రియో డి జెనీరో: ‘ఎవరు బతకాలో ఎవరు చావాలో పోలీసులే నిర్ణయించారు’

    • రచయిత, రుటే పినా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
రియో డి జెనీరో, క్రిమినల్ గ్యాంగ్స్, పోలీస్ ఆపరేషన్

ఫొటో సోర్స్, Bruno Itan

గమనిక: ఇందులో మిమ్మల్ని కలవరిచే అంశాలున్నాయి.

అక్టోబర్ 28, ఉదయం ఆరు గంటలు..

ఫోన్‌కు వరదలా వస్తున్న మెసేజ్‌ల శబ్ధాలు వింటూ బ్రెజిలియన్ ఫోటోగ్రాఫర్ బ్రూనో ఇటన్ నిద్ర లేచారు.

రియో డి జెనీరోలోని ఓ మురికివాడ ప్రజలు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్‌ గ్రూప్‌లో ఆ మెసేజ్‌లు వస్తున్నాయి.

తమ ప్రాంతంలో భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయని ఆ సందేశాల్లో ఉంది. బ్రూనో ఇటన్ ఇదే ప్రాంతంలో పెరిగారు.

తాను పెరిగిన ప్రాంతంలో దేశ చరిత్రలోనే అత్యంత భయానకమైన పోలీస్ ఆపరేషన్ జరుగుతోందన్న విషయం ఇటన్‌కు అప్పటికింకా తెలియదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రియో డి జెనీరో, క్రిమినల్ గ్యాంగ్స్, పోలీస్ ఆపరేషన్

ఫొటో సోర్స్, Bruno Itan

ఫొటో క్యాప్షన్, బ్రెజిల్ రాజధానిలో గ్యాంగ్స్‌ను నియంత్రించేందుకు పోలీసులు 1990 నుంచి దాడులు చేస్తూనే ఉన్నారు.

ఈ పోలీస్ ఆపరేషన్‌లో 121 మంది చనిపోయారు.

113 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బ్రెజిల్‌లో శక్తివంతమైన నేర ముఠాల్లో ఒకటైన రెడ్ కమాండ్ గ్యాంగ్‌‌‌‌ను తుదముట్టించేందుకు 2500 మంది ఆఫీసర్లను రంగంలోకి దించారని పేదలకు న్యాయ సాయం అందించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం చెప్పింది.

రియో డి జెనీరో, క్రిమినల్ గ్యాంగ్స్, పోలీస్ ఆపరేషన్

ఫొటో సోర్స్, Bruno Itan

ఫొటో క్యాప్షన్, దాడి అనంతర దృశ్యాలు

"మరణ శిక్ష విధించడమే"

"రియో డి జెనీరోలో పోలీసుల అతి పెద్ద ఆపరేషన్" అని ఈ ఆపరేషన్ గురించి ప్రభుత్వం ప్రకటించింది.

‘‘రియో డి జెనీరోలోని ఓ ప్రాంతంలో రెడ్ కమాండ్ గ్యాంగ్ విస్తరణను అడ్డుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఇది నేర ముఠాలకు గట్టి ఎదురు దెబ్బ’’ అని గవర్నర్ క్లాడియో కాస్ట్రో చెప్పారు.

పోలీస్ ఆపరేషన్‌ భయానకంగా ఉందని అంతర్జాతీయ మానవహక్కుల కార్యాలయం చెప్పిందని బ్రూనో ఇటన్ తెలిపారు.

"బ్రెజిల్‌లో మరణ శిక్ష లేదు. నేరస్థుడెవరైనా సరే, ఏం చేసినా సరే, వాళ్లను అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలి. కానీ ఈ పోలీస్ ఆపరేషన్ కచ్చితంగా మరణశిక్ష విధించడమే. ఎవరు బతకాలో, ఎవరు చావాలో పోలీసులే నిర్ణయించారు" అని ఇటన్ అన్నారు.

2008 నుంచి ఫోటోగ్రాఫర్‌గా పని చేయడం మొదలు పెట్టారు ఇటన్. 2011 నుంచి 2017 వరకు రియో ప్రభుత్వ ఫోటోగ్రాఫర్‌గా పని చేశారు. ఆ తర్వాత ఒల్హార్ కాంప్లెక్సో ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ సంస్థ ఫవెలా (ఇటన్ నివసించే మురికివాడ) యువతకు ఉచితంగా ఫోటోగ్రఫీ నేర్పిస్తుంది.

