రోహిత్ శర్మ 50 సెంచరీలు.. విరాట్ కోహ్లీ 75 హాఫ్ సెంచరీలు.. సిడ్నీ వన్డేలో రికార్డులు, భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి.
సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు చివరి వరకు క్రీజులో నిలిచారు.
రోహిత్ శర్మ 105 బంతుల్లో తన 33వ వన్డే సెంచరీ చేశాడు. అతను 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీని అందుకున్నాడు. రోహిత్ మొత్తంగా 50 అంతర్జాతీయ సెంచరీలను సాధించాడు.
మరోవైపు, విరాట్ కోహ్లీ కూడా వన్డే క్రికెట్‌లో తన 75వ అర్ధ సెంచరీని సాధించాడు. అంతేకాదు, వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు(14,255) చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. శ్రీలంకకు చెందిన కుమార్ సంగక్కర(14,234) మూడో స్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతం, వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లలో సచిన్ తెందూల్కర్ (18,426) మొదటి స్థానంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 125 బంతుల్లో 121 పరుగులు, విరాట్ కోహ్లీ 81 బంతుల్లో 74 పరుగులు సాధించారు.
దీంతో ఆస్ట్రేలియా జట్టుపై చెరో 2,500 పరుగులు సాధించిన ఆటగాళ్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు నిలిచారు. ఇప్పటికే సచిన్ ఈ రికార్డు సాధించారు.


ఫొటో సోర్స్, Getty Images
రాణించిన భారత బౌలర్లు
సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది.
మొదటి 30 ఓవర్ల వరకు బాగానే ఆడిన ఆసీస్ బ్యాటర్లు, ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో, ఆ జట్టు 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాట్ రెన్‌షా అత్యధికంగా 56 పరుగులు చేయగా, మిచెల్ మార్ష్ 41 పరుగులు చేశాడు.
భారత్ బౌలర్ హర్షిత్ రాణా 4 వికెట్లు పడగొట్టగా, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశాడు. మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు మంచి ఆరంభం లభించింది. కెప్టెన్ గిల్, రోహిత్ శర్మలు మొదటి వికెట్‌కు 69 పరుగులు జోడించారు.
24 పరుగులు చేసిన గిల్, హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లకు దక్కిన మొదటి, చివరి వికెట్ అదే.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మరో వికెట్ పడనీయకుండా 38.3 ఓవర్లలో జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఫొటో సోర్స్, Getty Images
టీ20 సిరీస్ ఎప్పుడంటే..
ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు వన్డే సిరీస్‌లో అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయింది.
ఆస్ట్రేలియా జట్టు తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో, రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.
ఇరు జట్ల మధ్య అక్టోబర్ 29 నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














