ఈ దీపావళి గన్ ఎంతమంది కంటి చూపును పోగొట్టిందంటే..

- రచయిత, శర్లీన్ మోలన్, విష్ణుకాంత్ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
15 ఏళ్ల ఆరిష్ మధ్యప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రిలో బెడ్ మీద కూర్చుని ఉన్నారు. కళ్లకు నల్లద్దాలున్నాయి. ఆ అద్దాల వెనుక చాలా బాధ ఉంది. ఆయన ఎడమ కంటికి గాయమైంది.
దీపావళి కోసం కొనుక్కున్న ఒక గన్ ఆయన ముఖం దగ్గర పేలిపోవడంతో, ఆరిష్ కంటిపొర (కార్నియా) దెబ్బతింది. ఒక కంటికి చూపు పోయింది. ఎమర్జెన్సీ ఆపరేషన్ చేశారు. కానీ, చూపు తిరిగి వస్తుందో లేదో కాలమే చెప్పాలని వైద్యులు అంటున్నారు.
ఆరిష్ చదువుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఆయనకి ఎక్కువగా బాధ కలిగించే విషయం ఏంటంటే ఇకపై తాను పని చేయలేనేమో అన్నది. ఆయన తండ్రి తోటమాలి. కుటుంబ ఖర్చుల కోసం టెలివిజన్లు రిపేర్ చేస్తూ తనవంతు సాయం చేస్తున్నారు ఆరిష్.
భారతదేశంలో పిల్లలు పనిచేయడం చట్ట విరుద్ధం. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా ఇంకా లక్షలాది పిల్లలు పని చేస్తూనే ఉన్నారు. భారత చట్టం ప్రకారం, 14 ఏళ్లకు పైబడిన పిల్లలు, ప్రమాదకరంకాని కొన్ని రంగాల్లో మాత్రమే పని చేయడానికి అనుమతి ఉంది.
దీపావళి సమయంలో ఉత్తర భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో ‘కార్బైడ్ గన్’ వాడడంతో కంటికి గాయాలై బాధపడుతున్న వందలాది పిల్లల్లో ఆరిష్ కూడా ఒకరు. ఈ పేలుడు వల్ల చాలామంది పిల్లలు చూపు కోల్పోయారు.

ఎందుకు పేలలేదని చూడగానే...
"కార్బైడ్ గన్" అనేది చాలా సాధారణ పరికరం. ప్లాస్టిక్ పైపులో కాల్షియం కార్బైడ్ వేసి దీనిని గన్‌లాగా పేలుస్తారు. పేలినప్పుడు తుపాకీలాగా గట్టిగా పేలి, నిప్పురవ్వలు చిమ్ముతుంది. కానీ ఈ పేలుడు ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. ఒక్కోసారి ఆలస్యం కావచ్చు. ఇంకా పేలడం లేదేంటని పైపు లోపల చూడగానే అది ఒక్కసారిగా పేలిపోవచ్చు. అలా గాయపడినవారు చాలామంది ఉన్నారని అధికారులంటున్నారు.
భారతదేశంలో కాల్షియం కార్బైడ్ అమ్మకం, కొనుగోళ్లపై నియంత్రణలు ఉన్నప్పటికీ పండ్లను కృత్రిమంగా పండించడానికి రైతులు, వ్యాపారులు తరచుగా దీనిని ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు పొలాల దగ్గర జంతువులను భయపెట్టడానికి కూడా ఈ కార్బైడ్ గన్‌లను ఉపయోగిస్తారని పోలీసు అధికారులు చెబుతున్నారు.
భారతదేశంలో చాలామందికి పోయిన వారందాకా ఈ కార్బైడ్ గన్ గురించి తెలియదు.
దీపావళి తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో పిల్లలకు కంటి గాయాలు కావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల కారణంగా ఈ గన్‌లు ఉత్తర భారతదేశంలోని స్థానిక మార్కెట్లలో వేగంగా అమ్ముడయ్యాయి.
ఆ వీడియోల్లో వీటిని టపాకాయల్లా ఉపయోగిస్తున్నట్లు చూపించడంతో పిల్లలు వాటిని సరదాగా కొనుగోలు చేశారని అధికారులు చెబుతున్నారు.

