ఏలియన్స్ మరో పదేళ్లలో కనిపించనున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జొనాథన్ ఓ'కల్లఘన్
- హోదా, బీబీసీ కోసం
యూఎఫ్‌ఓలు(ఫ్లయింగ్ సాసర్లు), ఏలియన్స్ కదలికలను కొద్దిసేపు పక్కనపెడదాం, ఇతర గ్రహాలపై జీవరాశిని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎలా వెతుకుతున్నారో తెలుసుకుందాం.
ప్రజలు ఏలియన్స్‌ను ఊహించుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇతర గ్రహాలపై జీవరాశి ఉందనే భావన మన సంస్కృతిని చాలావరకు మార్చింది. పుస్తకాలు, టీవీ షోలు, సినిమాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది.
కానీ ఇప్పుడు, ఏలియన్స్ కోసం నిజమైన వేట జరుగుతోంది. ఇది శాస్త్రవేత్తలు చేపట్టిన క్రమపద్ధతిలో నడిచే ప్రక్రియ. దశాబ్దంలోపు(పదేళ్లలోపు) ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.

దీనికోసం అనేక రకాల శోధనలు జరుగుతున్నాయి:
- అంగారక గ్రహంపై, ఒక రోవర్ రాళ్లు, మట్టిని సేకరిస్తోంది. ఆ నమూనాలు అక్కడ జీవరాశి ఉనికి ఉందో లేదో చూపించగలవు.
- జీవరాశి మనుగడకు అనుకూలమేనా? లేదా అని తెలుసుకోవడానికి సౌర వ్యవస్థలోని కొన్ని ఐసీ మూన్స్ (మంచుతో కప్పబడిన చంద్రుల)ను అంతరిక్ష నౌకలు అన్వేషిస్తున్నాయి.
- ఇతర నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఏలియన్ జీవితాన్ని సూచించే రసాయన సంకేతాల కోసం వారు ఆ గ్రహాల వాతావరణాలను పరిశీలిస్తున్నారు.
- శాస్త్రవేత్తలు కూడా ఇంటెలిజెంట్ సివిలైజేషన్(ఇతర తెలివైన జీవరాశి) నుంచి సంకేతాల కోసం చూస్తున్నారు - అవి ఉద్దేశపూర్వకంగా పంపినా లేదా ప్రమాదవశాత్తూ జరిగినా.
ఈ ప్రాజెక్టులన్నీ జాగ్రత్తగా, దశలవారీగా భూమికి ఆవల జీవరాశి(ఏలియన్స్) కి నిజమైన ఆధారాల కోసం వెతుకుతున్నాయి.
"సమీప గ్రహాల్లో జీవం లేదా జీవరాశికి సంబంధించిన ఆధారాలు వచ్చే పదేళ్లలో దొరకొచ్చు. దానిని కనుగొనడానికి చాలా దగ్గరగా ఉన్నాం" అని యూకే ఖగోళ శాస్త్రవేత్త రాయల్ లార్డ్ మార్టిన్ రీస్ అన్నారు.

ఫొటో సోర్స్, Nasa/JPL
మొదటి ప్రయత్నం ఎప్పుడు జరిగింది?
ఏలియన్స్ ఒకవేళ ఉంటే, వాటిని కనుగొనడం అంత సులభం కాదు. 'సెటి' అని పిలిచే తెలివైన జీవరాశి కోసం వెతకడానికి మొదటి భారీ ప్రయత్నం 1900ల మధ్యలో ప్రారంభమైంది. ఖగోళ శాస్త్రవేత్తలు ఇతర గ్రహాల నుంచి రేడియో సంకేతాలను విన్నారు కానీ, ఏమీ కనుగొనలేకపోయారు. 1800ల చివరలో అంగారక గ్రహంపై జీవానికి మద్దతు ఇచ్చే కాలువలు, నదులు ఉన్నాయని భావించారు.
