మెలిస్సా తుపాన్: 'గతంలో ఎన్నడూ చూడనివి చూడాల్సి రావచ్చు' అని జమైకా అధికారులు ఎందుకు భయపడుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
అట్లాంటిక్ మహాసముద్రంలో మెలిస్సా తుపాను, బంగాళాఖాతంలో మొంథా తుపాను. ఏక కాలంలో రెండు తుపాన్లు ప్రజలను కలవరపెట్టాయి.
మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటింది. తుపాను ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను కారణంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షం కురిసింది.
ఇక మెలిస్సా తుపాను కూాడ తీరం దాటింది. జమైకాలో విధ్వంసం సృష్టించి క్యూబా వైపు వెళుతోంది. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు క్యూబా సిద్ధమవుతోంది. తుపాను ప్రభావంతో జమైకాలో గంటకు 205 కి.మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు దీనిని అత్యంత శక్తిమంతమైన తుపానుగా భావిస్తున్నారు. ఈ తుపాను కారణంగా భయంకరమైన వరదలు సంభవించే అవకాశం ఉందని, కొండచరియలు విరిగిపడొచ్చని నిపుణులు హెచ్చరించారు.
‘‘గతంలో ఎన్నడూ చూడనివి చూడాల్సి రావచ్చు’’ అని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.


ఫొటో సోర్స్, AP
జమైకాలో మెలిస్సా విధ్వంసం
జమైకా ఆధునిక చరిత్రలో అత్యంత బలమైనదిగా చెబుతున్న మెలిస్సా తుపాను క్యూబా వైపు వెళుతోంది.
తీరం దాటక ముందు గంటకు 297 కి.మీ.కు పైగా వేగంతో తీరాన్ని తాకిన తుపాను తీరం దాటిన తర్వాత గంటకు 205 కి.మీ.ల వేగంతో కేటగిరీ 3 స్థాయికి తగ్గింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
మెలిస్సా తుపాను ప్రభావంతో జమైకాలోని కొన్ని ప్రాంతాల్లో 76 సెంటీ మీటర్ల వర్షం కురవచ్చని అంచనా వేశారు.
"ఈదురుగాలులు ఎంత బలంగా ఉన్నాయంటే మీరు రోడ్డు మీద నిల్చోవడం కూడా కష్టంగా ఉంది" అని జమైకాకు చెందిన వ్యక్తి ఒకరు బీబీసీకి చెప్పారు.
అంతకు ముందు మెలిస్సా తుపానును కేటగిరీ 5గా వర్గీకరించారు. కొన్ని గంటల్లో ఈ తుపాను క్యూబాను తాకనుంది.

ఫొటో సోర్స్, George Chac
జమైకా మీద తుపాను ప్రభావం ఏ స్థాయిలో ఉందనేది స్పష్టంగా తెలియడం లేదు.
కింగ్‌స్టన్ వీధుల్లో ఎక్కడ చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది.
జమైకాలో తుపాను బాధితుల కోసం 800 షెల్టర్లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. గత రాత్రి 15వేల మంది షెల్టర్లకు వచ్చారని వెల్లడించారు.
మెలిస్సా తుపాను కారణంగా క్యూబాలో 60 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు.
దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తుపాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
జమైకాలోని సెయింట్ ఎలిజబెత్ పరిష్ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది.
ఈ పట్టణంలోని బ్లాక్ రివర్ ఆసుపత్రికి విద్యుత్ సరఫరా ఆగిపోయిందని, ఆసుపత్రిలో 75 మంది రోగులు ఉన్నారని స్థానిక మంత్రి డెస్మండ్ మెకంజీ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
క్లారన్‌డన్ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగిందని, శాంతాక్రజ్‌లోని అగ్నిమాపక కేంద్రం నీట మునిగిందని ఆయన వివరించారు.
జమైకాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
ద్వీపంలోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేశారు. వారాంతం వరకు విమానాల రాకపోకలను నిలిపివేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














