బాహుబలి ది ఎపిక్: ఒక్కటొక్కటి కాదు రెండు బాహుబలులు కలసి ఒకేసారి వస్తే ఎలా ఉంటుందంటే..

బాహుబలి

ఫొటో సోర్స్, FB/Baahubali

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం

బాహుబ‌లి- ది ఎపిక్ థియేట‌ర్‌లోకి వ‌చ్చింది. 2015లో సంచ‌ల‌నం సృష్టించి, 2017లో పార్ట్‌-2గా వ‌చ్చింది. రెండు సినిమాలు క‌లిపి ఒకే సినిమాగా రీ రిలీజ్ చేశారు. ఎలా ఉందంటే...

క‌థ అంద‌రికీ తెలిసిందే. మొద‌టి భాగంలో శివ‌య్య‌గా పెరిగిన మ‌హేంద్ర బాహుబ‌లి, మాహిష్మ‌తికి వెళ్లి త‌ల్లి దేవ‌సేన‌ని విడిపిస్తాడు. అత‌ని తండ్రి అమ‌రేంద్ర బాహుబ‌లి గురించి క‌ట్ట‌ప్ప చెబుతాడు.

బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు? రెండేళ్లు ఈ స‌స్పెన్స్‌ భ‌రించి పార్ట్ -2 చూశారు.

సెకండ్ పార్ట్‌లో బాహుబ‌లి దేవ‌సేన ప్రేమ‌, శివ‌గామి అపార్థం, భళ్లాలుడి కుట్ర‌, ఫైన‌ల్‌గా విల‌న్ అంతం.

ప్రేక్ష‌కుల్ని అద్భుత ర‌సంలో ముంచిన ఈ సినిమా పేరు మీద రికార్డులు కూడా బాగానే ఉన్నాయి. తెలుగు సినిమాను ప్ర‌పంచ స్థాయికి తీసుకువెళ్లిన సినిమాగా దీన్ని అభివర్ణిస్తున్నారు సినీ విమర్శకులు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రానా, ప్రభాస్

ఫొటో సోర్స్, FB/RANA

ఇదో ఎడిటింగ్ అద్భుతం...

రెండు భాగాలు క‌లిపి రెండు గంట‌లు ఎడిట్ చేసి 3.40 గంట‌ల నిడివితో విడుద‌ల చేశారు. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు ఫ‌స్ట్ పార్ట్, త‌ర్వాత మిగ‌తా.

ఇదో ఎడిటింగ్ అద్భుతం. రెండు గంట‌ల సినిమా క‌ట్ చేసినా గూస్‌బంప్స్ సీన్స్ మిస్ కాలేదు.

ఫ‌స్ట్ పార్ట్‌లో ప‌చ్చ‌బొట్టేసిన , ఇరుక్కుపో పాట‌లు లేవు. సెకండాఫ్‌లో ఒక పాట తీసేశారు. త‌మ‌న్నా ల‌వ్ స్టోరీని వాయిస్ ఓవ‌ర్‌తో లాగేశారు.

సుదీప్ సీన్ తీసేశారు. మిగ‌తా అంతా ట్రిమ్ చేశారు. కొత్త సీన్స్ యాడ్ అయ్యాయ‌ని అన్నారు కానీ, వాటిని మ‌నం గుర్తించ‌లేం. ఫైటింగ్ సీన్స్ షార్ప్‌గా ఎడిట్ చేశారు.

మాహిష్మతి సామ్రాజ్యం

ఫొటో సోర్స్, youtube/Screenshot

బిగ్ స్క్రీన్‌పై మాహిష్మతి మరోసారి

ఎమోష‌న్‌ని పీక్స్‌కి తీసుకెళ్లే స‌న్నివేశాలు య‌ధాత‌థంగా ఉన్నాయి. భళ్లాలుడి కొడుకు త‌ల న‌రికే సీన్, దేవ‌సేన‌ని అవ‌మానించిన వాడి త‌ల న‌రికే సీన్, కాల‌కేయుల‌తో యుద్ధం, శివ‌గామి, క‌ట్ట‌ప్ప‌ల క్లైమాక్స్ సీన్‌, ఇవి చూస్తున్న‌పుడు థియేట‌రంతా ప‌దేళ్ల క్రితంలా ద‌ద్ద‌రిల్లి పోవ‌డం విశేషం.

