మల్లవల్లి ఫుడ్ పార్క్‌లో లులుగ్రూపు అనుబంధ సంస్థకు సీపీసీ బాధ్యతల అప్పగింతపై పవన్ కల్యాణ్ అనుమానాలేంటి, ప్రభుత్వం ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోని మల్లవల్లి ఫుడ్ పార్క్‌లో కోర్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) నిర్వహణను లులు గ్రూపు అనుబంధ సంస్థ ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇందుకోసం అక్టోబర్ 14న జీవో ఎంఎస్ నెంబర్ 201ని విడుదల చేసింది.
పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రతిపాదనల మేరకు ఫుడ్ పార్క్‌లోని సీపీసీ నిర్వహణను లీజు ప్రాతిపదికన అప్పగిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
మొత్తం 7.48 ఎకరాల్లో విస్తరించిన మెగా ఫుడ్ పార్క్ సీపీసీ నిర్వహణను ఏడాదికి రూ. 50 లక్షల అద్దె చొప్పున 66ఏళ్ల పాటు లీజుకు ఇస్తున్నట్టు ఆ ఉత్తర్వులలో తెలిపారు.
తదుపరి అవసరమైతే మరో 33ఏళ్ల పాటు అదనంగా లీజు పొడిగించే అవకాశం ఉందని, ఐదేళ్లకోసారి లీజు అద్దెను 5శాతం పెంచుతామని స్పష్టం చేశారు.


ఫొటో సోర్స్, APIIC
సౌకర్యాలన్నీ ఉపయోగించుకోవచ్చు
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని పారిశ్రామిక వాడలో ఫుడ్ పార్క్ ఉంది. మామిడి, టొమాటో, బొప్పాయి, జామ, అరటి వంటి పండ్లను గుజ్జుగా చేసి గంటకు ఏడు వేల 200 మిల్లీ లీటర్ల ప్యాకెట్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఇక్కడి కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంది. అలాగే 3 వేల టన్నుల సామర్ధ్యం కలిగిన కోల్డ్ స్టోరేజీ, బాయిలర్లు, కూలింగ్ టవర్స్ వంటి అన్ని సౌకర్యాలు ఈ యూనిట్‌కు ఉన్నాయి.
ఈ సౌకర్యాలన్నిటినీఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేసిన ప్రతిపాదనల మేరకు ఆ సంస్థ ఉపయోగించుకోవచ్చని జీఓలో పేర్కొన్నారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ పేరిట అక్టోబర్ 14న ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ ప్రతిపాదనల మేరకు అక్టోబర్ 8వ తేదీన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు సమావేశంలో జరిగిన చర్చల తర్వాత,ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ జీవోలో తెలిపారు.
పరిశ్రమల శాఖ డైరెక్టర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) ఎండీ తదుపరి చర్యలు తీసుకుంటారని ఆ జీవోలో ఉంది.

ఫొటో సోర్స్, UGC
పవన్ అభ్యంతరం చెప్పారా?
ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు మెగా ఫుడ్ పార్క్ కోర్ ప్రాసెసింగ్ సెంటర్ నిర్వహణ బాధ్యతను అప్పగించే విషయమై అక్టోబర్ 10న మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు అనుమానాలను వ్యక్తం చేసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
''అక్కడ పండ్లు, కూరగాయలే ప్రాసెస్ చేస్తారా లేక మాంస ఉత్పత్తి కార్యకలాపాలు ఏమైనా చేస్తారా.. గోవధ ఏమైనా జరుగుతుందా... అని పవన్ ప్రశ్నించినట్టు, గోవధకు తాను పూర్తిగా వ్యతిరేకమని ఆయన స్పష్టం చేసినట్టు’’ మీడియాలో వార్తలొచ్చాయి.
