అంటార్కిటిక్: తిమింగలాలు భూతాపాన్ని తగ్గిస్తాయా?

అంటార్కిటిక్, సముద్ర జీవరాశి, బురద

ఫొటో సోర్స్, Elisenda Balleste

    • రచయిత, కేట్ స్టీఫెన్స్, గ్విండాఫ్ హ్యూస్
    • హోదా, బీబీసీ న్యూస్ సైన్స్ టీమ్

చేతులు మొద్దుబారిపోయేలా ఉన్న చలి, నరాలు జివ్వుమనే శీతల గాలులు, హోరెత్తుతున్న సముద్రం.. ఇలాంటి వాతావరణంలో కొన్ని సార్లు రాత్రంతా పనిచేస్తూ అంటార్కిటిక్ సముద్రగర్భం నుంచి బురద తవ్వేందుకు ఎవరైనా ఎందుకు సాహసం చేస్తారు?

ఈ ఏడాది ప్రారంభంలో ఓ అంతర్జాతీయ బృందం, ప్రత్యేకించి సాహస పరిశోధకులు అంటార్కిటిక్ ద్వీపకల్పంలో ఇలాగే చేసింది. దక్షిణ మహాసముద్రానికి చెందిన శతాబ్దాల నాటి శాస్త్రీయ రహస్యాలను వెల్లడించాలనే లక్ష్యంతో ఈ పనిచేసింది.

వందేళ్లుగా సాగుతున్న వేల్స్ వేట, మానవ కార్యకలాపాలు అంటర్కిటికాను, మిగిలిన ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకునేందుకు ప్రపంచం నలుమూలలా ఉన్న శాస్త్రవేత్తలు సముద్రగర్భం నుంచి సేకరించిన బురదను విశ్లేషించనున్నారు.

సముద్రానికి, వాతావరణానికి మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నంలో ఈ పరిశోధన భాగం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అంటార్కిటిక్, సముద్ర జీవరాశి, బురద

ఫొటో సోర్స్, Elisenda Ballest

ఫొటో క్యాప్షన్, మనిషి జీవన విధానంతో అంటార్కిటిక్‌పై ప్రభావం పడింది.

సముద్ర జీవుల చరిత్ర

దీనికోసం పరిశోధకులు పెద్ద యాపిల్ కోరర్‌‌లా ఉండే ప్రత్యేక కోరింగ్ డ్రిల్ యంత్రాన్ని ఉపయోగించారు. పరిశోధన నౌకకు దీనిని కట్టి 500మీటర్ల లోతు వరకు తవ్వేవారు.

ద్వీపకల్పం పరిసరాల నుంచి 40కిపైగా పొడవైన ట్యూబులలో సముద్రపు అడుగున ఉండే నిక్షేపాలను వారు సేకరించారు.

అంటార్కిటికా తీరంలో సముద్రజీవులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది ఒకటి. 1980ల్లో నిషేధించడానికి ముందు తిమింగలాల వేట ఎక్కువగా జరిగేది.మత్స్య సంపద, పర్యాటకం వంటివాటికి ఈ ప్రాంతం కేంద్రం.

బురదను సేకరించడం వల్ల ''చరిత్ర పుస్తకంలా'' గతానికి సంబందించిన ఆధారాలు దొరకుతాయని పరిశోధనకు నేతృత్వం వహించినవారిలో ఒకరైన బార్సిలోనా యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఎలిసెండా బల్లెస్టె చెప్పారు.

ప్రస్తుతం సముద్రాల్లో ఏ ప్రాణులు జీవిస్తున్నాయి, గతంలో ఏముండేవి, మనిషి ప్రభావానికి సంబంధించిన ఆధారాలు అన్నీ, శతాబ్దాలుగా బురద పొరలపై నిలిచిపోయాయని ఆమె చెప్పారు.

ఆ పొరలను సంరక్షించడం, అవెప్పటివో గుర్తించడం, వాటిలో ఏముందో పరిశీలించడం ద్వారా పరిశోధకులు అంటార్కిటిక్ సముద్ర జీవరాశులకు సంబంధించిన అవగాహనకు వస్తారు.

అంటార్కిటిక్, సముద్ర జీవరాశి, బురద

ఫొటో సోర్స్, Elisenda Balleste

ఫొటో క్యాప్షన్, ల్యాబ్‌లో బురదను ముక్కలు చేస్తున్న శాస్త్రవేత్తలు

ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనాసంస్థలకు తరలింపు

సముద్రపు అడుగుభాగం నుంచి సేకరించిన మట్టి నమూనాలను గడ్డకట్టేలా చేసి, తరువాత

బార్సిలోనా లోని డాక్టర్ బాలెస్టే ప్రయోగశాలకి తరలించారు.

అక్కడ అక్కడ అంటార్కిటిక్ బురదను జాగ్రత్తగా ముక్కలు చేసి వాటిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక పరిశోధనా సంస్థలకు పంపిస్తారు.

