మెగ్నీషియం: మనం బాగా నిద్రపోవాలంటే ఈ సప్లిమెంట్ తీసుకోవాలా?

మంచి నిద్ర

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రుత్ క్లెగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మెగ్నీషియం- ప్రస్తుతం బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఖనిజం.

కారణాలేవైనా కావచ్చు.

మనలో లక్షల మంది మెగ్నీషియం తీసుకుంటున్నారు.

ఇది మనం హాయిగా నిద్ర పోవడానికి సహకరిస్తుందా?

అజీర్తిని దూరం చేస్తుందా?

ఆలోచనలతో సతమతమయ్యే బుర్రకు విశ్రాంతినిస్తుందా?

వేగంగా కదులుతున్న సప్లిమెంట్ల ప్రపంచంలో ఇది మెగ్నీషియం ప్రకాశించే సమయం.

మెగ్నీషియం పరిశ్రమ పుంజుకుంటోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజపు మార్కెట్ 3 బిలియన్ పౌండ్ల (సుమారు 31,500 కోట్ల రూపాయల)కు చేరుకుంది. రానున్న పదేళ్లలో ఇది రెట్టింపు కానుంది.

యార్క్‌షైర్ డేల్స్‌లోని ఓ చిన్న ఫ్యాక్టరీలో భారీ యంత్రాల పక్కన తెల్లటి పౌడర్ నింపిన పెద్ద ప్లాస్టిక్ గొట్టాలు ఉన్నాయి.

శరీరాన్నంతటినీ కప్పి ఉంచే దుస్తుల్లోని కార్మికులు సిట్రిక్ యాసిడ్ కలిపిన మెగ్నీషియం సిట్రేట్‌ ఖనిజాన్ని జాగ్రత్తగా తూకం వేసి మెరుస్తున్న స్టీల్ డబ్బాల్లో భద్రపరుస్తున్నారు.

"మేం వీటిని ప్రపంచమంతటా సరఫరా చేస్తున్నాం" అని లాన్స్‌డేల్ హెల్త్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్రూ గోరింగ్ చెప్పారు

"బ్రిటన్ మాత్రమే కాదు, ఆస్ట్రేలియా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, కువైట్, ఇరాక్‌కు కూడా పంపిస్తాం. మా అమ్మకాల్లో ఇది చాలా పెద్దది. అంతే కాదు దీని మార్కెట్ పెరుగుతోంది’’ అని చెప్పారాయన.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దలేక్ అనే ఒక వింత జీవిలా కనిపించే మిషన్‌ టాబ్లెట్లను తయారు చేస్తూ ఉంటే, ఆ శబ్ధానికి అనుగుణంగా ఆయన కూడా అరుస్తున్నారు. ఈ మెషీన్ సెకన్ల వ్యవధిలో డజన్ల కొద్దీ మెగ్నీషియం టాబ్లెట్లను తయారు చేస్తుంది.

"ఇవి నిజంగానే మనకు అవసరమా. ఇప్పుడివి ఎందుకింత పాపులర్ అయ్యాయి?" అని అడిగాను

"ఇన్‌ఫ్లూయెన్సర్లు, సోషల్ మీడియా, ఇవే వీటిని పాపులర్ చేశాయి" అని గోరింగ్ వివరించారు.

"మెగ్నీషియం గురించి, దాని వల్ల కలిగే లాభాల గురించి మనకు అనేక ఏళ్లుగా తెలుసు. ఎట్టకేలకు అవి ప్రజా జీవితంలోకి వచ్చాయి" అని ఆయన అన్నారు.

మెగ్నీషియం, నిద్ర, ఖనిజాలు, హెల్త్ సప్లిమెంట్లు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు

ఫొటో సోర్స్, Ruth Clegg/BBC

ఫొటో క్యాప్షన్, ఈ ఫ్యాక్టరీలో ప్రతీ రోజూ లక్షల కొద్దీ మెగ్నీషియం టాబ్లెట్లు తయారు చేస్తున్నారు.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంలో నిపుణురాలైన కిర్‌స్టెన్ జాక్సన్‌ను కలిసినప్పుడు ఆమె గదంతా చాలా నిశబ్ధంగా ఉంది.