ఇందుకు అధికారుల సమాధానాలు స్పష్టంగా లేకపోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని రాష్ట్రంలో ఎక్కడా గోవధ అనుమతించమని స్పష్టం చేశారని, మల్లవల్లి యూనిట్‌లో కేవలం మామిడి, బొప్పాయి, వంటి పండ్ల ప్రాసెసింగ్‌కే అనుమతి ఇవ్వాలని ఆదేశించినట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, UGC
పవన్ అడిగింది నిజమే కానీ... : మంత్రి భరత్
''అక్కడ ఏం చేస్తారు.. గోవధ ఏమైనా జరుగుతుందా? మాంసం ప్యాకేజ్ ఏమైనా చేస్తారా.. '' అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అడిగిన మాట నిజమే, కానీ అక్కడ కేవలం పండ్ల ఉత్పత్తులనే ప్యాక్ చేస్తారు.. ప్రస్తుతానికి మనం పండ్ల ఉత్పత్తులకే అనుమతినిచ్చాం. ఇందులో అనుమానం లేదు. పవన్ కల్యాణ్‌కు కూడా ఆ విషయమే చెప్పాం.. ఇప్పుడు ఎవరికీ అభ్యంతరాలు లేవు'' అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి టీజీ భరత్ బీబీసీకి వెల్లడించారు.

ఫొటో సోర్స్, fair exports (india) private limited
జనవరికి కార్యకలాపాలు ప్రారంభం
"ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లులు గ్రూపు సంస్థే. మొన్నే కదా జీవో వచ్చింది. ఎక్విప్‌మెంట్స్ అన్నీ చూసుకుంటున్నారు. ఏదేమైనా జనవరి ఫస్ట్ కల్లా అక్కడ కార్యకలాపాలు మొదలవుతాయి" అని మంత్రి భరత్ బీబీసీతో చెప్పారు.
కేబినెట్ ఆమోదించడంతోఅక్కడ గ్రౌండింగ్ వర్క్ జరుగుతోందని ఏపీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అభిషిక్త్ కిషోర్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
మా హయాంలో ఏడాదికి రూ.1.96 కోట్ల అద్దె: అమర్‌నాథ్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే కోర్ ప్రాసెసింగ్ సెంటర్ నిర్వహణను జియాన్ బేవరేజెస్‌కి నెలకు రూ.16 లక్షల చొప్పున ఏడాదికి 1.92 కోట్లు అద్దె చెల్లించేలా నిర్ణయం తీసుకున్నామని ఆ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేసిన గుడివాడ అమర్‌నాథ్ బీబీసీకి తెలిపారు.
ఆ మేరకు 2023 ఏప్రిల్ 20న ఏపీఐఐసీ ఉత్తర్వులు కూడా ఇచ్చిందని అమర్‌నాథ్ చెప్పారు.
''అంతేకాదు ఏటా 10 శాతం చొప్పున అద్దె పెంచేలా నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇప్పుడు అదే యూనిట్‌ను ఏడాదికి కేవలం 50లక్షల అద్దెకే ఇవ్వడం, అద్దె పెంపు ఏటా కాకుండా ఐదేళ్లకు ఒకసారి మాత్రమే అది కూడా కేవలం ఐదు శాతం మాత్రమే పెంచుతామనడంపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది'' అని మాజీ మంత్రి అమర్‌నాథ్ ప్రశ్నించారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పిన 1. 92 కోట్ల అద్దె విషయంపై పరిశ్రమల శాఖ మంత్రి భరత్ ను వివరణకోసం ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన వివరణ రాగానే అప్డేట్ చేస్తాం
‘‘అయితే వైఎస్సార్‌సీపీ హయాంలో కోర్ ప్రాసెసింగ్ సెంటర్ నిర్వహణను జియాన్ బేవరేజెస్ కంపెనీ కి కేటాయించినప్పటికీ అప్పటికి యూనిట్ గ్రౌండింగ్ పనులు పూర్తి కాలేదు. ఆ తర్వాత పనులు పూర్తయినప్పటికీ జియాన్ కంపెనీ కేటాయింపులకు సంబంధించిన అమౌంట్ చెల్లించలేదు. దాంతోఆ యూనిట్ కార్యకలాపాలు మొదలు కాలేదు ఆ తర్వాత ఎన్నికలు రావడంతో అక్కడ పనులు ఆగిపోయాయి’’ అని పరిశ్రమల శాఖ జోనల్ మేనేజర్ కే. బాబ్జీ బీబీసీకి వెల్లడించారు.
