బాల్ బరువు నుంచి బౌండరీ లైను వరకు.. మహిళలు, పురుషుల క్రికెట్ రూల్స్‌లో తేడాలుంటాయా? ఏమిటవి..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
క్రికెట్ ఆటపై ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పురుషుల క్రికెట్‌కు క్రేజ్ కాస్త ఎక్కువే అయినప్పటికీ, మహిళల క్రికెట్‌కు ఆ స్థాయిలో కాకపోయినా కొంత క్రేజ్ ఏర్పడింది.
ఇప్పుడు వరల్డ్ కప్ విజయంతో అది బాగా పెరిగే అవకాశం ఉందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ కప్ మ్యాచ్‌ల సమయంలో ప్రేక్షకులు పెద్దసంఖ్యలోనే స్టేడియానికి తరలివచ్చారు. మహిళల ప్రపంచకప్ నేపథ్యంలో భారత్ ఆడిన మ్యాచ్‌లకు విశేష ఆదరణ లభించింది.
అయితే, పురుషులు, మహిళలు ఆడే క్రికెట్ మ్యాచ్‌ల మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉంటాయని చాలా మందికి తెలియకపోవచ్చు.
ఎందుకంటే, మ్యాచ్‌లకు ఉన్న ప్రధాన నిబంధనల పరంగా ఎలాంటి వ్యత్యాసాలు లేనప్పటికీ, కొన్ని విషయాల్లో మాత్రం తేడాలు ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిబంధనలు
ఈ విషయంలో 'ప్లేయింగ్ కండిషన్స్' పేరుతో ఐసీసీ రూపొందించిన నిబంధనలను బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.
ముఖ్యంగా బాల్ సైజు, బౌండరీ దూరం సహా వివిధ అంశాల్లో తేడాలు కనిపిస్తున్నాయి.
''క్రికెట్ ఆటపరంగా ఓవరాల్‌గా ఉండే నిబంధనలలో ఎక్కడా తేడాలు కనపడవు. కానీ, కొన్ని టెక్నికల్ అంశాల్లో మాత్రమే తేడాలు గమనించేందుకు వీలుంటుంది'' అని బీబీసీతో చెప్పారు క్రికెట్ విశ్లేషకులు వెంకటేశ్.
అయితే, పురుషుల క్రికెట్‌తో పోల్చితే మహిళల క్రికెట్‌కు పాపులారిటీ భారత్‌లో ఇంకా పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
పురుషుల మ్యాచ్‌ల విషయంలో వన్డేలు, టీ20, టెస్టు మ్యాచుల కోసం రూపొందించిన నిబంధనలు 2023 డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చాయి.
అలాగే మహిళల క్రికెట్ మ్యాచ్‌ల కోసం రూపొందించిన నిబంధనలు 2024 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.
వీటి ప్రకారం, మెన్స్ క్రికెట్, విమెన్స్ క్రికెట్ మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.
అయితే, కోర్ అంశాలైన వైడ్, నోబాల్, ఓవర్, అంపైర్ నిర్ణయాలు సహా కీలకమైన విషయాల్లో ఎలాంటి మార్పులు లేవని ఐసీసీ నియమావళి స్పష్టం చేస్తోంది.
''అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచుల పరంగా కీలకమైన నిబంధనల్లో మార్పులు ఏమీ ఉండవు. మహిళల క్రికెట్ విషయంలో కొన్ని విషయాల్లో మాత్రమే స్వల్ప తేడాలు ఉంటాయి'' అని హైదరాబాద్‌కు చెందిన క్రికెటర్ స్నేహదీప్తి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బాల్ సైజు
మెన్, విమెన్ ఆడే బాల్ సైజు విషయంలో తేడా ఉంటుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం, విమెన్స్ క్రికెట్ మ్యాచ్‌లో కొత్త బాల్ బరువు 140 గ్రాములకు తక్కువ కాకుండా ఉండాలి. అలాగే 151 గ్రాముల కంటే ఎక్కువ బరువు ఉండకూడదు.
