ఉసిళ్లను తినడం మంచిదేనా, వాటి ఆయుష్షు నిజంగా ఒక రోజేనా?

ఉసిళ్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కె. శుభగుణం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వానాకాలం వచ్చి, వానలు పడితే చాలు, ఉసిళ్లు గుంపులు గుంపులుగా ఇళ్లలో ముసురుతుంటాయి. అలా ఇళ్లలోకి వచ్చిన ఉసిళ్లను చాలామంది గంపల్లో పట్టుకుంటూ ఉంటారు. తరువాత వాటిని కుండలోనో, బాణలిలోనో వేసి బాగా వేయిస్తారు. దీనివల్ల వాటి రెక్కలు, తలలు వేరవుతాయి. తరువాత వాటిని చక్కగా చెరిగి ఆహారంగా తీసుకుంటారు.

అయితే, అసలు ఈ ఉసిళ్లు ఎప్పుడు వర్షకాలంలోనే ఎందుకు వస్తాయి? వాటి ఆయుష్షు కేవలం ఒకరోజు మాత్రమే అనేది నిజమా? వాటిని ఆహారంగా తీసుకోవడం మంచిదేనా? వీటి గురించి వివరంగా తెలుసుకోవడానికి మేం కీటక శాస్త్రవేత్తలతో మాట్లాడాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చెదలు

ఫొటో సోర్స్, Getty Images

ఉసిళ్లు ఎక్కడి నుంచి వస్తాయి?

ఉసిళ్లు అనేవి ప్రత్యేకమైన పురుగులు కావు. రెక్కలు మొలిచిన చెదపురుగులే ఉసిళ్లు. ఈ సంగతి మనలో చాలామందికి తెలియదు. చెదపురుగుల తరాలు వృద్ధి చెందడానికి ఉసిళ్లే మూల కారణం.

చీమల్లాగే చెదపురుగులు కూడా సంఘ జీవులు. అంటే గుంపులుగా జీవిస్తాయి. ఒక పుట్టలో కొన్ని వేల నుంచి లక్షల సంఖ్యలో చెద పురుగులు ఉండొచ్చు.

తేనెటీగలు, చీమల వంటి సామూహిక జీవన విధానాన్నే చెదలు కూడా అనుసరిస్తాయి. వీటిలో రాజు, రాణి, కార్మికులు, కాపలా భటులు అనే నాలుగు వర్గాలు ఉంటాయి.

రాణి చెదపురుగు నిమిషానికి 25 నుంచి ఒక రోజులో కొన్ని వేల గుడ్లు పెడుతుంది. రాణి వల్లే చెదల పుట్ట ఏర్పడుతుంది.

డాక్టర్ ప్రియదర్శన్ ధర్మరాజన్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ ప్రియదర్శన్ ధర్మరాజన్

సంఘ జీవనం గడిపే తేనెటీగలు, చీమలు వంటి కీటకాలకు లేని ఒక ప్రత్యేకత చెద పురుగులకు ఉందని బెంగళూరులోని అశోక ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ రీసర్చ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ ప్రియదర్శన్ ధర్మరాజన్ చెప్పారు.

'పునరుత్పత్తి ప్రక్రియలు పూర్తయిన వెంటనే మగ చీమ లేదా మగ తేనెటీగ చనిపోతుంది. కానీ, చెదపురుగుల విషయానికొస్తే రాణి, రాజు కలిసి పుట్టను ఏర్పరుస్తాయి.రాణి చెదపురుగు శరీరానికి వీర్యాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండదు. కాబట్టి రాజు చెదపురుగు ఏళ్లపాటు దానితో పాటే ఉండి పునరుత్పత్తిలో పాల్గొంటుంది' అని ఆయన వివరించారు.

ఒక పుట్టకు ముఖ్యంగా రాణి, రాజు ఉన్నట్లే అందులో కొన్ని ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి ఆడ, మగ చెదపురుగులు ఉంటాయని ఆయన చెప్పారు.

'ఒకవేళ పుట్టకు కీలకమైన రాజు లేదా రాణి ఎవరైనా చనిపోతే, వాటి స్థానాన్ని భర్తీ చేయడం ఈ ద్వితీయ స్థాయి మగ, ఆడ చెదపురుగుల విధి. ఈవిధంగా వీటి సామాజిక నిర్మాణం ఒక పుట్ట అనేక తరాలతో చాలా ఏళ్లపాటు మనుగడ సాగించేందుకు సహాయపడుతుంది' అని ప్రియదర్శన్ తెలిపారు.

చెదల పుట్టలు చాలా ఎత్తుగా నిలబడి ఉండటాన్ని చాలా చోట్లా మనం చూసి ఉంటాం. అంటే, ఆ పుట్ట ఎక్కువ తరాలను చూసిందని ఇకనుంచి మనం అర్థం చేసుకోవచ్చు.

