భారతీయ జెన్ జడ్ ఆలోచనలు ఎలా ఉన్నాయి?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, సౌతిక్ బిస్వాస్, ఆంత్రిక్ష పఠానియా
- హోదా, బీబీసీ న్యూస్
భారతదేశంలో జెన్ జడ్ తరం చాలా పెద్దది. దేశంలో 25 ఏళ్లలోపు యువత 37 కోట్ల మందికి పైగా ఉన్నారు. అంటే దేశ జనాభాలో దాదాపు పావు వంతు. నిరంతరం ఇంటర్‌నెట్‌తో అనుసంధానమైన తరమిది. మొబైల్‌ఫోన్లు, సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది.
రాజకీయాలు, అవినీతి, అసమానతలు వంటి విషయాలపై స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలు యువతను నిరంతరం అప్రమత్తంగా ఉంచుతున్నాయి. కానీ వీధుల్లోకి వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలంటే వారిలో భయం, అనుమానాలు వేళ్లూనుకుని ఉన్నాయి.
ఎక్కడ తమను ‘దేశద్రోహి’గా ముద్ర వేస్తారనే భయంతోపాటు, ప్రాంతీయ, కుల భేదాలు, ఆర్థిక ఒత్తిళ్లతోపాటు మన ప్రయత్నం వల్ల ఏమి మారదనే నిరాశ వారిని వెనకడుగేసేలా చేస్తున్నాయి.
ఇతర ఆసియా, ఆఫ్రికా దేశాలలో ఈ జెన్ జడ్ యువత (1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు) ఇటీవల కాలంలో మౌనంగా లేదు. వివిధ సమస్యలపై తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తోంది.

కిందటి నెలలో నేపాల్‌లో యువ నిరసనకారులు కేవలం 48 గంటల్లోనే ప్రభుత్వాన్ని గద్దె దించారు.
మడగాస్కర్‌లో యువత చేసిన ఉద్యమం ఆ దేశ నాయకుడిని దించేసింది.
ఇండోనేషియాలో, ఉద్యోగాలు లభించకపోవడం, పెరుగుతున్న జీవన వ్యయం, అవినీతి, అసమానతలపై విసిగిపోయిన యువత ఉద్యమానికి దిగి ప్రభుత్వం నుంచి కొన్ని మినహాయింపులు పొందగలిగింది.
కిందటేడాది బంగ్లాదేశ్‌లో ఉద్యోగ కోటా, అవినీతిపై యువత ఆగ్రహం అక్కడి ప్రభుత్వాన్నే మార్చేసింది. ఈ ఉద్యమాలు సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి.
భారతదేశంలో కూడా కొంత అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. సెప్టెంబరులో, వివాదాస్పద హిమాలయ ప్రాంతమైన లద్దాఖ్ కూడా రాష్ట్ర హోదా కోరుతున్న ఆందోళనాకారులకు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలను చవిచూసింది. ఈ అశాంతిని "జెన్ జడ్ ఆగ్రహం, చాలా కాలంగా అణచిపెట్టుకున్న కోపానికి సంకేతంగా" సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అభివర్ణించారు.
ఈ భావం జాతీయ రాజకీయాల్లో కూడా కనిపించింది. కర్ణాటక ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బహిరంగంగా ఆరోపించిన తరువాత ‘జెన్ జడ్ యువత ఓట్ల అవకతవకలను అరికట్టి , రాజ్యాంగాన్ని రక్షిస్తుంది" అని ఎక్స్‌లో రాశారు.
నేపాల్‌లో జరిగిన ఉద్యమం కారణంగా దిల్లీలోనూ అప్రమత్తత పెరిగింది. ఇక్కడ యువత ఆందోళనకు దిగే అవకాశం ఉండొచ్చంటూ,తగిన విధంగా సిద్ధం కావాలని దిల్లీ పోలీసు చీఫ్ పదేపదే తన బలగాలను ఆదేశించినట్టు తెలిసింది.
