ఆల్గే బ్లూమ్: దక్షిణ ఆస్ట్రేలియాలో సముద్రజీవుల మృతికి కారణం ఇదేనా?

దక్షిణ ఆస్ట్రేలియా, సముద్ర జీవులు

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, సైమన్ అట్కిన్సన్, టిఫానీ టర్న్‌బుల్
    • హోదా, బీబీసీ న్యూస్

దక్షిణ ఆస్ట్రేలియాలో భారీగా పెరిగిన శైవలాలు(ఆల్గే) అక్కడి స్వచ్ఛమైన జలాలను ఆకుపచ్చగా మార్చాయి. ఇది పెద్ద సంఖ్యలో సముద్ర జీవుల మృతికి కారణమైంది.

దక్షిణ ఆస్ట్రేలియా స్టేట్ ప్రీమియర్ దీనిని ‘ప్రకృతి విపత్తు’గా అభివర్ణించారు.

నీటిలో ఆల్గే విపరీతంగా పెరగడాన్ని ఆల్గల్ బ్లూమ్ అంటారు.

ఇది మార్చిలో ప్రారంభమైంది. ఎంతలా విస్తరించిందంటే.. ఆ ప్రభావిత ప్రాంతం ఇప్పుడు ఆస్ట్రేలియా రాజధాని ప్రాంతం కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంది.

దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం సుమారు రూ. 77 కోట్లు సాయం ప్రకటించింది. కానీ, ఫెడరల్ గవర్నమెంట్ దానిని ప్రకృతి విపత్తుగా పేర్కొనలేదు. ఈ పదాన్ని సాధారణంగా తుపానులు, వరదలు, కార్చిచ్చుల వంటి వాటికి ఉపయోగిస్తారు.

విపత్తు అని ప్రకటిస్తే ప్రభుత్వం భారీ స్థాయిలో చర్యలు తీసుకోవలసి ఉంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వాతావరణ మార్పులే కారణమా?

ఆల్గల్ బ్లూమ్ కారణంగా 400 రకాలకుపైగా సముద్ర జీవులు చనిపోయాయని, చేపలు పట్టడం, పర్యటకం వంటి స్థానిక వ్యాపారాలు ఇబ్బందుల్లో పడ్డాయని అధికారులు చెప్పారు.

ఆల్గల్ బ్లూమ్ సహజంగానే జరుగుతుంది. కానీ, అవి వెచ్చని సముద్రపు నీరు, సముద్రంలో వేడిగాలులు, వ్యవసాయ వ్యర్థాల వంటి వాటి నుంచి వచ్చే కాలుష్యం(న్యూట్రియంట్ పొల్యూషన్) కారణంగా ఎక్కువగా పెరుగుతాయి. ఇవన్నీ వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తాయి.

‘సౌత్ ఆస్ట్రేలియా’ ప్రీమియర్ పీటర్ మలినౌస్కాస్ మంగళవారం ఏబీసీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఇదొక ప్రకృతి వైపరీత్యం, దాన్ని అలాగే గుర్తించాలి. రాజకీయ నాయకులు సాంకేతిక నిర్వచనాలపై ఎక్కువగా దృష్టి సారించినప్పుడు విశ్వసనీయతను కోల్పోతారు" అని అన్నారు.

ఫెడరల్ గవర్నమెంట్ మాదిరిగానే తమ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు రూ. 77 కోట్లు నిధులు ఇస్తుందని పీటర్ చెప్పారు.

ఈ డబ్బును పరిశోధన, నీటిని శుద్ధి చేయడం, స్థానిక వ్యాపారాలకు సహాయం కోసం వినియోగిస్తామని ఆయన స్పష్టంచేశారు.

ఆల్గల్ బ్లూమ్

ఫొటో సోర్స్, Stefan Andreus courtesy Great Southern Reef

ఫొటో క్యాప్షన్, ఆల్గల్ బ్లూమ్ ప్రస్తుతం కూరోంగ్ నుంచి యార్క్ ద్వీపకల్పం వరకు వ్యాపించింది.

గ్రీన్స్ సెనేటర్ సారా హాన్సన్-యంగ్ ఆస్ట్రేలియా ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు, వారు పరిస్థితిని సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆరోపించారు.

‘బోండి బీచ్, సిడ్నీలోని ఉత్తర తీరంలో ఈ విషపూరిత ఆల్గల్ బ్లూమ్ ఏర్పడితే ప్రధానమంత్రి ఇప్పటికే అక్కడికు వచ్చి చర్యలు తీసుకునేవారు’ అని సారా అన్నారు.

దీని ప్రభావం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం దీనిని ప్రకృతి విపత్తుగా పరిగణించలేమని ఆ దేశ పర్యావరణ మంత్రి ముర్రే వాట్ సోమవారం అన్నారు.

ఆల్గల్ బ్లూమ్ ప్రస్తుతం కూరోంగ్ నుంచి యార్క్ ద్వీపకల్పం వరకు వ్యాపించింది.

ఇది పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తోంది, చనిపోయిన సముద్ర జీవులు తీరం వెంబడి కొట్టుకు వస్తున్నాయి.

'జాలర్లు ఏడుస్తున్నారు'

"ఇది చేపలకు హారర్ మూవీ లాంటిది" అని చేపల ఆవాసాలను రక్షించడానికి పనిచేసే ఓజ్ ఫిష్ అనే సంస్థకు చెందిన బ్రాడ్ మార్టిన్ అన్నారు. ఆయన మే నెలలోనే బీబీసీకి ఈ విషయాన్ని చెప్పారు.

కానీ, ఆల్గల్ బ్లూమ్ సముద్ర జీవులకే కాదు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా సమస్యలను సృష్టిస్తోంది.

కొంతమంది మత్స్యకారులకు మూడు నెలలుగా సంపాదన లేదని ఫిషింగ్ పరిశ్రమకు చెందిన కొందరు చెబుతున్నారు.

"నాకు జాలర్లు ఫోన్‌ చేసి ఏడుస్తున్నారు" అని మత్స్యకారులు, దుకాణాలకు మధ్యవర్తిగా పనిచేసే ఇయాన్ మిచెల్ ఏబీసీ న్యూస్‌తో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)