‘దీపావళి టపాకాయలతో ఇలాంటి గాయాలు నేనెప్పుడూ చూడలేదు’
మధ్యప్రదేశ్‌లో ఒక్క భోపాల్ జిల్లాలోనే కార్బైడ్ తుపాకీ సంబంధిత కంటి గాయాలతో వందకు పైగా కేసులు నమోదయ్యాయి. కనీసం 15 మందికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. మరో మూడు జిల్లాల నుంచి సుమారు 100మంది పిల్లలు ఇలాంటి గాయాలతో ఆసుపత్రుల్లో చేరారు.
బిహార్‌లో 170 కేసులు నమోదయ్యాయని, వాటిలో 40 కేసులకు సర్జరీ అవసరమని పట్నా నగరంలోని ప్రాంతీయ నేత్ర వైద్య సంస్థ అధిపతి డాక్టర్ బిభూతి ప్రసాన్ సిన్హా చెప్పారు. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దిల్లీలో కూడా ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు ‘కార్బైడ్ గన్’లను నిషేధించాయి. అలాగే ఈ గన్లు అమ్మిన పలువురు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
"తేలికపాటి, మోస్తరు, తీవ్రస్థాయి కంటి గాయాలతో రోగులు వరుసబెట్టి ఆసుపత్రికి వస్తున్నారు" అని భోపాల్‌లోని హమీదియా హాస్పిటల్‌లో నేత్ర వైద్య విభాగాధిపతి కవిత కుమార్ చెప్పారు.
"కొద్దిపాటి గాయమైన కేసుల్లో కంటి చర్మం, దాని చుట్టుపక్కల భాగం రసాయన ప్రభావం, వేడివల్ల గాయపడింది. మధ్యస్థంగా గాయపడిన కేసుల్లో రసాయన కణాలు కార్నియాకు స్వల్ప నష్టం కలిగించాయి. తీవ్రంగా గాయపడిన కేసుల్లో కార్నియా బాగా దెబ్బతిని, తాత్కాలికంగా చూపు కోల్పోయారు. శస్త్రచికిత్స ద్వారా కొంతకాలానికి చూపు తిరిగి వచ్చే అవకాశం ఉంది" అని ఆమె తెలిపారు.
ఈ గాయాల తీవ్రత చూసి ఆశ్చర్యపోయామని కొంతమంది వైద్యులు బీబీసీకి చెప్పారు.
"దీపావళి టపాకాయల వల్ల ఇలాంటి గాయాలు కావడం నేను ఎప్పుడూ చూడలేదు. 'కార్బైడ్ గన్స్' అంటే ఏంటో ప్రత్యేకంగా పరిశోధించాల్సి వచ్చింది" అని భోపాల్‌లోని హమీదియా ఆసుపత్రికి చెందిన డాక్టర్ ఆదితి దూబే తెలిపారు.
చాలామంది రోగులు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు చూసి ఈ తుపాకీని కొనుగోలు చేశామని చెప్పారు. వీటిలో వాళ్లకు నచ్చిన విషయం ధర. ఒక్కో తుపాకీ కేవలం 150-200 రూపాయలు మాత్రమే ఉండడంతో, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావం చూపేదిగా అనిపించింది.
ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో "కార్బైడ్ గన్" అనే పదంతో సెర్చ్ చేస్తే, యువకులు ఈ పరికరాలను తయారు చేసి, ఉపయోగిస్తున్న చాలా వీడియోలు కనిపిస్తాయి. వీటిలో తరచుగా రాప్ మ్యూజిక్ వినిపిస్తుంది.