ఆన్‌లైన్ ప్రపంచంలో మాత్రం వీటిపై చర్చలు ఉధృతంగా సాగుతున్నాయి. కొంతమంది భారతీయ యువత ఇలాంటి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తుండగా, మరికొందరు నేపాల్‌లో జరిగిన హింసను చూపుతూ , నాయకులు లేకుండా జరిగే తిరుగుబాట్లను ప్రోత్సహించకూడదని హెచ్చరిస్తున్నారు. ‘బూమ్‌లైవ్’ అనే నిజనిర్థరణ సంస్థ జెన్ జడ్ వర్గంలోనే ఈ అంశంపై తీవ్రమైన విభేదాలు ఉన్నాయని, ఒకవర్గం ఈ నిరసనలను న్యాయమైనవి, సముచితమైనవిగా చూస్తుంటే, మరొకవర్గం విదేశీ ప్రభావంగా భావిస్తూ ‘ఆన్‌లైన్ యుద్ధం’ చేస్తున్నారని తెలిపింది.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
70వ దశకం మధ్యలో ఇందిరా గాంధీ వ్యతిరేక నిరసనల నుంచి ఇటీవలి క్యాంపస్ ఉద్యమాల వరకు, భారతదేశ విద్యార్థి ఉద్యమం అందరి దృష్టిని ఆకర్షించింది. అయినప్పటికీ నేపాల్ లేదా బంగ్లాదేశ్‌లోలాగా కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయికి భారత యువత చేరుతుందని నిపుణులు నమ్మడం లేదు.
దీనికి కారణం ఏంటంటే, భారతదేశ జెన్ జడ్ ముక్కలుగా విడిపోయింది. నిరుద్యోగం, అసమానతల వంటి అంశాలపై అసంతృప్తి ఉన్నప్పటికీ వారి ఆగ్రహం ఎక్కువగా స్థానిక సమస్యల చుట్టూ తిరుగుతోంది. అందువల్ల దేశవ్యాప్తంగా ఒకేగళం వినిపించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
"మమ్మల్ని ఏకం చేసే ఏ ఒక్క శక్తీ నాకు కనిపించడం లేదు" అని బిహార్‌కు చెందిన జర్నలిస్ట్ 26 ఏళ్ల విపుల్ కుమార్ అన్నారు.
"నేపాల్‌తో పోల్చితే భారతదేశంలో అధికార వికేంద్రీకరణ విస్తృతంగా ఉంది. అలాగే యువత ఆగ్రహం కూడా విభిన్నదశల్లో విస్తరించింది. కేంద్రప్రభుత్వాన్ని నిలదీయాలని నేను కోరుకుంటున్నా, కానీ చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కోరుకుంటున్నారు" అని విపుల్ అన్నారు.
జెన్ జడ్ విప్లవం విషయంలో భారత్ ప్రత్యేకంగా ఉండటానికి ఇదొక కారణమంటారు సెంటర్ ఫర్ యూత్ పాలసీకి చెందిన సుధాంశు కౌశిక్.
"వయస్సు ఒక్కటే తేడా కాదు. భారతదేశం యువత ప్రాంతం, భాష, కుల గుర్తింపులతో బలంగా ముడిపడి ఉన్నారు, ఇవి చాలాసార్లు వారిని పరస్పర విరోధులుగా నిలుపుతాయి’’ అన్నారు.
"భారతదేశంలో జెన్ జడ్ ఉద్యమం జరిగితే అది ఏ వర్గపు యువతది అవుతుంది? అది దళిత జెన్ జడ్, నగర లేదా తమిళ యువత ఉద్యమమా? నిజం ఏమిటంటే భారతదేశంలో జెన్ జడ్ యువత చాలా భిన్నంగా ఉంది. వారి ఆసక్తులు, ఆందోళనలు ఒక్కటి కావు’’ అంటారు యువ సామాజికకార్యకర్త, భారతీయ యువతపై పుస్తకం రాసిన కౌశిక్.