ఆయన ఎక్కువ శాతం మురికివాడలో దైనందిన జీవితంలో వాస్తవాలను చిత్రీకరించడంలో నిమగ్నమయ్యేవారు.

"మురికివాడల్లో సానుకూల అంశాలు, వైవిధ్యం, సాంస్కృతిక అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టేవాడిని. అయితే దురదృష్టం ఏంటంటే, మురికివాడల వాస్తవ స్థితిగతులు అవి కావు" అని ఆయన చెప్పారు.

రియో డి జెనీరో, క్రిమినల్ గ్యాంగ్స్, పోలీస్ ఆపరేషన్

ఫొటో సోర్స్, Bruno Itan

ఫొటో క్యాప్షన్, ఆపరేషన్‌లో 60 మంది అనుమానితులు, నలుగురు పోలీసు అధికారులు మరణించినట్లు మొదట రియో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

జంక్షన్‌లో మృతదేహాలు

ఇటన్ ఆ ప్రాంతానికి పది గంటల ప్రాంతంలో వచ్చారు. అక్కడ ఆయనకు కాలిపోయిన కార్లు, వాటికి తుపాకీ బుల్లెట్ల రంధ్రాలు, అయోమయ పరిస్థితిలో ఉన్న స్థానికులు కనిపించారు.

"కాల్పులు జరగడం నేను చూశాను. కాలిపోయిన కార్లను కూడా చూశాను. వాటిని రికార్డు చేయడం మొదలు పెట్టాను. పోలీసులు క్రూరంగా వ్యవహరించారని స్థానికులు నాతో చెప్పారు" అని ఇటన్ అన్నారు.

ఆ తర్వాత ఆయన గెటూలియో వర్గస్ ఆసుపత్రికి చేరుకున్నారు.

"చాలా మృతదేహాలు వచ్చాయి. అందులో పోలీసు అధికారులవి కూడా ఉన్నాయి. అప్పటికి అధికారికంగా 64 మంది చనిపోయారు" అని ఆసుపత్రి వద్ద పరిస్థితిని ఆయన వివరించారు.

రియో డి జెనీరో, క్రిమినల్ గ్యాంగ్స్, పోలీస్ ఆపరేషన్

ఫొటో సోర్స్, Bruno Itan

ఫొటో క్యాప్షన్, ఆపరేషన్‌లో భాగంగా 100 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పెన్హా ప్రాంతంలోకి మీడియా రాకుండా పోలీసులు నిషేధించారని ఇటన్ చెప్పారు.

"పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. మమ్మల్ని ఆ ప్రాంతంలోకి రానివ్వలేదు. వాళ్లంతా మాకు అడ్డుగా నిలబడి ప్రెస్‌కు అనుమతి లేదని చెప్పారు" అని ఇటన్ అన్నారు.

అయితే ఇటన్ ఈ ప్రాంతంలోనే పెరగడంతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని పెన్హా లోపలకు వెళ్లారు. చీకటి పడే వరకు అక్కడే ఉండి ఫోటోలు తీశారు.

బుధవారం ఉదయం స్థానికులు, మృతదేహాలను పెన్హాలోని కూడలి వద్దకు తీసుకువచ్చి ఒకదాని తర్వాత ఒకటిగా వరుసగా పడుకోబెట్టారు. ఆ దృశ్యం పోలీసుల దాడి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణగా కనిపించింది.

దాడిలో మరణించిన వారి సంఖ్య అధికారికంగా ప్రకటించిన దాని కంటే 50 నుంచి 70 వరకు అధికంగా ఉండవచ్చని బ్రెజిలియన్ మీడియా చెబుతోంది.

రియో డి జెనీరో, క్రిమినల్ గ్యాంగ్స్, పోలీస్ ఆపరేషన్

ఫొటో సోర్స్, Bruno Itan

ఫొటో క్యాప్షన్, పోలీస్ ఆపరేషన్ తర్వాత కనిపించకుండా పోయిన తమ వారి కోసం అలమావో ప్రాంతానికి పక్కనున్న కొండపై స్థానికులు వెదుకుతున్న దృశ్యం.

ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు, గ్యాంగ్ సభ్యుల మధ్య పెన్హా ఏరియా పక్కనే ఉన్న కొండ మీద భారీగా కాల్పులు జరిగాయి. అక్కడ నుంచే స్థానికులు మృతదేహాలను పెన్హా కూడలి వద్దకు తీసుకొచ్చారు.

"మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లారు. శరీరాలకు ప్లాస్టిక్ కవర్లు చుట్టి బైకులు, కార్ల మీద తీసుకు వచ్చి కూడలిలో ఉంచారు" అని ఇటన్ చెప్పారు

"మొదట 20 మృత దేహాలు వచ్చాయి. తర్వాత ఆ సంఖ్య 25, 30, 35, 40, 45.. అలా పెరుగుతూ వచ్చింది. వాళ్లేమైనా చేసి ఉండవచ్చు. కానీ వాళ్లు మనుషులు" అని అన్నారు.

‘‘ఆపరేషన్‌లో చనిపోయిన వారంతా క్రిమినల్స్. ఇందులో బాధితులు ఎవరైనా ఉన్నారంటే వాళ్లు పోలీసులే’’ అని రియో రాష్ట్ర గవర్నర్ క్లాడియో కాస్ట్రో చేసిన వ్యాఖ్యల గురించి జర్నలిస్టులు ఆయనను ప్రశ్నించారు.

"వాస్తవంగా చెప్పాలంటే, నేరముఠాలకు, పోలీసులకు మధ్య సంఘర్షణ ఇక్కడ జరగలేదు. అది అడవుల్లో జరిగింది. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అడవుల్లో ఎవరైనా ఉంటారా? దీన్నిబట్టి వాళ్లెవరో స్పష్టంగా చెప్పవచ్చు" అని ఆయన సమాధానమిచ్చారు.

రియో డి జెనీరో, క్రిమినల్ గ్యాంగ్స్, పోలీస్ ఆపరేషన్

ఫొటో సోర్స్, Bruno Itan

ఫొటో క్యాప్షన్, స్థానికులు సావో లూకాస్ కూడలి వద్దకు 55 మృత దేహాలను తీసుకువచ్చారు.

"శవాల వాసన"

ఆపరేషన్‌లో విధానపరమైన తప్పులు జరిగాయా అనే అంశం గురించి తేల్చేలోగానే స్థానికులు మృతదేహాలను అక్కడ నుంచి తీసుకురావడంపై దర్యాప్తు చేస్తున్నట్లు రియో డి జెనీరో సివిల్ పోలీసులు తెలిపారు.

కూడలిలో కనిపించిన మృతదేహాల స్టేటస్‌ను మార్చారని రియో డి జెనీరో స్టేట్ హోంమంత్రి ఫిలిపే కురి చెప్పారు.

‘‘ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులంతా దళాలు వేసుకునే దుస్తులు ధరించారు. వాళ్లకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మా వద్ద ఉన్నాయి. అయితే ఆపరేషన్‌లో చనిపోయిన తర్వాత వారి మృతదేహాలు చూసినప్పుడు వారి శరీరం మీద అండర్ వేర్ లేదా చడ్డీ ఉన్నాయి. కొంతమంది కాళ్లకు బూట్లు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో అద్భుతం జరిగినట్లుగా కనిపించకుండా పోయాయి" అని ఆయన చెప్పారు.

కొన్ని మృతదేహాల మీద కత్తి పోట్ల గాయాలు ఉన్నాయని ఇటన్ కూడా చెప్పారు.

"ఒక మృతదేహానికి తల లేదు. కొన్ని శరీరాల మొహం చెక్కేసి ఉంది. కొంతమంది తలలను సగం సగం నరికినట్లు ఉంది. చేతులు, కాళ్లు కూడా లేవు" అని ఇటన్ చెప్పారు.

"నేనిప్పుడు నిల్చున్న దగ్గర మృతదేహాలు లేవు. అయితే వాటి నుంచి వచ్చిన వాసన నాకు పదే పదే జ్ఞాపకం వస్తోంది. మానసికంగా కూడా అది నన్ను వెంటాడుతోంది" అని ఇటన్ ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు.