కానీ, తరువాత అంగారక గ్రహం ఎక్కువగా పొడిగా, ఖాళీగా ఉందని తెలుసుకున్నాం. ఇతర నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాలను అధ్యయనం చేయడం మరింత కష్టం. ఎందుకంటే, అవి చాలా చిన్నవి, అందుకే వాటిని కనుగొనడం, తెలుసుకోవడం కష్టం.
ఏలియన్స్ కోసం శాస్త్రవేత్తలు వెతుకుతున్న విధానాన్ని మెరుగుపరచాల్సి వచ్చింది. మొదటి సంకేతాలు గ్రహానికి చెందిన గాలిలోని సూక్ష్మజీవులు లేదా రసాయనాల మాదిరిగా చాలా చిన్నవిగా ఉండవచ్చు. ఇది హాలీవుడ్ సినిమాల్లో మాదిరిగా కనిపించకపోవచ్చు. కానీ, భూమి వెలుపల, వేరే గ్రహాలపై జీవరాశి ఉందనే చిన్న ఆధారం కూడా విశ్వంలో మన స్థానాన్ని.. మనం చూసే విధానాన్ని మార్చేస్తుంది.

ఫొటో సోర్స్, NASA
అంగారక గ్రహంపైనే పరిశోధనలు
ప్రస్తుతం, సౌర వ్యవస్థలో అంగారక గ్రహం మీదనే ప్రధాన దృష్టి ఉంది. చాలాకాలం కిందట, దీనిపై సముద్రాలు, సరస్సులు ఉండేవని నమ్ముతున్నారు. నేటికీ దాని మంచు కింద నీరు ఉండవచ్చని శాస్త్రవేత్తలకు ఆధారాలు లభించాయి.
ఆ గ్రహం మీదున్న జెజెరో క్రేటర్ అనే పాత సరస్సు నుంచి నాసా పెర్సెవరెన్స్ రోవర్ మట్టి, రాతి నమూనాలను సేకరిస్తోంది. జీవ సంకేతాలను తనిఖీ చేయడానికి 2030లలో ఈ నమూనాలను తిరిగి భూమికి తీసుకురావాలనేది ప్రణాళిక. ఈ మిషన్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది కానీ, విజయవంతమైతే, అది మనకు ముఖ్యమైన సమాధానాలను ఇవ్వగలదు.
అంగారక గ్రహంపై జీవం ఉంటే రాళ్లు, నీరు తగిలే ప్రదేశాలపై దాని గుర్తులుంటాయని యూకేలోని ది ఓపెన్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త సుసాన్ ష్వెంజర్ చెప్పారు.
అంగారక గ్రహ నమూనాలను భూమికి తీసుకువస్తే, శాస్త్రవేత్తలు వాటిని నిశితంగా అధ్యయనం చేయవచ్చని ఆమె చెబుతున్నారు. శిలాజ సూక్ష్మజీవుల కోసం కూడా వెతకవచ్చని ఆమె ఆశాజనకంగా ఉన్నారు. కానీ, ఈ ఫలితాలపై సుసాన్ హామీ ఇవ్వలేదు.
అయితే, అంగారక గ్రహంపై జీవాన్ని కనుగొనడం వల్ల జీవం ప్రతిచోటా ఉందని నిరూపితమవదు. చాలాకాలం కిందటే, అంగారక గ్రహం, భూమి మధ్య ఉపరితల పదార్థాలు మారినట్లు తెలిసింది. కాబట్టి జీవిత మూలాన్ని కూడా పంచుకుని ఉండవచ్చు.
కాగా, మరో ప్రపంచంలో రెండో జీవరాశి ఉందని నిరూపించడానికి శాస్త్రవేత్తలు బృహస్పతికి సమీపంలోని యూరోపా, శని గ్రహానికి సమీపంలోని ఎన్సెలాడస్ వంటి ఐసీ మూన్స్ కింద మహాసముద్రాలున్నాయో, లేవోనని పరిశీలిస్తున్నారు
2023 ఏప్రిల్‌లో ప్రయోగించిన యూరప్ 'జ్యూస్', 2024 అక్టోబర్‌లో ప్రయోగించిన నాసా 'యూరోపా క్లిప్పర్' మిషన్లు 2030–31లో యూరోపాకు చేరుకుంటాయి. అవి నేరుగా జీవాన్ని కనుగొనవు, కానీ యూరోపా మహాసముద్రాలను అధ్యయనం చేస్తాయి. సముద్రం నుంచి మంచును తవ్వే లేదా పరీక్షించే భవిష్యత్ మిషన్లకు సిద్ధం చేస్తాయి.