ఈ ప‌దేళ్ల‌లో సినిమా రూపు రేఖ‌లు మారిపోయాయి. బాహుబ‌లికి మించిన గ్రాఫిక్స్ చూశాం. అయితే అప్ప‌టికి ఉన్న టెక్నాల‌జీతో రాజ‌మౌళి సృష్టించిన మాహిష్మ‌తి అబ్బుర‌ప‌రుస్తుంది.

టెక్నిక‌ల్‌గా తీసుకున్న శ్ర‌ద్ధ మ‌ళ్లీ ఒక‌సారి బిగ్ స్క్రీన్‌పై చూస్తున్న‌పుడు కొత్త అనుభూతిని క‌లిగిస్తుంది.

బాహుబలి

ఫొటో సోర్స్, FB/prabhas

థియేటర్ ఎక్స్‌పీరియన్స్

ఇళ్ల‌లో టీవీలో చూడ‌టం వేరు. రెండు భాగాలు క‌లిపి థియేట‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ వేరు. అయితే ఇంట‌ర్వెల్‌తో క‌లిపి నాలుగు గంట‌లు.

ఇంకో అర‌గంట త‌గ్గించి ఉండాల్సింది. పాట‌లు, ఎమోష‌న‌ల్ సీన్స్ ఎగిరిపోయే ప్ర‌మాదం ఉంది కాబ‌ట్టి ఆ ప‌ని చేసిన‌ట్టు లేదు.

ఇప్పుడు ఈ రీ రిలీజ్ ఎందుకంటే బాహుబ‌లి బ్రాండ్ కొన‌సాగింపు ఉంది కాబ‌ట్టి. యానిమేటెడ్‌ బాహుబ‌లి పార్ట్ -3గా వ‌స్తున్నాడు.

టీజ‌ర్‌ని ఇంట‌ర్వెల్‌లో వేశారు. జాన‌ప‌ద బాహుబ‌లికి మైథాల‌జీ మిక్స్ చేశారు. రెండు లోకాల క‌థ‌గా రాబోతోంది.

మ‌హారాజు బాహుబ‌లి దైవ స్వ‌రూపంగా మారితే జ‌నం ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

బాహుబలి మూవీ

ఫొటో సోర్స్, FB/Arka media

కిక్కే వేరు..

క‌రోనా త‌ర్వాత ప్రేక్ష‌కుడికి ప్ర‌పంచ సినిమా అందుబాటులోకి వ‌చ్చింది. అత‌ని స్థాయి కూడా పెరిగింది. బాహుబ‌లి లాంటి వెబ్ సిరీస్‌లు ఎన్ని చూసినా బాహుబ‌లి ఇచ్చే కిక్ వేరు. థియేట‌ర్లు కిట‌కిట‌లాడ‌టం ఇందుకు నిద‌ర్శ‌నం.

ప‌దేళ్ల క్రితం ఒక ఫ్లోలో చూస్తున్న‌పుడు చాలా విష‌యాలు గ‌మ‌నించ‌లేం. ఇన్నేళ్ల త‌ర్వాత అర్థ‌మ‌య్యేది ఏమంటే సెంథిల్‌కుమార్ కెమెరా, కీరవాణి సంగీతం హాలివుడ్ స్థాయిలో ఉన్నాయ‌ని.

బాహుబలి మూవీ

ఫొటో సోర్స్, youtube/screenshot

బ్రేక్ ఎలా ఇచ్చారంటే..

ఫైన‌ల్‌గా క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న గురించి ఓ సరదా క్యాప్షన్‌‌తో ఇంటర్వెల్‌‌ బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి. అదేంటో తెరమీద చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్: షార్ప్ ఎడిటింగ్‌

మైన‌స్ పాయింట్: 3.40 గంట‌ల నిడివి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)