‘మొంథా’ పేరుకు అర్థం ఏమిటి, ఈ పేరు ఎవరు సూచించారు? అసలు తుపాన్లకు పేర్లు ఎందుకు పెడతారు?

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మచిలీపట్నానికి 160 కిమీ, కాకినాడకు 240 కిమీ, విశాఖపట్నంకు 320 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. తుపాను తీవ్రంగా మారి కాకినాడ సమీపంలో మచిలీపట్నం- కళింగపట్నం మధ్య తీరం దాటవచ్చని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది.
అయితే ఈ తుపానుకు మొంథా అనే పేరు ఎవరు పెట్టారు. మొంథా అంటే అర్థమేమిటి?
మొంథా పేరును సూచించింది థాయిలాండ్ దేశమని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సీనియర్ డ్యూటీ ఆఫీసర్ జగన్నాధ కుమార్ బీబీసీతో చెప్పారు.
‘మొం’ ‘థా’ అనే రెండక్షరాల కలయికే మొంథా. థాయ్‌లో మొంథా అంటే సువాసనలు వెదజల్లే పువ్వు లేదా అందమైన పువ్వు అని అర్థం. థాయి సంస్కృతిలో మొంథా పువ్వుకు విశిష్ఠ స్థానం ఉంది.
ఈ పువ్వును దేవాలయాలలోనూ, బౌద్ధ విగ్రహాల వద్ద నివేదిస్తుంటారు. దీని ద్వారా ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు.


పేర్లు పెట్టడం ఎప్పటి నుంచి...
తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయన్ని 2000 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏసియా అండ్ పసిఫిక్, ఇంకా వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రారంభించాయి.
ఈ గ్రూపులో ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలున్నాయి. ఒక్కోదేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో పుట్టే తుపాన్లకు ఈ పేర్లు పెడతారు.
2018లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ దేశాలు కూడా ఈ గ్రూపులో చేరాయి. ఈ దేశాల సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్ తుపాన్ల పేర్లను నిర్ణయిస్తుంది.
ప్యానెల్ సభ్యులు ప్రతిపాదించిన పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు. ఈ దేశాల జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్‌ది కాగా, భారత్ పేరు రెండో పేరు. ఆ తర్వాత ఇరాన్, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్ ఇలా కొనసాగుతాయి. ఇక 2020లో ఐఎండీ -ఆర్ఎస్ఎంసీ ఆమోదించిన పేర్ల జాబితాలో ‘మొంథా’ భాగంగా ఉందని ది హిందూ కథనం పేర్కొంది.

తుపాన్లకు పేర్లు ఎందుకు?
ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు (రీజనల్ స్పెషలైజ్‌డ్ మెట్రలాజికల్ సెంటర్స్-ఆర్‌ఎస్‌ఎంసీ) ఉన్నాయి. అలాగే ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుపాను హెచ్చరికల కేంద్రాలు (ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ -టీసీడబ్ల్యూసీ) ఏర్పాటు చేశారు.
తుపాన్ల గురించి హెచ్చరికలు, సూచనలు జారీ చేయడం, వాటికి పేర్లు పెట్టడం ఈ కేంద్రాల విధి. ఈ ఆరు ప్రాంతీయ కేంద్రాలలో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ ఒకటి. ఈ కేంద్రాలు 13 సభ్యదేశాలకు తుపానులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి.
తుపానులకు పేర్లుపెట్టడం వల్ల అధికారులు, సైంటిస్టులు, విపత్తుల నిర్వహణ శాఖ, మీడియాతోపాటు సామాన్య ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.
తుపానును గుర్తుపెట్టుకోవడం సులభమవుతుంది.
తుపాను కదలికల మీద హెచ్చరికలు చేయడానికి సులువుగా ఉంటుంది.
ఒకేసారి రెండు, మూడు తుపానులు వచ్చినప్పుడు వాటిని గుర్తించడానికి వీలవుతుంది
పేర్ల వల్ల ఏ తుపాను ఎప్పుడు వచ్చిందన్నది గుర్తుపెట్టుకోవడం సులభం
ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి అనువుగా ఉంటుంది.
వివిధ తీరప్రాంతాలలో పుట్టే తుపాన్లకు పేర్లు పెట్టే బాధ్యతను కొన్ని ప్రాంతీయ కేంద్రాలకు అప్పజెప్పారు.ఉ దాహరణకు ఉత్తర హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో పుట్టే తుపాన్లకు భారతదేశం పేర్లు పెడుతుంది.
వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ సంస్థలు 2000 సంవత్సరంలో మస్కట్‌లో జరిపిన సమావేశంలో అరేబియా సముద్రం, బంగాళాఖాతాలలో ఏర్పడే తుపాన్లకు పేర్లు పెట్టాలని నిర్ణయించాయి. సుదీర్ఘ చర్చ తర్వాత 2004లో ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు.
అప్పటికి ఈ గ్రూపులో ఉన్న ఎనిమిది దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ రూపొందించిన పేర్లను పెడుతూ వచ్చారు.
2018లో జరిగిన సభ్యదేశాల 45వ సమావేశంలో కొత్త జాబితాను తయారు చేయాలని నిర్ణయించారు. పేర్లను సూచించే దేశాల జాబితాలో ఈ గ్రూపులో కొత్తగా చేరిన ఇరాన్, ఖతార్, సౌదీఅరేబియా, యూఏఈ, యెమెన్‌లను కూడా చేర్చారు.

