‘నడి సముద్రంలో పడిపోయాను.. 26 గంటలు ఈదుతూనే ఉన్నాను, జెల్లీఫిష్‌లు ఒళ్లంతా కొరికాయి.. సూర్యుడిని చూశాక ఆశ కలిగింది’

- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
2025 సెప్టెంబర్ 20వ తేదీ అర్ధరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో కన్యాకుమారి తీరానికి 16 నాటికల్ మైళ్ల(సుమారు 29 కిలోమీటర్ల) దూరంలో భారీ అలల మధ్య శివమురుగన్ సముద్రంలో తేలుతూ ఉన్నారు.
తన స్నేహితులు, సోదరుడితో కలిసి చేపలు పడుతున్న సమయంలో శివమురుగన్ పడవ నుంచి సముద్రంలో పడి అప్పటికే 5 గంటలైంది.
"నా కళ్ల ముందు, ఒక నాటికల్ మైలు (సుమారు 1.8 కి.మీ) దూరంలో, కొన్ని పడవలు నా కోసం వెతుకుతున్నాయి. సముద్రపు నీటితో నా గొంతు ఉబ్బిపోయింది, సహాయం కోసం కేకలు వేయలేకపోయాను. అమావాస్య రాత్రి సమయం, సముద్రంలో నన్ను వారు చూడలేకపోయారు. కొన్ని గంటల్లోనే, ఆ పడవలు ఒడ్డుకు తిరిగి వెళ్లిపోయాయి. నేను అక్కడే ఈదుతున్నాను" అని శివమురుగన్ బీబీసీతో చెప్పారు.
35 ఏళ్ల శివమురుగన్ తిరునల్వేలి జిల్లాలోని కూడంకుళం సమీపంలోని చెట్టికుళం తీరప్రాంత గ్రామానికి చెందినవారు.
సెప్టెంబర్ 20న, కన్యాకుమారిలోని చిన్నముట్టం ఫిషింగ్ పోర్ట్ నుంచి తన సోదరులు, ఇతర మత్స్యకారులు కలిపి మొత్తం 16 మందితో కలిసి చేపలు పట్టడానికి మోటార్ బోటులో వెళ్లిన శివమురుగన్ జారిపడి సముద్రంలో గల్లంతయ్యారు. 26 గంటల తర్వాత ఆయన్ను రక్షించారు.
"శివమురుగన్ గల్లంతైన వార్త తీరానికి చేరింది. ఆయన్ను రక్షించే ప్రయత్నాలు విఫలమవడంతో, ఇక బతికే అవకాశం లేదని మేం భావించాం. ఎందుకంటే తమిళనాడు దక్షిణ సముద్రంలో తప్పిపోతే సజీవంగా తిరిగి రావడం చాలా అరుదు" అని కన్యాకుమారికి చెందిన మత్స్యకారురాలు, రచయిత్రి పౌలిన్ చెప్పారు.
"శివమురుగన్ గల్లంతైన విషయం తెలిసిన వెంటనే, పోలీసులు ఆయన్ను రక్షించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే, ఆచూకీ లభించలేదు. కూతంకుళి గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లినప్పుడు వారికి శివమురుగన్ కనిపించారు. దీంతో వారు సెప్టెంబర్ 22 తెల్లవారుజామున ఆయన్ను రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. తరువాత శివమురుగన్‌కు చికిత్స అందించారు" అని 'కులచల్ మెరైన్ పోలీస్' అధికారులు తెలిపారు.


ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగింది?
ఈ సంఘటనకు రెండువారాల ముందు నుంచే శివమురుగన్ సముద్రంలో చేపల వేటకు వెళ్లడం ప్రారంభించారు.
శివమురుగన్ మాట్లాడుతూ "మేం సాధారణంగా చెట్టికుళం నుంచి తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరుతాం. చిన్నముట్టం చేరాక, సాయంత్రం 4.30 గంటల సమయంలో అక్కడి నుంచి చేపలు పట్టడానికి పడవలో బయలుదేరుతాం. శనివారం (సెప్టెంబర్ 20) అలా వెళ్లి, వలలు వేసి, చేపలు పట్టాం. సాయంత్రం 6 గంటలకు ఒడ్డుకు తిరిగి రావడం ప్రారంభించాం" అని చెప్పారు.
