సెప్టెంబర్ 9: ఆరోజు రాత్రి నేపాల్‌లో ఏం జరిగింది, సంక్షోభం ఇంకా ముగియలేదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీష్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి నేపాల్‌లో పుకార్లు చక్కర్లు కొట్టడం మొదలైంది. జర్నలిస్టుల ఫోన్లు ఆగకుండా మోగుతూనే ఉన్నాయి. నేపాల్‌లో రాచరికం తిరిగి రానుందనే ఊహాగానాలు రేగాయి.
సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ జరుగుతోంది.
నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ రాజీనామా చేశారని ఇండియన్ మీడియాలోనూ బ్రేకింగ్ న్యూస్‌లు వచ్చాయి.
కాఠ్‌మాండూలోని ప్రభుత్వ సంస్థలను తగలబెట్టినప్పుడు నేపాల్ మరోసారి రాచరికం వైపు పయనిస్తున్నట్లు అనిపించిందని జర్నలిస్ట్ కిషోర్ నేపాల్ చెప్పారు.
ఆ రోజు పౌడెల్‌ను అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఆర్మీ చీఫ్ కోరారని కిషోర్ నేపాల్ పేర్కొన్నారు. అయితే, అధ్యక్షుడు, సైన్యాధిపతి కలిసి పరిస్థితిని చక్కదిద్దారని మరికొంతమంది నిపుణులు చెబుతున్నారు.
"కాఠ్‌మాండూలోని రాజభవనం నారాయణ హిటీలోకి జ్ఞానేంద్ర తిరిగి వస్తారని చర్చ జరిగింది. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని సైన్యం రామచంద్ర పౌడెల్‌ను కోరింది. అయితే ఆయన తెలివిగా వ్యవహరించారు" అని కిషోర్ నేపాల్ అంటున్నారు.
"మీరు రాజీనామా చేయండి, మిగతాది మేం చూసుకుంటామని ఆర్మీ చీఫ్ అధ్యక్షుడితో అన్నారు. అందుకు అధ్యక్షుడు ఇలా అన్నారు. నేను రాజీనామా చేయను. మీరు నన్ను చంపి, జెన్ జడ్ నిరసనకారులపై హత్య కేసు పెట్టినా కూడా. ఆ తర్వాత మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి."
అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ మధ్య జరిగిన సంభాషణ గురించి కిషోర్ నేపాల్‌కు ఎలా తెలిసింది?
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "నాకు ఎవరు చెప్పారో వివరాలు వెల్లడించను. కానీ, ప్రధాన మంత్రి ఓలీ కూడా ఆర్మీ చీఫ్ ఆదేశాలతోనే రాజీనామా చేశారని, అధ్యక్షుడికి కూడా అలాంటి ఒత్తిడి ఎదురైందని నాకు తెలుసు. అధ్యక్షుడు రాజీనామాకు అంగీకరించి ఉంటే, నేపాల్ సైనిక పాలన లేదా రాచరికం వైపు వెళ్లేది. అధ్యక్షుడు నిజంగానే ధైర్యంగా వ్యవహరించారు" అని ఆయన చెప్పారు.
అయితే, నేపార్ ఆర్మీ రిటైర్డ్ మేజర్ జనరల్ బినోజ్ బాస్నెత్ కిషోర్ నేపాల్ వ్యాఖ్యలతో విబేధిస్తున్నారు.
"ఆర్మీ చీఫ్, అధ్యక్షుడు కలిసి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొన్నారని నేను అనుకుంటున్నా. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు సైన్యం ముందుకు రావాల్సి ఉంటుంది" అని బాస్నెత్ చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
'సంక్షోభం ఇంకా ముగియలేదు'
కనక్ మణి దీక్షిత్ నేపాల్‌లో ప్రముఖ జర్నలిస్ట్. ఆయనకు ప్రభుత్వంతో మంచి సంబంధాలున్నాయి. నేపాల్‌లో మళ్లీ రాచరికం రావడం గురించి ఆయన అనేక సందేహాలు వ్యక్తం చేశారు.
"ప్రజాస్వామ్య మూలస్తంభాలన్నీ కాలిపోయాయి. ఆందోళనకారులెవరూ రాయల్ ప్యాలెస్ నారాయణ్ హిటీని కనీసం ముట్టుకోలేదు. జ్ఞానేంద్ర నివాసం కూడా సురక్షితంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య రాచరికం మళ్లీ వస్తుందని మనసు ఆందోళన చెందుతోంది. అధ్యక్షుడి పాత్ర కూడా కీలకమైనదని నేను నమ్ముతున్నా" అని దీక్షిత్ బీబీసీతో చెప్పారు.
