బస్సు ఎక్కలేదని అధికారులు గుర్తించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇండియన్ నేవీలో ఉద్యోగం

హైదరాబాద్‌లోని చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన తరుణ్.. బెంగళూరు వెళ్లేందుకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో శుక్రవారం రాత్రి లక్డీకాపూల్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నారు.

బస్సు ఎక్కేందుకు తాను లక్డీకాపూల్ కూడా వచ్చినట్లు చెప్పారు తరుణ్. కానీ బస్ ఎక్కలేదన్నారు ఆయన.

తరుణ్ బెంగళూరులో ఇండియన్ నేవీలో లెఫ్టినెంట్ కమాండర్‌గా పనిచేస్తున్నారు.

2019లో ఇండియన్ నేవీలో చేరిన తరుణ్.. పది రోజుల సెలవుపై హైదరాబాద్‌ వచ్చారు. తిరిగి శుక్రవారం రాత్రి వెళ్లాల్సి ఉండటంతో ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులోనే ‘యూ 2’ బెర్త్ బుక్ చేసుకున్నారు.

బస్సు ఎక్కేందుకు లక్డీకాపూల్ వరకు వచ్చి, ఎక్కకుండా ఆగిపోయానని ఆయన చెప్పారు.

''నాకు రావాల్సిన పార్సిల్ అప్పటికి రాలేదు. అది నాకు ఎంతో ముఖ్యం. అందుకే బస్సు వచ్చినా సరే, వెళ్లిపోవాలని చెప్పాను. తర్వాత వేరొక బస్సుకు వెళ్దామనుకుని ఆగిపోయాను'' అని బీబీసీతో చెప్పారు తరుణ్.

బస్సు డ్రైవర్ ఫోన్ చేసినప్పుడు, తనకు ఆలస్యం అవుతుందని, వెళ్లిపోవాలని చెప్పానని అన్నారాయన.

''పైగా నాకు మరొక రోజు లీవ్ ఉంది. అందుకే కాస్త ఆలస్యమైనా సరే, ఏ బస్సు అయినా ఫర్వాలేదనుకున్నా.

శుక్రవారం రాత్రి మరొక బస్సులో టికెట్ తీసుకుని బెంగళూరు వచ్చాను'' అని చెప్పారు.

మంటలు

ఫొటో సోర్స్, UGC

బెంగళూరు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులలో తరుణ్ ఒకరు.

అయితే, ఆయన బస్సు ఎక్కలేదని, బస్సులో ప్రయాణించలేదని కర్నూలు జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా అధికారులు విడుదల చేసిన ప్రకటనలో ఉంది.

దీంతో బీబీసీ ఆయనతో మాట్లాడింది.

"శనివారం ఉదయం బస్సు కాలిపోయిన విషయం తెలిసింది. తర్వాత నేను ఎక్కకుండా వదిలేసిన బస్సు అదే అని తెలుసుకుని, ఎంతో అదృష్టం అనుకున్నా" అని ఆయన చెప్పారు.

అగ్నిప్రమాదం

‘బస్‌లో నేను ఉంటే ప్రాణాలు పోయేవో.. ప్రాణాలు కాపాడేవాడినో’

"బస్సులో నా సీటు(బెర్త్) ముందు భాగంలోనే ఉంది. బస్సు ఎక్కి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో.. ఏమో చెప్పలేకపోతున్నా"

''మెలకువ వచ్చుంటే.. వెంటనే బయటకు వచ్చేవాడిని లేదా ఇంకేదైనా జరిగేదేమో'' అని అన్నారు.

తాను ఇండియన్ నేవీలో పనిచేస్తున్నందున అత్యవసర సమయాల్లో ఎలా వ్యవహరించాలి, ఎలా ప్రాణాలు కాపాడుకోవాలి.. ఎలా ఇతరుల ప్రాణాలు కాపాడాలనే విషయాలపై తమకు శిక్షణ ఉంటుందని చెప్పారు తరుణ్.

''ఒకవేళ నేను ఆ సమయంలో బస్సులో ఉండి మెలకువ వచ్చి ఉంటే మరికొందరిని కాపాడగలిగేవాడిని కూడా కావొచ్చు. ''నాకు పెద్దగా గాఢ నిద్ర కూడా పట్టదు. ఫోన్ కూడా తరచూ మోగుతూ ఉంటుంది'' అని చెప్పారు.

ప్రమాదాన్ని తలచుకుంటే, ఇలా అక్కడ పరిస్థితులను బట్టి రెండు రకాల అవకాశాలున్నాయని తరుణ్ వివరించారు.

''అలాంటి అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు రావడం, గ్లాస్ పగలగొట్టడం.. ఇలా అన్ని అంశాలపై ఫోకస్ ఉండేలా మాకు శిక్షణ ఉంటుంది'' అని తరుణ్ బీబీసీతో చెప్పారు.

ఏం జరిగుండేదో ఏమో కానీ.. ఆ బస్సులో ప్రయాణించకపోవడమనేది తన ప్రాణాలు కాపాడుకోవడంలో పెద్ద విషయమని ఆయన వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)