'యంత్రం పంపడం కష్టం'
ఐసీ మూన్స్ మహాసముద్రాలలోకి ఒక యంత్రాన్ని పంపడానికి 100 సంవత్సరాలు పట్టవచ్చని కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్రవేత్త అయిన బ్రిట్నీ ష్మిట్ అంటున్నారు.
ఎందుకంటే అనేక కిలోమీటర్ల మందమైన మంచు గుండా వెళ్లడం కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ మంచును చేరుకోవడం, లోపల ఉన్న ద్రవాన్ని తాకడం త్వరగా సాధ్యమవుతుందని బ్రిట్నీ తెలిపారు.
తన బృందం అటువంటి మిషన్ల కోసం సాధనాలు, సాంకేతికతలపై పని చేస్తున్నట్లు ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
జేమ్స్ టెలిస్కోప్ సాయంతో..
మరోవైపు, శాస్త్రవేత్తలు ఎక్సోప్లానెట్స్ అనే ఇతర సౌర వ్యవస్థలలోని గ్రహాలను కూడా పరిశీలిస్తున్నారు. అలాంటివి ఇప్పటివరకు 5,500కు పైగా కనుగొన్నారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్టీ) వంటి శక్తిమంతమైన కొత్త టెలిస్కోప్‌లతో, ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ ప్రపంచాలను వివరంగా అధ్యయనం చేస్తున్నారు.
ఇప్పటివరకు అతిపెద్ద అంతరిక్ష టెలిస్కోప్ అయిన జేడబ్ల్యూఎస్టీ, మొదట్లో ఎక్సోప్లానెట్లను అధ్యయనం చేయడానికి ఉద్దేశించలేదు. కానీ, ఇప్పుడు భూమి వంటి రాతి గ్రహాలపై ఏ వాయువులు ఉన్నాయో కనుగొనేందుకూ ఉపయోగిస్తున్నారు.
సూర్యుడిలాంటి నక్షత్రాల చుట్టూ ఉన్న భూమి లాంటి గ్రహాలను జేడబ్ల్యూఎస్టీ ఇంకా అధ్యయనం చేయలేదు, ఎందుకంటే అవి వాటి నక్షత్రాలతో పోలిస్తే చాలా బలహీనంగా ఉంటాయి. దాని కోసం, 2040ల కోసం ప్రణాళిక చేసిన నాసా హాబిటబుల్ వరల్డ్స్ అబ్జర్వేటరీ అవసరం.
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చిన్న నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాలను అధ్యయనం చేయగలదు. ప్రస్తుతం TRAPPIST-1 అనే నక్షత్ర వ్యవస్థను ఇది అధ్యయనం చేస్తోంది. ఈ వ్యవస్థలో భూమికి సమానమైన ఏడు గ్రహాలున్నాయి. వాటిలో మూడు నివాసయోగ్యమైన మండలంలో ఉన్నాయి, ఇక్కడ ద్రవ రూపంలోని నీరు ఉనికిలో ఉండవచ్చు.
మొదటి పని ఈ గ్రహాలకు వాతావరణం ఉందో లేదో తనిఖీ చేయడం. లోపలి గ్రహంలో వాతావరణం ఉండకపోవచ్చు అని ప్రారంభ ఫలితాలు చూపించాయి. కానీ, 2025లో శాస్త్రవేత్తలు TRAPPIST-1e మీద వాతావరణం ఉన్నట్లు సంకేతాలను రిపోర్టు చేశారు. 2026లో మరిన్ని ఫలితాలను ఆశిస్తున్నారు.
''ఈ గ్రహాలకు వాతావరణం ఉంటే, అది ఒక పెద్ద అడుగు అవుతుంది'' అని నాసా ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జెస్సీ క్రిస్టియన్సెన్ అభిప్రాయపడ్డారు.