ఇంకా సులభంగా చెప్పాలంటే, పట్టణ యువత ఉద్యోగావకాశాలు, నగర మౌలిక సదుపాయాలు వంటి సమస్యల చుట్టూ కేంద్రీకృతమవుతుంటే, దళిత యువత కులవివక్ష, సామాజిక న్యాయం వంటి అంశాలపై పోరాడుతోంది. తమిళ యువత భాష, ప్రాంతీయ హక్కులు, స్థానిక సంప్రదాయాల పరిరక్షణను ప్రాధాన్యంగా చూస్తోంది.
అలాగే ఉద్యమాలకు కారణాలు కూడా రాష్ట్రానికోవిధంగా ఉన్నాయి. గుజరాత్, హరియాణాలో సామాజికంగా, ఆర్థికంగా బలమైన వర్గాలకు చెందిన యువత రిజర్వేషన్ల పెంపుకోసం రోడ్లపైకి వచ్చింది. తమిళనాడులో మాత్రం జల్లికట్టుపై కోర్టు నిషేధానికి వ్యతిరేకంగా యువత భారీ ఎత్తున నిరసనకు దిగింది.

ఫొటో సోర్స్, Getty Images
యువతలో ఉన్న విభజనలపై మరో భయం కూడా పేరుకుపోయి ఉంది. అదే ‘‘దేశద్రోహి’’గా ముద్రవేస్తారనే భయమంటారు 23 ఏళ్ల పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్ ధైర్య చౌదరి అన్నారు. ఈ భయం వల్లే చైతన్యవంతమైన యువత కూడా వీధుల్లోకి రావడానికి భయపడుతోందంటారు ఆయన.
కొంత మంది రాజకీయ నేతలు, టీవీ యాంకర్లు ఈ ముద్రను వాడి నిరసనలను ఆపడానికి ప్రయత్నిస్తారని చెప్పారు.
ఒకప్పుడు రాజకీయ చర్చలకు కేంద్రాలుగా ఉన్న దేశంలోని కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు నిరసనలపై నియంత్రణ లేదా పరిమితులు విధిస్తున్నాయి. " ఈ విద్యాసంస్థలు ఒకప్పుడు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉండేవి. ఇప్పడా స్ఫూర్తిని కోల్పోయాయి" అని 23 ఏళ్ల పరిశోధకురాలు హజారా నజీబ్ అన్నారు.
యువశక్తిని,ఉత్సాహాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి ప్రాధాన్యం ఇచ్చే విధానాలను చేపడుతూ, వారి శక్తిని పథకాలు, కార్యక్రమాల ద్వారా సరైన మార్గంలో పెట్టాలని కోరుతున్నట్లు పేర్కొంది. అయితే, ఆర్థికపరమైన ఒత్తిళ్లు యువత నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి.
"ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే భారతదేశం సాధారణంగా ప్రపంచం కంటే కొంచెం మెరుగ్గా ఉంది. కానీ, నిరుద్యోగ భయం పెరుగుతూనే ఉంది. యువత తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు. ఏటికేడాది విదేశాలకు వలసలు పెరుగుతున్నాయి" అని చెప్పారు కౌశిక్.
అంతేకాదు, భారతదేశ యువతలో ఓటు వేయాలనే ఉత్సాహం కూడా తగ్గుతోంది. 2024 ఎన్నికలలో 18 ఏళ్ల యువకులలో కేవలం 38% మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. సిటిజన్ మీడియా ప్లాట్‌ఫామ్ నిర్వహించిన కొత్త సర్వేలో సాంప్రదాయ రాజకీయాలపై యువతరానికి నమ్మకం క్షీణిస్తోందని తేలింది. 29% యువత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటోందని తెలిపింది.