ఇక బాల్ చుట్టుకొలత 21 సెంటిమీటర్లకు తక్కువ కాకుండా, 22.5 సెంటిమీటర్లకు ఎక్కువ కాకుండా ఉండాలి.
పురుషులు ఆడే క్రికెట్ మ్యాచ్‌లో కొత్తగా తీసుకునే బాల్ బరువు 155.9 గ్రాములకు తక్కువ కాకుండా 163 గ్రాములకు ఎక్కువ కాకుండా ఉంటుంది.
బాల్ చుట్టు కొలత 22.4 సెంటిమీటర్లకు తక్కువ కాకుండా, 22.9 సెంటిమీటర్లకు మించకుండా ఉండాలి.
అయితే, బ్యాట్ విషయంలో మెన్స్, విమెన్స్ క్రికెట్‌లో ఎలాంటి తేడాలు ఉండవని క్రికెటర్ స్నేహదీప్తి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓవర్ రేట్
విమెన్స్, మెన్స్ వన్డే మ్యాచ్‌ల ఓవర్ రేటు, ఇన్సింగ్స్ సమయాల్లో తేడాలు కనిపిస్తుంటాయి. ఈ విషయంలో ఐసీసీ నిబంధనలు విధించింది.
ఆ వివరాల ప్రకారం...
విమెన్స్ వన్డే మ్యాచ్‌ల విషయానికి వస్తే, ఇన్సింగ్స్(50 ఓవర్లు) మూడు గంటల 10 నిమిషాల్లో ముగియాల్సి ఉంటుంది.
సిరీస్ లేదా టోర్నమెంట్ అతిథ్యమిచ్చే దేశం కూడా సమయాల్లో మార్పులు చేసుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. విమెన్స్ వన్డే మ్యాచ్‌ల ఓవర్ రేటు గంటకు 15.79 గా ఉండాలని స్పష్టం చేసింది.
మెన్స్ వన్డే క్రికెట్ ఇన్సింగ్స్ (50ఓవర్లు) విషయానికి వస్తే, మూడున్నర గంటల సమయంగా ఐసీసీ నిర్దేశించింది. ఈ సమయం సిరీస్ లేదా టోర్నమెంట్ అతిథ్యం ఇచ్చే హోం బోర్డు తీసుకునే నిర్ణయంపైనా ఆధారపడి ఉంటుంది.
ఓవర్ రేటు విషయానికి వస్తే, గంటకు 14.28గా ఉంది. ఓవర్ రేటు మెన్స్ మ్యాచ్‌లతో పోల్చితే విమెన్ ఆడే మ్యాచ్‌లలోనే ఎక్కువగా ఉండటం విశేషం.
అయితే, ఇన్నింగ్స్‌కు ఇన్నింగ్స్‌కు మధ్య బ్రేక్ సమయం మెన్స్ మ్యాచ్‌లు, విమెన్ మ్యాచులకు సమానంగా (30 నిమిషాలు) ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
బౌండరీ దూరం
మెన్స్, విమెన్స్ క్రికెట్ పరంగా బౌండరీ దూరంలో తేడా ఉంటుందని చెప్పారు విశ్లేషకులు వెంకటేశ్.
విమెన్ ఆడే మ్యాచ్‌లలో పిచ్ సెంటర్ నుంచి బౌండరీ 70 గజాల (64 మీటర్ల) దూరానికి మించకుండా, 60 గజాల (54.86 మీటర్ల)కు తగ్గకుండా ఉండాలి. దీన్ని మ్యాచ్ టాస్ వేయడానికి ముందుగా ఎంపైర్ నిర్ణయిస్తారు.
అదే పురుషుల మ్యాచులలో బౌండరీ దూరం పిచ్ సెంటర్ నుంచి 90 గజాల(82.29 మీటర్ల)కు మించకుండా, 65 గజాల(59.43 మీటర్ల)కు తగ్గకుండా ఉండాలని ఐసీసీ చెబుతోంది.
