జీఎస్టీలో కోతలు: కొన్ని అనుమానాలు- నిపుణుల సమాధానాలు

జీఎస్టీలో కోతలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

    • రచయిత, సందీప్ రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్లలో మార్పులను బుధవారం రాత్రి ప్రకటించారు. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి.

జీఎస్టీ మండలి 56వ సమావేశంలో ఆమోదించిన కొత్త రేట్ల ప్రకారం, ఇప్పటి వరకు ఉన్న 12%, 28% ట్యాక్స్ శ్లాబులు రద్దు అవుతాయి. 5%, 18% శ్లాబ్ రేట్లు కొనసాగుతాయి.

రోజూవారీ వస్తువులపై జీఎస్టీ రేట్లలో ఉపశమనం కల్పించగా, కొన్ని వస్తువులను ఎంపిక చేసి, వాటికి జీఎస్టీని 40% వరకు పెంచారు.

సిగరెట్లు, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులు, ప్రాసెస్ చేయని పొగాకు, బీడీలపై జీఎస్టీ రేట్లు, కాంపెన్సెషన్ సెస్ యథాతథంగా కొనసాగుతాయి. కొత్త రేట్లను తర్వాత నోటిఫై చేస్తారు.

సీజీఎస్టీ చట్టం 2017 ప్రకారం, జీఎస్టీ రిజిస్ట్రేషన్ పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు.

కొత్త జీఎస్టీ రేట్ల ప్రకటనల తర్వాత కొన్ని సందేహాలు తలెత్తాయి. వీటికి నిపుణులు ఎలాంటి సమాధానాలు ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జీఎస్టీ, నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

జీఎస్టీ

అన్ని ఔషధాలపై 5% రాయితీ జీఎస్టీ రేటును విధించారు. అయితే, ప్రాణాలను రక్షించే కొన్ని ఔషధాలపై జీఎస్టీ రేటు సున్నా చేశారు.

ఔషధాలను పూర్తిగా జీఎస్టీ నుంచి మినహాయిస్తే, తయారీదారులు లేదా డీలర్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేయలేరు.

దీనివల్ల వారిపై పన్ను భారం, ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. ఈ భారం, అధిక ధరల రూపంలో వినియోగదారులు, రోగులపై పడవచ్చు.

దిల్లీలో 35 ఏళ్లుగా చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తోన్న, ఆర్థికవేత్త డీకే మిశ్రా ఈ అంశం గురించి బీబీసీతో మాట్లాడారు.

''కొత్త జీఎస్టీ రేట్లలో కొన్ని వైద్య పరికరాలు, సర్జికల్ పరికరాలు, కళ్లద్దాలు వంటి వాటిని తక్కువ ధరలకు లభించేలా చేయాలని ప్రయత్నించారు. రోజువారీగా అవసరమయ్యే ఈ వైద్య సామగ్రిని చౌకగా లభించేలా చేయడంతో ప్రజలకు ఉపశమనం లభిస్తుంది" అని అన్నారు.

ఆటోొ మొబైల్ రం

ఫొటో సోర్స్, Getty Images

జీఎస్టీ

అన్ని చిన్న కార్లపై జీఎస్టీ రేటును 28% నుంచి 18%కి తగ్గించారు.

చిన్న కార్లంటే పెట్రోల్, ఎల్పీజీ లేదా సీఎన్‌జీతో నడిచే, 1200 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం, 4000 ఎంఎం వరకు పొడవు ఉన్న కార్లు.

అలాగే, 1500 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం, 4000 ఎంఎం వరకు పొడవు ఉన్న డీజిల్ కార్లను ఈ విభాగంలోనే చేర్చారు.

ప్రస్తుతం మధ్యస్థ-పెద్ద కార్లపై 28% జీఎస్టీతో పాటు 17-22% వరకు కాంపెన్సేషన్ సెస్ విధిస్తున్నారు. అంటే ఓవరాల్‌గా పన్ను 45-50%కి చేరుతుంది.