అద్దె సొమ్ముల్లో వ్యత్యాసంపై తమకు సంబంధం లేదని అది ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, fair exports (india) private limited
మాంసం ఎగుమతులపై ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్ ఏం చెబుతోందంటే
ఐఎస్‌ఓ 9001:2008, ఐఎస్‌ఓS22000:2005– హెచ్‌ఏసీసీపీ సర్టిఫైడ్ కంపెనీ అయిన ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్ తమ క్లయింట్‌లకు ఉత్తమ నాణ్యత గల మాంసాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆ సంస్థ తన వెబ్‌సైట్ ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్.నెట్‌లో పేర్కొంది.
తమ ఉత్పత్తులు అత్యంత పరిశుభ్రమైనవనీ, ఇందు కోసం మాంసం, మాంసం ముక్కల సేకరణ, ప్రాసెసింగ్, ప్యాకింగ్ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తామని వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది.
మాంసంతో పాటు, తాము సుగంధ ద్రవ్యాలు, తాజా పండ్లు, కూరగాయలపాటు నాణ్యమైన దుస్తులను కూడా ఎగుమతి చేస్తామని సదరు సంస్థ పేర్కొంది.
అయితే ఏపీలో మాంసం ఎగుమతికి అనుమతివ్వలేదని మంత్రి టీజీ భరత్ బీబీసీతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, UGC
అన్నీ నిబంధనల మేరకే: మంత్రి అనగాని సత్యప్రసాద్
లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ అలీ.. ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను కలిగి ఉన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం లులు గ్రూపు సంస్థకు విజయవాడ, విశాఖల్లో మాల్స్ ఏర్పాటుకు భూములను కేటాయించింది. ఈ నేపథ్యంలో లులు సంస్థకే అన్నీ ఏకపక్షంగా కట్టబెడుతున్నారన్న విపక్షాల విమర్శలపై రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ బీబీసీతో మాట్లాడారు.
''అన్నీ నిబంధనల మేరకే భూములు, అనుమతులు ఇచ్చాం. మల్లవల్లి ఫుడ్ పార్క్‌లో కోర్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణలో పెద్ద సంఖ్యలో స్థానికులకు ఉద్యోగాలిస్తామని ఆ సంస్థ హామీనిచ్చింది. అందుకే అనుమతులిచ్చాం. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పన లక్ష్యంగానే ప్రభుత్వం ఎవరినైనా ప్రోత్సహిస్తుందే కానీ అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో ప్రయోజనం చేకూర్చదు" అని మంత్రి సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, UGC
దుబాయ్ పర్యటనలో లులు చైర్మన్‌తో చంద్రబాబు భేటీ
అక్టోబర్ 8న స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్‌కు మల్లవల్లి ఫుడ్ పార్క్‌లో కోర్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణను అప్పగించడంపై చర్చ జరిగింది.
తర్వాత ఈనెల 10న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.
ఆ తర్వాత నాలుగురోజులకు అంటే అక్టోబర్ 14వ తేదీన సదరు సంస్థకి ఆ యూనిట్ నిర్వహణను అప్పగిస్తూ జీవో వెలువడింది.
ఇక అక్టోబర్ 23న దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీని కలిశారు.

ఫొటో సోర్స్, UGC
మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ వివరాలిలా..
బాపులపాడు మండలం మల్లవల్లిలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 1,467 ఎకరాల్లో మోడల్ ఇండస్ట్రియల్ పార్కును ప్రకటించింది.ఈ పార్కుకు 1,367 ఎకరాలు, ఫుడ్‌పార్కుకు వంద ఎకరాలను కేటాయించారు.
ప్రస్తుతం భూములు కేటాయించిన పరిశ్రమల్లో నట్లు, బోల్టుల నుంచి రక్షణ రంగ విడిభాగాల వరకూ అన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి. వీటితో పాటు టెక్స్‌టైల్స్, బాక్స్‌ల తయారీ, ప్లాస్టిక్ ఉత్పత్తుల పరిశ్రమలనూ నెలకొల్పారు.
ఫుడ్‌పార్కులో ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువ ఏర్పాటయ్యాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














