విశాఖ: 'దొంగ - పోలీస్ ఆట పేరుతో అత్తను చంపేసిన కోడలు..'

అత్త జయంతి కనకమహాలక్ష్మి, విశాఖ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మృతురాలు జయంతి కనకమహాలక్ష్మి(ఫైల్)
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

(ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

'దొంగ-పోలీస్' ఆట పేరుతో విశాఖలో అత్తని ఓ కోడలు సజీవ దహనం చేసినట్లు పోలీసులు చెప్పారు.

హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు కోడలు ప్రయత్నించారని, విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.

అత్తని హతమార్చడం కోసం ఆమె 'హౌ టూ కిల్ ఏ ఓల్డ్ లేడీ' అని యూట్యూబ్‌లో సెర్చ్ చేసి వీడియోలు కూడా చూసినట్లు చెప్పారు.

కోడలు జయంతి లలితను పోలీసులు అరెస్టు చేశారు.

అత్త జయంతి కనకమహాలక్ష్మిని కోడలు లలిత ఎందుకు చంపాలనుకున్నారు?

పోలీసుల విచారణలో లలిత ఏం చెప్పారు?

అత్తని చంపేందుకు ముందుగా ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు?

విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను పెందుర్తి పీఎస్ పోలీసులు, వెస్ట్ జోన్ ఏసీపీ పృధ్వీ తేజ్ బీబీసీకి వెల్లడించారు.

వెస్ట్ జోన్ ఏసీపీ పృధ్వీ తేజ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఈ ప్రమాదంలో నిందితురాలైన లలిత కూతురికి కూడా గాయాలైనట్లు ఏసీపీ పృధ్వీ తేజ్ చెప్పారు.

అసలేం జరిగింది?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,

విశాఖ పెందుర్తిలోని అప్పన్నపాలెం నుంచి శుక్రవారం ఉదయం పెందుర్తి పోలీసు స్టేషన్‌కు ఫోన్ వచ్చింది.

వర్షిణి హోమ్స్ అనే గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ఫ్లాట్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదంలో ఒక వృద్ధురాలు కాలిపోతున్నారని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశారు.

వెంటనే పెందుర్తి సీఐ సతీష్ కుమార్ తన బృందంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే 63 ఏళ్ల జయంతి కనకమహాలక్ష్మి అనే మహిళ కుర్చీలో విగతజీవిగా కనిపించారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసినట్లు ఆనవాళ్లు, అలాగే కళ్లకు గంతలు ఉన్నాయి.

"టీవీ షార్ట్ సర్య్యూట్ అవ్వడంతోనే మా అత్తగారు చనిపోయారు" అని తాము ప్రాథమికంగా విచారించినప్పుడు కోడలు లలిత చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

"సంఘటన స్థలానికి చేరుకునే సరికి ఆ ఫ్లాట్‌లో కోడలు లలితతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. టీవీ వైర్లు కాలిపోవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు ఉందని, ఆ కారణంగా మంటలు వచ్చాయని కోడలు లలిత చెప్పారు. మాకు సంఘటన స్థలంలో షార్ట్ సర్క్యూట్ ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు" అని ఏసీపీ పృధ్వీతేజ్ తెలిపారు.

"అత్త కనకమహాలక్ష్మి, పిల్లలు కళ్లకు గంతలు కట్టుకొని దొంగ-పోలీస్ ఆట ఆడుకున్నారని, అందులో భాగంగా అత్త కుర్చీలో కూర్చుండగా... ఆమె కాళ్లు, చేతులు కట్టారని, ఇంతలో టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందని కోడలు లలిత మాకు చెప్పారు"

ఈ ప్రమాదంలో లలిత కూతురికి కూడా స్వల్ప గాయాలైనట్లు ఏసీపీ చెప్పారు.

"లలిత భర్త పౌరోహిత్యం చేస్తుంటారు. ప్రమాద విషయం తెలుసుకుని ఇంటికి వచ్చారు. ఆయనతో మాట్లాడిన తర్వాత కోడలు లలితపై అనుమానం వచ్చింది. దీంతో ఆమె సెల్ ఫోన్ తీసుకుని సెర్చింగ్ హిస్టరీ చెక్ చేశాం" అని ఏసీపీ వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖ, ప్రమాదం జరిగిన ఇల్లు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ప్రమాదం జరిగిన ఇల్లు

'హౌ టు కిల్ ఏ ఓల్డ్ లేడీ' అంటూ యూట్యూబ్‌లో సెర్చ్ ..

