చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెటర్లు.. ఇండియాకు ప్రపంచ కప్

ICC Women's world CUP , HarmanPreetKaur

ఫొటో సోర్స్, Getty Images

భారత మహిళల క్రికెట్ జట్టు చిరస్మరణీయ విజయం సాధించి ప్రపంచ కప్ గెలుచుకుంది.

దక్షిణాఫ్రికాతో నవీముంబయి వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంతకుముందు రెండు సార్లు ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరినప్పటికీ విజయం సాధించలేకపోయిన భారత జట్టు ఈసారి ఎలాంటి తడబాటు లేకుండా కప్ గెలిచింది.

భారత జట్టులో షెఫాలీ వర్మ 87 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. దీప్తి శర్మ 58 పరుగులు చేయడంతో పాటు బంతితోనూ రాణించి 5 వికెట్లు పడగొట్టింది.

దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్డ్ట్ 101 పరుగులు చేసినప్పటికీ ఆమె అవుటైన తరువాత వరుసగా వికెట్లు పడడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది.

దీప్తి శర్మకు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు లభించింది.

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఓవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్, మరోవైపు భారత్ బౌలర్లు

భారత్ విధించిన 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆచితూచి ఆడారు. సింగిల్స్, అప్పుడప్పుడూ బౌండరీలతో స్కోరు బోర్డును పెంచుకుంటూ పోయారు.

అయితే, 51 పరుగుల వద్ద భారత్‌కు బ్రేక్ వచ్చింది. తజ్మిన్ బ్రిట్స్‌ను అమంజోత్ రనౌట్ చేసింది. ఆ తర్వాత, కొద్దిసేపటికే ఆనికేను ఖాతా తెరవకుండానే శ్రీచరణి ఔట్ చేసింది.

అయితే, సూనేతో కలిసి కెప్టెన్ లారా వోల్వార్ట్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 52 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీని షెఫాలీ వర్మ విడగొట్టింది. రిటర్న్ క్యాచ్‌తో సూనే లూస్‌(25)ను ఔట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన మారిజాన్ కాప్(4) కూడా ఎక్కువసేపు క్రీజులో లేదు. ఆమెను కూడా షెఫాలీనే పెవిలియన్ పంపింది.

కెప్టెన్ లారా వోల్వార్డ్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ సెంచరీ సాధించింది.

ఇలా ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్న మరో ఎండ్‌లో కెప్టెన్ లారా (98 బంతుల్లో 101 పరుగులు) పోరాడింది. అయితే, భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు.

సెంచరీ అనంతరం లారా కూడా ఔట్ అవడంతో మ్యాచ్‌పై భారత్ పూర్తిగా పట్టు సాధించింది.

ఆ తర్వాత వచ్చిన వారు పెద్దగా ప్రతిఘటించకలేకపోయారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది.

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

అంతకుముందు, వర్షం అంతరాయం కలిగించడంతో రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది.

భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. షెఫాలి వర్మ‌, స్మృతీ మంధాన‌ల జోడీ తొలి వికెట్‌కు 104 పరుగులు జోడించారు.

అయితే, 45 పరుగులు చేసిన స్మృతీ మంధాన‌, క్లోయ్ ట్రయాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమిమాతో షెఫాలీ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించారు.

సెంచరీకి చేరువైన షెఫాలీ (78 బంతుల్లో 87 పరుగులు)ని అయాబోంగా ఔట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే జెమిమా(24) కూడా పెవిలియన్ చేరడంతో స్కోరు వేగం మందగించింది.

అయితే, దీప్తి శర్మ, కెప్టెన్ హర్మన్ ప్రీత్(20 పరుగులు) జోడి హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో భారత్ కోలుకుంది. చివర్లో రిచా బ్యాట్ ఝలిపించడంతో భారత్ 50 ఓవర్లలో 298 పరుగులు సాధించింది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో అయాబోంగా మూడు వికెట్లు తీసింది.

ఆ తర్వాత 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు, విజయానికి 52 పరుగుల దూరంలో ఆగిపోయింది.

షెఫాలీ వర్మ, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ అత్యధికంగా 87 పరుగులు చేశారు.

షెఫాలీ కీలక ఇన్నింగ్స్

ఫైనల్‌లో భారత యువ ఓపెనర్ షెఫాలీ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడింది.

ఆమె కేవలం 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. వందకుపైగా స్ట్రైక్‌రేట్‌తో సెంచరీకి చేరువలో 87 పరుగుల వద్ద ఔట్ అయింది.

స్మృతి మంధాన పెవిలియన్ చేరడంతో షెఫాలీ ఇన్నింగ్స్ భారత జట్టుకు మంచి స్కోర్ చేయడంలో సాయపడింది.

ఆ తర్వాత బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు తీసింది షెఫాలీ. వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి, భారత్‌ను మ్యాచ్‌లోకి తెచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మ్యాచ్ ఎలా సాగిందంటే..

23.56 (IST)

దక్షిణాఫ్రికా 45 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.

ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి వరల్డ్ కప్ గెలవాలంటే ఆ జట్టు ఇంకా 30 బంతుల్లో 53 పరుగులు చేయాల్సి ఉంది.

23:33 (IST)

దక్షిణాఫ్రికా 209 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అన్నెరీ డెర్క్సెన్‌(35)ను దీప్తి శర్మ క్లీన్ బౌల్డ్ చేసింది.

