డోనల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్ భేటీ: ట్రేడ్ వార్‌లో తలపడుతున్న ఈ ఇద్దరు నేతల్లో ముందుగా తలవంచేది ఎవరు?

డోనల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images / BBC

    • రచయిత, బెన్నీ లూ & గ్లోబల్ జర్నలిజం టీమ్
    • హోదా, బీబీసీ చైనీస్ సర్వీస్ & బీబీసీ వరల్డ్ సర్వీస్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మక సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

డోనల్డ్ట్రంప్, షీ జిన్‌పింగ్ అక్టోబర్ 30న దక్షిణ కొరియాలో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (ఏపీఈసీ) సదస్సు సందర్భంగా భేటి కానున్న విషయాన్ని వైట్ హౌస్ ధృవీకరించింది.

ఈ సమావేశం చాలా కాలంకిందటే జరగాల్సి ఉండగా, ఇటీవల ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రం కావడంతో, ఇది రద్దయ్యే పరిస్థితి కనిపించింది.

ఈ నెల మొదట్లో, జాతీయ భద్రతను కారణంగా చూపిస్తూ "రేర్ ఎర్త్స్"(అరుదైన ఖనిజాలు) ఎగుమతిపై కొత్త ఆంక్షలను చైనా ప్రకటించింది.

రేర్ ఎర్త్స్ ఖనిజాలపై చైనాకు దాదాపు గుత్తాధిపత్యం ఉంది. ఇవి అనేక హైటెక్ ఉత్పత్తులు తయారీలో కీలకమైనవి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రేర్ ఎర్త్స్ విషయంలో చైనా నిర్ణయానికి ప్రతిస్పందనగా, నవంబర్ నుంచి అన్ని చైనా వస్తువులపై సుంకాన్ని 100 శాతానికి పెంచనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

ఆ తరువాత, రెండు దేశాలు కాస్త వెనక్కుతగ్గి, చర్చలకు అవకాశం కల్పించాయి.

అయితే, మార్కెట్లో ఉద్రిక్తతను పెంచుతూ, అస్థిరతను సృష్టిస్తున్నాయని ఇప్పటికీ ఇరుదేశాలు ఒకదానినొకటి నిందించుకుంటున్నాయి.

సుంకాల నుంచి రేర్ ఎర్త్స్ వరకు "ప్రతి విషయంలోనూ డీల్" చేసుకుంటానని ట్రంప్ అన్నారు. అయితే ఆయన చైనా సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసినట్టున్నారు. ఎందుకంటే ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ యుద్ధానికి చైనా ఇప్పటివరకు కఠినమైన ప్రతిస్పందనే ఇస్తోంది.

"రెండు దేశాలూ ఆర్ధిక వ్యవస్థలను పణంగా పెట్టి గేమ్ ఆడుతున్నాయి" అని అమెరికా థింక్ ట్యాంక్ అట్లాంటిక్ కౌన్సిల్‌లో చైనా వ్యవహరాల నిపుణులు వెన్-టి సంగ్ అన్నారు.

"ఇరుదేశాలు కూడా తామే ఎక్కువ ఒత్తిడిని తట్టుకోగలమని నమ్ముతున్నాయి. బహుశా ఇది చర్చా ప్రక్రియలో భాగం కావచ్చు" అని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ చోంగ్ జా ఈన్ అన్నారు.

ట్రంప్ వ్యూహం ఒకరకంగా ఆయన ఆధిపత్యానికి పరీక్ష" అని సంగ్ అంటున్నారు. ‘‘చైనా ఒత్తిడికి తలవంచితే, అది రాబోయే నెలల్లో అమెరికా–చైనా సంబంధాల దిశను నిర్ణయించవచ్చు’’ అని ఆయన అన్నారు.

అయితే, చైనా తలవంచే అవకాశం చాలా తక్కువ అని సంగ్ పేర్కొన్నారు.

"చైనాలో షీ జిన్‌పింగ్ వరుసగా 13వ ఏడాది అధికారంలో ఉన్నారు. తనను తాను నిరూపించుకోవడానికి ట్రంప్‌తో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం అవసరం లేదు" అని ఆయన అంటున్నారు.

రేర్ ఎర్త్స్‌తో పాటు, అమెరికా సోయాబీన్ రంగాన్ని కూడా చైనా లక్ష్యంగా చేసుకుంది. అమెరికా రైతులు ట్రంప్‌కు ప్రధాన మద్దతుదారులలో ఒకవర్గం కావడంతో ఇది పెద్ద దెబ్బగా పరిగణిస్తున్నారు.