"లలిత ఫోన్ హిస్టరీని చెక్ చేయగా.. అందులో 'హౌ టు కిల్ ఏ ఓల్డ్ లేడీ' అనే సెర్చింగ్ పలుమార్లు కనిపించింది. ఆమెపై అనుమానం బలపడింది. ఆమెను విచారించినప్పుడు తానే అత్తని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. పెళ్లైనప్పటి నుంచి అత్తతో సంబంధాలు సరిగ్గా లేవు. తనని ప్రతి చిన్న పనికీ విసుక్కుంటారని, ప్రతిరోజూ ఏదో వంకతో తనని తిడుతుంటారని, అందుకే అత్తని చంపాలనుకున్నట్లు ఆమె చెప్పారు" అని పోలీసులు తెలిపారు.

"అత్తను హతమార్చాలని నిర్ణయించుకుని.. తన ద్విచక్ర వాహనంపై 6వ తేదీన సింహాచలం సమీపంలోని గోశాల వద్ద ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్లి రూ.100 పెట్రోల్ కొనుక్కుని తీసుకొచ్చారు. దానిని ఇంట్లోనే దాచి పెట్టారు" అని ఏసీపీ పృధ్వీ తేజ్ తెలిపారు.

నిందితురాలు లలిత పోలీసుల దర్యాప్తులో "పిల్లలను అత్తగారితో దొంగ పోలీస్ ఆట ఆడుకోమని చెప్పాను. వాళ్లు ఆడుకుంటున్నారు. ఆటలో భాగంగా అత్త కళ్లకి గంతలు కట్టి, కాళ్లు, చేతులు కుర్చీకి కట్టించాను. ఆటలో భాగమని ఆమెతో అన్నాను" అని చెప్పారు.

ఆ తర్వాత తన ప్లాన్‌ ప్రకారం అత్తకు నిప్పంటించినట్లు లలిత చెప్పారని పోలీసులు తెలిపారు. అనంతరం దీన్ని అగ్నిప్రమాదంగా చిత్రీకరించేందుకు లతిత ప్రయత్నించారని పోలీసులు చెప్పారు.

"కేకలు వేస్తే వినిపించకుండా పెద్దగా టీవీ సౌండ్ పెట్టారు. ఆ తర్వాత, అయ్యో మా అత్తగారు మంటల్లో కాలిపోతున్నారు, కాపాండండి, అంటూ కేకలు వేస్తూ పక్కింటి వాళ్లని పిలిచే ప్రయత్నం చేశారు".

కానీ, చివరకు కోడలి 'దొంగ-పోలీస్' ఆట గురించి తెలుసుకుని, తాము కూడా షాక్ అయినట్లు పోలీసులు చెప్పారు. తనని వేధింపులకు గురిచేస్తున్నారని, అందుకే అత్తని చంపేయాలని నిర్ణయించుకున్నట్లు లలిత విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, జయంతి లలితను రిమాండ్‌కు తరలించామని వెస్ట్ జోన్ ఏసీపీ చెప్పారు.

అతి భావోద్వేగాలే కారణం: సైకాలజిస్ట్ పూజిత

అత్తను కోడలు చంపిన ఘటన గురించి బీబీసీ సైకాలజిస్టులతో మాట్లాడింది.

"ఒక వ్యక్తిని చంపేయాలనేంత వరకు వెళ్లడానికి అతి భావోద్వేగాలే కారణం. కొన్ని కుటుంబ వ్యవస్థల్లో కఠినమైన సామాజిక కట్టుబాట్లు, సాంస్కృతిక నియమాలు.. వ్యక్తుల భావోద్వేగాలను అణిచివేయడానికి, చివరికి ప్రమాదకర నిర్ణయాలకు దారితీస్తాయి" అని విశాఖకి చెందిన సైకాలజిస్ట్, సైకో-లీగల్ అడ్వైజర్ డాక్టర్ పూజిత జోస్యుల బీబీసీతో చెప్పారు.

"కొంతమంది వ్యక్తుల్లో టైప్-బీ, టైప్-సీ పర్సనాలిటీ డిజార్డర్లు ఉండవచ్చు. వీరిలో అతి భావోద్వేగం, నాటకీయ స్వభావం, అనూహ్య ప్రతిస్పందనలు ఉంటాయి. తమపైనే ఎక్కువ ఇష్టాన్ని కలిగి ఉంటారు. ఇతరుల భావాలను పట్టించుకోరు. 'సెల్ఫ్-ఫోకస్', అనుమానం, హైపర్ సెన్సిటివిటీలతో భావోద్వేగ మార్పులు విపరీతంగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వ్యక్తులు తాము ఎదుర్కొంటున్న భావోద్వేగ ఒత్తిడిని నియంత్రించుకోలేక ప్రమాదకర చర్యలకు పూనుకుంటారు" అని పూజిత చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)