దోమలు లేని దేశంలో తొలిసారి ఒక మగ, రెండు ఆడ దోమలు కనిపించాయి

దోమ

ఐస్‌లాండ్‌లో తొలిసారి దోమలు కనిపించాయి. ఈ వసంత కాలం(స్ప్రింగ్)‌లో ఐస్‌లాండ్‌లో మునుపెన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

జార్న్ జాల్టాసన్ అనే వ్యక్తి ఇటీవల ఐస్‌లాండ్‌లో దోమలను చూశారని స్థానిక మీడియాలో రిపోర్ట్ అయింది.

జాలాస్టన్ ఒక మగ, రెండు ఆడ దోమలను చూశారు. అనంతరం వాటిని క్యులిసెటా యాన్యులాటా వర్గానికి చెందిన దోమలుగా గుర్తించారు. ఈ రకం దోమలు చలికాలంలోనూ మనగలుగుతాయి.

భూమి మీద రెండే రెండు దోమలు లేని ప్రాంతాల్లో ఐస్‌లాండ్ ఒకటి. దోమలు లేని మరో ప్రాంతం అంటార్కిటికా.ఐస్‌లాండ్, అంటార్కిటికాల్లో తీవ్రమైన చలి వాతావరణం కారణంగా ఇక్కడ దోమలు ఉండేవి కావు.

అయితే, తాజాగా ఐస్‌లాండ్‌లోనూ దోమలు కనిపించడంతో ఇక ప్రపంచంలో దోమలు లేని ఏకైక ప్రాంతం అంటార్కిటికాయే.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఐస్‌లాండ్ రాజధానికి నైరుతి దిశలోని క్జోస్ అనే గ్లేసియల్ వ్యాలీలో జాల్టాసన్ ఈ దోమలను గుర్తించారు.

'ఒక రెడ్ వైన్ రిబ్బన్ మీద కొత్త రకం ఈగలు కనిపించాయి' అంటూ జాల్టాసన్ తొలుత ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

తాను చూసిన ఆ ఈగల వంటి కీటకాలు దోమలు కావొచ్చంటూ జాల్టాసన్ ఐస్‌లాండిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురల్ హిస్టరీకి పంపించి అవేంటో కనిపెట్టమని కోరారు.

అక్కడి కీటకశాస్త్రవేత్త మథియాస్ అల్‌ఫ్రియోసన్ వాటిని దోమలుగా తేల్చారు.

'యూరప్‌, ఉత్తర ఆఫ్రికాలో ఈ రకం దోమలు సాధారణమే. కానీ, ఐస్‌లాండ్‌లోకి అవి ఎలా వచ్చాయన్నది తెలియదు' అని మథియాస్ సీఎన్ఎన్ న్యూస్‌కు చెప్పారు.

ఐస్‌లాండ్ వాతావరణం, అక్కడ నిల్వ నీరు లేకపోవడం వంటి కారణాల వల్ల దోమలు ఉండవని 'ది వరల్డ్ పాపులేషన్ రివ్యూ' పేర్కొంది.

కానీ, ఈ ఏడాది ఐస్‌లాండ్‌లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో కొన్నిసార్లు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠంగా ఒక రోజు 26.6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది.

కాగా ఈ దోమలు తమ దేశంలోకి ఎలా వచ్చుంటాయనే విషయంలో వీటినితొలిసారి చూసిన జాల్టాసన్ కొన్ని అంచనాలకు వచ్చారు.

తాను ఉండే క్జోస్ వ్యాలీకి 6 కిలోమీటర్ల దూరంలో గ్రండార్తంగి మున్సిపాలిటీ ఉందని.. అక్కడికి వచ్చే షిప్‌లు, కంటెయినర్ల ద్వారా వచ్చి ఉండొచ్చని జాల్టాసన్ స్థానిక మీడియాతో చెప్పారు.

అలా కాకుండా అవి నేరుగా వచ్చి ఉంటే మాత్రం మరిన్ని దోమలు ఉండే అవకాశం ఉందన్నారు జాల్టాసన్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)