"తెలివైన మార్కెటింగ్ విధానాలు" అన్నారామె.

"నిద్ర, జీర్ణప్రక్రియ, మానసిక ఆరోగ్యం లాంటి వాటి కోసం ప్రజలు మెగ్నీషియం ఉపయోగించాలనుకుంటున్నారు" అని ఆమె చెప్పారు.

అయితే మనం తీసుకునే సప్లిమెంట్ల వల్ల నిద్ర, జీర్ణ వ్యవస్థ, మానసిక ఆరోగ్యం మెరుగుపడవనే విషయాన్ని గుర్తించాలని ఆమె నొక్కి చెప్పారు.

మన శరీరంలో ఉండే అనేక ఖనిజాల్లో మెగ్నీషియం ఒకటి.

అది రోజువారీగా పురుషులు 270 మిల్లీ గ్రాములు, మహిళలు 300 మిల్లీ గ్రాములు తీసుకోవచ్చు. మన శరీరంలో 25 మిల్లీ గ్రాములు నిల్వ ఉంటుంది.

ఇది మనలో 1 శాతం కంటే తక్కువ ఉండొచ్చు. కానీ ఇది " 300 కంటే ఎక్కువగా వివిధ రకాల ప్రక్రియలలో దీని ప్రమేయం ఉంటుంది" అని జాక్సన్ వివరించారు.

"ఇది మన మెదడు, మానసిక స్థితికి చాలా ముఖ్యమైనది" అని ఆమె అన్నారు. ఎందుకంటే నరాలకు సందేశాలు పంపడంలో మెదడులో కణత్వచ నిర్మాణానికి మెగ్నీషియం సాయపడుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్‌ను సమతుల్యం చేయడం, రక్తపోటును నియంత్రించడంలో సాయపడుతుంది. కాల్షియం, పొటాషియాన్ని మన కణాలలోపలకు, బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గుండె కొట్టుకోవడాన్ని క్రమబద్దీకరిస్తుంది. కాబట్టి మన శరీరం చక్కగా పని చేయాలంటే రోజూ ఒక మెగ్నీషియం మాత్ర వేసుకోవాలా?

రోజూ మాత్ర వేసుకోవడం అనేది మరింత సంక్లిష్టమైనది అని జాక్సన్ చెప్పారు.

మెగ్నీషియం లోపం ఉన్న వాళ్లు మాత్రమే ఈ సప్లిమెంట్‌ను తీసుకోవాలి. అయితే మెగ్నీషియం లోపాన్ని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే మన శరీరంలో ఉండే మెగ్నీషియంలో ఎక్కువ శాతం శరీర కణజాలం, ఎముకల్లో ఉంటుంది.

అయితే వ్యక్తిగతంగా చూస్తే, దీని వల్ల చాలా మార్పు వస్తుందని అనేకమంది చెబుతున్నారు.

మెగ్నీషియం, నిద్ర, ఖనిజాలు, హెల్త్ సప్లిమెంట్లు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు

ఫొటో సోర్స్, Katie Curran

ఫొటో క్యాప్షన్, మెగ్నీషియం టాబ్లెట్లు తాను నిద్రపోవడానికి, ఆలోచనలను నియంత్రించడానికి ఉపయోగ పడ్డాయని కేటీ చెప్పారు.

ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లకు కమ్యూనికేషన్ స్పెషలిస్ట్‌గా పని చేసిన కేటీ కుర్రన్‌కు బాగా నిద్రపోవడం అనేది పెద్ద కల

"ఏడాది కిందట నేను చాలా బాధ పడేదానిని. నిద్ర పట్టడానికి చాలా సమయం పట్టేది. నా మెదడులో ఆలోచనలు సుడులు తిరిగేవి. నిద్ర పట్టిన రెండు గంటల తర్వాత మెలకువ వచ్చేది" అని ఆమె చెప్పారు.

దీంతో తాను మెగ్నీషియం గ్లైసినేట్ వాడాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు.

