కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట: చనిపోయిన వారి వివరాలేంటి, అసలు ప్రమాదానికి కారణం ఏమిటి?

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న సృజన
ఫొటో క్యాప్షన్, కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న యువతి సృజన
    • రచయిత, వద్ది ప్రభాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శ్రీకాకాళం జిల్లా పలాస-కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి(చిన్న తిరుపతి) ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది చనిపోయినట్లు జిల్లా అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

శనివారం(01.11.2025) ఉదయం 11:45 గంటలకు ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

ఘటనాస్థలంలోనే ఏడుగురు మృతిచెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారని చెప్పారు.

గాయపడిన 15 మందిని ఆసుపత్రికి తరలించగా, అందులో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

ఇది ప్రైవేట్ నిర్వహణలో ఉన్న ఆలయమని.. నాలుగు నెలల కిందటే దీన్ని ప్రారంభించారని చెప్పారు.

కాగా ఘటన స్థలంలో భక్తులు పూజ కోసం తెచ్చిన సామగ్రి, పువ్వులతో పాటు పెద్దసంఖ్యలో ఆధార్ కార్డులు కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

ఏపీలో ఉచిత బస్ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఆధార్ కార్డ్ చూపిస్తే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది.

ఈ ఆలయానికి వచ్చిన మహిళా భక్తుల్లో చాలామంది పరిసర ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చినట్లు చెప్తున్నారు.

క్షతగాత్రులను పరామర్శించేందుకు వచ్చిన ఏపీ మంత్రి లోకేశ్ కూడా ఫ్రీ బస్ సౌకర్యం, సోషల్ మీడియా ప్రభావం వల్ల భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

ఫొటో సోర్స్, AnamRamanarayanareddy

ఫొటో క్యాప్షన్, ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

దేవాదాయ శాఖ మంత్రి ఏం చెప్పారంటే?

కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన ఆలయం ప్రైవేట్ వ్యక్తులు నిర్వహణలో ఉందని, అసలు ఆ ఆలయం గురించి ప్రభుత్వానికి సమాచారం లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలను వెల్లడిస్తూ మంత్రి మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు.

పలాస-కాశీబుగ్గ, వేంకటేశ్వర స్వామి ఆలయం, తొక్కిసలాట ఘటన

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పలాస-కాశీబుగ్గలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆప్తులను కోల్పోయి రోదిస్తున్న కుటుంబీకులు

"కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినాన వేలాది మంది భక్తులు తరలివచ్చి, దర్శించుకునే సమయంలో తొక్కిసలాట జరిగింది. అక్కడున్న బారికేడ్లు, క్యూలైన్లు బ్రేక్ అయ్యాయి. ఒకరిపై మరొకరు పడ్డారు. కిందపడ్డవారిపై నుంచి కొందరు నడుచుకుంటూ వెళ్లారు'' అని మంత్రి ఆనం ఆ వీడియోలో చెప్పారు.

మంత్రులు, జిల్లా అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారని ఆయన తెలిపారు.

సీఎం చంద్రబాబు ఘటనపై స్పందించారని, తక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.

"ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయం కాదు, ప్రైవేట్ వ్యక్తి సొంత నిధులతో నిర్మించిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం వద్ద లేవు. దేవాదాయ శాఖ, ఇతర జిల్లా అధికారులకు కూడా ఆలయంపై సమాచారం ఇవ్వలేదు'' అని స్పష్టం చేశారు.

అచ్చెన్నాయుడు

ఫొటో సోర్స్, Kinjarapu Atchannaidu

ఫొటో క్యాప్షన్, బాధిత కుటుంబాలను ఓదార్చుతున్న ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు

రెయిలింగ్ కూలడంతోనే ప్రమాదం: మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు.

ఆలయంలో రెండు అంతస్తులు ఉన్నాయని.. ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ కాగా, అక్కడి నుంచి మెట్లెక్కి పై అంతస్తుకు వెళ్లాలని.. అక్కడే వెంకటేశ్వరస్వామి విగ్రహం ఉందని అచ్చెన్నాయుడు చెప్పారు.

ఏకాదశి కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు రావడం వారు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైఅంతస్తులోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న రెయిలింగ్‌ను పట్టుకోవడంతో అది ఊడిపడిందని.. దాంతో గందరగోళం ఏర్పడి ఈ ప్రమాదం జరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు.

ప్రమాదంలో 8 మంది మహిళలు, ఒక బాలుడు మరణించారని ఆయన చెప్పారు.

ఆలయాన్ని నిర్వహిస్తున్న 94 ఏళ్ల వృద్ధుడితో తాను స్వయంగా మాట్లాడానని ఆయన చెప్పారు.