నవంబర్ 2018 తర్వాత సెప్టెంబర్‌లో, మొదటిసారిగా చైనాకు అమెరికా సోయాబీన్ ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. బ్రెజిల్, అర్జెంటీనా నుంచి చైనా దిగుమతులు పెరిగాయి.

ప్రపంచంలోనే అత్యధికంగా సోయాబీన్‌లను దిగుమతి చేసుకునే దేశం చైనా. ప్రధానంగా పశువుల మేత కోసం సోయాబీన్‌ను ఉపయోగిస్తుంది.

క్యాపిటల్ ఎకనామిక్స్‌ అనే విశ్లేషణ సంస్థలో చైనా ఆర్ధిక వ్యవహారాల విభాగం అధిపతి జూలియన్ ఎవాన్స్-ప్రిట్‌చర్డ్ దీనిపై స్పందించారు.

‘‘అమెరికా సుంకాలు విధించినప్పటికీ, చైనా ఎగుమతులు ఊహించిన దానికంటే బలంగా ఉన్నాయి. అయితే, అవి సెప్టెంబర్‌లో జీడీపీలో 0.3 శాతం క్షీణతకు కారణమయ్యాయి" అని రాశారు.

రేర్ ఎర్త్స్, చైనా, అమెరికా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, చైనా, అమెరికా మధ్య వివాదంలో రేర్ ఎర్త్స్ అంశం ప్రధాన సమస్యగా ఉంది.

అమెరికా ప్రతీకార చర్యలను చైనా తట్టుకోగలదా?

అమెరికాతో వాణిజ్య యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే, చైనా ఆర్థికంగా బలహీనపడే అవకాశం ఉంది.

ఎందుకంటే అమెరికా దిగుమతిదారులు ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను, సప్లై చైన్‌లను వెతుక్కుంటారు.

ఉదాహరణకు, ఈ ఏడాది మొదట్లో ఆపిల్ కంపెనీ అమెరికాలో విక్రయించే ఐఫోన్ల ఉత్పత్తిలో ఎక్కువ భాగాన్ని చైనా నుంచి భారత్‌కు తరలిస్తామని తెలిపింది.

అలాగే జూన్‌లో, నైకీ కంపెనీ తన ప్రొడక్షన్ సెంటర్లలలో కొన్నింటిని చైనా నుంచి తరలించాలని కూడా ప్రణాళిక వేసింది.

‘‘అమెరికా సుంకాలకు చైనా శాశ్వత మందును కనిపెట్టిందనుకోవడం సరికాదు.ఎందుకంటే చైనా కరెన్సీ అమెరికా డాలర్ కాక, మరికొన్ని కరెన్సీలతో పోలిస్తే బలహీనపడింది. అందుకే చైనా ఎగుమతుల కోసం పోటీ పడుతోంది’’ అని ఎవాన్స్-ప్రిట్‌చర్డ్ అన్నారు.

దేశీయ వినియోగాన్ని పెంచడానికి, రియల్ ఎస్టేట్ సంక్షోభం నుంచి బయటపడటానికి చైనా ఇంకా కష్టపడుతోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ఎగుమతులే కీలకంగా మారాయి.

సోయాబీన్, దిగుమతి, బ్రెజిల్, అర్జెంటీనా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, చైనా సోయాబీన్ దిగుమతుల కోసం ఇప్పుడు బ్రెజిల్, అర్జెంటీనా వైపు మొగ్గు చూపుతోంది.

ట్రంప్‌ను అంచనా వేయడంలో చైనా కూడా ఎక్కడో ఒకచోట పొరపాటు చేయవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు.

అమెరికా సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేసే ప్రమాదకరమైన అలవాటును చైనాకు ఉందని అమెరికా థింక్ ట్యాంక్ స్టిమ్సన్‌ సెంటర్‌కు చెందిన సన్ యున్ పేర్కొన్నారు.

"అమెరికా త్వరలో చైనా టెక్నాలజీ రంగాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త వాణిజ్య ఆంక్షలు విధించే అవకాశం ఉంది" అని ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ట్రేడ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నాయిస్ మెక్‌డొనాగ్ అన్నారు.

అత్యంత అధునాతన ఎన్‌వీడియా చిప్‌లను కొనుగోలు చేయకుండా చైనాను అమెరికా ఇప్పటికే కట్టడిచేసిందని మెక్‌డొనాగ్ ఉదహరించారు.