దక్షిణాఫ్రికా 40 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది.

కెప్టెన్ లారా వోల్వార్ట్‌ సెంచరీ చేసింది.

లారా వోల్వార్ట్‌(100), క్లోయ్ ట్రయాన్‌(1) క్రీజులో ఉన్నారు.

23:15 (IST)

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తూ, వికెట్లు తీస్తున్నారు.

దక్షిణాఫ్రికా 148 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

ఓవైపు వికెట్లు పడుతున్న మరోవైపు కెప్టెన్ లారా వోల్వార్ట్‌(86 నాటౌట్) పోరాడుతోంది.

దక్షిణాఫ్రికా 35 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.

షెఫాలీ వర్మ వరుస ఓవర్లలో రెండు కీలక వికెట్లు తీసింది.

21:40 (IST)

299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆచితూచి ఆడుతోంది.

మ్యాచ్ ఇన్నింగ్స్ 10 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ కోల్పోయి 52 పరుగులు సాధించింది.

23 పరుగులు చేసిన తజ్మిన్ బ్రిట్స్‌‌ను అమంజోత్ కౌర్ రనౌట్ చేసింది.

కెప్టెన్ లారా వోల్వార్ట్‌ (25 పరుగులు), ఆనికే బోష్‌ క్రీజులో ఉన్నారు.

హర్మన్ ప్రీత్ కౌర్ , భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా
ఫొటో క్యాప్షన్, హర్మన్ ప్రీత్ కౌర్

భారత బ్యాటింగ్ ఎలా సాగిందంటే..

19:35 (IST)

భారత్ ఆచితూచి బ్యాటింగ్ చేసింది.

87 పరుగులు చేసిన షెఫాలీ వర్మ, అయాబోంగా ఖాకా‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మూడో వికెట్ రూపంలో జెమిమా(24) కూడా పెవిలియన్ చేరారు.

దీప్తీ శర్మ, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. అయితే, 39వ ఓవర్లో హర్మన్ ప్రీత్(20) కూడా ఔటయ్యారు.

ఇన్నింగ్స్ 40 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.

దీప్తీ శర్మ 36 పరుగులు, అమంజోత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

18:35 (IST)

దక్షిణాఫ్రికాపై భారత్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఓపెనర్ షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ సాధించారు.

58 బంతుల్లో 45 పరుగులు చేసిన స్మృతీ మంధాన‌, క్లోయ్ ట్రయాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యారు.

ఇన్నింగ్స్ 25 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ వికెట్ నష్టానికి 151 పరుగులు చేసింది.

షెఫాలీ వర్మ 78 పరుగులు, జెమిమా రోడ్రిగ్స్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

స్మృతీ మంధాన‌, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్మృతీ మంధాన‌ 27 పరుగులు, షెఫాలి వర్మ‌ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.

17:40 (IST)

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతీ మంధాన‌, షెఫాలి వర్మ‌ శుభారంభాన్నిచ్చారు. ఇరువురూ దక్షిణాఫ్రికా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ, స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.

మ్యాచ్ ఇన్నింగ్స్ పది ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ వికెట్ కోల్పోకుండా 64 పరుగులు చేసింది.

స్మృతీ మంధాన‌ 27 పరుగులు, షెఫాలి వర్మ‌ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఐసీసీ మహిళల ప్రపంచకప్, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

17:00 (IST)

ఐసీసీ మహిళల వరల్డ్ కప్-2025 ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా, బౌలింగ్ ఎంచుకుంది.

నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. వర్షం ఆటంకం కలిగించడంతో టాస్‌ వేయడం ఆలస్యమైంది. రెండు జట్లు సెమీస్‌లో ఆడిన జట్లనే కొనసాగించాయి.

తుది జట్లు:

భారత్ జట్టు: షెఫాలి వర్మ‌, స్మృతీ మంధాన‌, జెమిమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్ కౌర్‌ (కెప్టెన్), దీప్తీ శర్మ‌, రిచా ఘోష్‌ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్‌, రాధా యాదవ్‌, క్రాంతి గౌడ్‌, శ్రీ చరణి‌, రేణుకా సింగ్ ఠాకూర్‌

దక్షిణాఫ్రికా జట్టు: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్‌, ఆనికే బోష్‌, సూనే లూస్‌, మారిజాన్ కాప్‌, సినాలో జాఫ్టా‌ (వికెట్ కీపర్), అన్నెరీ డెర్క్సెన్‌, క్లోయ్ ట్రయాన్‌, నాడిన్ డి క్లెర్క్‌, అయాబోంగా ఖాకా‌, నాంకులులెకో మ్లాబా‌

డీవై పాటిల్ స్టేడియం

ఫొటో సోర్స్, Getty Images

ఫైనల్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సింది. కానీ, ముంబయిలో వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ ఆలస్యమైంది.

షెడ్యూల్ ప్రకారం టాస్ 2:30 గంటలకు, మ్యాచ్ 3 గంటలకు ప్రారంభం కావాలి. అయితే, వర్షం కారణంగా అరగంట ఆలస్యం కానుందని బ్రాడ్ కాస్టర్ తెలిపింది.

రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం, టాస్ సాయంత్రం 4:32 గంటలకు, మ్యాచ్ 5 గంటలకు ప్రారంభం అయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)