ఒక ఇంజనీరింగ్ విద్యార్థి కూడా
కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియోలకు "సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్", "యూజ్‌ఫుల్ ప్రాజెక్ట్" వంటి హ్యాష్‌ట్యాగ్‌లను కూడా పెట్టారు.
తన పేషెంట్లలో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి అని డాక్టర్ సిన్హా తెలిపారు. అలాంటి వీడియోలు చూసి ఇంట్లోనే ఆ గన్ తయారు చేసి ఉపయోగించారనీ, దాంతో ఆయనకు ఒక కంటికి చూపు పోయిందని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారనీ డాక్టర్ సిన్హా వెల్లడించారు.
భారతదేశంలో కాల్షియం కార్బైడ్ నియంత్రణలున్నాయి. ఇది హానికరం కావచ్చు లేదా దుర్వినియోగానికి అవకాశం ఉండడంతో, దీనిని తయారు చేయడం, ఉపయోగించడంపై నియంత్రణలు విధించింది ప్రభుత్వం.
ఇది నీటితో కలిసినప్పుడు అసిటిలీన్ అనే వాయువు ఉత్పత్తి అవుతుంది. దీనికి మండే గుణం ఉంది. అది ఆరోగ్యానికి హానికరమైంది కూడా.
కాల్షియం కార్బైడ్ రూల్స్-1987 ప్రకారం, 200 కిలోల కంటే ఎక్కువ పరిమాణంలో ఉంటే దీని అమ్మకం, కొనుగోలు, నిల్వ కోసం లైసెన్స్ తప్పనిసరి.
కాల్షియం కార్బైడ్‌లో విషపూరిత పదార్థాలు ఉండటం వల్ల నిషేధం ఉన్నప్పటికీ, పండ్లను కృత్రిమంగా పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఇప్పటికీ విస్తృతంగా వాడుతున్నారని భోపాల్‌కు చెందిన ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఆయన తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

శాశ్వత అంధత్వానికి దారి తీస్తుందా?
ఉత్తర భారతదేశంలో కొంతమంది పెళ్లి వేడుకల్లో వినోదం కోసం, అలాగే రైతులు తమ పొలాల నుంచి కోతులను తరిమేందుకు ఈ గన్‌లను ఉపయోగిస్తారని భోపాల్ పోలీస్ కమిషనర్ హరి నారాయణాచారి మిశ్రా తెలిపారు.
కార్బైడ్ తుపాకులను తక్షణమే నిషేధించాలని ఆల్ ఇండియా ఆప్తాల్మోలాజికల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ పార్థా బిశ్వాస్ అన్నారు.
"దీన్ని కేవలం దీపావళి సందర్భంగా జరిగిన 'అనుకోని ప్రమాదం'గా తీసుకోవద్దు. ఇదొక జాతీయ సమస్య. ఈ ఘటనల తీవ్రతను తక్కువగా అంచనా వేయకూడదు" అని ఆయన అన్నారు.
భారతదేశం క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు, నూతన సంవత్సర వేడుకల వంటి పండుగలు, కార్యక్రమాలలో ఈ తుపాకులను బాణసంచాగా ఉపయోగించే అవకాశమూ, ప్రమాదమూ ఉన్నాయని ఆయన అన్నారు.
"ఈ ముడివస్తువులతో తయారైన కార్బైడ్ బాంబులు లేదా కార్బైడ్ గన్స్ చిన్నవిగా కనిపించినప్పటికీ, తీవ్రమైన ప్రమాదాలకు కారణమవుతాయి. శాశ్వత అంధత్వం, ముఖం అందవిహీనమవడం, లేదా శారీరక వైకల్యానికి దారితీస్తాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి పరికరాలను తయారు చేసి అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాల్షియం కార్బైడ్ సరఫరా వ్యవస్థను కూడా ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది" అని ఆయన అన్నారు.
చూపు కోల్పోయిన తర్వాత ఎడమ కంటికి ఆపరేషన్ చేయించుకున్న అల్జైన్ హమీదియా ఆసుపత్రిలో తన తల్లి ఒడిలో కూర్చున్నారు. ఏడేళ్ల ఈ బాలుడు యూట్యూబ్‌లో వీడియోలు చూసిన తర్వాత ఆ తూపాకీ కొనివ్వమని తన మామను కోరాడు. కొనివ్వాల్సిందేనని మారాం చేశాడు.
"వాడి భవిష్యత్తు గురించి నాకు భయంగా ఉంది. మళ్లీ చూపు రావాలని ప్రార్థిస్తున్నా" అని అతని తల్లి అఫ్రీన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