ఇప్పుడు జరిగినదంతా తీవ్ర సంక్షోభం నుంచి బయటపడడానికే జరిగిందనేది కిషోర్ నేపాల్ అభిప్రాయం.
అయితే, దీనర్థం నేపాల్ సంక్షోభం నుంచి బయటపడిందని కాదు.
"అప్పుడు రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి అధ్యక్షుడితో సైన్యం ఏకీభవించాలి లేదా సైన్యంతో అధ్యక్షుడు ఏకీభవించాలి" అని ఆయన అన్నారు.
ఉద్యమం అనంతరం, అధ్యక్షుడి పాత్రను నేపాల్ రాజకీయ విశ్లేషకులు సీకే లాల్ కూడా ప్రశంసించారు.
"అధ్యక్షుడు చాలా ఒత్తిడిలో ఉన్నారు. పార్లమెంట్‌ను రద్దు చేయాలని ఆయన కోరుకోలేదు. అందుకే ఆయన స్వయంగా అలా చేయలేదు. తాత్కాలిక ప్రధాన మంత్రి సిఫార్సు తర్వాత అలా చేశారు. పార్లమెంట్‌ను రద్దు చేశారనే నింద మోయడానికి పౌడెల్ ఇష్టపడలేదు. ఆయన ఎన్నికలను ప్రకటించారు. అయినప్పటికీ, ఆయన అనుకున్నట్లు జరగలేదని నా అభిప్రాయం" అని లాల్ అన్నారు.
సెప్టెంబర్ 8, 9న జరిగిన ఉద్యమంలో జెన్ జడ్ వర్గానికి రక్షా బమ్ నాయకత్వం వహించారు.
సెప్టెంబర్ 9 రాత్రి ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్‌తో చర్చలు జరిపిన జెన్ జడ్ ప్రతినిధుల్లో రక్షా బమ్ కూడా ఉన్నారు.
"ఆర్మీ చీఫ్‌ను కలిసేందుకు జెన్ జడ్ తరపున 10 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. వారిలో నేను కూడా ఉన్నాను. మనం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి దాని గురించి మీతో మాట్లాడేదేమీ లేదని, అధ్యక్షుడితోనే మాట్లాడతానని స్పష్టంగా చెప్పాను. మీ డిమాండ్లేంటో నాకు చెప్పండి. నేను వాటిని అధ్యక్షుడికి వివరిస్తానని ఆర్మీ చీఫ్ అన్నారు" అని రక్షా బమ్ బీబీసీతో చెప్పారు.
అధ్యక్షుడు విజ్ఞత, ధైర్యం ప్రదర్శించి ఉండకపోతే నేపాల్ సైనిక పాలన లేదా రాచరికంలోకి వెళ్లి ఉండేదని రక్షా బమ్ అభిప్రాయపడ్డారు.
జెన్ జడ్ ఉద్యమంలో జరిగిన పరిణామాలను ఎలా చూస్తారని బీబీసీ రక్షా బమ్‌ను అడిగింది.
"ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంపై నేను ఏ మాత్రం సంతోషంగా లేను. నిజానికి సెప్టెంబర్ 9 ఉద్యమాన్ని హైజాక్ చేశారు" అని ఆయన బీబీసీతో చెప్పారు.
నేపాల్‌లో ఆందోళనకు దిగిన విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతూ, వారికి మార్గనిర్దేశం చేయడంలో నేపాల్ పాలసీ రీసర్చ్ ఇన్‌స్టిట్‌ట్యూట్‌తో అనుబంధమున్న ఇందిరా అధికారి కీలకంగా వ్యవహరించారు.
అధ్యక్షుడు తెలివిగా వ్యవహరించకుంటే పరిస్థితులు చేయి దాటిపోయేవని ఆమె కూడా నమ్ముతున్నారు.

ఫొటో సోర్స్, NEPALARMY
సైన్యం పాత్ర..
"ఆర్మీ చీఫ్- జెన్ జడ్ చర్చలకు రాజ కుటుంబానికి చెందిన దుర్గా ప్రసాయి, రవి లామిచానేకు చెందిన పార్టీ ఆర్ఎస్‌పీ, రాజ కుటుంబానికి మద్దతు పలికే ఆర్‌పీపీలను కూడా పిలిచారు. దీంతో ఏం జరుగుతుందోనని మేం ఆందోళన చెందాం" అని ఇందిరా అధికారి చెప్పారు.
"విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారు. వాళ్లు సైన్యంతో జరిపే చర్చల్లోకి రాజ కుటుంబ సభ్యులు ఎందుకు వచ్చారు? అందుకే నేను విద్యార్థులకు ఒకటే చెప్పాను. వాళ్లు మిమ్మల్ని సీరియస్‌గా తీసుకోరు కాబట్టి చర్చలకు మీ ప్రతినిధిని పంపండని వాళ్లకు సూచించాను. దీని తర్వాత సుశీలా కార్కి పేరుపై ఏకాభిప్రాయం కుదిరింది" అని ఆమె వివరించారు.
"సుశీలా కార్కిని ప్రతినిధిగా చేయడం తెలివైన నిర్ణయం. ఆమె ప్రధాన మంత్రి కావడం రాజకుటుంబానికి పెద్ద దెబ్బగా నేను భావిస్తున్నా. తొలుత పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని అనుకున్నాం. అయితే, అధ్యక్షుడు మధ్యేమార్గాన్ని కనుగొన్నారు" అని ఇందిరా అధికారి అన్నారు.
నేపాల్ గురించి విద్యార్థులు, యువతకున్న అవగాహనపై ఇందిరా అధికారి భరోసాతో ఉన్నారా?
"చూడండి. ఇప్పుడు జరిగిన దానిలో రిస్క్ కూడా ఉంది. అలాగే ఇది సరైనదేనని కూడా చెప్పలేను. జెన్ జడ్‌కు రాజకీయ అవగాహన తక్కువ" అని ఇందిరా అధికారి అన్నారు.
"రాజకీయాలంటే అసహ్యమని వాళ్లు చెబుతున్నారు. రాజకీయాలకు నిజమైన అర్థం వాళ్లకు తెలియదు. పౌరహక్కులు ఉండాలంటే.. రాజకీయాలు ఎంత ముఖ్యమనేది వాళ్లకు అవగాహన లేదు. వ్యవస్థను అర్థం చేసుకోలేని వారు తక్షణ పరిష్కారాలు కోరుకుంటారు. జెన్ జడ్ కూడా అంతే " అని ఆమె అన్నారు.
ఉద్యమం వల్ల దేశానికి చాలా నష్టం జరిగిందని, అయితే అది ఉద్యమాన్ని ప్రారంభించిన వారి వల్ల జరగలేదని ఆమె భావిస్తున్నారు.
"జెన్ జడ్ ఒక వయసుకు చెందిన గ్రూపు. ఈ గ్రూపుకి సిద్ధాంతం ఏమీ లేదు. ఇందులో అన్ని రకాల వ్యక్తులున్నారు. వారిలో కొందరు వ్యవస్థల్ని నమ్ముతారు. కొందరు నమ్మరు. వాళ్లు ప్రతిసారీ రాజ్యాంగ పరిధి దాటి నిర్ణయాలు తీసుకోవాలని పట్టుబట్టే అవకాశం ఉంది. అయితే, సుశీలా కార్కి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఆమెకు చట్టం తెలుసు" అని ఇందిరా అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, @ShahBalen
బాలెన్ షాపై ప్రశ్నలు
వాస్తవానికి, ఉద్యమం తర్వాత తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కాఠ్‌మాండూ మేయర్ బాలెన్ షా ప్రభావం స్పష్టంగా కనిపించింది.
సుశీలా కార్కి పేరును ఆయనే ముందుకు తెచ్చారు.
చర్చల గురించి సైన్యానికి సమాచారం అందించారు. పార్లమెంట్‌ను రద్దు చేయాలని కోరారు.
అధ్యక్షుడితో కాకుండా సైన్యంతో చర్చలు జరపాలని బాలెన్ షా కోరారని రాజకీయ విశ్లేషకుడు సీకే లాల్ చెప్పారు.
"ప్రధాన మంత్రి రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏర్పాటు బాధ్యత అధ్యక్షుడిది. ఆర్మీ చీఫ్‌ది కాదు. అయితే, బాలెన్ షా అధ్యక్షుడిని విస్మరించారు. ఇదంతా చూస్తే తెర వెనుక ఏదో జరిగిందనే అనుమానాలు వస్తాయి" అని సీకే లాల్ చెప్పారు.
"బాలెన్ షా ఒక పావు మాత్రమే. అతని యజమానులు లోపల, బయట ఉన్నారు. సుశీలా కార్కి అమెరికన్ లాబీకి దగ్గరగా ఉన్నారు. ఆమె భారత్‌తో సంబంధాలకు సానుకూలంగా ఉంటారు. ఆమె ఇమేజ్, వాస్తవం మధ్య పెద్దగా సారూప్యత లేదు" అని లాల్ చెప్పారు.
బాలెన్ షా మద్దతివ్వకపోతే సుశీలా కర్కీ ప్రధాన మంత్రి అయ్యేవారా?
అది సాధ్యం అయ్యేది కాదని ఇందిరా అధికారి నమ్ముతున్నారు.
