మహిళా డీఎస్పీపై దొంగతనం కేసు, సీసీటీవీలో రికార్డైన ఘటన

డీఎస్పీ కల్పనా రఘువంశీ , దొంగతనం కేసు

ఫొటో సోర్స్, Vishnukant Tiwari/BBC

ఫొటో క్యాప్షన్, సీసీటీవీ ఫుటేజ్, ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు డీఎస్పీ కల్పనా రఘువంశీపై దొంగతనం కేసు నమోదు చేశారు.
    • రచయిత, విష్ణుకాంత్ తివారీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో డీఎస్పీ కల్పనా రఘువంశీపై దొంగతనం కేసు నమోదైంది. ఆమె తన స్నేహితురాలు ప్రమీలా తివారీ ఇంట్లో నుంచి రూ. 2 లక్షల నగదు, మొబైల్ ఫోన్ దొంగిలించినట్లు ఆరోపణలు వచ్చాయి.

సెప్టెంబర్ 24న జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. గణేష్ నిమజ్జనం రోజున కల్పనా రఘువంశీ తన ఇంటికి విందుకు వచ్చారని ప్రమీలా తివారీ చెప్పారు. ఆమె ఇలా చేస్తారని, కలలో కూడా ఊహించలేదని అన్నారు.

ఈ సంఘటన తర్వాత, భోపాల్ పోలీసులు డీఎస్పీ కల్పనా రఘువంశీపై దొంగతనానికి సంబంధించిన సెక్షన్ల కింద(బీఎన్ఎస్) కేసు నమోదు చేశారు. నిందితురాలు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, ఆమె కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో కలకలం రేగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఫిర్యాదుదారు ఏం చెప్పారు?

ప్రమీలా తివారీ ఒక బీమా కంపెనీలో పనిచేస్తున్నారు, ఆమె సింగిల్ మదర్.

"నా కూతురి ఫీజు చెల్లించడానికి డబ్బును విత్‌డ్రా చేశా. మా నాన్న నుంచి లక్ష రూపాయలు తీసుకున్నా. మిగిలిన డబ్బును కొంతమంది స్నేహితుల నుంచి అప్పుగా తీసుకున్నా. నా కూతురు నీట్ పరీక్షకు సిద్ధమవుతోంది, కాబట్టి ఆమె ట్యూషన్ కోసం ఈ డబ్బును తెచ్చాను" అని ప్రమీలా చెప్పారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. సెప్టెంబర్ 24 సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో, ప్రమీల తన మొబైల్ ఫోన్‌ను వంటగదిలో ఛార్జింగ్ పెట్టి, స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఇంటి తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఆమె కూతురు మరొక గదిలో చదువుకుంటున్నారు. అదే సమయంలో ఈ దొంగతనం జరిగింది.

"నేను స్నానం చేసి బయటకు వచ్చేసరికి, మొబైల్ ఫోన్ కనిపించలేదు. అమ్మాయి ఫీజు కోసం ఇంటి హాలులో ఉన్న బ్యాగ్‌లో ఉంచిన రెండు లక్షల రూపాయలు (రూ. 500 నోట్ల నాలుగు కట్టలు) కూడా కనిపించలేదు" అని ప్రమీల అన్నారు.

ఆ తర్వాత, ప్రమీల తన కూతురుతో కలిసి ఇంట్లో వెతికి, పక్కింటివారి సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేశారు. ఆ ఫుటేజీలో తన స్నేహితురాలు కల్పన రఘువంశీ తన ఇంటికి రావడం కనిపించిందని ప్రమీల చెప్పారు.

"ఆమె లోపలికి వచ్చినప్పుడు ఆమె చేతిలో ఏమీ లేదు. కానీ, ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఒక చేతిలో డబ్బుల కట్ట, మరో చేతిలో పర్సు ఉంది. రెండు సిమ్ కార్డులున్న నా శాంసంగ్ మొబైల్, డబ్బును ఆమె దొంగిలించారు" అని ప్రమీల ఆరోపించారు.

డీఎస్పీ కల్పనా రఘువంశీ

ఫొటో సోర్స్, Vishnukant Tiwari/BBC

ఫొటో క్యాప్షన్, ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ కల్పనా రఘువంశీ

'డోర్ బెల్ కొట్టకుండా లోపలికి వచ్చి'

ఐదారేళ్ల కిందట బీపీఎల్ కార్డు విషయంలో డీఎస్పీ కల్పనను కలిసినట్లు ప్రమీల బీబీసీతో చెప్పారు. అప్పటి నుంచి తమ మధ్య స్నేహం మొదలైందని.. కల్పన తన ఇంటికి రావడం ప్రారంభించినట్లు చెప్పారు.

"దొంగతనానికి ముందు, గణేష్ నిమజ్జనం రోజున కల్పన మా ఇంటికి వచ్చారు. ఇంట్లో భోజనం చేసి, వెళ్లిపోయారు. ఆమె ఇలా చేస్తారని కలలో కూడా ఊహించలేదు" అని ప్రమీల అన్నారు.

"కల్పన ఆ రోజు ఇంటికి వచ్చారు, ఫోన్ చేయలేదు, డోర్ బెల్ కొట్టలేదు. మామూలుగానే లోపలికి వచ్చి బయట ఉంచిన నా పర్సును దొంగిలించారు" అని ప్రమీల చెప్పారు.

‘కల్పన చర్యలు నా కూతురు చదువు, భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. నా కూతురు ఫీజు చెల్లించలేకపోతున్నా, ఆమె ట్యూషన్ ఆగిపోవచ్చు. నేను ఒంటరి తల్లిని, మళ్లీ అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?. దీని గురించి ఆలోచిస్తే నా గుండె బరువెక్కుతోంది" అని అన్నారు ప్రమీల.

ఈ సంఘటనతో చాలా కలత చెందానని, తన కుటుంబ సభ్యులను సంప్రదించిన తర్వాత, ఫిర్యాదు చేయాలని అక్టోబర్ 2న నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు.

భోపాల్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ బిట్టు శర్మ

ఫొటో సోర్స్, Vishnukant Tiwari/BBC

ఫొటో క్యాప్షన్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు భోపాల్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ బిట్టు శర్మ తెలిపారు.

పోలీసులు ఏమన్నారు?

"ఫిర్యాదుదారు మొబైల్ ఫోన్ నిందితురాలి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నాం. మీడియాలో చూపిస్తున్న సీసీటీవీ ఫుటేజీలో నిందితురాలు ఇంట్లోకి వచ్చి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆమె చేతిలో డబ్బు కూడా కనిపిస్తోంది" అని భోపాల్‌లో విధులు నిర్వహిస్తున్న అదనపు పోలీసు సూపరింటెండెంట్ బిట్టు శర్మ విలేకరులతో చెప్పారు.

అయితే రూ. 2 లక్షల నగదు ఇంకా దొరకలేదని పోలీసులు తెలిపారు. నిందితురాలైన డీఎస్పీపై శాఖాపరమైన విచారణ ప్రక్రియను పోలీసు ప్రధాన కార్యాలయం ప్రారంభించింది.

పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక సీనియర్ పోలీసు అధికారి బీబీసీతో మాట్లాడుతూ.. "ఇలాంటి సంఘటన పోలీసులపై అపనమ్మకాన్ని కలిగించొచ్చు. ఈ కేసును ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తామని, దోషులుగా తేలితే ఎవరినైనా వదిలిపెట్టకూడదనే విషయంలో సీనియర్ అధికారుల వైఖరి స్పష్టంగా ఉంది" అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)