శాస్త్రవేత్తలు మట్టిపొరలను పరిశీలించి వాటి కాలాన్ని నిర్థరిస్తారు. వాటిల్లోని సూక్ష్మజీవులను గుర్తిస్తారు. కాలుష్యం స్థాయిని కొలుస్తారు. ఆ మట్టిలో ఎంత కార్బన్ నిక్షిప్తమై ఉందో ఉందో లెక్కిస్తారు.

ఇది కాన్వెక్స్ సీస్కేప్ సర్వే అనే మిషన్‌లో భాగం. సముద్రానికి, వాతావరణానికి ఎలాంటి సంబంధం ఉందనే విషయాన్ని మెరుగ్గా అర్ధం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీలు, పరిశోధనా సంస్థలు ఈ మిషన్‌లో భాగస్వామ్యమయ్యాయి.

అంటార్కిటికా సముద్ర జీవరాశులపై 20 ఏళ్లకు పైగా పరిశోధనలు చేసిన సముద్ర శాస్త్రవేత్త క్లైరె అల్లెన్, ఇలాంటి మట్టినమూనాలు చాలా కీలకమైనవని చెప్పారు.

''1950కి ముందు అంటార్కిటికా ఎలాంటి పర్యవేక్షణా సామర్థ్యం లేనప్పుడు, కాలక్రమేణా మారిన వాతావరణం లేదా భౌతిక లక్షణాల గురించి అవగాహన పొందడానికున్న ఏకైక మార్గం అవక్షేప, ఐస్ నమూనాలు మాత్రమే'' అని ఆమె చెప్పారు.

అంటార్కిటిక్, సముద్ర జీవరాశి, బురద

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తిమింగలాల వేట వల్ల అంటార్కిటిక్‌లో అనేక జాతులు అంతరించిపోయాయి.

డీఎన్ఏ విశ్లేషణ కోసం కొత్తగా సేకరించిన నమూనాలను అన్ని జీవ ప్రక్రియలు నిలిచిపోయేంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాలి.

డాక్టర్ బల్లెస్టె వాటిని భారీ ఫ్రీజర్ నుంచి బయటకు తీసి, మాకు సంక్షిప్తంగా చూపించారు.

వాటిని మైనస్ 80 డిగ్రీల వద్ద ఉంచడం ద్వారా అవి నిర్వీర్యం కాకుండా చూస్తున్నామని వివరించారు. ఇవి డిఎన్ఎ విశ్లేషణ కోసం ఉపయోగపడతాయి అని వివరించారు.

ఈ రంగంలో ఇటీవలి సంవత్సరాలలో వేగంగా అభివృద్ధి చెందిన సైన్స్ కారణంగా నీరు, మట్టి, గాలి నుంచి కూడా జన్యుసమాచారాన్ని సేకరించగలిగే సామర్థ్యాన్ని అందిస్తోంది.

సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ కార్లోస్ ప్రెక్లర్ ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్నారు అంటార్కిటికాలో దాదాపు వందేళ్ల తిమింగలాల వేట సముద్రాన్ని మన వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేసిందో కొలిచే పనిలో ఉన్నారు.

కార్బన్ వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్‌గా విడుదలైనప్పుడు భూమిని వేడెక్కిస్తుంది.

ఎలాంటి ప్రక్రియలు పెద్ద మొత్తంలో కార్బన్‌ను గ్రహించి నిక్షిప్తం చేసుకోగలవలనే అంశం భూతాపాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

"తిమింగలాలు చాలా పెద్ద జంతువులు కాబట్టి, వాటి శరీరాల్లో కార్బన్ ఎక్కువ నిల్వ ఉంటుంది," అని డాక్టర్ ప్రెక్లర్ చెప్పారు.

ఇప్పుడు ఆయనకు, ఆయన సహచర శాస్త్రవేత్తలకు ఆసక్తి కలిగిస్తున్న విషయం ఏమిటంటే ఈ తిమింగలాలు మరణించినప్పుడు, వాటి శరీరాల్లో ఉన్న కార్బన్ ఎంత భాగంసముద్రపు అడుగునకి వెళ్లి తిరిగి వాతావరణంలోకి రాకుండా అక్కడే నిక్షిప్తమైపోతుంది?

"మేంఅవక్షేపాలలో తిమింగలాల డీఎన్ఏ, కార్బన్ స్థాయిని కొలవగలం," అని డాక్టర్ ప్రెక్లర్ చెప్పారు.

" భారీ వేట కారణంగా భారీగా తిమింగాలు అంతరించకపోముందు ఏం జరిగిందనే విషయం అంచనా వేయవచ్చు’’ అని ఆయన చెప్పారు.

ఇది ఈ భారీజీవులు భూ వాతావరణంలోని ఎంతమొత్తం కార్బన్‌ను గ్రహించగలవనే విషయాన్ని తెలుసుకునేందుకు సహాయపడుతుంది. ఇది వాతావరణ మార్పులపై జరుగుతున్న పోరుకు సహాయకారి అవుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)