ట్రంప్-జిన్‌పింగ్ భేటీ: ప్రతీకార సుంకాల అమలు ఉంటుందా, ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఆస్మోండ్ చియా
- హోదా, బిజినెస్ రిపోర్టర్
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య దక్షిణ కొరియా వేదికగా సమావేశం జరిగింది.
ఫెంటానిల్ తయారీలో వాడే రసాయనాలను సరఫరా చేసినందుకు బదులుగా, గతంలో విధించిన టారిఫ్‌లను తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. వీటిని ఫెంటానిల్ టారిఫ్‌లుగా పిలిచేవారు. ఈ ఫెంటానిల్ టారిఫ్‌లను 20 నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
అమెరికా నుంచి పెద్ద మొత్తంలో సోయాబీన్ కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు చైనా తెలిపిందంటూ ట్రంప్ వెల్లడించారు.
చైనాతో రేర్ ఎర్త్స్ సమస్య కూడా కొలిక్కి వచ్చిందని ట్రంప్ అన్నారు.
అమెరికా, చైనా దేశాల మధ్య ఇటీవలి కాలంలో టారిఫ్‌ల పరంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇప్పుడు ఈ రెండు దేశాల వాణిజ్య ఒప్పందం కుదరనుందనే ఆశభావం నెలకొంది.
చైనా సరుకులపై 100 శాతం లెవీ వేస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు అమలు అవుతాయని తనకు అనిపించడం లేదని అమెరికా ఆర్థిక మంత్రి స్టాక్ బెసెంట్ అన్నారు.
ప్రపంచంలోని ఈ రెండు అతిపెద్ద ఆర్థికవ్యవస్థలు దాదాపు ప్రతీ రంగంలోనూ ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి.
‘‘కోవిడ్ తర్వాతి కాలంలో ప్రపంచీకరణకు కొత్త దిశానిర్దేశం చేసే సమావేశం ఇది’’ అని ఈ రెండు దేశాధ్యక్షుల సమావేశాన్ని ఉద్దేశించి సిడ్నీ టెక్నాలజీ యూనివర్సిటీలోని ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ టిమ్ హార్‌కోట్ అన్నారు.
ఈ భేటీ జరుగడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
ముందు ప్రతీకార సుంకాలు, తర్వాత ఒప్పందాలు
లిబరేషన్ డే కంటే చాలా ముందు నుంచే చైనాతో ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టారు. తన మిత్రులు, శత్రువులు అని చూడకుండా దాదాపు అన్ని దేశాలపై అమెరికా సుంకాలు విధించిన రోజు ఇది.
చైనా వాణిజ్య విధానాలు సరిగ్గా లేవంటూ ఆరోపించిన ట్రంప్ తన మొదటి పదవీకాలంలో కూడా చైనాపై సుంకాలు విధించారు.
రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ట్రంప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్ని చైనా దిగుమతులపై 10 శాతం అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు.
దీనికి ప్రతిగా చైనా కూడా సుంకాలను పెంచింది. ఆ తర్వాత ట్రంప్ కూడా చైనాపై అమెరికా సుంకాలను 20 శాతానికి పెంచడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నారు.
లిబరేషన్ డే రోజున చైనాపై 34 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు.
ఇలా ఒకరిపైఒకరి ప్రతీకార టారిఫ్‌ల ప్రక్రియ కొనసాగుతూ చివరికి అమెరికా టారిఫ్‌లు 145 శాతానికి, చైనా టారిఫ్‌లు 125 శాతానికి చేరుకున్నాయి.
తయారీదారులు, దిగుమతిదారులు ఈ సుంకాలతో బెంబేలెత్తిపోయారు.
ఇంతలో ట్రంప్, చైనా ట్రాన్స్‌షిప్‌మెంట్‌లను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.
కానీ చైనా వెనక్కి తగ్గలేదు. అమెరికాతో చర్చలకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూనే, అమెరికా రైతులను లక్ష్యంగా చేసుకొని సోయాబీన్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించింది.
