గర్భిణులు బరువులు ఎత్తకూడదా... 7నెలల గర్భిణిగా 145 కేజీల బరువు ఎత్తిన మహిళా పోలీసు వైరల్ వీడియోపై చర్చ ఏంటి?

ఫొటో సోర్స్, Sonika Yadav
- రచయిత, ఆశయ్ యెడ్గే
- హోదా, బీబీసీ ప్రతినిధి
వెయిట్‌లిఫ్టింగ్ పోటీలో 145 కిలోల బరువు ఎత్తిన ఏడు నెలల గర్భిణి సోనికా యాదవ్ ఇటీవల వార్తల్లో నిలిచారు. ఆమె దిల్లీలో పోలీసు కానిస్టేబులుగా పనిచేస్తున్నారు.
"భారతదేశంలో గర్భధారణపై ఉన్న అపోహలను చెరిపేయాలనుకున్నా" అని ఆమె అన్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆల్ ఇండియా పోలీసు వెయిట్‌లిఫ్టింగ్ క్లస్టర్ 2025–26 పోటీకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో, ఏడు నెలల గర్భిణి అయిన సోనికా యాదవ్ 145 కిలోల బరువు ఎత్తి, 84 కిలోల కేటగిరీలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
ఆ సమయంలో వెయిట్‌లిఫ్టింగ్ బార్‌బెల్ నేలపై పడిపోయింది, వెంటనే సోనికా భర్త ఆమెకు సహాయం చేయడానికి పరుగున వచ్చారు. దీంతో అక్కడ ఉన్న చాలామందికి సోనికా గర్భిణి అనే విషయం అప్పుడే తెలిసింది.
ఏడు నెలల గర్భిణి అయినప్పటికీ 145 కిలోల బరువును ఎత్తిన సోనికా వీడియో వైరల్ అయింది. తరువాత ఆమెను చాలా మంది ప్రశంసించారు. మరోవైపు ఇది ప్రమాదకరమనే చర్చ కూడా మొదలైంది.

సోషల్ మీడియాలో చాలా మంది సోనికా నిర్ణయాన్ని ప్రశ్నించారు. కొంతమంది ఆమె నిర్ణయాన్ని"రిస్క్" "నిర్లక్ష్యం" అన్నారు. మరికొందరు ఆమె "పుట్టబోయే బిడ్డను ప్రమాదంలో పడేస్తోందని" అని కూడా అన్నారు.
అయితే తానేం చేస్తున్నానో తనకు బాగా తెలుసుని సోనికా అన్నారు.
"రెండుమూడేళ్లుగా పవర్ లిఫ్టింగ్ చేస్తున్నా. ఈ పోటీలో పాల్గొనే ముందు డాక్టర్ సలహా తీసుకున్నా. పుట్టబోయే బిడ్డపై ప్రేమలేదని చాలా మంది వ్యాఖ్యానించారు. ఇది నిజం కాదు. నా పెద్ద కొడుకును ఎంత ప్రేమిస్తున్నానో, నా కడుపులో పెరుగుతున్న బిడ్డనూ అంతే ప్రేమిస్తున్నా" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Sonika Yadav
వెయిట్ లిఫ్టింగ్‌లోకి ఎలా వచ్చారు?
సోనికా తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని 2022లోనే మొదలుపెట్టారు.
"ఆ సమయంలో అధిక బరువుతో ఉన్నా. దీనివల్ల జీవనశైలి సంబంధిత సమస్యలు అనేకం వచ్చాయి. వాటిని తగ్గించుకోవడానికి జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టా" అని ఆమె చెప్పారు.
వ్యాయామంగా మొదలైన ఆ పని, క్రమశిక్షణతో కూడిన అలవాటుగా మారింది.
"నేనింత బరువు ఎత్తగలుగుతున్నాకాబట్టి, ఏదైనా పోటీలో పాల్గొనమని నా భర్త సలహా ఇచ్చారు. జనవరి 2023లో పవర్ లిఫ్టింగ్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నా" అని సోనికా చెప్పారు.
అదే ఏడాది ఆగస్టులో, మొదటిసారి రాష్ట్రస్థాయి డెడ్‌లిఫ్ట్ పోటీలో పాల్గొని పాల్గొని సోనికా యాదవ్ బంగారు పతకం గెలుచుకున్నారు.
తర్వాత, సోనికా పోలీసు వెయిట్‌లిఫ్టింగ్ క్లస్టర్ 2025–26 కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే, తాను గర్భిణి అని తెలిసింది.
"ఒక క్షణం గందరగోళంగా అనిపించింది, నా ఆట పాడవుతుందేమో" అనుకున్నా.
కానీ ఆమె అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. తన డాక్టర్ సలహా తీసుకున్నారు.
"రెండేళ్లుగా జాతీయస్థాయిలో ఆడుతున్నాను. ఈ ఏడాది కూడా ఆడాలనుకుంటున్నాను, బ్రేక్ తీసుకోవాలని లేదని డాక్టర్‌కి చెప్పాను" అన్నారు సోనికా.
"మీ శరీరం అనుమతిస్తే, నేను కూడా అనుమతిస్తాను, కానీ మీరు మీ శరీర పరిమితులను దాటకూడదు" అని డాక్టర్ చెప్పారని సోనికా తెలిపారు.