ఇటీవలి దశాబ్దాలలో, చాలా మంది యువ భారతీయులు మత, సాంస్కృతిక, భాషాపరమైన గుర్తింపు ద్వారా తమను తాము ఎక్కువగా నిర్వచించుకుంటున్నారని కౌశిక్ పేర్కొన్నారు.
ఎన్నికల అనంతరం సీఎస్‌డీఎస్-లోక్ నీతి నిర్వహించిన సర్వేలో అధికార హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ బలమైన యువత మద్దతును నిలుపుకుందని, 2019లో 40% యువత మద్దతు పొందిన ఆ పార్టీ , 2024లో స్వల్ప తగ్గుదలను మాత్రమే చూసిందని పేర్కొంది.
అయినా భారతీయ జన్ జడ్ యువత రాజకీయ అవగాహన వేర్లు, వారు టీనేజర్లుగా ఉన్నప్పుడు చూసిన గత దశాబ్దపు ఉద్యమాలలోనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
అన్నా హజారే అవినీతి వ్యతిరేక నిరసనల నుంచి 2012 దిల్లీలో సామూహిక అత్యాచారానికి నిరసనగా జరిగిన భారీ ఉద్యమాలను, ప్రదర్శనలను అప్పట్లో కౌమారదశలో ఉన్న ఈ యువత ప్రత్యక్షంగా చూసింది.

ఫొటో సోర్స్, Getty Images
తరువాత, 2019లో కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు, సాగు చట్టాల సంస్కరణలు, వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిరసనగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలలో పాల్గొన్నారు. ముఖ్యంగా సీఏఏ నిరసనలు ఎక్కువభాగం జెన్ జడ్ నేతృత్వంలోనే సాగాయి.
2019లో దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో జరిగిన ఆందోళనలపై పోలీసుల దాడి తరువాత హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలీద్‌ను అరెస్టు చేసి ఐదేళ్లుగా జైలులోనే ఉంచారు. 2019 దిల్లీ అల్లర్లలో "కీలక కుట్రదారు"గా ఆయనపై ఆరోపణలున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండిస్తున్నారు.
" ప్రభుత్వం నిరసన అనే భావనను చాలా తప్పుగా చిత్రీకరించడం మొదలుపెట్టింది... అందుకే నిరసన తెలియజేయాలని కొద్దిమంది మాత్రమే ఆలోచిస్తారు" అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న 26 ఏళ్ల యువకుడు జతిన్ ఝా అన్నారు.
ప్రభుత్వం మాత్రం తన చర్యలు శాంతిభద్రత పరిరక్షణ కోసమే అని చెబుతోంది. నిరసనలను బయటి శక్తులు లేదా "జాతి వ్యతిరేక" శక్తుల ప్రభావంతో జరిగినవిగా చూపే ప్రయత్నం కూడా చేసింది.
నిరసనల్లో యువత ఎక్కువగా పాల్గొనకపోవడం సహజం అని సామాజిక శాస్త్రవేత్త దీపాంకర్ గుప్తా అన్నారు. యువత శక్తి స్వల్పకాలికం, ప్రతి తరం తమదైన కారణాలతోనే ఉద్యమిస్తుంది. పాతతరం పోరాటాలను వారసత్వంగా కొనసాగించదు . ఇటీవల చరిత్ర కూడా అదే చెబుతోంది. యువత ప్రభుత్వాలను కూల్చగలిగినా, దీర్ఘకాలిక మార్పు లేదా . వారి జీవితాల్లో గణనీయమైన అభివృద్ధి మాత్రం ఎప్పుడూ సాధ్యపడదు.
ప్రస్తుతానికి, భారతదేశ జెన్ జడ్ తరం తిరుగుబాటుదారులుగా కాకుండా జాగ్రత్తగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. వారి అసమ్మతి మృదువుగా ఉంది, కానీ వారి లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