ఇలాంటి చర్య ప్రతిచర్యల తర్వాత జూన్‌లో ఈ రెండు దేశాలు ఒక రాజీకి వచ్చాయి. ఒక నిర్దిష్ట ఒప్పందం కుదిరే వరకు చర్చల్ని కొనసాగించాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
చిప్ యుద్ధం
రెండు దేశాల మధ్య టారిఫ్‌లపై చర్చలు కొనసాగుతున్నాయి.
అయితే అమెరికా-చైనా సంబంధాలకు సంబంధించిన ఒక పాత వివాదం మళ్లీ తలెత్తింది.
అదేంటంటే, స్మార్ట్‌ఫోన్‌ల నుంచి కృత్రిమ మేధస్సు వరకు ఇలా ప్రతిదానికీ అవసరమైన అడ్వాన్స్ చిప్ నియంత్రణ విషయంలో పోటీ.
'ప్రపంచ కర్మాగారం' అనే గుర్తింపును దాటుకొని 'అడ్వాన్స్ టెక్నాలజీ హబ్' గా మారాలనుకుంటున్న చైనా ఆర్థిక ప్రణాళికలో చిప్ పరిశ్రమ ఒక కీలక భాగం.
అందుకే అత్యంత అధునాతన చిప్‌లను యాక్సెస్ చేయడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను పరిమితం చేసే చర్యల్ని అమెరికా మొదలుపెట్టింది.
ట్రంప్ కంటే ముందు నుంచే చైనా విషయంలో అమెరికా ఈ విధానాన్నే అనుసరించింది. అయితే, ట్రంప్ దీన్ని మరింత కఠినతరం చేశారు. కేవలం బేసిక్ సెమీకండక్టర్లు మాత్రమే చైనాకు చేరుకునేలా చేశారు ట్రంప్.

ఫొటో సోర్స్, Getty Images
రేర్ ఎర్త్స్ విషయంలో..
ఈ నెల మొదట్లో, జాతీయ భద్రతను కారణంగా చూపిస్తూ "రేర్ ఎర్త్స్"(అరుదైన ఖనిజాలు) ఎగుమతిపై కొత్త ఆంక్షలను చైనా ప్రకటించింది.
రేర్ ఎర్త్స్ ఖనిజాలపై చైనాకు దాదాపు గుత్తాధిపత్యం ఉంది. ఇవి అనేక హైటెక్ ఉత్పత్తులు తయారీలో కీలకమైనవి.
రేర్ ఎర్త్స్ విషయంలో చైనా నిర్ణయానికి ప్రతిస్పందనగా, నవంబర్ నుంచి అన్ని చైనా వస్తువులపై సుంకాన్ని 100 శాతానికి పెంచనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఆ తరువాత, రెండు దేశాలు కాస్త వెనక్కుతగ్గి, చర్చలకు అవకాశం కల్పించాయి.
అయితే, మార్కెట్లో ఉద్రిక్తతను పెంచుతూ, అస్థిరతను సృష్టిస్తున్నాయని ఇప్పటికీ ఇరుదేశాలు ఒకదానినొకటి నిందించుకుంటున్నాయి.
అక్టోబర్ 10న చైనా రేర్ ఎర్త్స్ ప్రకటనకు ట్రంప్ ఘాటుగా స్పందించడంతో, అమెరికా స్టాక్ మార్కెట్‌కు 2 ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయింది.
చైనా విధానాలు మార్కెట్ సెంటిమెంట్‌కు చాలా అరుదుగా ప్రభావితమవుతుండగా, నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ చైనాలో కేంద్రీకృతంగా ఉంది. ఇటీవలి దశాబ్దాలలో అత్యంత శక్తివంతమైన చైనా నాయకుడిగా షీ జిన్‌పింగ్‌ను పరిగణిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