మరి బాలెన్ షా సుశీలా కార్కికి ఎందుకు మద్దతు ఇచ్చారు?
"కాఠ్‌మాండూ మేయర్‌గా ఉన్నప్పుడు, బాలెన్ నగర వీధుల నుంచి వీధి వ్యాపారులను తొలగించాలని భావించారు. అయితే, దీనిపై చాలా వివాదం చెలరేగింది. అప్పుడు ఆయనకు సుశీలా కార్కి మద్దతిచ్చారు. నేపాల్‌లో ప్రధాన పార్టీలు ఆయన పని చేయడానికి అనుమతించడం లేదని కార్కి చెప్పారు" అని ఇందిరా అధికారి వివరించారు.
అధ్యక్షుడితో కాకుండా సైన్యంతో చర్చలు జరపాలన్న బాలెన్ షా ప్రతిపాదన ఆయన అవగాహన లోపానికి నిదర్శనమని జర్నలిస్ట్ కనక మణి దీక్షిత్ అన్నారు.
"నేపాల్‌లో సంక్షోభం ఇప్పుడే మొదలైంది. ఎన్నికల్ని ప్రకటించినా అవి సకాలంలో జరగకపోవచ్చు. పార్టీల్లో అంతర్గత కలహాలు జరగవచ్చు. వీటిలో నుంచి కొత్త నాయకుడు అవతరించినప్పుడు, ఆయన అందరిపై విజయం సాధిస్తారని నమ్మకం ఏర్పడినప్పుడు ఎన్నికలు జరగవచ్చు" అని సీకే లాల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధానిగా సుశీలా కార్కి..
సుశీలా కార్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా అనేక ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే మిగిలివున్నాయి.
వాస్తవానికి, పార్లమెంట్ సభ్యుడు/సభ్యురాలు కాని వ్యక్తి ప్రధాని అయ్యేందుకు నేపాల్ రాజ్యాంగం అనుమతించదు.
నేపాల్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి ప్రతినిధుల సభలో సభ్యుడిగా ఉండటం తప్పనిసరి.
తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుశీలా కార్కి పార్లమెంట్ రద్దుకు సిఫార్సు చేశారు.
అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ దానిని ఆమోదించారు.
పార్లమెంట్‌ను ఇలా రద్దు చేసేందుకు రాజ్యంగం అనుమతించదు. మంత్రి వర్గం సిఫార్సు మీద ప్రధాన మంత్రి పార్లమెంట్‌ను రద్దు చేయాల్సి ఉంటుంది.
పార్లమెంట్ బయట ఉన్న వ్యక్తులే పార్లమెంట్‌ను రద్దు చేశారు. పార్లమెంట్‌లో సభ్యత్వం లేని వ్యక్తిని తాత్కాలిక ప్రధాన మంత్రిని చేశారు.
తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే మరో మార్గం లేదని నేపాల్ మాజీ ఎన్నికల కమిషర్ నీలకాత్ ఉప్రేతి బీబీసీతో చెప్పారు.
పార్లమెంట్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని నేపాల్ బార్ అసోసియేషన్ ప్రకటించింది.
నేపాల్‌లోని మూడు ప్రధాన పార్టీలు పార్లమెంటును రద్దు చేసి సుశీలా కార్కిని ప్రధాన మంత్రిని చేయడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పాయి.
వచ్చే ఏడాది మార్చి 5న ఎన్నికలు నిర్వహిస్తామని సుశీలా కార్కి ప్రకటించారు.
అయితే, దీనిపై ప్రజలకు పెద్దగా నమ్మకం లేదు.
నేపాల్‌లో ప్రస్తుతమున్న వ్యవస్థకు 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించే సామర్థ్యం లేదని చెబుతున్నారు.
ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ఇంకా రెండేళ్లు మిగిలి ఉంది కాబట్టి రాజకీయ పార్టీలు రెండేళ్ల ముందుగానే ఎన్నికలకు వెళ్లడం అంత సులభం కాదు.
తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించారని రాజ్యాంగ నిపుణులు బిపిన్ అధికారి చెప్పారు.
"నేపాల్‌లో రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలు తీసుకోవడం సంప్రదాయంగా మారుతోంది. ఇది దురదృష్టకరం. అధ్యక్షుడి ముందు వేరే ప్రత్యామ్నాయాలు లేవు. దీంతో ఆయన రాజీపడాల్సి వచ్చింది. క్లిష్ట పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం తప్పుడు సంప్రదాయంగా మారుతోంది. దీనికి రాజ్యాంగ పరిధిలోనే పరిష్కారం కనుక్కోవాలి" అని ఆయన బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