ఫొటో సోర్స్, Sonika Yadav
ఈ సలహా సోనికాకు మార్గం చూపించింది. ఆమె జాగ్రత్తగా శిక్షణ పొందారు. తన సెషన్లను గమనించుకుంటూ, ఎప్పటికప్పుడు డాక్టర్‌ను సంప్రదించేవారు.
"రెండేళ్ల నా ప్రయాణం వల్లే ఇది సాధ్యమైందనుకుంటున్నా. ప్రెగ్నెంట్ అయ్యాకే నేనేమీ వెయిట్ లిఫ్టింగ్ మొదలుపెట్టలేదు. రెండు-మూడేళ్లుగా నా శరీరం ఈ ఆటను బాగా హ్యాండిల్ చేస్తోంది. అందుకే నేనేం చేస్తున్నానో దానిని కొనసాగించాను " అంటారు సోనికా.
"నా భర్త ఎప్పుడూ అండగా ఉన్నారు, జాగ్రత్తగా చూసుకున్నారు, మద్దతుగా నిలిచి, నా భద్రతకు భరోసా ఇచ్చారు, ఆయనే నా అతిపెద్ద బలం" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, NikhilDatar/Facebook
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, సోనికా యాదవ్ ఎప్పటికప్పుడు తన డాక్టర్ సలహా తీసుకుంటూ, నిరంతరం సంప్రదించేవారు.
ప్రతి గర్భధారణ భిన్నంగా ఉంటుందని, అందుకే ప్రతి గర్భిణీని ఇలా చేయాలని సలహా ఇవ్వడం సరైంది కాదు అని నిపుణులు అంటున్నారు.
సోనికా యాదవ్ చేసిన పని అందరూ చేయలేరు, అలా చేయకూడదు కూడా.
"ఇలాంటి విషయాలు ప్రతి వ్యక్తి శరీర స్థితి, ఆరోగ్యంపై ఆధారపడి వేరువేరుగా ఉంటాయి" అని ముంబైలోని క్లౌడ్‌నైన్ హాస్పిటల్‌లో సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ నిఖిల్ దాతర్ చెప్పారు.
"కొన్ని సందర్భాల్లో, సరైన వైద్య సలహా, శిక్షణతో మహిళలు సురక్షితంగా శారీరక బలాన్నిపెంచే వ్యాయామాలు కొనసాగించవచ్చు" అని ఆయన చెప్పారు.
సోనికా కేసు ప్రత్యేకమైనది అని ఆయన అన్నారు.
"ఆమె సంవత్సరాలుగా శిక్షణ పొందిన అథ్లెట్. చాలా మంది గర్భిణులు అంత భారీ బరువులు ఎత్తడం సురక్షితం కాదు" అని ఆయన అన్నారు.
అయితే దీనర్థం గర్భిణులు కదలకుండా ఉండాలి, ఏ పని చేయకూడదని కాదు.