ఇప్పుడు, 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం లేదా 4000 ఎంఎం కంటే ఎక్కువ పొడవు ఉన్న అన్ని మధ్యస్థ, పెద్ద కార్లపై 40% జీఎస్టీ రేటు వర్తిస్తుంది.

అంతేకాకుండా యుటిలిటీ వాహనాల కేటగిరీలోకి వచ్చే అన్ని మోటార్ వాహనాలకు సెస్ లేకుండా 40 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అంటే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ), మల్టీ యుటిలిటీ వెహికల్ (ఎమ్‌యూవీ), మల్టీ-పర్పస్ వెహికల్ (ఎమ్‌పీవీ) లేదా క్రాస్-ఓవర్ యుటిలిటీ వెహికల్ (ఎక్స్‌యూవీ) వంటి 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4000 ఎంఎం కంటే ఎక్కువ పొడవు, 170 ఎంఎం లేదా అంతకంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వాహనాలు ఈ కేటగిరీలోకి వస్తాయి.

''రేషనలైజేషన్‌లో భాగంగా చిన్న, పెద్ద కార్ల పన్ను శ్లాబుల్లో మార్పులు చేశారు. సాధారణంగా చిన్న కార్లు, మధ్యతరగతి ప్రజలకు అవసరంగా మారాయి. చిన్న కార్లను చౌకగా అందిస్తే, ఆ మేరకు ఆదా అయిన డబ్బును ప్రజలు ఇతర వినియోగ వస్తువుల కోసం పొదుపు చేస్తారు'' అని మిశ్రా అభిప్రాయపడ్డారు.

జీఎస్టీ

ఇంజిన్ సామర్థ్యం 350 సీసీ వరకు ఉన్న మోటార్‌సైకిళ్లపై 18% జీఎస్టీ రేటు వర్తిస్తుంది.

అంతకంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లపై జీఎస్టీ రేటును 28% నుంచి 40%కి పెంచారు.

సైకిల్, దాని విడిభాగాలపై జీఎస్టీ రేటును 12% నుంచి 5%కి తగ్గించారు.

''గతంలో సైకిల్ అనేది ప్రతి వ్యక్తికి ఒక అవసరంగా ఉండేది. ఇప్పుడు సైకిల్ స్థానాన్ని మోటార్‌సైకిల్ తీసుకుంది. కానీ బైక్‌ల విషయానికొస్తే, ఖరీదైన బైక్‌లు కొనుగోలు చేసి, వాటిపై పన్ను చెల్లించగల ఒక వర్గం ఉందని ప్రభుత్వం భావిస్తోంది'' అని మిశ్రా వివరించారు.

జీఎస్టీ కోతలు

ఫొటో సోర్స్, Getty Images

జీఎస్టీ

ఎంపిక చేసిన కొన్ని వస్తువులకు మాత్రమే ఈ స్పెషల్ రేటు జీఎస్టీ వర్తిస్తుంది. ఈ శ్లాబులో వ్యసనాలుగా మారే (సిన్ గూడ్స్), కొన్ని విలాసవంతమైన వస్తువులను చేర్చారు. అందుకే దీనిని 'ప్రత్యేక రేటు' జీఎస్టీ అని పిలుస్తున్నారు.

వీటిలో చాలా వస్తువులకు జీఎస్టీతో పాటు కాంపెన్సేషన్ సెస్ కూడా ఉండేది. ఇప్పుడు కాంపెన్సేషన్ సెస్‌ను జీఎస్టీలో కలిపేశారు. దీనివల్ల చాలా వస్తువులపై పన్ను భారం అలాగే ఉంటుంది.

