క్లౌడ్ సీడింగ్: దిల్లీలో కృత్రిమ వర్షం ప్లాన్ ఎందుకు ఫెయిలైంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దిల్ నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్న దిల్లీలో దాన్ని కంట్రోల్ చేసేందుకు మంగళవారం కృత్రిమ వర్షం కురిపించే ప్రయత్నం చేశారు. కానీ అది విఫలమైంది.
క్లౌడ్ సీడింగ్‌కు ఉపయోగిస్తున్న సెస్నా (సెస్నా కంపెనీ తయారు చేసే ఒకరకం విమానం) ఎయిర్‌క్రాఫ్ట్‌లతో మొదట ఐఐటీ కాన్పూర్ ఎయిర్ స్ట్రిప్ నుంచి, తరువాత మేరఠ్ విమానాశ్రయం నుంచి దిల్లీలో క్లౌడ్ సీడింగ్ నిర్వహించారు.
ఈ విమానాలు ఖేక్రా, బురారి, నార్త్ కరోల్ బాగ్, మయూర్ విహార్, సడక్‌పూర్, భోజ్‌పూర్, ఇతర ప్రాంతాలలో క్లౌడ్ సీడింగ్ కోసం హైగ్రోస్కోపిక్ ఉప్పు (గాలిలోని తేమను ఆకర్షించే ఉప్పు. మేఘాల్లోని నీటి బిందువులను ఆకర్షించి, వాటిని పెద్ద బిందువులుగా మార్చి వర్షం కురిసేలా సహాయపడతాయి.) ను వదిలారు.
దిల్లీ పర్యావరణ శాఖా మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ఈ ప్రయత్నాలను ధృవీకరించారు. వివిధ తేమ పరిస్థితులలో వర్షం పడే అవకాశాన్ని అంచనా వేసేందుకు ఈ ప్రయోగాలు నిర్వహించామని పేర్కొన్నారు. ప్రయోగాలు జరిగిన రోజు వాతావరణంలో తేమ వర్షానికి అవసరమైన దానికంటే చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు.
‘‘ ఇది నగరంలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి శాస్త్రీయమైన ప్రయత్నం’’ అని సిర్సా అన్నారు.

అయితే, దిల్లీలో చలికాలంలో, పొగమంచు కారణంగా వాతావరణంలో తేమ తరచుగా తక్కువగా ఉంటుంది.
"భవిష్యత్తులో కాలుష్యాన్ని నియంత్రించడానికి దిల్లీ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలను కొనసాగిస్తుంది" అని సిర్సా అన్నారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే, ఫిబ్రవరి నాటికి వాటిని అమలు చేస్తామని ఆయన తెలిపారు.
దీని కోసం దిల్లీ ప్రభుత్వం రూ.3.21 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది.
దిల్లీలో క్లౌడ్ సీడింగ్ కార్యక్రమాన్ని ఐఐటీ కాన్పూర్ బృందం పర్యవేక్షించింది.

ఫొటో సోర్స్, ANI
ఎందుకు విఫలమయ్యాయి?
వాతావరణంలో తగినంత తేమ లేకపోవడమే ఈ ప్రయోగాలు విఫలమవడానికి కారణమని చెబుతున్నారు. క్లౌడ్ సీడింగ్ చేసిన ప్రాంతాల్లో గాలిలోని కాలుష్య కణాల (పార్టిక్యులేట్ మ్యాటర్) స్థాయిలో తగ్గుదల కనిపించిందని కూడా దిల్లీ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
కానీ, అక్టోబర్ 28 నాటి సీపీసీబీ (కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు) రియల్-టైమ్ డాటా ప్రకారం, గణనీయమైన తగ్గుదల కనిపించలేదని తేలింది.
"వర్షం పడటాన్ని సక్సెస్‌కు ప్రమాణంగా తీసుకుంటే, దిల్లీలో క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపించే ప్రయత్నం విఫలమైంది’’ అని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మణీంద్ర అగర్వాల్ అన్నారు.
మంగళవారం దిల్లీలో మేఘాలలో తేమ చాలా తక్కువగా ఉందని, అందుకే క్లౌడ్ సీడింగ్ ఫలితాలు ఆశించినంతగా లేవని అన్నారు.
"మేం త్వరలో మళ్లీ ప్రయత్నిస్తాం. బుధవారం కూడా క్లౌడ్ సీడింగ్ చేయాలని ప్లాన్ చేశాం, కానీ మేఘాల్లో మంగళవారంకంటే తక్కువ తేమ ఉంది. రాబోయే రోజులో తగినంత తేమ కనిపిస్తే, తప్పకుండా ఈ ప్రయోగాన్ని మళ్లీ చేస్తాం" అని ఆయన అన్నారు.
ఇది కృత్రిమంగా వర్షం కురిపించేందుకు భారత్‌లో దేశీయ సాంకేతికతను ఉపయోగించి చేసిన మొదటి ప్రయోగంగా చెబుతున్నారు.
‘‘దీనికి ముందు కరువు నియంత్రణ కోసం క్లౌడ్ సీడింగ్ జరిగింది. కానీ అప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ కాంట్రాక్టు తీసుకుంది. ఆ పరికరాలను విదేశాల నుంచి సేకరించారు. కాబట్టి క్లౌడ్ సీడింగ్‌లో దేశీయ టెక్నాలజీ సాయంతో చేసిన మొదటి ప్రయత్నం ఇదేనని చెప్పొచ్చు" అని ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ అన్నారు.