''నిబంధనల ప్రకారం బౌండరీ దూరంలో మార్పులు ఉన్నప్పటికీ మెన్స్, విమెన్స్ ఆడే మ్యాచుల్లో కొన్నివైపులు ఉండే బౌండరీ మాత్రం ఒకే విధమైన దూరంలోనే ఉంటుంది'' అని స్నేహదీప్తి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పవర్ ప్లే లో తేడాలు
మెన్స్ మ్యాచ్‌లలో మూడు పవర్ ప్లే లకు అవకాశం కల్పించింది ఐసీసీ. దీనికి తగ్గట్టుగా ఫీల్డర్ల ఫీల్డింగ్ స్థానాలు నిర్ణయించారు.
అలాగే ఫీల్డ్ లో కనిపించే సెమీ సర్కిల్స్ విషయానికి వస్తే రెండు కనిపిస్తాయి.
వీటిలో ఒక్కొక్క దాని రేడియస్(వ్యాసార్థం) రెండువైపులా ఉన్న మిడిల్ స్టంప్ నుంచి 30 గజాలు (27.43 మీటర్లు)గా ఉంది. వీటి ఆధారంగానే పవర్ ప్లేల సమయంలో ఫీల్డర్ల స్థానాలు నిర్దేశిస్తారు.
విమెన్స్ మ్యాచ్ విషయానికి వస్తే, పవర్ ప్లే ఒక్కటేనని ఐసీసీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ పవర్ ప్లే కూడా కచ్చితంగా అమలు చేయాల్సినది. ఇది మొదటి ఓవర్ నుంచి పదో ఓవర్ మధ్య అమలు చేయాల్సి ఉంటుంది.
పవర్ ప్లే అమల్లో ఉన్న సమయంలో ఇద్దరు ఫీల్డర్లు నిర్దేశిత (రిస్ట్రిక్షన్) ఏరియాకు బయట ఉంటారు. పవర్ ప్లే లేని సమయంలో నలుగురు ఉండేందుకు వీలుంటుంది.
ఫీల్డ్‌లో రెండు సెమీ సర్కిల్స్ ఉంటాయి. వీటిల్లో ఒక్కొక్కదాని రేడియస్ (వ్యాసార్థం) 25.15 గజాలు(23 మీటర్లు) ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
టెస్టు మ్యాచ్ ఎన్ని రోజులంటే..
ఇక టెస్టు క్రికెట్‌లో మహిళా, పురుష క్రికెట్లో ప్రధానమైన తేడా ఒకటి ఉంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం పురుషులు ఆడే టెస్టు క్రికెట్ కచ్చితంగా ఐదు రోజుల మ్యాచ్ అయి ఉంటుంది.
అదే మహిళల క్రికెట్ మ్యాచ్ విషయానికి వస్తే, ఐదు రోజుల నిబంధన ఉండదు. నాలుగు రోజులు లేదా అయిదు రోజులు ఆడేందుకు వీలుంటుంది.
భారత్ తో టెస్టు మ్యాచ్ ఆడేందుకు ముందుకు వచ్చే దేశానికి చెందిన బోర్డుతో సంప్రదించి, ఇరుదేశాల బోర్డు అంగీకారం మేరకు నాలుగు రోజులా లేదా ఐదు రోజులా అనే విషయంపై నిర్ణయం తీసుకుని టెస్టు మ్యాచ్ నిర్వహిస్తారు.
మెన్స్ ఆడే టెస్టు మ్యాచ్ లో ఓవర్ రేటు గంటకు 15గా నిర్ణయించగా, విమెన్స్ టెస్టు మ్యాచ్ లో గంటకు 17 ఓవర్లను ఓవర్ రేటుగా నిర్ణయించినట్లుగా ఐసీసీ చెబుతోంది.
ఇవి కాకుండా బౌలింగ్ స్పీడ్ విషయంలో మెన్స్, విమెన్స్ బౌలర్లు విసిరే బంతులలో తేడాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














