ముంబయి: 17 మంది పిల్లలు సహా 19 మంది నిర్బంధం.. పోలీసు కాల్పుల్లో నిందితుడి మృతి

ఫొటో సోర్స్, Rohit Arya/ BBC
- రచయిత, అల్పేష్ కర్కరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముంబయిలో నిర్బంధానికి గురైన 17 మంది చిన్నారులు, ఇద్దరు పెద్దవాళ్లను రక్షించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరందరినీ నిర్బంధించిన నిందితుడిని అదుపులోకి తీసుకుంటుండగా ఆయన పోలీసులపై దాడి చేశారు. దీంతో, పొవాయ్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అమోల్ వాఘ్మారే జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించారు.
ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడం కోసం కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
ఓ భవనంలో కొంతమందిని బంధించినట్లు తమకు గురువారం మధ్యాహ్నం ఫోన్ వచ్చిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. నిందితుడితో తొలుత చర్చలు జరపడానికి ప్రయత్నించామని.. అయితే ఆయన మొండిగా ప్రవర్తించడంతో భవనంలోకి ప్రవేశించామని తెలిపారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దత్తా నలవాడే తెలిపిన వివరాల ప్రకారం.. 'ముంబయి పోలీసుల బృందం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి పిల్లలందరినీ రక్షించారు. ఈ ఆపరేషన్ సమయంలో నిందితుడు గాయపడ్డారు. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, మరణించారు'.
సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, పిల్లల తల్లిదండ్రులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పోవాయిలోని స్టూడియో వెలుపల గుమిగూడారు.


ఫొటో సోర్స్, BBC/ApleshKarkare
అసలేం జరిగింది?
మీడియా కథనాల ప్రకారం… పొవాయ్ ప్రాంతంలోని మహవీర్ క్లాసిక్ బిల్డింగ్‌లో ఈ ఘటన జరిగింది. ఓ ఆడిషన్ కోసం చిన్నారులు అక్కడికి వెళ్లారు.
అయితే, రోహిత్ అక్కడి స్టూడియోలో కొంతమంది పిల్లలను బందీలుగా ఉంచారు. మధ్యాహ్నం 3 నుంచి 3:30 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. పిల్లలు గది అద్దాల నుంచి బయటకు చూస్తూ సహాయం కోరుతూ కనిపించారు.
సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం, ఇతర భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ తర్వాత, స్టూడియో బయట హై అలర్ట్ ప్రకటించారు. పిల్లలను రక్షించడానికి ఆపరేషన్ ప్రారంభించారు.
ముందుగా పిల్లలు సురక్షితంగా ఉండాలని పోలీసులు నిందితుడిని గుర్తించడానికి, ఆయన ఉద్దేశాలను తెలుసుకోవడానికి ప్రయత్నించారు. దాదాపు రెండున్నర గంటల పాటు, పోలీసులు, ఇతర భద్రతా దళాలు, నిందితుడి మధ్య కమ్యూనికేషన్ జరిగింది.
కానీ, రోహిత్ దూకుడుగా ఉన్నారు, తలుపు తెరవడానికి అంగీకరించలేదు. అనంతరం, రోహిత్ కొన్ని డిమాండ్లు చేశారు.

ఫొటో సోర్స్, Rohit Arya
ఆయన డిమాండ్లు ఏంటి?
'కొందరు వ్యక్తుల గురించి కొన్నిప్రశ్నలు అడగాలని అనుకుంటున్నా, అందుకే చిన్నారులను బంధించా' అని నిందితుడు చెబుతున్న వీడియోలను పలు వార్తాఛానళ్లు ప్రసారం చేశాయి.
ఆ వీడియోలలో, తనను తాను రోహిత్ ఆర్య అని పరిచయం చేసుకున్న నిందితుడు, తనవి "సింపుల్ డిమాండ్లు, నైతిక డిమాండ్లు, సహేతుక డిమాండ్లు" అని చెప్పారు.
తాను తీవ్రవాదిని కాదని, తనకు డబ్బులు అవసరం లేదని కూడా చెప్పారు.
"ఏ చిన్న తప్పు చేసినా నన్ను రెచ్చగొట్టినట్లే అవుతుంది" అని హెచ్చరించారు. ఆ ప్రదేశాన్ని తగలబెడతానని బెదిరించారు.
ఎలా కాపాడారు?
పిల్లలను సురక్షితంగా విడిచిపెట్టాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు నిందితుడిని హెచ్చరించారు. చివరకు, పోలీసులు స్టూడియో బాత్రూమ్ కిటికీలోంచి లోపలికి ప్రవేశించారు.
"గత కొన్నిసంవత్సరాలుగా నిందితుడి డిమాండ్లు నెరవేరకపోవడంతో ఆయన ఇలా చేయాలని నిర్ణయించుకున్నారు. పోలీసు అధికారులు బాత్రూమ్ కిటికీలోంచి లోపలికి ప్రవేశించి పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు" అని డీసీపీ దత్తా నలవాడే మీడియాతో చెప్పారు.
"ఈ ఆపరేషన్ మాకు సవాలుగా మారింది. ముంబయి పోలీసులు సరైన మార్గాన్ని కనుగొని, పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు" అని ఆయన తెలిపారు.
ఆపరేషన్ సమయంలో, రోహిత్ పోలీసులపై కాల్పులు జరిపారని, తిరిగి కాల్పులు జరపడంతో ఆయన మరణించారని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడి వద్ద ఎయిర్ గన్, కొన్ని రసాయన పదార్థాలు దొరికాయని తెలిపారు.
ఎవరీ రోహిత్ ఆర్య?
రోహిత్ ఆర్య 2017 వరకు పుణేలో నివసించారు, ఆ తర్వాత ముంబయిలో స్థిరపడ్డారు. ఆయనొక వ్యాపారవేత్త అని పోలీసులు తెలిపారు.
"పిల్లలందరూ సురక్షితంగా ఉన్నారు. వారి తల్లిదండ్రులకు అప్పగించాం. నిందితుడి నుంచి ఎయిర్ గన్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నాం. సరైన ధ్రువీకరణ తర్వాత వీలైనంత త్వరగా ఇతర వివరాలను తెలియజేస్తాం" అని ముంబయి పోలీస్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్ సత్యనారాయణ చౌదరి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














