'ఈ పాప మనిద్దరికే పుట్టిందని చెప్పినా, పసికందును రైల్లోంచి విసిరేశాడు'

నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేవియర్ సెల్వకుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.

‘‘ఈ పాప మనిద్దరికే పుట్టింది, అనుమానం ఉంటే డీఎన్‌ఏ టెస్టు చేయించుకోమన్నా. బిడ్డను ఏమీ చేయొద్దని ప్రాధేయపడ్డా. కానీ, నా మాటలు వినకుండా నా నుంచి బిడ్డను లాక్కున్నాడు. నాకు పుట్టని బిడ్డ ఎందుకు బతికి ఉండాలి అంటూ రైలులోంచి విసిరేశాడు''

తన భర్త మీద కవిత అనే మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పిన మాటలివి.

ఈ కేసులో కవిత భర్త మారిసెల్వంకు జీవిత ఖైదు విధిస్తూ కోయంబత్తూరు అదనపు మహిళా కోర్టు తీర్పునిచ్చింది. అయితే, బయటకు విసిరేసినట్లుగా పేర్కొంటున్న బిడ్డ మృతదేహం మాత్రం దొరకలేదు.

బిడ్డ మృతదేహం దొరకనప్పటికీ, నిందితుడికి వ్యతిరేకంగా ప్రభుత్వం సమర్పించిన సాక్ష్యాలు, పత్రాల ఆధారంగా, నేర స్వభావంరీత్యా కోర్టు తీర్పు ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మారిసెల్వంకు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మారిసెల్వంకు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది

అర్ధరాత్రి రైల్లోంచి పసికందును విసిరేసిన తండ్రి

కోయంబత్తూరు సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు 2022 మే 15వ తేదీ రాత్రి గం 9:15కు ఒక ఫోన్ కాల్ వచ్చింది.

భర్త తనను కొట్టి, చిత్రహింసలు పెట్టాడని, ఒలింపస్ ఏరియాలోని ఒక గదిలో బంధించి వెళ్లిపోయారంటూ ఒక మహిళ ఆ ఫోన్ కాల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు తల, ఒళ్లంతా గాయాలున్న ఒక మహిళ కనిపించారు. పోలీసులు ఆమెను కాపాడారు.

తన పేరు కవిత అని, భర్త మారిసెల్వం తనను కొట్టి హింసించి గదిలో బంధించారంటూ పోలీసులకు ఆమె తెలిపారు. మారిసెల్వంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కోయంబత్తూరు రామనాథపురం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 2021లో కవిత, మారిసెల్వం వివాహం జరిగింది. గర్భవతి అయిన కవితను మారిసెల్వం 2022 ఏప్రిల్ 30న కోయంబత్తూరుకు తీసుకొచ్చారు. ఒలింపస్ ఏరియాలోని ఒక లాడ్జిలో ఉంచారు.

కవితకు నొప్పులు రావడంతో కోయంబత్తూరులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు పాప పుట్టింది. వారం తర్వాత పాపతో పాటు కవితను రైలులో కోవిల్‌పట్టి తీసుకెళ్లిన మారిసెల్వం, అక్కడి నుంచి కడయనల్లూరులోని కవిత ఇంట్లో దిగబెట్టి వెళ్లిపోయారు.

రెండు రోజుల్లోనే కడయనల్లూరుకు తిరిగొచ్చిన మారిసెల్వం, కవితతో గొడవపడి ఆమెను నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ రైలులో కోయంబత్తూర్ తీసుకెళ్లారు.

మారిసెల్వంకు ఇదివరకే పెళ్లి అయిన సంగతి గురించి రైల్లో ఉండగా కవిత అడిగారు. దీనిపై గొడవ పడిన మారిసెల్వం, ఆ పాప తనకు పుట్టలేదంటూ వాదనకు దిగారు.

Coimbatore Railway Station (file photo)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోయంబత్తూరు రైల్వే స్టేషన్ (ఫైల్ ఫోటో)

‘పాపతో నన్ను బలవంతంగా టాయ్‌లెట్స్ వైపు లాక్కెళ్లాడు’

‘‘అనుమానం ఉంటే డీఎన్‌ఏ పరీక్ష చేయించండని నేను చెప్పా. కానీ, ఆయన వినలేదు. అప్పుడు రాత్రి 12 దాటింది. రైల్లోని అందరూ నిద్రపోతున్నారు. రైలు మదురైను దాటి దిండిగల్‌ను సమీపిస్తోంది. పాపతో పాటు నన్ను ఆయన బలవంతంగా టాయ్‌లెట్స్ వైపు లాక్కెళ్లాడు.

నా చేతుల్లో నుంచి పాపను లాక్కోడానికి ప్రయత్నించాడు. బిడ్డను నేనే పెంచుకుంటానని ఆయన్ను బతిమాలా. మా ఇద్దర్నీ వదిలేయమని ప్రాధేయపడ్డా. నా మాట వినకుండా చేతుల్లో నుంచి పాపను లాక్కొని 'ఈ బిడ్డ నాకు పుట్టలేదు, ఎందుకు బతికి ఉండాలి' అంటూ బయటకు విసిరేశాడు’’ అని కవిత చెప్పినట్లుగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఈ సంగతి గురించి ఎవరికీ చెప్పొద్దని బెదిరించి, కోయంబత్తూరుకు తీసుకెళ్లి ఒక గదిలో బంధించి కొట్టాడని పోలీసులకు కవిత వెల్లడించారు.