"రాత్రి 8 గంటలకు, మూత్ర విసర్జనకు పడవకు ఒక వైపునకు వెళ్లాను. చివరిసారిగా నేను జీపీఎస్‌తో చెక్ చేసినప్పుడు, కన్యాకుమారి తీరం నుంచి 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నాం. అకస్మాత్తుగా, ఒక పెద్ద అల పడవను ఢీకొట్టింది. పడవ ఒక్కసారిగా కదలడంతో నేను జారి సముద్రంలో పడిపోయాను. ఆ తర్వాత పడవను చేరడానికి ఈదుతూ ఉన్నాను, అరిచాను. కానీ, పడవ ఇంజిన్ శబ్దం వల్ల వారికి వినిపించలేదు" అని ఆయన అన్నారు.
"10-15 నిమిషాలైనా నేను తిరిగి రాలేదని, నా సోదరుడు బయటకు వచ్చి నా కోసం వెతికారు. ఏం జరిగిందో గ్రహించి, అరుస్తూ అందరినీ పిలిచారు. జీపీఎస్ పరికరాన్ని ఉపయోగించి, పడవను తిరిగి వెనక్కి తీసుకొచ్చి, నా కోసం వెతికారు. కానీ, అప్పటికే అలలు నన్ను చాలా దూరం లాక్కుపోయాయి" అని చెప్పారు శివమురుగన్.
"విశాలమైన సముద్రం, రాత్రి కావడంతో వారు నన్ను చూడలేకపోయారు. నా చేతులు పైకెత్తి, అరుస్తూనే ఉన్నా. డీజిల్ సమస్య కారణంగా వారు వెనక్కి తిరిగారు. మరికొన్ని పడవలతో తిరిగి వచ్చి, నన్ను వెతుకుతున్నారు. నేను పడవల లైట్ల వైపు చూశాను, అరిచాను, నా చేతులు ఊపాను. కొన్నిగంటల పాటు వారు తిరిగి వచ్చే వరకు అలా చేస్తూనే ఉన్నాను" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రాత్రంతా ఈదుతూనే ఉన్నాను
నిరంతరం అలలు ముఖాన్ని తాకడం వల్ల చర్మం ఊడిపోయిందని, కళ్లలోకి ఉప్పు నీరు చేరిందని, తన నోటిలోకి సముద్రపు నీరు చేరడంతో గొంతులో పుండ్లు ఏర్పడ్డాయని శివమురుగన్ చెప్పారు.
"చుట్టూ చీకటి, సముద్రం మధ్యలో తేలుతున్నా. నా మనసులో ఏకైక ఆలోచన: ఏదో విధంగా ఒడ్డుకు చేరుకోవాలి. నేను ఇక్కడే ప్రాణాలు కోల్పోతే నా కుటుంబం ఏమైపోతుందో అని ఆందోళన చెందాను. నీటిలో మరింత సులభంగా తేలగలిగేలా బరువు తగ్గడానికి నా టీ-షర్టును విప్పేశాను. ఆ తర్వాత, నా శరీరమంతా ఏదో ఒకటి కొరకడం ప్రారంభించింది" అని ఆయన గుర్తుచేసుకున్నారు.
"అవి జెల్లీ ఫిష్ వంటివి. అవి శరీరానికి అతుక్కుపోతాయని, కొంతసేపు అలాగే ఉంటే చర్మంలో రంధ్రం చేస్తాయని గ్రామంలోని కొందరు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నేను వాటిని ఒక్కొక్కటిగా తీసేశాను. నా చేతులు, కాళ్లు ఊపుతూ తేలుతూనే ఉన్నాను. నా శరీరం అలసిపోవడం ప్రారంభించింది. కొన్నిసార్లు, మునిగిపోయినా, పైకి ఈదుకుంటూ వచ్చా. మరుసటి రోజు (సెప్టెంబర్ 21) ఉదయం సూర్యుడిని చూసినప్పుడు, నేను ఏదో ఒక విధంగా ఒడ్డుకు ఈదుకుంటూ చేరుకుంటానని ఆశ కలిగింది" అని శివమురుగన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
శివమురుగన్ ఒడ్డుకు ఈదడం మొదలుపెట్టినపుడు ఆయన్ను అలలు ఇబ్బంది పెట్టాయి. ఏ దిశలో ఈదినా అలలు, గాలి మరొక దిశలోకి నెట్టాయి. పట్టుకోవడానికి ఒక్క దుంగ కూడా కనిపించలేదు, ఆ అలల తాకిడికి దూరంగా వెళుతున్నారు. దీంతో, ముందుకు వెళ్లే ప్రయత్నం మానేశారు శివమురుగన్.