మెగ్నీషియం గ్లైసినేట్ అనేది మెగ్నీషియం, గ్లైసీన్ అనే అమైనో యాసిడ్‌ మిశ్రమంతో తయారైన ఔషధం. ఇది నిద్రకు సాయపడుతుంది.

రెండు వారాల పాటు రోజూ 270 మిల్లీ గ్రాములు తీసుకోవడంతో తన మెదడులో ఆలోచనల సుడి ఆగిపోయిందని ఆమె చెప్పారు. పరుగులు తీసే ఆలోచనలు నెమ్మదించాయి. తాను తిరిగి పని చేయగలనని ఆమె భావించారు.

"కచ్చితంగా నా నిద్ర మెరుగుపడింది. నాలో శక్తి పెరిగింది. నేను మరింత యాక్టివ్‌గా మారాను. నా జీవితంలో ఇతర అంశాలు కూడా మారాయి. ఇదంతా ఒక్క మాటలో చెప్పాలంటే మెగ్నీషియం సప్లిమెంట్లు నా సమస్యల్ని దూరం చేసిన ముఖ్యమైన ఖనిజం" అని ఆమె వివరించారు.

మెగ్నీషియం లోపం ఉంటే కచ్చితంగా అది నిద్రను ప్రభావితం చేస్తుంది. అయితే మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల నిద్ర మెరుగు పడుతుందని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేవు.

సామాజిక మాధ్యమాలు వివిధ రకాల సప్లిమెంట్లు తీసుకునేవారితో నిండిపోయాయి. వారు తమ అకౌంట్లలో పెడుతున్న అనేక పోస్టులలో ఏదో మూలన "కమిషన్ చెల్లించారు" అనే స్టాంప్ కనిపిస్తోంది.

దీనర్ధం ఏంటంటే వాళ్లు తమ కథ చెప్పడం ద్వారా లేదా రీల్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు.

ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు చెప్పే దాని ప్రకారం కేవలం మెగ్నీషియం ఒక్కటే మన ఆరోగ్యానికి సాయం చేయదు. ఇంకా వివిధ రకాలైన సప్లిమెంట్లు వాడాలని వాళ్లు సూచిస్తున్నారు.

మన శరీరంలో వివిధ భాగాలకు చేరేందుకు వీలుగా మెగ్నీషియంను ఇతర ఖనిజాలతో కలుపుతారు.

ఉదాహరణకు మెగ్నీషియంను గ్లైసీన్ లేదా ఎల్- థెరోనేట్‌తో కలపడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఈ ఔషధం ఒత్తిడి నుంచి విముక్తి కలిగించడంతో పాటు మంచి నిద్రకు సాయపడుతుంది.

అదే మెగ్నీషియాన్ని క్లోరైడ్‌తో కలిపితే అది కండరాలపై ఒత్తిడి తగ్గిస్తుంది. మహిళల్లో రుతు స్రావానికి ముందు వచ్చే తిమ్మిరిని తగ్గిస్తుంది. మెగ్నీషియంతో సిట్రేట్, ఆక్సైడ్‌లను కలిపితే అవి జీర్ణ ప్రక్రియను మెరుగుపరిచి సుఖ విరేచనానికి తోడ్పడతాయి.

మనలో ప్రతీ ఒక్కరికీ ఇందులో ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే ఈ సమస్యలకు మెగ్నీషియం లోపమే కారణమని చెప్పేందుకు బలమైన ఆధారాలు లేవని, అలాగే మెగ్నీషియం సప్లిమెంట్లతో ఆరోగ్యంగా ఉన్నారని చెప్పడం కూడా కష్టమని న్యూట్రిషనిస్ట్ కిర్‌స్టెన్ స్టావ్రిడిస్ చెప్పారు.

ఒక వేళ వాళ్లు మెగ్నీషియం సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతులైతే, వారిలో అంతకు ముందు మెగ్నీషియం లోపం ఉందేమో చూడాల్సి ఉంటుంది.

"హెల్త్ సప్లిమెంట్ల సంస్థలు మనల్ని చూసి మనమంతా చనిపోతున్నాం. త్వరపడండి. మా టాబ్లెట్ వేసుకోంది. అదే మీకు పరిష్కారం అని అరుస్తున్నాయి" అని ఆమె వివరించారు.