అప్పుడే పోలీసులు వెళ్లి ఆమెను రక్షించారు.

ప్రస్తుతం కవిత ఎక్కడ ఉన్నారో తెలియరాలేదు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారుల్లో చాలామంది బదిలీ అయ్యారు. ఈ కేసు కోయంబత్తూరు మహిళా కోర్టులో మూడేళ్లకు పైగా పెండింగ్‌లో ఉంది.

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సుందర్‌రాజ్, గత శనివారం (అక్టోబర్ 25) మారిసెల్వంకు జీవిత ఖైదు, 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు.

మామూలుగా హత్య కేసుల విచారణల్లో హత్యకు గురైన వ్యక్తి శరీరం, పోస్ట్‌మార్టం రిపోర్టు, ఇతర ఆధారాల సాయంతో నిందితుడిని దోషిగా నిర్ధరిస్తారు.

మారిసెల్వం

ఫొటో సోర్స్, TN Police

ఫొటో క్యాప్షన్, మారిసెల్వం

ప్రధాన సాక్ష్యం కెమెరా ఫుటేజీ

ఈ కేసులో రైలు నుంచి బయటకు విసిరేసినట్లుగా చెబుతున్న పాప మృతదేహం దొరకలేదు. కవిత వాంగ్మూలం, ఇతర సాక్షులు, మరికొన్ని పత్రాల ఆధారంగా దోషికి శిక్ష విధించారు.

భారత్‌లో చాలా అరుదైన కేసుల్లో మాత్రమే మృతదేహం దొరకనప్పటికీ కోర్టు తీర్పు ఇచ్చినట్లుగా బీబీసీతో ప్రాసిక్యూటర్ జిషా చెప్పారు.

‘‘కొన్ని సందర్భాల్లో హత్యకు గురైన వ్యక్తి మృతదేహాన్ని యాసిడ్‌లో కరిగించారు. ఈ కేసులో కూడా చిన్నారి మృతదేహం దొరకలేదు. అయితే, బలమైన ఆధారాలు, డాక్యుమెంట్స్ ఆధారంగా తీర్పు ఇచ్చారు.

సీసీటీవీ ఫుటేజీ చాలా ఉపయోగపడింది. కోవిల్‌పట్టి రైల్వే స్టేషన్‌లో మారిసెల్వం, పాపతో కవిత రైలు ఎక్కుతున్నట్లుగా కెమెరాలో రికార్డయింది.

కానీ కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌లోని కెమెరా ఫుటేజీలో పాప లేకుండా వారిద్దరే రైలు దిగినట్లు కనిపించింది. ఇద్దరే వెళ్లి హోటల్‌ గది తీసుకున్నట్లు రికార్డయింది.

అక్కడి నుంచి కవిత పోలీసులకు ఫోన్ చేయగా, వారు వచ్చి ఆమెను రక్షించారు. ఇది మరో కీలక ఆధారం’’ అని జిషా వివరించారు.

కవితను రక్షించి కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చినప్పుడు, ఆమె ఇదే ఆసుపత్రిలో ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లు తమకు తెలిసిందని రామనాథపురం పోలీసులు తెలిపారు.

హత్య కేసులో అతి ముఖ్యసాక్ష్యమైన చిన్నారి మృతదేహం కోసం మూడు రోజులు గాలించినా దొరక్కపోవడంతో, ఈ కేసులో ఇతర ఆధారాలను సేకరించాల్సి వచ్చిందని తెలిపారు.

Lawyer Jisha

ఫొటో సోర్స్, Jisha

ఫొటో క్యాప్షన్, లాయర్ జిషా

పసికందును హత్య చేసిన కేసులో అరెస్టయిన మారిసెల్వం 80 రోజులు జైల్లో గడిపారు.

''తర్వాత బెయిల్ మీద విడుదల అయ్యాడు. బెయిల్ తీసుకురావడంలో ఆలస్యం చేశావంటూ తండ్రి ఆర్ముగంను హత్య చేశాడు. ఈ హత్యకు సంబంధించి తిరునల్వేలిలో నమోదైన ఎఫ్‌ఐఆర్ పరిగణలోకి తీసుకున్నాం. మారిసెల్వంపై ఇప్పటికే నమోదైన పోక్సో కేసు పత్రాలను కూడా సాక్ష్యంగా ఉపయోగించాం.

ఇంజనీరింగ్ చదివిన మారిసెల్వం, కోయంబత్తూరులో పనిచేశాడు. అతనికి అంతకు ముందే ఒకసారి పెళ్లయింది. మొదటి భార్యను కూడా వేధించాడు. నెలన్నర తర్వాత ఆమె నుంచి విడిపోయాడు. ఈ విషయాన్ని దాచిపెట్టి కవితను వివాహం చేసుకున్నాడు’’ అని జిషా వివరించారు.

ఈ కేసులో మారిసెల్వం మొదటి భార్య కూడా తన సాక్ష్యం చెప్పారు.

తన మొదటి వివాహం గురించి ప్రశ్నించిన కవితను బ్లాక్‌మెయిల్ చేసి నియంత్రించడానికి, పాప తనకు పుట్టలేదంటూ కవితను బెదిరించాడని ప్రాసిక్యూషన్ లాయర్ చెప్పారు.

కెమెరా ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు, పత్రాల ఆధారంగా నేరం రుజువైనందున ఆయనకు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదు పడినట్లు పోలీసులు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)