ఏకాదశి సందర్భంగా పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ఆయన చెప్పారని.. అయితే, ఏకాదశి సందర్భంగా జిల్లాలోని ఆలయాల వద్ద ఏర్పాట్లు చేయడంలో భాగంగా ఎస్పీ ఇక్కడ వివరాలు తెలుసుకోగా... సుమారు 2 వేల మంది వస్తారని నిర్వాహకులు చెప్పడంతో ప్రకారం ఆరుగురు పోలీసులను ఇక్కడకు బందోబస్తుకు పంపించారని.. ఎస్ఐ కూడా ఇక్కడ10.30 గంటల వరకు ఉన్నారని అచ్చెన్నాయుడు చెప్పారు.

రెయిలింగ్ కూలిపోయి ఉండకపోతే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆయన అన్నారు.

కాగా, భక్తులు మెట్లెక్కుతున్నప్పుడు అక్కడి రెయిలింగ్ విరిగిపోవడంతో సుమారు 7 అడుగుల ఎత్తు నుంచి వారంతా కిందపడిపోయారని, గందరగోళమేర్పడి ఈ దుర్ఘటనకు దారితీసిందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మీడియాతో చెప్పారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం
ఫొటో క్యాప్షన్, పలాస-కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

సుమారు 2,000 మంది మాత్రమే పట్టే ఈ ఆలయానికి 25 వేల మందికి పైగా భక్తులు వచ్చారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

అయితే, ఆలయానికి 15,000 మంది వచ్చారని స్థానిక ఎమ్మార్వో అధికారిక ప్రకటనలో తెలిపారు.

"సరైన క్యూలైన్లు లేకపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు ఇప్పటివరకున్న సమాచారం. ఘటన బాధాకరం, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నాం'' అని మంత్రి ఆనం అన్నారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం,
ఫొటో క్యాప్షన్, తొక్కిసలాట తరువాత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఇలా..

ఒకే మార్గం ఉండడంతో..

ఆలయంలోకి భక్తుల ప్రవేశానికి, బయటికి వెళ్లడానికి ఒకే మార్గం ఉందని అధికారులు తెలిపారు.

"ఆలయం తెరిచినప్పుడు పెద్ద సంఖ్యలో జనం ముందుకు రావడంతో, ప్రవేశ మార్గంలో తోపులాటలు చోటు చేసుకుంది. భక్తుల ఒత్తిడి కారణంగా ఒక రెయిలింగ్ కూలిపోయింది, ఇది భయాందోళనలకు దారితీసింది. ప్రవేశం, నిష్క్రమణ రెండింటికీ ఒకే మార్గాన్ని ఉపయోగిస్తున్నారు'' అని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

శ్రీకాకుళం, పలాస, ఆలయంలో తొక్కిసలాట

ఫొటో సోర్స్, Srikakulam District officials

ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళం జిల్లా అధికారులు విడుదల చేసిన ప్రకటన.

చనిపోయింది వీరే..

ఈ ఘటనలో చనిపోయినవారి వివరాలను అధికారులు వెల్లడించారు. మృతులంతా శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు.

1. ఎదురి చిన్నమ్మి, రామేశ్వరం గ్రామం, టెక్కలి మండలం

2. రాపాక విజయ(48), పిట్టలసరియా గ్రామం, టెక్కలి మండలం.

3. మురిపింటి నీలమ్మ(60), దుక్కవన్మిపేట (వి) వజ్రపుకొత్తూరు మండలం

4. దువ్వు రాజేశ్వరి(60). బెలుపాటియ గ్రామం. మందస మండలం.

5. చిన్ని యశోదమ్మ (56), శివరాంపురం గ్రామం, నందిగాం మండలం.

6. రూప, గుడ్డిభార గ్రామం, మందస మండలం

7. లొట్ల నిఖిల్ (13), బెంకిలి గ్రామం, సోంపేట మండలం

8. డొక్కర అమ్ములమ్మ, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ

9. బోర బృంద, బోయ వీధి, మందస

జనపాల మల్లేష్
ఫొటో క్యాప్షన్, జనపాల మల్లేష్

'గుడికి రావాలని నెల నుంచే అనుకుంటున్నారు'

"మా ఊరి నుంచి రెండు ఆటోలు, బైకుల మీద జనం వచ్చారు. తొక్కిసలాటలో మా ఊరి వాళ్లు ఐదుగురు కింద పడిపోయారు. అందులో, ఎదురి చిన్నమ్మి అనే మహిళ చనిపోయారు. చాలామందికి గాయాలయ్యాయి. 11 నుంచి 12 గంటల మధ్యలో ఘటన జరిగింది'' అని టెక్కలి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన జనపాల మల్లేష్ తెలిపారు.

"ఏకాదశి రోజున పలాసలో వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి రావాలని మా ఊరి మహిళలు నెల కిందటి నుంచే అనుకుంటున్నారు. మా ఊరి నుంచి పాతిక మంది మహిళలు వచ్చారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగింది'' అని రామేశ్వరం గ్రామానికి చెందిన ఒకరు తెలిపారు.

ఆలయం గేట్లు ఒక్కసారిగా తెరవడంతో, వెనుక ఉన్న వాళ్లు తోసుకుంటూ వచ్చారని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు కూడా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)