"మనలో చాలా మందికి అవసరమైనంత మెగ్నీషియం అందడం లేదు. 10శాతం పురుషులు, 20 శాతం మహిళలు రోజువారీ ఆహారంలో సూచించినంత మెగ్నీషియంతీసుకోవడం లేదు" అని కిర్‌స్టెన్ అన్నారు

అయితే దీనికి కేవలం సప్లిమెంట్ తీసుకోవడం ఒక్కటే సమాధానం కాదని ఆమె చెప్పారు.

మెగ్నీషియం, నిద్ర, ఖనిజాలు, హెల్త్ సప్లిమెంట్లు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విత్తనాలు, గింజలు, గోధుమ రొట్టెలు, ఆకు కూారలు, పండ్లలో మెగ్నీషియం మెండుగా ఉంటుంది.

ఉదాహరణకు నిద్రనే తీసుకుంటే, మెగ్నీషియం సప్లిమెంట్ల వల్ల నిజంగానే మార్పు వచ్చిందా అనే దానిపై అధ్యయనాల ఫలితాలు వేర్వేరుగా ఉన్నాయి.

కొన్ని పరీక్షల్లో కొన్ని ప్రయోజనాలు ఉన్నట్లు, మరి కొన్ని నియంత్రిత పరీక్షల్లో అద్భుత ఫలితాలు ఉన్నట్లు తేలింది.

ఈ సప్లిమెంట్లను తీసుకున్న తర్వాత అవి శరీరంలో ఎలా పని చేస్తాయనే దానితోపాటు అవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పని చేసే అవకాశం కూడా ఉంది.

ఉదాహరణకు జింక్‌నే తీసుకుంటే రుతుక్రమం ఆగిపోయిన మహిళలకు దీన్ని సూచిస్తారు. అయితే ఇది శరీరం మెగ్నీషియాన్ని స్వీకరించే స్థాయిని ప్రభావితం చేస్తుంది.

వాస్తవానికి మెగ్నీషియం అనేది ఒక మందు పాతర. ఇది తీసుకుంటే నయం అవుతుందని చెప్పగలిగేది కాదని స్టావ్రిడిస్ చెప్పారు.

ముందు మీరేం తింటున్నారో చూడండి. మెగ్నీషియం తీసుకోవాలని మీకు సూచిస్తే.. మీకు సూచించిన దానిలో సగం మాత్రమే తీసుకోండి. మీకెలా అనిపిస్తుందో గమనించండని స్టావ్రిడిస్ సూచించారు.

ఆరోగ్యంగా ఉన్న వారు మెగ్నీషియాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అదనపు పరిణామాన్ని కిడ్నీలు మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపుతాయి. కానీ డయేరియా, వాంతులు, వికారం లాంటి ముప్పు ఏర్పడుతుంది.

కిడ్నీ వ్యాధులు ఉన్న వారికి మెగ్నీషియం తీసుకోవడం ప్రమాదకరంగా మారవచ్చు. అది హైపర్ మేగ్నిసియాకు దారి తీయవచ్చు. ఇది ప్రాణాంతకమే కాకుండా కోమా లేదా పక్షవాతానికి దారి తీయవచ్చు.

ముందుగా మనమేం తింటున్నామో గమనించాలని డైటీషియన్ కిర్‌స్టెన్ జాక్సన్ సూచిస్తున్నారు.

విత్తనాలు, గింజలు, గోధుమ రొట్టె, ఆకు కూరలు, పండ్లలో మెగ్నీషియం మెండుగా ఉంటుందని ఆమె చెప్పారు.

మీరు మీ రోజువారీ ఆహారంలో ఇవన్నీ తీసుకోకపోతే మీకు విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ ప్రీ బయాటిక్స్ వంటి పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉందని కిర్‌స్టెన్ హెచ్చరించారు.

"మెగ్నీషియం సప్లిమెంట్ మాత్రమే అన్నింటినీ భర్తీ చేయలేదు"

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)