ఫొటో సోర్స్, Getty Images
"తేలికపాటి వ్యాయామం సురక్షితం, ఉపయోగకరం కూడా. గర్భధారణ అంటే పూర్తిగా విశ్రాంతిలో ఉండాలనే ఆలోచనను మార్చుకోవాలి" అని డాక్టర్ దాతర్ అంటున్నారు.
నడక, యోగా, లేదా డాక్టర్ పర్యవేక్షణలో చేసే వ్యాయామాలు వంటివాటిని ఆయన సిఫార్సు చేస్తున్నారు.వీటి వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది, బరువును నియంత్రించుకోవచ్చు, అలాగే శరీరం ప్రసవానికి సిద్ధమయ్యేందుకు సాయపడుతుంది.
డాక్టర్ నిఖిల్ దాతార్ ఒక ప్రసిద్ధ పేషెంట్ రైట్స్ యాక్టివిస్ట్ ఆయన వివిధ కోర్టులలో మహిళల ఆరోగ్యానికి సంబంధించి అనేక పిటిషన్లు దాఖలు చేశారు.
"ప్రమాదం అనేది ఎంత బరువు ఎత్తారనే విషయంలో మాత్రమే ఉండదు. అది ఆ మహిళ ఫిట్‌నెస్ స్థాయి, ఆమె శరీరం స్పందించే తీరు, అలాగే సరైన వైద్యం అందించడం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్లు, ట్రైనర్లు, అథ్లెట్‌లు కలిసి పనిచేయడం చాలా అవసరం" అని ఆయన చెప్పారు.
గర్భధారణ సమయంలో మితమైన వ్యాయామం చేయడం వల్ల , గుండె ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని డాక్టర్ దాతార్ చెప్పిన విషయాలను స్పోర్ట్స్ మెడిసిన్ పరిశోధనలు కూడా సమర్థిస్తున్నాయి.
అయితే ఎక్కువగా వ్యాయామాలు చేయడం, భారీ బరువులు ఎత్తడం వంటి వాటిని కేవలం డాక్టర్ పర్యవేక్షణలోనే చేయడం సురక్షితం.
"గర్భిణి అథ్లెట్లు సాధారణ మార్గదర్శకాల్లో చెప్పిన దానికంటే ఎక్కువ తీవ్రతతో శిక్షణ పొందవచ్చు. కానీ అది కేవలం వారి ప్రోగ్రామ్ సాఫ్ట్‌గా, పరిస్థితులకు అనుగుణంగా ఉండి, నిపుణుల బృందం పర్యవేక్షణలో ఉంటేనే సురక్షితం" అని గేటరేడ్ స్పోర్ట్స్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ రివ్యూలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Sonika Yadav
"గర్భధారణ సమయంలో ఎవరూ హఠాత్తుగా లేదా ఎక్కువగా వ్యాయామం చేయకూడదు" అని డాక్టర్ దాతర్ అంటున్నారు.
సోనికా కూడా అదే చెబుతున్నారు.
"ఎప్పుడూ ట్రైనింగ్ చేయని వారు నన్ను చూసి గర్భధారణలో బరువులు ఎత్తాలని ప్రయత్నించకూడదు. నా శరీరం సంవత్సరాలుగా అలవాటు పడింది, నేను చేసిన ప్రతిదీ డాక్టర్ సలహాతోనే చేశాను" అని ఆమె చెప్పారు.
ఇందులోని రిస్క్ గురించి అడిగినప్పుడు "గర్భధారణలో శరీరం చాలా మారుతుంది. అందుకే మొదట మీ శరీరం ఏమంటుందో అదే వినాలి" అని సోనికా చెప్పారు.

ఫొటో సోర్స్, Sonika Yadav/Facebook
క్రీడలలో మాతృత్వానికి కొత్త నిర్వచనం
"నేనో తల్లి గా, ఓ అథ్లెట్‌గా ఉండగలనని పవర్‌లిఫ్టింగ్ నమ్మకాన్నిచ్చింది" అని సోనికా అన్నారు.
విదేశీ మహిళలను చూసి ప్రేరణ పొందానని చెప్పారు సోనికా.
"గర్భధారణ సమయంలో కూడా సురక్షితంగా తమ క్రీడలను కొనసాగించిన ఇతర దేశాల మహిళల గురించి చదివాను. వారు వైద్యుల మార్గదర్శకత్వంతో అలా చేయగలిగితే, మనం ఎందుకు చేయలేం?" అని ఆమె చెప్పారు.
"గర్భధారణ సమయంలో ఉన్న అపోహను చెరిపేయాలనుకున్నా. ఇది జీవితంలో ఒక దశ మాత్రమే, రోగం కాదు." అని సోనికా చెబుతున్నారు.
ఆమెకు పోటీ అనేది పతకాలకు సంబంధించిన విషయం కాదు. ఆలోచనా ధోరణి మారడమే ముఖ్యం.
"గర్భధారణను ఒక అడ్డంకిగా చూడకూడదని కోరుకుంటున్నా" అని ఆమె అన్నారు.
అమెరికన్ రన్నర్ అలిసియా మోంటానో ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్నప్పుడు 2014లో, అమెరికా అవుట్‌డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. దశాబ్దం తర్వాత, ఈజిప్ట్‌కి చెందిన కత్తి యుద్ద క్రీడాకారిణి నాడా హఫీజ్ ఏడు నెలల గర్భవతిగా పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు.
బలమనేది అనేకరూపాలలో వస్తుందని వారి కథలు గుర్తుచేస్తుంటాయంటారు సోనికా.
‘‘నా శరీరాన్ని నమ్మడానికి వారు స్ఫూర్తినిచ్చారు’’
దిల్లీకి తిరిగి వచ్చాక సోనికా ఇప్పుడు తేలికపాటి వ్యాయామం మాత్రమే చేస్తున్నారు, కానీ ఆమె దృష్టి ఎప్పుడూ తన లక్ష్యంపైనే ఉంటుంది.
"నేను జీవితాంతం ఒక అథ్లెట్‌గానే ఉండాలనుకుంటున్నా.కేవలం పతకాల కోసం కాదు, మాతృత్వం, ఆశయం ఏకకాలంలో మనగలవు ’’ అని ఆమె చెప్పారు.
గర్భధారణను తరచూ విరామంగా చూసే సమాజంలో, సోనికా యాదవ్ బరువులు ఎత్తడమే కాకుండా ఇష్టాలు, సామర్థ్యం, మాతృత్వం గురించి చర్చను కూడా లేవనెత్తారు.
గమనిక: మీరు మీ ఆహారం, చికిత్స, మందులు, వ్యాయామంలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే, తప్పనిసరిగా మీ డాక్టర్ లేదా నిపుణుల సలహా తీసుకోండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