వానకాలంలో మన ఇళ్లను ముసిరే ఈ ఉసిళ్లే కొత్త చెదపుట్టలు ఏర్పడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఉసిళ్లు

ఫొటో సోర్స్, Getty Images

వానకాలంలోనే ఎందుకు వస్తాయి?

డాక్టర్ ప్రియదర్శన్ ధర్మరాజన్ చెప్పిన వివరాల ప్రకారం, ఒక పుట్టలో రాజు, రాణి మాత్రమే కాకుండా పునరుత్పత్తి సామర్థ్యం ఉన్న ఇతర ఆడ, మగ చెదలు ఉంటాయి.

'ఈ శక్తి ఉన్న చెదలే వానకాలంలో రెక్కలు తెచ్చుకొని బయటకు ఎగురుతాయి. వీటినే మనం ఉసిళ్లు అంటాం' అని ఆయన చెప్పారు.

మరో కీటక శాస్త్రవేత్త సహనాశ్రీ రామకృష్ణయ్య వీటి గురించి మాట్లాడారు.

'పునరుత్పత్తి ప్రక్రియలో పాల్గొని కొత్త పుట్టలను నిర్మించడం కోసం వేల సంఖ్యలో ఉసిళ్లు తమ ఆవాసాలను (పుట్ట) వదిలి బయటకు వస్తాయి. వానాకాలంలో తేమతో కూడిన వాతావరణం ఉసిళ్లు ఎగరడానికి అనుకూలంగా ఉంటుంది. ఉసిళ్లకు మాత్రమే కాకుండా చాలా జీవులకు వానకాలం పునరుత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. వానకాలంలో ఎక్కువ ఆహారం లభించడం కూడా ఇందుకు ఒక కారణం’’ అని తెలిపారు.

‘‘వాన కారణంగా మట్టి తడిగా, మెత్తగా మారుతుంది. దీనివల్ల జతకట్టిన చెద పురుగుల జంటలకు మట్టిని తొలిచి కొత్త పుట్టను నిర్మించుకోవడం సులభంగా మారుతుంది’’ అని సహనశ్రీ వివరించారు.

ఉసిళ్ల జీవితకాలం ఒకరోజేనా అని అడిగినప్పుడు అందులో నిజం లేదని ఆమె అన్నారు.

'పునరుత్పత్తి కోసం మామూలుగా వేల సంఖ్యలో జంటలు పుట్ట నుంచి బయటకు వస్తాయి. వాటిలో చాలా వరకు చనిపోతాయి. తక్కువ సంఖ్యలో జంటలు పుట్టను నిర్మిస్తాయి. ఇలా చాలా వరకు చనిపోవడం చూసి ఈ అపోహ పుట్టి ఉండొచ్చు' అని ఆమె వివరించారు.

Entomologist Sahanasree Ramakrishnaiah
ఫొటో క్యాప్షన్, సహనశ్రీ

ఉసిళ్లను తినొచ్చా?

పక్షులు, వేటాడే కీటకాలు, కప్పలు వంటి ఇతర జీవుల కారణంగా పుట్టల నుంచి బయటకు వచ్చిన ఉసిళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతుంటాయి.

వీటి మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి మనుషులు కూడా ఒక కారణమని ప్రియదర్శన్ అన్నారు.

ఉసిళ్లను ఆహారంగా తీసుకునే ఆచారం భారత్‌లోని చాలా ప్రాంతాల్లో ఉందని సహనశ్రీ చెప్పారు.

'వానకాలంలో పెద్ద సంఖ్యలో ఉసిళ్లు బయటకు వచ్చినప్పుడు గ్రామాల్లోని ప్రజలు వాటిని సేకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వాటిని ఎండబెట్టి, వేయించి ఆహారంగా వాడతారు' అని ఆమె తెలిపారు.

ఉసిళ్లను పోషకాలు ఉన్న, రుచికరమైన ఆహారంగా భావిస్తారని ఆమె చెప్పారు.

ఉసిళ్లను తినడం మంచిదేనా, అవి నిజంగానే ప్రోటీన్‌ నిండిన ఆహారమా అని ప్రశ్నించినప్పుడు పోషకాహార నిపుణురాలు ప్రియాంక సమాధానం ఇచ్చారు.

'ఉసిళ్లను ఆహారంగా తీసుకునే అలవాటు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉంది. చికెన్, మటన్ వంటిదే ఇది కూడా. ఆరోగ్యకరమైన రీతిలో వీటిని తింటే ఎలాంటి సమస్య ఉండదు. అయితే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనే వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆ మేరకు భారత్‌లో అధ్యయనాలు ఎక్కువగా జరుగలేదు' అని ఆమె చెప్పారు.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, అస్సాం వంటి రాష్ట్రాల్లో నేటికీ ఉసిళ్లను ఆహారంగా తీసుకునే ఆచారం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)