జపాన్‌‌లో ఎలుగుబంట్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు.. వేటగాళ్లను నియమించడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం

BEAR

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కోహ్ ఈవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జపాన్‌లో ఇటీవల ఎలుగుబంట్ల దాడులు పెరుగుతుండడంతో ఆ సమస్య పరిష్కారానికి వేటగాళ్లను నియమించుకోవాలనే ఆలోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం.

నివాస ప్రాంతాల్లోకి చొరబడుతూ ప్రజలపై దాడులు చేస్తున్న ఎలుగుబంట్ల సమస్య నుంచి బయటపడడానికి లైసెన్స్‌డ్ హంటర్లను, ఇతర సిబ్బందిని నియమించుకునేందుకు కావాల్సిన నిధులను కేటాయించనున్నట్లు ఆ దేశ పర్యావరణ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.

దేశంలో పెరుగుతున్న ఎలుగుబంట్ల సమస్యను పరిష్కరించడం కోసం గురువారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రతిపాదించిన వివిధ చర్యల్లో వేటగాళ్ల నియామకం ఒకటి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"ప్రజా భద్రతకు తీవ్రమైన ముప్పు"

జపాన్‌లో ఎలుగు బంట్ల దాడుల కారణంగా ఈ ఏడాది 12 మంది చనిపోయారు.

2000 సంవత్సరం నుంచి ఎలుగుబంట్ల దాడుల కేసులను ట్రాక్ చేయడం జపాన్‌లో మొదలైంది. అప్పటి నుంచి ఇలాంటి దాడుల్లో ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి.

మరణించినవారిలో హొక్కాయిడోలో న్యూస్ పేపర్ డెలివరీ బాయ్‌తో పాటు ఇవేట్‌లోని ఓ గార్డెన్‌లో మరణించిన 67 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నారు.

ఎలుగుబంట్లను ప్రజల భద్రతకు తీవ్రమైన ముప్పుగా ప్రభుత్వం పేర్కొంది.

అలాగే పోలీసు అధికారులు తమ రైఫిళ్లతో ఎలుగుబంట్లను షూట్ చేసేందుకు అనుమతించాలనే విషయం కూడా పరిశీలనలో ఉంది.

ఎలుగుబంట్ల సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలకు సంబంధించిన విధానాలను నవంబర్ నెల మధ్య నాటికి ఖరారు చేయాలని భావిస్తున్నారు.

జపాన్‌లో సూపర్ మార్కెట్లు, హైస్కూళ్లలోకి ఎలుగుబంట్లు ప్రవేశించిన ఘటనలున్నాయి. అంతేకాకుండా రోజువారీ పనుల కోసం వెళ్తున్న ప్రజలపైనా దాడి చేస్తున్నాయి.

జపాన్‌లో జపనీస్ బ్లాక్ బేర్, బ్రౌన్ బేర్ అనే రెండు రకాల ఎలుగుబంట్లు ఉన్నాయి. వీటిలో బ్రౌన్ బేర్స్ హొక్కాయిడో ద్వీపంలో ఎక్కువగా ఉంటాయి. ఇవి భారీగా ఉండడంతో పాటు దూకుడుగానూ ఉంటాయి.

ఎలుగుబంట్లు ఉన్నాయని హెచ్చరిస్తూ రోడ్ల పక్కన పెట్టిన బోర్డులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలుగుబంట్లు ఉన్నాయని హెచ్చరిస్తూ రోడ్ల పక్కన పెట్టిన బోర్డులు

ఈ ఏడాది ఎలుగుబంట్ల దాడుల కారణంగా 100 మందికి పైగా గాయపడ్డారు. అందులో ఒక విదేశీయుడు కూడా ఉన్నారు. ఓ పర్యటక ప్రాంతంలోని బస్ స్టాప్ దగ్గర అతనిపై ఎలుగుబంటి దాడి చేసింది.

అకిటా ప్రిఫెక్చర్ ప్రాంతంలో ఎలుగుబంట్ల సమస్య ఎక్కువగా ఉంది. ఉత్తర జపాన్‌లోని ఈ ప్రాంతం పెద్ద పర్వత శ్రేణులతో ఉంటుంది. ఇక్కడే అత్యధిక మరణాలు చోటు చేసుకున్నాయి.

ఎలుగుబంట్లను పట్టుకోవడానికి, తరిమేయడానికి అకిటా ప్రభుత్వానికి సాయం చేసేందుకు జపాన్ సెల్ఫ్-డిఫెన్స్ బలగాలను నియమిస్తామని ఈ వారంలో అధికారులు ప్రకటించారు.

"ప్రజల ప్రాణాలు, జీవనోపాధులు ప్రమాదంలో పడ్డాయి" అని ఆ దేశ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి మంగళవారం చెప్పారు.

ప్రస్తుత చట్టాల ప్రకారం ఎలుగుబంట్లను భద్రతా బలగాలు చంపేందుకు వీలు లేదు. అయితే.. వారు ఎలుగుబంట్ల వేటగాళ్లకు వాటిని పట్టుకోవడంలో, చనిపోయిన ఎలుగుబంట్లను తరలించడంలో సాయం చేయవచ్చు.

ఎలుగుబంటి సమస్యను ఎదుర్కోవడంలో ప్రజలు "నీరసించిపోయారు" అని అకిటా గవర్నర్ కెంటా సుజుకీ అన్నారు.

ఎలుగుబంట్లు, వేటగాళ్ళు

ఫొటో సోర్స్, Getty Images

తగ్గిపోతున్న వేటగాళ్ల సంఖ్య..

జపాన్‌లోని వేటగాళ్లలో చాలా మంది వృద్ధాప్యంలో ఉన్నారు. అక్కడ వేటగాళ్ల సంఖ్య కూడా తగ్గుతోంది. ఒకప్పుడు ఎలుగుబంటి వెంట్రుకలు(ఫర్), పిత్తాశయ ద్రవం(బైల్) కోసం వాటిని చంపేవారు. అయితే ప్రస్తుతం వాటికంతగా ఆదరణ లేకపోవడం ఎలుగుబంట్లను వేటాడేవారు తగ్గిపోయారు.

దీంతో నివాస ప్రాంతాల్లో ఎలుగుబంట్లు సంచరించడం పెరుగుతున్నందున ప్రజలు వాటి దాడులకు గురయ్యే ప్రమాదం పెరుగుతోంది.

వాతావరణ మార్పుల కారణంగా బీచ్‌నట్స్‌కు కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో.. ఆకలితో ఉన్న ఎలుగుబంట్లు ప్రజల ఇళ్లల్లోకి వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

నివాస ప్రాంతాలలో జనాభా తగ్గడం కూడా ఎలుగుబంట్ల దాడులకు ఓ కారణంగా ఉంది.

నివాస ప్రాంతాల్లోకి వచ్చిన ఎలుగుబంట్లను షూట్ చేయొచ్చంటూ జపాన్ ప్రభుత్వం అక్కడి గన్ రూల్స్‌ను ఇటీవల సడలించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)