ఫొటో సోర్స్, VCG via Getty Images
క్లౌడ్ సీడింగ్ వల్ల కృత్రిమ వర్షాలు ఎలా కురుస్తాయి?
వర్షాభావ పరిస్థితులను, కరువును ఎదుర్కోవడానికి, శాస్త్రీయ పద్ధతిలో క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపించే ప్రయత్నం చేస్తారు.
సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, ఉప్పు వంటి పదార్థాల సూక్ష్మ కణాలను వాతావరణంలోకి విడుదల చేస్తారు.
"శాస్త్రీయ దృష్టిలో చూస్తే ఇది ఒక సులభమైన ప్రక్రియ. సన్నటి ఉప్పు మిశ్రమాన్ని మేఘాల్లోకి స్ప్రే చేస్తాం. మేఘాల్లో తగినంత తేమ ఉంటే నీటి ఆవిరి చల్లబడి, నీటి బిందువులుగా మారే ప్రక్రియ జరుగుతుంది. అది ఎక్కువగా జరిగితే వర్షం పడుతుంది. దీన్నే క్లౌడ్ సీడింగ్ అంటారు" అని ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ వివరించారు.
ఐఐటీ కాన్పూర్‌లో ఏడెనిమిదేళ్లుగా క్లౌడ్ సీడింగ్‌పై పరిశోధన జరుగుతోందని, ఈ బృందంలో పదిమంది వరకు పని చేస్తున్నారని మణీంద్ర అగర్వాల్ తెలిపారు.
దిల్లీలో క్లౌడ్ సీడింగ్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చిందని ప్రొఫెసర్ అగర్వాల్ ధృవీకరించారు.

ఫొటో సోర్స్, CG via Getty Images
ఏ దేశాలు ముందు ఉన్నాయి?
చైనా ఈ రంగంలో ప్రపంచంలో ముందంజలో ఉంది. అక్కడ ఇప్పుడు క్లౌడ్ సీడింగ్ కోసం ఏఐ సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు. అక్కడ లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఈ ప్రక్రియ జరుగుతోంది.
2025 నాటికి 55 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఈ కార్యక్రమం పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యాన్ని చైనా నిర్ణయించుకుంది. అయితే, అది పూర్తిగా సాధ్యపడలేదు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఎడారి ప్రాంతాలలో కూడా క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపిస్తున్నారు. భూమి బంజరుగా మారకుండా కాపాడటానికి సౌదీ అరేబియా ఇటీవల క్లౌడ్ సీడింగ్‌ను ప్రారంభించింది.
అమెరికాలోని కరువు పీడిత రాష్ట్రాల్లో వ్యవసాయ ప్రయోజనాల కోసం క్లౌడ్ సీడింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది.
కొన్నిసార్లు, కార్చిచ్చులను నియంత్రించడానికి క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షాలు కురిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిలిపేసిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ కూడా క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షం కురిపించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. 1960ల నుంచి ఈ టెక్నాలజీ మీద పనిచేయడం ప్రారంభించినప్పటికీ, దేశంలో మొట్టమొదటి ప్రధాన క్లౌడ్ సీడింగ్ కార్యక్రమం 2014 సంవత్సరంలో ప్రారంభమైంది.
ఈ ప్రయోగాన్ని ఏడేళ్లపాటు అంటే 2021 వరకు నిర్వహించిన ఇజ్రాయెల్, సరైన ఫలితాలు రాకపోవడంతో ఆ ఏడాదే దాన్ని నిలిపివేసింది.
ఈ ప్రయోగాల సమయంలో విమానాల నుంచి మాత్రమే కాకుండా గ్రౌండ్ స్టేషన్ల నుంచి కూడా రసాయనాలను గాలిలోకి విడుదల చేసింది ఆ దేశం. కానీ, దీనివల్ల వర్షపాతంలో పెద్దగా మార్పు రాలేదని పరిశోధనలో తేలింది.
దీనికి పెడుతున్న ఖర్చుకు, వస్తున్న ప్రయోజనాలకు పొంతన లేదని గుర్తించిన ఇజ్రాయెల్ ఈ ప్రయోగాలను నిలిపేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














