బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్: డ్రైనేజీలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చూసి కన్నీరు పెట్టుకున్న తారమ్మ కథ ఏంటి?

ఫొటో సోర్స్, UGC/BBC
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం 4.47 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది.
''నష్టం పెరిగే అవకాశం ఉంది'' అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు ఎక్కువ నష్టం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో మహిళా రైతు కేడిక తారమ్మ(60) వీడియోలు వైరల్ అయ్యాయి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో తారమ్మ ఆరబోసిన ధాన్యం వర్షంలో కొట్టుకుపోయి డ్రైనేజీలో కలిసింది. ఆ ధాన్యాన్ని తిరిగి సేకరించడానికి, నాలాలో దిగి తారమ్మ చేసిన ప్రయత్నం రైతుల కష్టాలను ప్రతిబింబించిందన్న చర్చ జరిగింది.


'ఒక్క రాత్రిలో బతుకు ఆగమవతదనుకోలేదు'
హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామానికి చెందిన ఐదెకరాల సన్నకారు రైతు కుటుంబం తారమ్మది.
తెల్లవారితే తూకం వేసి అమ్మకానికి సిద్దంగా ఉంచిన తారమ్మకు చెందిన ధాన్యం రాశి గురువారం (అక్టోబర్ 30) మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షానికి మార్కెట్ యార్డ్ డ్రైనేజీలో కొట్టుకుపోయింది.
"తెల్లవారితే ధాన్యం కొనుగోలు చేస్తాం అని చెప్పారు. మరుసటి రోజు పది ట్రాక్టర్ల ధాన్యం లోడు మురికి కాల్వలో కొట్టుకుపోతూ కనిపించింది. వెంటనే అందులోకి దిగి జల్లెడతో కొంత ఎత్తుకున్నాను. రెండువారాల క్రితం అల్లుడు చనిపోయాడు, ఇప్పుడు పండిన పంట ఖరాబైంది. నాకు వరుస కష్టాలు. ఇప్పుడీ బాకీలు ఎలా కట్టాలి?'' అని వాపోయారు తారమ్మ.
'ఎకరానికి 40వేలు ఖర్చు చేశాం. ఆరు నెలల రెక్కల కష్టం నోటికాడికి వచ్చి పోయింది' అని తారమ్మ అన్నారు.
డ్రైనేజీ నీటి నుంచి ధాన్యం ఎత్తుకుంటున్న సందర్భంలో సిద్దిపేట కలెక్టర్ హైమవతితో తన బాధ మొరపెట్టుకుంటున్న తారమ్మ వీడియోలు వైరల్ అయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ , కేంద్రమంత్రి బండి సంజయ్ తారమ్మకు ఆర్థిక సహాయం అందించారు.
శుక్రవారం (అక్టోబర్ 31) న సివిల్ సప్లై శాఖాధికారులు తారమ్మ నుంచి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో మహిళల నిరీక్షణ
వ్యవసాయ మార్కెట్ కేంద్రాలు, గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీబీసీ పరిశీలించినప్పుడు తేమశాతం తగ్గేందుకు ఆరబోసిన ధాన్యం కుప్పల వద్ద కాపలాగా మహిళలే ఎక్కువగా కనిపించారు.
ధాన్యం అమ్మేందుకు పదిహేను రోజులుగా హూస్నాబాద్ మార్కెట్ యార్డ్‌లో నిరీక్షిస్తున్నానని హూస్నాబాద్ కు చెందిన కౌలు రైతు పిల్లి మానస బీబీసీతో చెప్పారు.
"పిల్లలను స్కూల్ కు పంపాక, అన్ని పనులు వదులుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ధాన్యం ఆరబోస్తూ మార్కెట్ యార్డ్ లో ఉంటున్నా. సద్దిమూట తెచ్చుకుని మధ్యాహ్న భోజనం ఇక్కడే చేస్తున్నా'' అని మానస అన్నారు.
మానస కుటుంబం ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేసింది.
5 ఎకరాల్లో పంట కోత పూర్తయి ఐదు ట్రాక్టర్ల ధాన్యం లోడు అమ్మారు.
అమ్మకానికి సిద్దంగా ఉంచిన మరో మూడు ధాన్యం లోడులు వర్షానికి తడసిపోయాయి. పొలంలో ఉన్న మూడెకరాల పంట దెబ్బతింది.

హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో ఓ మూలన ఆరబోసిన మొక్కజొన్న విత్తులను చేటలో చెరుగుతూ కనిపించారు 55ఏళ్ల గౌరవెల్లి స్వరూప.
ధాన్యంతో పాటూ మొక్కజొన్న పంటను ఆమె అమ్మకానికి తెచ్చారు.
"ధాన్యంతో పాటూ మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం కలిగింది. వర్షానికి కొట్టుకుపోయాయి. మిగిలింది తడిసి ముద్దయి వాసన పట్టాయి. ఎండలో గాలికి ఆరబోశాను. తడిసిన మొక్కజొన్న, ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలి'' అని స్వరూప అన్నారు.
తారమ్మ, మానస, స్వరూప మాదిరే చాలా మంది మహిళా రైతులు కొనుగోళ్ల కోసం నిరీక్షిస్తున్నారు.

కౌలు రైతుల కష్టం అంతా ఇంతా కాదు
వర్షాల వల్ల నష్టపోయిన వారిలో సొంత భూమి కలిగిన రైతులతో పోలిస్తే కౌలు రైతులది ఎక్కువ కష్టం అని పెసర శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.
ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి.
సుమారు 15కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్నాబాద్‌కు కుటుంబంతో సహా ఆయన వలస వచ్చారు.
15 ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తున్నారు.
కౌలు భూమిలోనే ఏర్పాటుచేసిన రెండు గదుల కంటైనర్‌లో ఆయన కుటుంబం నివసిస్తోంది.
"వర్షం నీటిలో వరి పంట ఒరిగిపోయింది. మిరప కుళ్లిపోయింది. పత్తి పంట తడిసిపోయింది. వేసిన మూడు పంటలకు నష్టం కలిగింది. పంట పెట్టుబడి మూడు లక్షలయ్యింది. పంటలు నష్టపోయినా మూడు లక్షల కౌలు డబ్బులు భూమి యజమానికి చెల్లించకతప్పదు. వర్షం రైతులను నిండా ముంచేసింది''అని శ్రీనివాస్ వాపోయారు.

తేమశాతం కారణంగా కొనుగోళ్లు ఆలస్యం..
ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం వెనుక పలు కారణాలున్నాయని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
"వర్షాలకు దెబ్బతింటుందని కాస్త ముందుగానే ధాన్యం కోస్తున్నారు. పొలం నుంచి నేరుగా 30-40 శాతం తేమ కలిగిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. అది ఆరడానికి పది రోజులు పడుతోంది. కేంద్ర నిబంధనల ప్రకారం 17 శాతం తేమతో పూర్తి తూర్పారబట్టిన ధాన్యాన్ని ప్రమాణాలకు లోబడి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.' అని సిద్దిపేట జిల్లా సివిల్ సప్లై శాఖ మేనేజర్ ప్రదీప్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, I&PR Telangana
ఎకరాకు రూ.10వేల పరిహారం-సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక అంచనా ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా 2,53,033 మంది రైతులకు చెందిన 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
ఇందులో 2.82 లక్షల ఎకరాల్లో వరి, 1.51 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి.
మొంథా ఎఫెక్ట్ తో ఎక్కువగా పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఖమ్మం జిల్లాల మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం(అక్టోబర్ 31) ఏరియల్ సర్వే చేసారు.
వరంగల్ లో బాధితులతో మాట్లాడారు.
హనుమకొండ కలెక్టరేట్ లో వరద నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా..నష్టపోయిన ప్రతి ఎకరాకు10 వేలు, వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5లక్షల పరిహారం ప్రకటించారు.
పొలాల్లో ఇసుక మేటలను ఉపాధిహామీ పథకం కింద తొలగించే ఏర్పాట్లు చేయాలని, నష్టంపై పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలని, కేంద్రం ద్వారా వచ్చే నిధులను రాబట్టాలని సూచించారు.
ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించొద్దని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














