మొంథా: ప్రపంచంలో అత్యంత తీవ్ర తుపానులు బంగాళాఖాతంలోనే ఎక్కువగా ఎందుకు సంభవిస్తాయి?

బంగాళాఖాతం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలోనే అతి పెద్ద తీరప్రాంతం బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉంది. సుమారు 50 కోట్ల మంది ఈ తీర ప్రాంతంలో నివసిస్తున్నారు.

అలాగే ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన తుపానుల్ని ఎదుర్కొంటోంది కూడా ఈ తూర్పు తీర ప్రాంతమే.

వాతావరణ వివరాలను అందించే వెబ్ సైట్ వెదర్ అండర్‌ గ్రౌండ్‌లో ఈ తీరానికి సంబంధించి కొన్ని ఆసక్తికర వివరాలున్నాయి.

ఈ వెబ్‌సైట్ ప్రకారం ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన 35 తుపానుల్లో 26 పెను తుపాన్లు ఈ తీరంలోనే సంభవించాయి.

తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మొంథా తుపాను

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అల్లకల్లోలంగా సముద్రం ( ప్రతీకాత్మక చిత్రం )

బంగాళాఖాతం ఎందుకు కేంద్రంగా మారుతోంది?

ఘోరమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే సంభవిస్తుంటాయని చెబుతారు వాతావరణ పరిశోధకులు. ఇక్కడ లోతు తక్కువగా ఉంటూ ఒక వైపుకు తీర ప్రాంతం వంగినట్లు ఉండి పల్లంగా ఉంటుంది.

సాధారణంగా తుపాను సమయంలో వీచే బలమైన గాలులు నీటిని బలంగా ఒడ్డువైపుకు తోస్తాయి. ఫలితంగా అలల వేగం ఒక్కసారిగా పెరిగి నేరుగా తుపాను తీరాన్ని తాకుతుంది.

ఈ తరహా భౌగోళిక పరిస్థితులకు బంగాళాఖాతం ఓ స్పష్టమైన ఉదాహరణ అని వెదర్ అండర్ గ్రౌండ్‌ కాలమిస్ట్, ప్రముఖ వాతావరణ పరిశోధకులు బాబ్ హెన్సన్ నాతో అన్నారు.

బంగాళాఖాతం ఉపరితలంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ అధికంగా ఉండటం కూడా ఈ పరిస్థితికి ఒక కారణం. ఫలితంగా తీవ్ర తుపానులు సంభవిస్తుంటాయి.

"అక్కడ ఉష్ణ్రోగ్రతల స్థాయి చాలా ఎక్కువ" అని భారత వాతావరణ పరిశోధన విభాగ అధిపతి డి.మహాపాత్ర వ్యాఖ్యానించారు.

బంగాళాఖాతం

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా పెను తుపానులు సంభవించే మరికొన్ని తీర ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందుకు ఉదాహరణ లూసియానాలోని గల్ఫ్ తీర ప్రాంతం.

"కానీ బంగాళాఖాతపు ఉత్తర తీర ప్రాంతంలో తుపానులు ఒక్కసారిగా విరుచుకుపడి పెను నష్టానికి కారణమవుతాయి. భూమిమీద ఇంకెక్కడా ఇంత దారుణమైన పరిస్థితులు తలెత్తవు" అని హెన్సన్ అన్నారు.

తూర్పు తీర ప్రాంతంలో జనసాంద్రత అధికంగా ఉండటం కూడా తీవ్ర నష్టానికి కారణమవుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు తీర ప్రాంతాల్లోనే ఉంటున్నారు.

తుపానులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తుపానును సూచించే చిత్రం (ఫైల్ ఫోటో)

పెను తుపానుల వల్ల అనేక విపత్తులు ఎదురవుతాయి. బలమైన గాలుల కారణంగా భౌతిక నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే సముద్రంలో అలల పోటు తీవ్రంగా ఉంటుంది ఈ రెండింటితో పాటు భారీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తాయి.

సాధారణంగా బంగాళాఖాతంలోనూ, అరేబియా సముద్రంలో తరచూ తుపానులు వచ్చినా ప్రతి పదేళ్లకు ఒకసారి మాత్రమే ఈ స్థాయి తుపానులు విరుచుకుపడుతుంటాయి.

1970 నవంబర్లో వచ్చిన సైక్లోన్ భోలా ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైన తుపానుల్లో ఒకటి. బంగాళాఖాతంలో సంభవించిన ఈ తుపాను కారణంగా సుమారు 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుపాను సమయంలో తీర ప్రాంతంలో అలలు సుమారు 34 అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి.

సైక్లోన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, తుపాను తీవ్రతను తెలిపే దృశ్యం (ఫైల్‌ ఫోటో)

గడిచిన కొన్ని దశాబ్దాలుగా బంగాళాఖాతంలో సంభవించే తుపానుల తీవ్రత పెరుగుతూ వస్తోందని హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ అమృత్ అన్నారు.

2008 మే నెలలో బర్మా తీరంలో సంభవించిన ‘నర్గిస్’ తుపాను కారణంగా సుమారు లక్షా 40 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

"ఓ సిరాతో వేసిన వర్ణ చిత్రంపై ఒక్కసారిగా బకెట్‌తో నీళ్లు గుమ్మరించినట్టయ్యింది. ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించిన గీతలన్నీ (డెల్టా కాల్వలు) పూర్తిగా చెరిగిపోయాయి. కిందనున్న పేపర్ మొత్తం నలిగిపోయినట్టయిపోయింది" అంటూ ఓ పాత్రికేయుడు నాటి బీభత్సం గురించి వర్ణించారు.

కాకినాడ, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Nayana Majumdar

ఫొటో క్యాప్షన్, కోల్‌కతా నగరంపై కారు మబ్బులు (ఫైల్ ఫోటో )

చివరిసారిగా 1999లో సూపర్ సైక్లోన్ భారత్‌లో ఒడిశా రాష్ట్రాన్ని తాకింది. ఆ తుపాను ధాటికి సుమారు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా కుళ్లిన శవాలు, శ్మశానాల్లో ఆకాశాన్ని అంటుతున్న పొగ.. అప్పట్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించిన నాకు కనిపించిన దృశ్యాలవి. నాటి భయానక పరిస్థితి ఇప్పటికి నాకు గుర్తుంది. ఓ సూపర్ సైక్లోన్ ధాటికి పరిస్థితులు ఎంత దారుణంగా తయారవుతాయో మొదటిసారిగా నాకు అప్పుడే తెలిసింది.

(ఈ కథనం మే 20, 2020న బీబీసీ తెలుగులో తొలిసారి ప్రచురితమైంది.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)