పేర్ల నిర్ణయానికి ప్రమాణం ఏంటి?
పేర్ల ప్రతిపాదనకు సభ్యదేశాలు పాటించాల్సిన నిబంధనలు
ఈ పేర్లు రాజకీయ, మత, సాంస్కృతిక, లింగ భేదాలకు, చిహ్నాలకు అతీతంగా ఉండాలి.
సభ్యదేశాలు సూచించిన పేర్లు ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి
ఆ పేర్లలో క్రూరత్వం కనిపించకూడదు
పలకడానికి, గుర్తు పెట్టుకోవడానికి సులభంగా ఉండాలి.
ఈ పేరు ఇంగ్లీషులో ఎనిమిది అక్షరాలకంటే ఎక్కువ ఉండరాదు.
పేరు ప్రతిపాదించడంతోపాటు దాని స్పెల్లింగ్, ఉచ్ఛారణను ఇవ్వాల్సిన బాధ్యత కూడా సభ్య దేశాలదే.
సభ్యదేశాలు సూచించిన పేరును ఏ కారణంతోనైనా తిరస్కరించేందుకు ప్యానెల్‌కు అధికారం ఉంటుంది.
ఒకసారి ప్రకటించిన పేర్ల జాబితాలో కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేయవచ్చు
ఉత్తర హిందూ మహాసముద్రంలో పుట్టే తుపానులకు సూచించే పేర్లు ఒకసారి వాడిన తర్వాత మరోసారి వాడటానికి వీలులేదు. పేర్లు ఎప్పటికప్పుడు కొత్తగా, మరే ఇతర రీజినల్ సెంటర్ ఉపయోగించనిదిగా ఉండాలి.
2004లో సభ్యదేశాలు ఆమోదించిన పేర్ల జాబితాకు చివరిసారిగా వచ్చిన ఆంఫన్ తుపాను తర్వాత కాలం చెల్లింది.
అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలలో ప్రతియేటా ఐదు వరకు తుపానులు పుడుతుంటాయని, అయితే ప్రస్తుతం తయారు చేసిన జాబితా 25 సంవత్సరాలు వరకు పని చేస్తుందని సభ్యదేశాల సమన్వయకర్త మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు.

సామాన్యులు కూడా పేర్లు సూచించవచ్చు
భారత్ ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో తుపాన్ల పేర్లను సూచించడానికి సామాన్య ప్రజలకు కూడా అవకాశం కల్పించారు. అయితే ఈ పేర్లను సూచించేవారు అందరికీ సులభంగా అర్థమయ్యే పేర్లను ఇవ్వాల్సి ఉంటుంది.
ఎలాంటి వివాదాలకు చోటివ్వని, ఎవరి మనోభావాలు గాయపడని విధంగా జాగ్రత్త వహించాలి. ఆసక్తి ఉన్నవారు ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెట్రాలజీ, భారత వాతావరణ శాఖ, లోధీ రోడ్, న్యూదిల్లీ చిరునామాకు లేఖ రాసి సూచించవచ్చు.
తుపానులకు పేర్లు పెట్టడం వల్ల సహాయకార్యక్రమాల నుంచి నష్టం అంచనాల వరకు అనేక ఉపయోగాలు ఉన్నాయి.
తుపాన్లను ప్రాంతాలవారీగా ఎలా పిలుస్తారు?
దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో పుట్టే అలజడులను సైక్లోన్ అంటారు. ఉత్తర అట్లాంటిక్, మధ్య ఉత్తర పసిఫిక్, తూర్పు ఉత్తర పసిఫిక్ మహాసముద్రాలలో పుట్టే తుపాన్లను హరికేన్‌లుగా పిలుస్తారు. వాయవ్య పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే తుపానులను టైఫూన్లుగా వ్యవహరిస్తారు.
(25 నవంబర్ 2020న ప్రచురితమైన ఈ కథనాన్ని అప్‌డేట్ చేశాం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