ఆ గ్రహాలపై ఒకవేళ వాతావరణం నిర్ధరణ అయితే, జేడబ్ల్యూఎస్టీ జీవం గుర్తుల కోసం చూస్తుంది.

ఫొటో సోర్స్, NASA
శాస్త్రవేత్తలు వివరణే కీలకం
నాసా హాబిటబుల్ వరల్డ్స్ అబ్జర్వేటరీ, యూరప్ ప్రతిపాదిత 'లైఫ్' మిషన్ వంటి భవిష్యత్ టెలిస్కోపులు, మన సూర్యుడి వంటి నక్షత్రాల చుట్టూ ఉన్న భూ-సారూప్య గ్రహాలను అధ్యయనం చేస్తాయి.
"నివాసయోగ్యమైన జోన్‌లోని రాతి గ్రహాలపై ప్రధాన దృష్టి ఉంటుంది " అని లైఫ్ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహిస్తున్న స్విట్జర్లాండ్‌లో ఈటీహెచ్ జ్యూరిచ్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సాస్చా క్వాంజ్ అన్నారు.
కాగా, శాస్త్రవేత్తలు ఇప్పటికీ తెలివైన జీవం(ఇంటెలిజెంట్ లైఫ్) కోసం వెతుకుతున్నారు. భూమి నుంచి 100 కాంతి సంవత్సరాల లోపల బలమైన రేడియో సిగ్నల్స్ ఇప్పటివరకు కనుగొనలేదని, కాబట్టి 'బ్రేక్‌త్రూ లిజెన్' వంటి ప్రాజెక్టులు ఇప్పుడు గెలాక్సీ అంతటా మరింత దూరం చూస్తున్నాయని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జాసన్ రైట్ చెప్పారు.
భూమి విడుదల చేసినట్లుగా, ప్రమాదవశాత్తూ వచ్చే రేడియో లీక్‌లను గుర్తించాలని కూడా వారు ఆశిస్తున్నారు.
'స్క్వేర్ కిలోమీటర్ అర్రే' అనే కొత్త భారీ రేడియో టెలిస్కోప్ 2028లో ప్రారంభమవుతుంది. ఇది రెండు ఖండాల్లో వేలాది యాంటెన్నాలను ఉపయోగించనుంది, శోధన మరింత బలోపేతం కానుంది. ఆధునిక రేడియో టెలిస్కోప్‌లతో కూడా ఒక ఆవిష్కరణ "ఏ క్షణంలోనైనా" జరగొచ్చు అని జాసన్ రైట్ అభిప్రాయపడ్డారు.
శాస్త్రవేత్తలు గ్రహాంతర జీవుల గురించి ఆధారాలు కనుగొంటే, అది వెంటనే స్పష్టంగా తెలియకపోవచ్చు. కానీ దశలవారీగా వస్తుంది.
"మీ దగ్గర ఎంత ఎక్కువ సమాచారం ఉంటే, మీరు తప్పుడు సమాచారాన్ని తోసిపుచ్చే స్థితిలో ఉంటారు" అని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త క్వాంజ్ చెప్పారు.
శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను ఎంత జాగ్రత్తగా వివరిస్తారనే దానిపై ప్రజల స్పందన ఆధారపడి ఉంటుందని మార్టిన్ రీస్ అంటున్నారు. శుక్రగ్రహంపై ఫాస్ఫిన్, ఎక్సోప్లానెట్‌పై డైమిథైల్ సల్ఫైడ్‌ను గుర్తించినట్లు వచ్చిన రిపోర్టులు అనిశ్చితంగా, చర్చనీయాంశంగా మారడం దీనికి ఉదాహరణ.
''అసలు జీవమే కనిపించకపోయే అవకాశం కూడా ఉంది. అది కూడా ఒక ముఖ్యమైన ఫలితం అవుతుంది, విశ్వంలో జీవం చాలా అరుదుగా ఉండవచ్చని అది చూపుతుంది'' అని క్వాంజ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