‘‘అయితే, చైనా టెక్నాలజీ రంగాన్ని అమెరికా టార్గెట్‌గా చేసుకోవడంవల్ల చైనా వృద్ధి మందగించవచ్చు. కానీ దాన్ని పూర్తిగా ఆపడం సాధ్యం కాదు" అని ప్రొఫెసర్ మెక్‌డొనాగ్ అంటున్నారు.

ముందుగా తలవంచేదెవరు?

మార్కెట్ స్పందిస్తున్న తీరును చూసి ట్రంప్ తన వైఖరిని మార్చుకోవాల్సి వచ్చిందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

అక్టోబర్ 10న చైనా రేర్ ఎర్త్స్‌ ప్రకటనకు ట్రంప్ ఘాటుగా స్పందించడంతో, అమెరికా స్టాక్ మార్కెట్‌కు 2 ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయింది.

చైనా విధానాలు మార్కెట్ సెంటిమెంట్‌కు చాలా అరుదుగా ప్రభావితమవుతుండగా, నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ చైనాలో కేంద్రీకృతంగా ఉంది. ఇటీవలి దశాబ్దాలలో అత్యంత శక్తివంతమైన చైనా నాయకుడిగా షీ జిన్‌పింగ్‌ను పరిగణిస్తున్నారు.

చైనాలో ప్రభుత్వరంగ సంస్థలపై పాలక కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం గట్టిపట్టుతో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఆ సంస్థలు నడుచుకుంటాయి.

ట్రంప్‌ రెండో పదవీ కాలపు విధానాలను ఎదుర్కోవడానికి చైనా పూర్తిగా సిద్ధమైందని, ట్రంప్‌ శైలి, వ్యూహాలను, సుంకాలు, టెక్నాలజీ యుద్ధం, కోవిడ్-19 సమయంలో తీసుకున్న చర్యలను గమనించి, దీర్ఘకాలిక వ్యూహంగా "హార్డ్ గేమ్" ఆడుతోంది అని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

‘‘చైనా ఇప్పుడు స్టూడెంట్ దశ నుంచి ప్రొఫెసర్ దశకు మారింది’’ అని అమెరికన్ థింక్ ట్యాంక్ బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో సీనియర్ పరిశోధకుడు ర్యాన్ హాస్ పేర్కొన్నారు.

"షీ జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా ఆచితూచి స్పందించే విధానం నుంచి ముందుగానే దాడికి దిగే దూకుడు వ్యూహానికి మారింది’’ అని ఆయన అన్నారు.

ఈ మార్పు పెరుగుతున్న చైనా శక్తిని సూచిస్తుంది. ట్రంప్ మొదటి పదవీకాలంలో ప్రారంభమైన అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం జిన్‌పింగ్ ‘ఆత్మనిర్భర చైనా’’ ఎజెండాకు మరింత ఆజ్యం పోసింది.

ట్రంప్ అహంకారాన్ని, బలహీనతలను చైనా నాయకులు పసిగట్టారని అమెరికా థింక్ ట్యాంక్ పసిఫిక్ ఫోరమ్ ప్రొఫెసర్ ఎలిజబెత్ లారస్ అన్నారు.

" తన సహనాన్ని పరీక్షించనంత వరకు శక్తివంతమైన నాయకులతో డోనల్డ్ ట్రంప్ బాగానే ఉంటారు. పరీక్షించడానికి ప్రయత్నిస్తే ప్రతిదాడి చేస్తారు. కాబట్టి చైనా నాయకులు ట్రంప్ స్వభావం పట్ల జాగ్రత్తగా ఉండాలి" అని లారెస్ సూచించారు.

‘‘అకస్మాత్తు నిర్ణయాలు తీసుకునే ట్రంప్ ధోరణి పట్ల, వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్, రైట్ వింగ్ కార్యకర్త లారా లూమర్ వంటి ట్రంప్ సలహాదారుల ప్రభావం పట్ల కూడా చైనా జాగ్రత్తగా ఉండాలి" అని లారస్ అన్నారు.

ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో ట్రంప్, జిన్ పింగ్ మధ్య రాజీ కుదిరే అవకాశం ఉంది. అయితే ఇరుదేశాలు తమ ప్రాథమిక అభిప్రాయభేదాలను త్వరగా పరిష్కరించుకునే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)