''వ్యసనంగా ఉపయోగించే వస్తువులపైనే ఈ ప్రత్యేక జీఎస్టీ రేట్లు విధించారు. పొగాకు వంటి వాటిని ప్రభుత్వం ప్రోత్సహించాలనుకోవట్లేదు. వీటిని సిన్ గూడ్స్ అని కూడా అంటారు. ధనవంతులు పన్ను చెల్లించగల ఖరీదైన వస్తువులను కూడా ప్రత్యేక రేట్ల కిందకు తీసుకువచ్చారు" అని మిశ్రా చెప్పారు.

జీఎస్టీ

ఇటీవల జీఎస్టీని మరింత తార్కికంగా మార్చారు. అంటే ఒకే రకమైన వస్తువులను ఒకే శ్లాబులో ఉంచారు. తద్వారా తప్పుడు వర్గీకరణ, వివాదాలు తలెత్తవు.

ఇదే సూత్రాన్ని 'ఆల్కహాల్ రహిత పానీయాల'కు వర్తింపచేశారు.

కానీ, ఫ్రూట్ డ్రింక్స్ లేదా పండ్ల రసాలతో కూడిన కార్బోనేటెడ్ పానీయాలపై జీఎస్టీ రేటు పెంచారు.

వీటిపై జీఎస్టీతో పాటు కాంపెన్సేషన్ సెస్ కూడా ఉండేది. ఇప్పుడు దాన్ని రద్దు చేసి, పన్ను భారం ముందులాగే ఉండేలా పన్ను రేటును పెంచారు.

'జీఎస్టీ వ్యవస్థను తార్కికంగా చేయడానికి సెస్‌ను రద్దు చేశారు. కొత్త రేట్ల వల్ల సుమారు 48 వేల కోట్ల రూపాయల రాబడి నష్టం జరుగుతుందని అంచనా వేశారు. ప్రత్యేక రేట్లు విధించడం ద్వారా దీన్ని పూడ్చే ప్రయత్నం చేశారు'' అని మిశ్రా అని అన్నారు.

పనీర్

ఫొటో సోర్స్, AFP via Getty Images

జీఎస్టీ

సాధారణ బ్రెడ్‌కు ఇదివరకే మినహాయింపు ఉండేది. అయితే పిజ్జా బ్రెడ్, రోటీ, పరాఠా మొదలైన వాటికి వేర్వేరు రేట్లు వర్తించేవి.

ఇప్పుడు పేరుతో సంబంధం లేకుండా అన్ని భారతీయ బ్రెడ్‌లకు మినహాయింపు ఇచ్చారు.

పనీర్, ఇతర చీజ్‌లపై వేర్వేరు పన్ను విధానం ఎందుకు?

రేట్లను తార్కికంగా మార్చడానికి ముందు ప్యాకేజీ చేయని, లేబుల్ లేని పనీర్‌పై ఇదివరకు సున్నా పన్ను రేటు వర్తించేది.

అందుకే ప్యాకేజ్ చేసిన, లేబుల్ ఉన్న పనీర్‌కు మాత్రమే మార్పులు వర్తింపచేశారు. దేశీయ చీజ్ పరిశ్రమలో పనీర్ ఒక భాగం. ఎక్కువగా చిన్న స్థాయిలోనే పనీర్‌ను తయారు చేస్తారు.

దేశీయ చీజ్ పరిశ్రమను ప్రోత్సహించడానికి ఈ చర్య తీసుకున్నారు.

ట్రాక్టర్

ఫొటో సోర్స్, Getty Images

జీఎస్టీ

వ్యవసాయ యంత్రాలు, పరికరాలపై పన్నును గతంలో కంటే తగ్గించారు.

స్ప్రింక్లర్లు, బిందు సేద్యం వ్యవస్థలు, వ్యవసాయం, ఉద్యానవనం మొదలైన వాటిలో నేలను సిద్ధం చేయడానికి లేదా సాగు చేయడానికి ఉపయోగించే యంత్రాలు, లాన్ లేదా క్రీడా మైదాన రోలర్లు, కోత, నూర్పిడి యంత్రాలు, గడ్డి కోసే యంత్రాలపై జీఎస్టీ రేట్లను 12% నుంచి 5%కి తగ్గించారు.