"ఆ క్రూరత్వాన్ని చూసి నేను నిర్ఘాంతపోయా. కుటుంబాల్లో విషాదం, స్పృహ తప్పి పడిపోయిన తల్లులు, ఏడుస్తూ కనిపించిన గర్భిణులైన భార్యలు, ఆగ్రహంతో ఉన్న తండ్రులు.. ఇలా వాళ్లను చూశాక, నాలో కూడా అలాంటి భావోద్వేగాలు ఉన్నట్లు అనిపించింది. నేను ఫోటోగ్రాఫర్‌ను కాకపోయుంటే, వాళ్లలో ఒకడినై ఉండేవాడిని" అని ఇటన్ అన్నారు.

రియో డి జెనీరో, క్రిమినల్ గ్యాంగ్స్, పోలీస్ ఆపరేషన్

ఫొటో సోర్స్, Bruno Itan

ఫొటో క్యాప్షన్, అలెమావో ప్రాంతంలో మృతదేహాలను చూసి బంధువులు కన్నీరు పెట్టుకున్నారు.

కొనసాగుతున్న ఫోరెన్సిక్ దర్యాప్తు

మురికివాడల్లో భద్రత అనేది ఆ ప్రాంతంలో ఉన్న హింసను బట్టి ఉంటుందని ఇటన్ చెబుతున్నారు.

"దురదృష్టత్తువశాత్తూ, ఇది ఎప్పుడూ తుపాకి గొట్టం ద్వారానే వస్తుంది. సామాజికంగా సాధ్యం కాదు. మురికివాడల్లో ప్రజలకు చదువు, ఇళ్లు, వైద్యం, సంస్కృతి ఉంటేనే వాళ్లు సురక్షితంగా ఉంటారు" అన్నారు ఇటన్.

ఇటన్ గతంలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లను కూడా ఫోటోలు తీశారు. 2021 మేలో జకరెజిన్హోలో 28 మంది క్రిమినల్స్ చనిపోయిన సంఘటనను అత్యంత దారుణమైనదిగా చెబుతారు. అయితే అక్టోబర్ 28న జరిగిన దాన్ని దేనితోనూ పోల్చలేమని ఇటన్ అభిప్రాయపడ్డారు.

ఈ దాడికి సంబంధించిన ఫోరెన్సిక్ డేటా అంతా తమకు 48 గంటల్లోగా అందించాలని రియో డి జెనీరో ఫోరెన్సిక్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌ను బ్రెజిల్ కేంద్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం కోరింది.

రాష్ట్రాలు ఇలాంటి పోలీసు ఆపరేషన్లు నిర్వహించడానికి ముందు తగిన ఆధారాలు చూపించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేసింది.

రియో డి జెనీరో, క్రిమినల్ గ్యాంగ్స్, పోలీస్ ఆపరేషన్

ఫొటో సోర్స్, Bruno Itan

ఫొటో క్యాప్షన్, మృతదేహాల సంఖ్య పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

నేర ముఠాలను నిర్మూలించేందుకు పోలీసులు చేపట్టే భారీ ఆపరేషన్లలో శరీరానికి కెమెరాలు ధరించడం, దాడులకు సంబంధించి న్యాయపరమైన కారణాలు చూపించడం, ప్రభావిత ప్రాంతాల్లో అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచడంలాంటి అంశాలు సుప్రీంకోర్టు ఆదేశాల్లో ఉన్నాయి.

పెన్హా, అలమావోలో చేపట్టిన ఆపరేషన్ ఈ ఆదేశాలను అమలు చేశారో లేదో చెప్పాలని రియో రాష్ట్ర గవర్నర్ క్లాడియో కాస్ట్రోను వివరణ కోరింది ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం.

ఆపరేషన్‌తోపాటు తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించిన సమగ్ర నివేదిక అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

బ్రూనో ఇటన్ అసహనంతో కనిపిస్తున్నారు. ఈ ఆపరేషన్ ఓ విజయమని భావిస్తే అందరం నష్టపోతామని ఆయన అన్నారు.

"మాదకద్రవ్యాల వ్యాపారంలో ఎవరో ఒకరు చనిపోతే, వారి స్థానంలోకి ఇద్దరు, ముగ్గురు వస్తారని కచ్చితంగా చెప్పగలను" అని ఇటన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)