మధ్యప్రదేశ్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను అనుచితంగా తాకి లైంగిక వేధింపులు, నిందితుడు అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ఆడేందుకు వచ్చిన ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు వెలుగులోకి వచ్చింది.
ఆస్ట్రేలియా జట్టు భద్రత అధికారి డానీ సిమన్స్ ఫిర్యాదు మేరకు ఇందోర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 74 (మహిళ గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం లేదా నేరపూరిత బలప్రయోగం చేయడం), 78 (మహిళలను వెంబడించడం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం ఇందోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మ్యాచ్ ఉంది. దీంతో రెండు జట్ల క్రికెటర్లు ఇందోర్ వచ్చారు.
"ఇందోర్‌కు చెందిన అకీల్ అహ్మద్ బైక్‌పై వెళ్తూ ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను అనుచితంగా తాకారు, వేధించారు, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై కేసు నమోదైంది. ఐదు పోలీస్ స్టేషన్ల బృందం సంయుక్తంగా గాలింపు చేపట్టింది. నిందితులను అరెస్టు చేశాం" అని ఇండోర్ అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (క్రైమ్) రాజేష్ దండోటియా బీబీసీతో చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
పోలీసులు ఇంకా ఏం చెప్పారు?
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం, గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు ఇందోర్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న ఖజరానా రోడ్డులోని ఒక కేఫ్‌కు నడుచుకుంటూ వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.
"మహిళా క్రికెటర్లు నడుచుకుంటూ వెళుతుండగా, బైక్‌పై వచ్చిన ఒకరు వారిని వెంబడిస్తూ, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. భయపడిన మహిళాక్రికెటర్లు వెంటనే హోటల్‌కు తిరిగి వచ్చి జట్టు యాజమాన్యానికి విషయం చెప్పారు. అనంతరం, ఆస్ట్రేలియా జట్టు భద్రత అధికారులు పోలీసులకు సమాచారం అందించారు" అని ఇందోర్ పోలీస్ అధికారి బీబీసీతో చెప్పారు.
"సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో నిందితుడు మోటార్ సైకిల్‌పై క్రీడాకారిణులను వెంబడిస్తున్నట్లు కనిపించింది. దీంతో, నిందితుడిని అరెస్టు చేశాం" అని రాజేష్ దండోటియా చెప్పారు.
సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ జరుగుతోంది. ఈ టోర్నీ నవంబర్ 2న ముగుస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