ఇతర వ్యవసాయం, ఉద్యానవనం, అటవీశాస్త్రం, పౌల్ట్రీ పెంపకం, తేనెటీగల పెంపకం యంత్రాలు, కంపోస్టింగ్ యంత్రాలు మొదలైన వాటిపై ఇంతకు ముందు ఉన్న 12% జీఎస్టీ రేట్లను 5%కి తగ్గించారు.

రైతులకు ఉపశమనం కల్పించేటప్పుడు దేశీయ తయారీ రంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా చూడటం కూడా ముఖ్యం.

జీఎస్టీ నుంచి వీటికి మినహాయింపు ఇస్తే, ఈ వస్తువుల తయారీదారులు, డీలర్లు ముడిసరుకుపై చెల్లించిన జీఎస్టీపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేయలేరు. దీని భారం చివరికి వినియోగదారులపై పడుతుంది.

జీఎస్టీలో కోతలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

జీఎస్టీ

లిక్విడ్ సోప్, బార్ సోప్‌ మధ్య తేడాను గుర్తించారు. టాయిలెట్ సోప్ బార్‌పై కొత్త జీఎస్టీ రేటును 5%గా నిర్ణయించారు. దీని ఉద్దేశ్యం దిగువ మధ్యతరగతి, పేద వర్గాల నెలవారీ ఖర్చును తగ్గించడం.

ఈ వస్తువులు దాదాపు అన్ని వర్గాల ప్రజలకు రోజువారీగా అవసరమే.

అయితే, ఖరీదైన ఫేస్ పౌడర్, షాంపూలను విక్రయించే బహుళజాతి కంపెనీలు లేదా లగ్జరీ బ్రాండ్‌లు కూడా దీని నుంచి లబ్ధి పొందుతాయి. కానీ పన్ను రేట్లను తార్కికం చేయడం వెనక ఉద్దేశ్యం పన్ను వ్యవస్థను మరింత సరళీకృతం చేయడమే.

బొగ్గుపై జీఎస్టీ రేటు పెరగడం వల్ల విద్యుత్ ధరపై ప్రభావం పడుతుందా?

ఇంతకుముందు బొగ్గుపై 5% జీఎస్టీతో పాటు టన్నుకు రూ.400 కాంపెన్సేషన్ సెస్ విధించేవారు.

జీఎస్టీ కౌన్సిల్, సెస్ రద్దు చేయాలని సిఫార్సు చేసింది. అందుకే ఈ రేటును జీఎస్టీలో కలిపేశారు. వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం వేయలేదు.

జీఎస్టీలో కోతలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

జీఎస్టీ

జీవిత బీమాకు వర్తింపచేసిన మినహాయింపు పరిధిలోకి అన్ని వ్యక్తిగత జీవిత బీమా పాలసీలు వస్తాయి.

వీటిలో టర్మ్, యూఎల్‌ఐపీ, ఎండోమెంట్ పథకాలు, వాటి రీ-ఇన్సూరెన్స్ సేవలు ఉన్నాయి.

ఆరోగ్య బీమాపై సూచించిన మినహాయింపు పరిధిలోకి అన్ని వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలు వస్తాయి. వీటిలో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్, సీనియర్ సిటిజన్ల పాలసీలు కూడా ఉన్నాయి.

వాటి రీ-ఇన్సూరెన్స్ సేవల్ని కూడా ఇందులో చేర్చారు.

''జీవిత బీమా, ఆరోగ్య బీమాపై జీఎస్టీని 5 శాతం లేదా సున్నాకు తగ్గించాలని ప్రజలు చాలా కాలం నుండి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సున్నాకు తగ్గించడం ద్వారా పెద్ద ఉపశమనం కల్పించింది" అని ఆర్థికవేత్త డీకే మిశ్రా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)