"ఎంత ఈదినా, ఒకే చోట ఉండిపోయినట్లు అనిపించింది. నా కాళ్లు చలికి మొద్దుబారాయి. సూర్యుడు అస్తమించి చీకటి పడటం ప్రారంభించినప్పుడు, నా శరీరంలోని శక్తి, ధైర్యం అంతా పోయాయి. దక్షిణ సముద్రాలలో తప్పిపోయిన వారెవరూ బతకలేదని ఎందుకు చెప్పేవారో నాకప్పుడు అర్థమైంది. బాధను భరించలేక, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఆ సమయానికి నేను చనిపోయానని గ్రామంలోనూ అనుకున్నారు" అని చెప్పారు శివమురుగన్.
"మునిగిపోతున్నపుడు ఊపిరి అందేది కాదు. అయినా పైకి లేస్తూనే ఉన్నా. ఎక్కువగా సముద్రం నీటిని తాగాను. ఈసారి నేను ఖచ్చితంగా మునిగిపోతానని అనుకున్నప్పుడు, దూరంలో ఒక కాంతి కనిపించింది" అని చెప్పారు.
శివమురుగన్ బయటపడటం ఒక అద్భుతం అని రచయిత్రి పౌలిన్ అన్నారు. దక్షిణ సముద్రం ఇతర సముద్రాల కంటే ప్రమాదకరమైనదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ తమిళనాడు దక్షిణ సముద్రం రామనాథపురంలోని చెతుకరై, కీజకరై నుంచి కుమారికరై వరకు విస్తరించి ఉంది.
శివమురుగన్ తాను చూసిన కాంతి 'పడవ హెడ్‌లైట్' అని అర్థం చేసుకున్నారు.
"నేను నా బలాన్ని కూడగట్టుకుని చేతులు ఊపాను. వారు నన్ను చూశారు, పడవను నా వైపుకు తిప్పారు. నేను కూడా పడవ వైపు ఈదుకుంటూ వెళ్లాను. దాదాపు 30 నిమిషాల వరకు, నన్ను సముద్రం నుంచి ఎవరు రక్షించారు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. టీ, బిస్కెట్లు తిన్న తర్వాతే కళ్లు తెరవగలిగాను. అది కూతంకుజి గ్రామానికి చెందిన అరుళప్పన్ పడవ. ఆయన, తన మత్స్యకార బృందం సముద్రంలో వేసిన వలలను తీసుకెళ్లడానికి వచ్చారు" అని తెలిపారు.

శివమురుగన్ ఒడ్డుకు చేరుకున్న తర్వాత ఆయనకు వైద్య చికిత్స అందించారు. శివమురుగన్ వివాహితుడు, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు.
"గత నెలరోజులుగా సముద్రంలో అడుగు పెట్టలేదు. ఇకపై సముద్రంలోకి వెళ్లవద్దని నా కొడుకు, కుటుంబం నాకు చెప్పారు. నేను ఇప్పటికీ ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను. నాకు ఇలా జరగడంతో, నా సోదరుడు పని కోసం విదేశాలకు వెళ్లారు" అని అన్నారు శివమురుగన్.
"అప్పుడప్పుడు, నేను ఒడ్డున నిలబడి సముద్రం వైపు చూస్తాను. ఆ రాత్రి నేను చూసిన సముద్రం నాకు ఇప్పటికీ గుర్తుంది. నా శరీరంపై జెల్లీ ఫిష్, నా తల చుట్టూ తిరుగుతున్న మిణుగురు పురుగులు. ఆ దృశ్యాన్ని నేను మరచిపోయే వరకు సముద్రపు నీటిలో పాదాలను పెట్టలేను" అని శివమురుగన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సముద్రంలో పడిపోతే..
"ఎలాంటి నీటిలోనైనా తేలడం చాలా ముఖ్యం, నెమ్మదిగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి. అవసరమైతే, మీరు తేలుతూ ఉండటానికి చేతులు, కాళ్లను సున్నితంగా కదిలించవచ్చు. స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి మీ చేతులు, కాళ్లను విస్తరించండి. మీ శరీరం మొత్తం తేలకపోయినా, తల వెనుకకు వంచి, మీ ముఖం ఆకాశంపైకి చూసేలా నీటిపైన ఉండాలి" అని బ్రిటన్ రాయల్ నేషనల్ లైఫ్ బోట్ ఇన్‌స్టిట్యూషన్ సలహా ఇస్తోంది.
(ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














